మెదక్‌లోని అటవీ శాఖ కార్యాలయం
- కనీస స్థాయిలో భర్తీ కాని పోస్టులు.. 25 శాతానికి పైగా ఖాళీలు
- దశాబ్దాలుగా ఇదే దుస్థితి.. సిబ్బంది కొరతతో ఇబ్బంది
- అడవులపై కొరవడుతున్న పర్యవేక్షణ.. ఏటా తగ్గిపోతోన్న అటవీ సంపద
మెదక్: జిల్లాలో అటవీ శాఖ ఎవరూ లేని అనాథలా మారింది. కింది స్థాయి ఉద్యోగులు మొదలుకుని ఉన్నతాధికారుల వరకు కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉండటంతో అటవీ సంపదకు రక్షణ కరువైంది. ఇదే అదనుగా అక్రమార్కుల గొడ్డలివేటుకు విలువైన సంపద బలవుతోంది. ఒకపక్క అడవులు బాగుంటేనే వర్షాలు పడతాయని.. కరువు, కాటకాలు దరిచేరవని చెబుతూ ప్రతిష్టాత్మకంగా హరితహారం చేపడుతున్న ప్రభుత్వం.. మరోపక్క ఉన్న అడవులు అంతరించిపోతోన్నా పట్టించుకోవడం లేదని పర్యావరణవేత్తలు అంటున్నారు.
జిల్లా అటవీశాఖలో దశాబ్దాలుగా 25 శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. దీంతో ఓవైపు స్మగ్లర్లు జంతువులను వేటాడుతుండగా మరోవైపు అటవీ సంపదను కొల్లగొడుతున్నారు. సరిపడా సిబ్బంది ఉంటే ఇటువంటి పరిస్థితి తలెత్తదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అడవులకు రక్షణ ఎవరు?
అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 2,40,697 ఎకరాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. వీటిని నిత్యం కలప దొంగలు నరికేస్తున్నారు. వేటగాళ్లు జంతులను వేటాడుతున్నారు. జిల్లాలో టెరిటోరియల్, సోషల్ ఫారెస్ట్, వైల్డ్‌లైఫ్.. ఈ మూడు విభాగాల్లో అధికారిక లెక్కల ప్రకారం 238 మంది ఉద్యోగులు ఉండాలి.
కానీ 178 మంది మాత్రమే ఉన్నారు. ఈ లెక్కన 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ రేంజ్ ఒకటి, సెక‌్షన్ ఆఫీసర్ పోస్టులు 5, బీట్ ఆఫీసర్లు 29, వాచర్ పోస్టులు 14, టెక్నికల్ అధికారి ఒకటి, జూనియర్ అసిస్టెంట్లు 4, డ్రైవర్లు 4, అటెండర్లు 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 25శాతం పోస్టులు ఖాళీగా ఉండటంతో ఉన్న సిబ్బందికి పనిభారం పెరిగింది.
క్షేత్రస్థాయి సిబ్బంది కరువు
ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో అడవిని రక్షించాల్సిన బీట్ ఆఫీసర్ల పోస్టులు 29 ఖాళీగా ఉండటంతో అడవంతా అక్రమార్కుల పాలవుతోంది. భూభాగంతో పోల్చుకుంటే 33 శాతం అడవులు ఉండాలి. కానీ కేవలం 9.93 శాతం మాత్రమే అడవులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని 46 మండలాలకు గాను 37 మండలాల్లో 2,40,697 ఎకరాల్లో అటవీ భూములున్నా అందులో అత్యధికంగా అడవులు అంతరించిపోయాయి. దీంతో జిల్లా కరువు, కాటకాలకు కేంద్రబిందువుగా మారింది.
జల్లులతో సరి
గడచిన రెండేళ్లలో తీవ్ర కరువుతో పల్లెలన్నీ కళతప్పాయి. ప్రజలంతా పొట్టచేతబట్టుకొని వలసబాట పట్టారు. ఈ సారైనా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయంటే చిరుజల్లులతోనే సరిపెడుతుంది. ఇప్పటికే రెండు నెలల పుణ్యకాలం గడిచిపోయింది. చెరువు, కుంటల్లోకి చుక్కనీరు రాలేదు. దీనికంతటి కారణం అడవులు లేకపోవడమేనని అధికారులు చెబుతున్నారు. వనాలకు ఇంతటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అటవీశాఖలోనే పోస్టులు భారీగా ఖాళీలు ఉండటంతో అక్రమార్కులు అడవిని కొల్లగొడుతున్నారు.
జంతువుల వేట
వేటగాళ్లు కొద్ది రోజుల క్రితం రాయిన్‌పల్లి అడవుల నుంచి నాలుగు జింకలను చంపి తరలిస్తుండగా అటవీ అధికారులు పట్టుకున్న విషయం విదితమే. గడచిన ఐదేళ్లలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. సిబ్బంది కొరత వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి అటవీశాఖలో ఖాళీ పోస్టులు భర్తీచేసి వన సంపదతోపాటు అందులోని జంతువులను కాపాడాలని పర్యావరణ, జంతు ప్రేమికులు కోరుతున్నారు.
పర్యాటకుల తాకిడి..పర్యవేక్షించని సిబ్బంది
మెదక్ మండలం పోచారం అభయారణ్యంలో సుమారు 250 ఎకరాల్లో జింకల ప్రత్యుత్పత్తి కేంద్రముంది. అందులో జింకలు, కొండగొర్రెలు, దుప్పులు, సాంబార్లు, నీల్‌గాయ్, నెమళ్లు, అడవి పందులతోపాటు అనేక రకాల పక్షులు, జంతువులు కళ్లముందే చెంగుచెంగున దూకుతూ పరుగులు పెడుతుంటాయి. పుల్కల్ మండలం అటడిలో మంజీర వైల్డ్‌లైఫ్ సెంచరీలో సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో మొసళ్ల ప్రత్యుత్పత్తి కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు.
ఇవి రాజధానికి అతి సమీపంలో ఉండంతో ప్రతి వారంలో శని,ఆదివారాలు వీటిని తిలకించేందుకు హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చి తిలకిస్తుంటారు. సిబ్బంది కొరతతో ఈ ప్రాంతాల్లో అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని జిల్లా అధికారి ఒకరు తెలిపారు. పోస్టుల భర్తీతో ఈ సమస్యలను అధిగమించవచ్చని పలువురు పేర్కొంటున్నారు.