నాలుగు నెలలుగా వేతనాల్లెవ్..!
-
అందని బిల్లులు
-
ఇబ్బందుల్లో మధ్యాహ్న భోజన కార్మికులు
-
పట్టించుకోని అధికారులు
చెన్నూర్ రూరల్ : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు భోజన వసతి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది. దీంతో పేద విద్యార్థులకు బుక్కెడు బువ్వ దొరుకుతోంది. కానీ విద్యార్థులకు భోజనం తయారు చేస్తున్న నిర్వాహకులకు పూట గడవడం కష్టంగా మారింది. నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదు. భోజన తయారీ సమయంలో ఖర్చు తాలూకు బిల్లులు సైతం విడుదల కాలేదు. మండల వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో పనిచేస్తున్న 130 మధ్యాహ్న భోజన నిర్వాహకులకు వేతన వెతలు తప్పడం లేదు.
ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం, మధ్యాహ్న భోజన తయారీ బిల్లులు, వేతనాలు అందక నిర్వాహకులు ఇబ్బందుల పాలవుతున్నారు. సమయానికి బిల్లులు, వేతనాలు అందక అప్పులు తెచ్చి మరీ వంట వండుతున్నారు. మండలంలో మొత్తం 49 ప్రాథమిక, 7 ప్రాథమికోన్నత, 12 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలలన్నీంటిలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది.
అన్ని పాఠశాలల్లో కలిపి సుమారు 4,800 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అన్ని పాఠశాలలకు కలిపి 130 మంది మధ్యాహ్న భోజన నిర్వాహకులు, హెల్పర్లు పని చేస్తున్నారు. ఏప్రిల్ నెల 12వ తేదీ నుంచి జూన్ నెల వరకు మధ్యాహ్న భోజనం వండిన బిల్లులు రాక, అటు వేతనాలు రాక నిర్వాహకులు ఇబ్బందులకు గురవుతున్నారు.
ప్రతి నెల సక్రమంగా బిల్లులు అందకపోవడంతో మధ్యాహ్న భోజన తయారీ కోసం నిత్యవసర సరకులు తెచ్చిన దుకాణాలల్లో డబ్బులు చెల్లించ లేక నిర్వాహకులు అప్పుల పాలవుతున్నారు. నెల నెలా సక్రమంగా బిల్లులు, వేతనాలు అందించాలని, ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న బిల్లులు, వేతనాలు అందించాలని మధ్యాహ్న భోజన కార్మికులు కోరుతున్నారు.