పాఠశాలల్లో పారిశుద్ధ్యానికి మంగళం | no sanitaion in schools | Sakshi
Sakshi News home page

పాఠశాలల్లో పారిశుద్ధ్యానికి మంగళం

Published Sun, Oct 23 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 6:00 PM

no sanitaion in schools

  • సిబ్బందిని నిలిపివేయాలంటూ హెచ్‌ఎంకు సెల్‌ మెసేజ్‌లు 
  • జిల్లాలో ఇంటిముఖం పట్టనున్న 2,526 శానిటేషన్ వర్కర్లు
  • వారికి చెల్లించాల్సిన వేతన బకాయిలు రూ.2.78 కోట్లు
  • రాయవరం :
    సంపూర్ణ పారిశుద్ధ్యంపై స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఒకవైపు...దోమలపై దండయాత్రంటూ ఆర్భాట నినాదాలతో ప్రదర్శనలు మరోవైపు... కానీ పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేసే శానిటేషన్ వర్కర్లను నిలిపి వేయాలంటూ ఇంకోవైపు ఆదేశాలు జారీ. ఏమిటీ ద్వంద్వ ప్రమాణాలంటూ విస్తుపోతున్నారు విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లను శుభ్రం చేసే శానిటేషన్ వర్కర్లను నిలిపివేయాలని, అక్టోబరు నుంచి వారికి వేతనాలు ఇవ్వరంటూ వచ్చిన ఆదేశాలతో సిబ్బంది బిత్తరపోయారు. 

    సర్కారు బడుల్లో..
    ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మించిన మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచేందుకు సిబ్బందిని నియమించే బాధ్యతను గతేడాది డీఆర్‌డీఏకు అప్పగించారు. గ్రామాణాభివృద్ధి శాఖలో అంతర్భాగంగా ఉన్న మహిళా శక్తి సంఘాలకు పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణా బాధ్యతలను అప్పగించారు. అయితే వీరికి ఐదు నెలలుగా వేతనాలు అందకపోగా, ఇప్పుడు అకస్మాత్తుగా ఇంటికి పంపించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలల్లో విద్యార్థులకు నిర్మించిన మరుగుదొడ్ల నిర్వహణను సర్వశిక్ష అభియాన్ (ఎస్‌.ఎస్‌.ఏ)2014 నవంబరు నుంచి చేపడుతోంది. అప్పట్లో ఆరు నెలలకు ఎస్‌.ఎస్‌.ఎ. నేరుగా నిధులను పాఠశాల ఎస్‌.ఎం.సీ. అకౌంట్లకు బదిలీ చేసింది. గతేడాది నవంబరు 20 నుంచి పారిశుద్ధ్యం నిర్వహణా బాధ్యతలను డీఆర్‌డీఏ ద్వారా డ్వాక్రా సంఘాలకు అప్పగించారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు నిర్వహణ చేపడుతున్న వారికి గౌరవ వేతనాన్ని వారి ఖాతాల్లోనే జమ చేశారు. 

    జిల్లాలో పరిస్థితి ఇదీ..
    జిల్లాలో 2,110 ప్రాథమిక, 214 ప్రాథమికోన్నత, 202 ఉన్నత పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అనుమతి వచ్చింది. ప్రాథమిక పాఠశాలలో పారిశుద్ధ్యం నిర్వహించే వారికి నెలకు రూ.2 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలకైతే రూ.2,500, ఉన్నత పాఠశాలలో నిర్వహించే వారికి రూ.4వేలు గౌరవ వేతనంగా నిర్ణయించారు. వేతనాలు అందకపోగా..ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబరు వరకు ఐదు నెలలకు రావాల్సిన  వేతనం విడుదల కాలేదు. జిల్లాలో వీరి గౌరవ వేతనం కింద రూ.2.78 కోట్లు విడుదల కావాల్సి ఉంది. మార్చి నుంచి గౌరవ వేతనం ఎప్పుడు విడుదలవుతుందా? అని నిర్వాహకులు ఎదురుచూపులు చూస్తుండగా... ఏకంగా తొలగించడానికి జీఓ ఇవ్వడమేమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
     
    20 రోజుల వేతనం మాటేమిటి..
    పాఠశాల హెచ్‌.ఎం.లకు వచ్చిన మెసేజ్‌లో వీరికి సెప్టెంబరు నెలాఖరు వరకు మాత్రమే వేతనాలు ఇస్తామని తెలిపారు. అయితే వీరు అక్టోబరులో 22వ తేదీ వరకు పనిచేసిన కాలానికి వేతనాలు ఇవ్వరా? అనే ప్రశ్న తలెత్తుతోంది. వీరిని తొలగిస్తే పాఠశాలల్లో మరుగుదొడ్లను విద్యార్థులతోనే శుభ్రం చేయిస్తారా? లేకుంటే ఉపాధ్యాయులే శుభ్రం చేస్తారా? అనే ప్రశ్న లు తలెత్తుతున్నాయి. ఒక పక్క స్వచ్ఛ భారత్‌ అంటూ ఊదరగొడుతున్న సర్కార్‌ మరో పక్క ఆయాలను తొలగించడంతో పాలకుల వైఖరి బట్టబయలైంది.
    ముందే హెచ్చరించిన ’సాక్షి’..
    పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్న శానిటేషన్ వర్కర్లకు వేతన బకాయిలు చెల్లించక పోవడాన్ని గత నెల 28న ’సాక్షి’ పారిశుద్ధా్యనికి మంగళం’ అనే శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. ‘సాక్షి’ ప్రచురించిన కథనం నిజమే అన్నట్లుగా వేతనాలు ఇవ్వక పోగా ఇప్పుడు సిబ్బందిని తొలగిస్తూ హెచ్‌ఎంలకు మెసేజ్‌లు వచ్చాయి. 
     
    విధుల్లోకి రావద్దంటున్నారు..
    ఇకపై విధుల్లోకి రావద్దంటూ హెచ్‌.ఎం. తెలిపారు. మార్చి నెల నుంచి వేతనాలు చెల్లించలేదు. ఇప్పుడు అకారణంగా విధుల్లోకి రావద్దంటున్నారు. – దండంగి సీతయ్యమ్మ, శానిటేషన్ వర్కర్, ఎంపీపీపీ స్కూల్, వెదురుపాక, రాయవరం మండలం. 
     
    తాత్కాలికంగా తొలగిస్తున్నాం..
    పాఠశాలల్లో శానిటేషన్ వర్కర్ల వేతనాలకు బడ్జెట్‌ రాలేదు. ఇప్పటికే ఆరు నెలల వేతనాలు చెల్లించాలి. అందుకే తాత్కాలికంగా తొలగించాలంటూ ఆదేశాలిచ్చాం. – మహబూబ్‌ వలీ, జిల్లా ప్రాజెక్టు మేనేజర్, డీఆర్‌డీఏ, కాకినాడ.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement