♦ ఇప్పటికీ అందని క్లాత్
♦ స్కూళ్లు తెరిచి మూడువారాలవుతున్నా ఊసేలేని యూనిఫాం
క్యాలెండర్‌లో సంవత్సరాలు మారుతున్నాయే తప్పా ప్రభుత్వ పెద్దల తీరులో మార్పు రాలేదు. పాఠశాలలు తెరిచేనాటికి యూనిఫాం అందిస్తామన్న వారి మాటలు ఆచరణలో అమలయ్యింది లేదు. ఇంకేముంది ఇంతవరకు విద్యార్థుల యూనిఫాం అ‘డ్రస్’ లేకుండా పోయింది. నేతల మాటలు నీటి మూటలేనని మరోసారి రుజువైంది. యూనిఫాం కోసం జిల్లా విద్యార్థులకు ఎదురుచూపులు తప్పని పరిస్థితి నెలకొంది.
కడప ఎడ్యుకేషన్: పాఠశాలలు తెరిచి మూడు వారాలవుతున్నా జిల్లాలో ఇప్పటివరకు యూనిఫాం అ‘డ్రస్’ లేదు. అసలు యూనిఫామ్ క్లాతే జిల్లాకు రాలేదు. క్లాత్‌కు సంబంధించి ఒక్క రూపాయి నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు.
దీంతో జిల్లాకు క్లాత్ ఎప్పుడోస్తుంది ..వచ్చిన క్లాత్‌ను కుట్టి ఎప్పుడు పాఠశాలలకు సరఫరా చేస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నలు కురిపిస్తున్నారు. మరోవైపు సకాలంలో యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు అందక కొంతమంది విద్యార్థులు పాఠశాలలకు దూర మవుతున్నారే ఆరోపణలు ఉన్నాయి.
గతేడాదీ ఇదే పరిస్థితి..
2015-16 సంవత్సర విద్యా సంవత్సరానికి సంబంధించి ఇదే పరిస్థితి ఉంది. ఈ ఏడాది మార్చి నెల వరకు కూడా పాఠశాలలకు యూనిఫాంలు అందిస్తూనే ఉన్నారు. కొన్ని పాఠశాలల్లో సంబంధిత యూనిఫాంలు విద్యార్థులకు అందించకుండానే పాఠశాలల్లో ఉంచుకున్నట్లు తెలిసింది. మరికొన్ని చోట్ల విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన బట్టలు సరిపడక అలాగే వదిలేసినట్లు కూడా సమాచారం. ప్రస్తుతం విద్యార్థులకు యూనిఫాం అందించేందుకు ఇప్పటి వరకూ ఒక్క రూపాయి డబ్బులను విడుదల చేయలేదు. కానీ గుడ్డను కొనుగోలు చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిసింది.
ఎయిడెడ్ పాఠశాలలకు మొండిచెయ్యి
జిల్లాలో ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫాం అందించడానికి ప్రభుత్వం విముఖత చూపుతోంది. గతేడాది జిల్లాలో 131 ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించి 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఒకొక్కరికి 2 జతల చొప్పున 12,699 మందికి పంపిణీ చేశారు. ఈ ఏడాది యూనిఫాంలు కేవలం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు చెబుతున్నారు.
ఉర్దూ పాఠశాలలకు అందని పాఠ్యపుస్తకాలు
జిల్లా వ్యాప్తంగా 2016-17 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం పాఠశాలలకు 15.52.000 లక్షలు పుస్తకాలను కేటాయించింది. అయితే సంబంధిత పుస్తకాలను పాఠశాలలకు చేర్చారు. కొన్ని చోట్ల సంబంధిత పుస్తకాలను విద్యార్థులకు ఇవ్వకుండా ఎమ్మార్సీల్లోనే ఉంచుకున్నట్లు తెలిసింది. దీంతోపాటు సరఫరా చేసిన పుస్తకాల్లో కొన్ని పాఠ్యపుస్తకాలు అంద నట్లు తెలిసింది. ముఖ్యంగా ఉర్దూ పాఠశాలలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 20 వేల పుస్తకాలను ఇవ్వాల్సి ఉంది.