రహదారిపై రక్షణేది..?! | no security for roads | Sakshi
Sakshi News home page

రహదారిపై రక్షణేది..?!

Published Mon, Aug 1 2016 11:20 PM | Last Updated on Thu, Oct 4 2018 4:39 PM

హెచ్చరిక బోర్డులు లేకుండా కల్వర్టులు నిర్మిస్తున్న దృశ్యాలు - Sakshi

హెచ్చరిక బోర్డులు లేకుండా కల్వర్టులు నిర్మిస్తున్న దృశ్యాలు

  •  ఖమ్మం–కొత్తగూడెం మార్గంలో రోడ్డు విస్తరణ పనులు
  •  హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు
  • –బెంబేలెత్తుతున్న వాహన చోదకులు

  • కొత్తగూడెం: ఖమ్మం–కొత్తగూడెం రోడ్డు విస్తరణ పనుల వద్ద సంబంధిత కాంట్రాక్టర్లు తగిన హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడం, దీనిని అధికారులు పట్టించుకోకపోవడంతో వాహన చోదకులు ప్రమాదాలబారిన పడుతున్నారు. కొత్తగూడెం మండలం చుంచుపల్లి పంచాయతీ కార్యాలయం నుంచి గోధుమ వాగు (బృందావనం) బ్రిడ్జి వరకు మూడు కిలోమీటర్ల పొడవున నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పనులు రెండు నెలలుగా జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు కిలోమీటర్ల మేరకు రోడ్డుకిరువైపులా గోతులు తీసి కంకర పోశారు. రోడ్డు నిర్మాణానికి మధ్యలోగల సుమారు ఆరు కల్వర్టులను పునర్నిర్మాణం సాగుతోంది. పని ప్రదేశాలలో హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద గుంతలు తీసినచోట కనీసంగా రోడ్డు పక్కగా రాళ్లు అడ్డంగా పెట్టి, వాటిపై సున్నం వేసినా బాగుండేది. సంబంధిత కాంట్రాక్టర్‌ ఇదేమీ చేయలేదు. రాత్రి వేళ ఆ రహదారి చుట్టుపక్కల చీకటిగా ఉండడంతో వాహన చోదకులు ప్రమాదాలబారిన పడుతున్నారు. అటుగా ఏవైనా పెద్ద వాహనాలు వస్తే ద్విచక్ర వాహనాలు తప్పనిసరిగా రోడ్డు దిగాలి. అప్పుడు.. అక్కడే ఉన్న గుంతల్లో అవి పడిపోతాయి. ఇప్పటికే ఇలా అనేక ప్రమాదాలు జరిగాయి. 15 రోజుల క్రితం యాష్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ.. రోడ్డు పక్కన తీసిన గుంతలో దిగబడి బోల్తాపడింది. రెండు రోజుల కిందట, బూర్గంపాడు మండలంలో రోడ్డు విస్తరణ పనుల కోసం తీసిన కల్వర్ట్‌ గుంతలో పడి ద్విచక్ర వాహన చోదకుడు ప్రాణాలు కోల్పోయాడు.

    • పర్యవేక్షణ కరువు

    కొత్తగూడెం మండలంలో సాగుతున్న రోడ్డు విస్తరణ పనులపై ఆర్‌ అండ్‌బీ అధికారుల పర్యవేక్షణ కరువైంది. అ«ధికారుల అనుమతి లేకుండా రెండు రోజుల క్రితం రాత్రి వేళ వాహనాల రాకపోకలను కాంట్రాక్టర్‌ నిలిపివేసి కల్వర్టు నిర్మాణ పనులు సాగించారు. అధికారులు ఇప్పటికైనా ఈ పనులను పర్యవేక్షించాలని, హెచ్చరిక బోర్డులు పెట్టించాలని, వాహన చోదకుల ప్రాణాలు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై ఆర్‌అండ్‌బీ డీఈ హరిసింగ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ‘‘పనులను పర్యవేక్షిస్తాం. రక్షణ చర్యలు లేకపోతే కఠినంగా వ్యవహరిస్తాం’’ అని చెప్పారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement