నిరుద్యోగి లేని తెలంగాణ.. నా కల
గవర్నర్ నరసింహన్ ఆకాంక్ష
ప్రతి ఒక్కరూ సొంతంగా తమ కాళ్లపై నిలబడాలి
కలిసికట్టుగా ఉంటే సాధించలేనిదేమీ లేదు
సహకారం తీసుకోవాలేగానీ పూర్తిగా ప్రభుత్వాలపై ఆధారపడొద్దు
మహబూబ్‌నగర్: ‘‘రాబోయే రెండేళ్లలో తెలంగాణలో ఏ ఒక్కరూ నిరుద్యోగిగా ఉండరాదు.. ఇది నా కల..’’ అని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలం హాజీపల్లి, కిషన్‌నగర్‌లో జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో మంత్రులు కె.తారక రామారావు, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డితో కలిసి గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వృత్తి నైపుణ్యా న్ని పెంచుకొని సొంతకాళ్లపై నిలబడాలన్నారు. గ్రామస్తులు కలిసికట్టుగా ఉంటే సాధించలేనిదంటూ ఏమీ ఉండదని.. ఇందుకు కిషన్‌నగర్, హాజీపల్లి గ్రామాలే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో నిరక్షరాస్యతను పారదోలడానికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని అందిపుచ్చుకోవాలే తప్ప ప్రభుత్వాలపైనే పూర్తిగా ఆధారపడడం సమంజసం కాదన్నారు.
‘గుడ్డు’పై సీరియస్..: ఉదయం 10 గంటలకు కిషన్‌నగర్ చేరుకున్న గవర్నర్ మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల మధ్యే గడిపారు. ప్రతి అంశంపై చర్చ జరిపి, అందుకు బాధ్యులైన అధికారులను గ్రామస్తుల ముందే నిలదీశారు. ప్రభుత్వ సొమ్మును దుబారా చేయొద్దని గట్టిగా చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు సక్రమంగా అందజేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారానికి రెండ్రోజులు ఇవ్వాల్సిన గుడ్డు ఒక్కరోజు మాత్రమే ఇస్తున్నారని కిషన్‌నగర్‌లో విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో గవర్నర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. మండల విద్యాశాఖ అధికారిని గ్రామసభకు పిలిచి గుడ్డు ఇవ్వకపోవడంపై నిలదీశారు.
ప్రభుత్వం ఒక విద్యార్థికి ఇచ్చే రూ.6.38 సరిపోవడం లేదని ఓసారి.. తాను చెప్పినా కాంట్రాక్టర్ వినడం లేదంటూ మరోసారి పొంతనలేని సమాధానాలు చెప్పడంతో మంత్రి కేటీఆర్, గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రమంతటా ఇదే డబ్బుతో వారానికి రెండు రోజులు గుడ్లు ఇస్తున్నప్పుడు.. ఇక్కడెందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నించారు. రెండు గుడ్లు ఇస్తున్నట్లు ప్రభుత్వ నిధులను ఎందుకు డ్రా చేస్తున్నారని, కాంట్రాక్టర్ ఇచ్చే బిల్లులపై ఎలా సంతకాలు పెడుతున్నారని అడిగారు. కట్టెల పొయ్యి మీద మధ్యాహ్న భోజనం తయారు చేయడం ఇబ్బందికరంగా ఉంటుందని, అన్ని పాఠశాలలకు తక్షణం వంటగ్యాస్ సిలిండర్లను, పొయ్యిని అందజేయాలని గవర్నర్.. కలెక్టర్‌ను ఆదేశించారు.
రేషన్ షాపుకెళ్దామా..?
తనకు రేషన్ బియ్యం రావడం లేదని అంతమ్మ అనే మహిళ ఫిర్యాదు చేయడంతో డీలర్‌ను సమాధానం చెప్పాల్సిందిగా గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్ కోరారు. తాను సక్రమంగానే బియ్యం పంపిణీ చేస్తున్నానని డీలర్ చెప్పడంతో.. అయితే షాపుకెళ్లి తనిఖీ చేద్దామా, కీ రిజిస్టర్ చూపిస్తావా అంటూ గవర్నర్ ప్రశ్నల వర్షం కురిపించారు. గ్రామాల్లో బడి ఈడు పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపిస్తామని తమకు గ్రామస్తులు మాటివ్వాలని, ఈ మేరకు ప్రతిజ్ఞ చేయాలని నరసింహన్ కోరారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ గ్రామాల్లో చెత్తను సేకరించడం కోసం 750 మందికి ఒక రిక్షా చొప్పున అందిస్తున్నామన్నారు. చెత్తను డంప్‌యార్డుకు తరలించడానికే పరిమితం కాకుండా, దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు గ్రామస్తులు ప్రణాళికలు రూపొందించాలని గవర్నర్ కోరారు. అనంతరం రెండు గ్రామాల ప్రజలతో కలిసి గవర్నర్ సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి, కిషన్‌నగర్ సర్పంచ్ దేవి తదితరులు పాల్గొన్నారు.