సాక్షి, సిటీబ్యూరో/ఉప్పల్/నాగోల్/ కూకట్‌పల్లి/రాంగోపాల్‌పేట్: డబ్బు ఇప్పుడు ఒక మాయా వస్తువైంది. కనీకనిపించనట్లు, ఉండీ లేనట్లు, చేతికి వచ్చీ రానట్లు...అంతా ఎడారిలో ఎండమావుల సదృశ్యంగా మారింది. డబ్బుల కోసం రోడ్డెక్కే ప్రతి వ్యక్తిని బ్యాంకులు, ఏటీఎంలు అపహాస్యం చేస్తున్నాయి. ఖాతాల్లో డబ్బులు ఉన్నా అవసరానికి వినియోగించుకోలేని దుస్థితి. కష్టపడి సంపాదించుకున్న డబ్బులను అవసరానికి వాడుకునే హక్కు లేకుండా పోయింది. గంటల తరబడి పడిగాపులు కాస్తే వెయ్యో, రెండు వేలో చేతిలో పెట్టి పంపించే బ్యాంకులు ఒకవైపు...ఎప్పుడు తెచుకుంటాయో, ఎప్పుడు మూసుకుంటాయో తెలియని ఏటీఎంలు మరోవైపు లక్షలాది జనాన్ని నానా అగచాట్లకు గురి చేస్తున్నాయి.
తెల్లారిందంటే చాలు జనం ఇళ్ల నుంచి నేరుగా ఏటీఎంలు, బ్యాంకులకే పరుగులు తీస్తున్నారు. కానీ ఎంత దూరం వెళ్లినా ఎండమావులను తలపించే విధంగా సగం మూసి, సగం తెరుచుకొన్న షట్టర్లతో కనిపించే ఏటీఎంలు, ‘ఔట్ ఆఫ్ సర్వీస్’ అంటూ వేలాడే బోర్డులు ప్రజలను వెక్కిరిస్తున్నాయి. ఒకవేళ ఎక్కడో ఒక చోట తెరుచుకొన్నా క్షణాల్లోనే డబ్బులు ఖాళీ అవుతున్నాయి. లైన్‌లో ఉన్న జనం లైన్‌లో ఉండగానే ‘నో క్యాష్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అర్దరాత్రి, తెల్లవారు జామున..సమయం ఏదైతేనేం.
ప్రాంతం ఏదైతేనేం...కనిపించే దృశ్యం ఇదే. నెల రోజులు దాటినా జనానికి కరెన్సీ కష్టాలు తప్పడం లేదు. పెళ్లిళ్లు నిలిచిపోతున్నాయి. శుభకార్యాలు ఆగిపోతున్నాయి. ఆపదలు వేధిస్తున్నాయి. అత్యవసరాలు నిలదీస్తున్నారుు.డబ్బు కొరత కారణంగా సగటు నగర జీవి ఎన్ని బాధలు పడాలో అన్నీ పడుతున్నాడు. నగరంలో కరెన్సీ కష్టాలను తెలుసుకునేందుకు శనివారం పలు మార్గాల్లో సాక్షి బృదం ‘స్పెషల్ విజిట్’ నిర్వహించింది. ఈ బృందం పర్యటించిన అన్ని మార్గాల్లోనూ 96 శాతం ఏటీఎంలు ‘ ఔటాఫ్ సర్వీస్’ బోర్డులతోనే కనిపించాయి.
పర్యటన ఇలా సాగింది...
ఎల్‌బీనగర్, చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్ మార్గం, చందానగర్ నుంచి బోరుున్‌పల్లి వరకు, ఉప్పల్ గాంధీ బొమ్మ నుంచి అంబర్‌పేట్ వరకు ఛే నెంబర్, రామంతాపూర్, హబ్సిగూడ, నల్లకుంట, విద్యానగర్, మెట్టుగూడ, ప్రాంతాల్లో, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి జనరల్ బజార్ మీదుగా బేగంపేట్, అమీర్‌పేట్, పంజగుట్ట, సోమాజిగూడ, రాణీగంజ్, ప్యారడైజ్, తదితర ప్రాంతాల మీదుగా ఈ పర్యటన సాగింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సాగిన ఈ పర్యటనలో ఎస్‌బీహెచ్, ఎస్‌బీఐ.హెడీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కెనరా, విజయ, డీసీబీ, ఆంధ్రా తదితర బ్యాంకులకు చెందిన మొత్తం 335 ఏటీఎంలను పరిశీలించగా వాటిలో 11 ఏటీఎంలు మాత్రమే పనిచేశాయి. మిగతా 324 ఏటీఎంలు మూసి ఉన్నాయి. తెరిచిన ఏటీఎం కేంద్రాలన్నింటిలోనూ ఉదయం 9 నుంచి 11 గంటల వరకే డబ్బులు ఖాళీ అయ్యాయి. ఒకవైపు వందలాది మంది లైన్‌లలో ఉండగానే ఏటీఎంల్లో డబ్బులు ఖాళీ అయ్యాయి. ఎంతో ఆశగా వచ్చిన వాళ్లు నిరాశతో, నిస్సహాయంగా వెనుదిరిగి వెళ్లారు.
వివిధ మార్గాల్లో...
చైతన్యపురి నుంచి చాదర్‌ఘాట్ వరకు రోడ్డుకు ఇరువైపులా 35 ఏటీఎంలు ఉన్నారుు. కానీ ఏ ఒక్క ఏటీఎంలోనూ నగదు లేదు. దిల్‌సుఖ్‌నగర్ చౌరస్తాలో ఉన్న ఆంధ్రాబ్యాంకు ఏటీఎంలో మాత్రం నగదు జమచేసే మిషన్ తప్ప.. డ్రా చేసే ఏటీఎం పనిచేయడం లేదు.
మలక్‌పేట డి మార్ట్ వద్ద స్వైపింగ్ మిషన్ ద్వారా రూ.2 వేలు ఇస్తున్నారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున జనం క్యూలో నిలబడ్డారు.
సికింద్రాబాద్ నుంచి సోమాజిగూడ మార్గంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మోండా, ఎంజీరోడ్, ఆర్పీరోడ్, ప్యాట్నీ, బేగంపేట్, గ్రీన్ ల్యాండ్‌స, అమీర్‌పేట్, పంజగుట్ట, రాజ్‌భవన్, నెక్లెస్‌రోడ్ రాణిగంజ్, ఎంజీ రోడ్ వరకు ఏ ఒక్క ఏటీఎం పనిచేయలేదు.
ప్రతి ఏటీఎం వద్ద నో క్యాష్ బోర్డులు వెక్కిరిస్తూ కనిపించాయి.
గ్రీన్‌ల్యాండ్‌సలోని విజయ బ్యాంకు వద్ద ఉదయం 10 గంటల నుంచి 11.30గంటల వరకు వినియోగదారులు డబ్బు డ్రా చేసుకున్నారు. 11.30 గంటలకు డబ్బు అయిపోవడంతో నో క్యాష్ బోర్డు పెట్టారు. అప్పటికే వందల మంది క్యూలో ఉన్న ప్రజలు ఉసూరుమంటూ వెళ్లిపోయారు.
ప్యాట్నీ సెంటర్‌లోని ఎస్‌బీహెచ్ వద్ద నో క్యాష్ బోర్డు ఉన్నా...ప్రజలు పెద్ద ఎత్తున క్యూ లైన్‌లో నిల్చున్నారు. డబ్బు వస్తుందేమోనని ఆశతో ఎదురు చూశారు. కానీ గంటల తరబడి ఎదురు చూసినా ఫలితం కనిపించలేదు.
ఈ రూట్‌లో ఉన్న 81 ఏటీఎంలలో గంట పాటు గ్రీన్‌ల్యాండ్‌స వద్ద ఉన్న ఏటీఎం ఒక్కటే పని చేసింది.
చందానగర్ నుంచి బోరుున్‌పల్లి వరకు నిర్వహించిన విజిట్‌లో మొత్తం 165 ఏటీఎంలలో 129 ఏటీఎంలు మూసి ఉన్నారుు. 4 మాత్రమే గంట సేపు డబ్బులు అందించాయి. మరో 32 ఏటీఎంలు తెరుచుకొని ఉన్నాయి. కానీ డబ్బుల్లేవు.
నిజాంపేట రోడ్డులోని విజయబ్యాంకు ఏటీఎం ఉదయం 9.30 గంటలకు ప్రజలకు డబ్బులు అందించింది. కొద్ది సేపట్లోనే ‘నో క్యాష్ బోర్డు’ పెట్టేశారు.
కూకట్‌పల్లిలోని డి మార్ట్ మాల్ వద్ద ఉదయం 6 గంటల నుంచి ప్రజలు లైన్‌లో నిల్చొని టోకెన్ తీసుకుని డబ్బుల కోసం వేచి ఉన్నారు. ఇక్కడ కేవలం 150 మందికి రూ.2000 నోటును అందజేశారు.
హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని హైదర్‌నగర్, నిజాంపేట రోడ్డు, అడ్డగుట్ట, భాగ్యనగర్ కాలనీలోని ఏటీఎంలు ఎక్కడ చూసినా నో క్యాష్ బోర్డులు కన్పించాయి. కొన్ని చోట్ల 20 రోజులైనా క్యాష్ పెట్టడం లేదని స్థానికులు పేర్కొన్నారు.
నిజాంపేట రోడ్డులోని ఆంధ్రాబ్యాంకు యూకో బ్యాంకు , భాగ్యనగర్ కాలనీలోని ఆంధ్రాబ్యాంకుతో పాటు ఎస్‌బీఐ ఏటీఎంలు తెరిచినప్పటికీ ఉండకపోవడంతో ఖాతాదారులు ఏటీఎం సెంటర్‌ల వద్దకు వచ్చి నోక్యాష్‌బోర్డులు ఉండటంతో వెనుదిరిగివెళ్తున్నారు బాలానగర్, ఫతేనగర్‌లోని ఏటీఎంలలో అన్ని మూత ఉన్నారుు. కేవలం రెండు ఏటీఎంలు మాత్రమే పని చేశాయి.
ఉప్పల్ నుంచి అంబర్‌పేట్ మార్గంలో రామంతాపూర్, హబ్సిగూడ, మెట్టుగూడ, తార్నాక, విద్యానగర్, నల్లకుంట, ఛే నెంబర్, అంబర్‌పేట్ ప్రాంతాల్లో మొత్తం 34 ఏటీఎంలుండగా కేవలం ఆరు ఏటీఎంలు మాత్రమే పనిచేశాయి.
నోట్ల రద్దు పుణ్యమా అని సిటీజనులు వీకెండ్ సరదాలకు స్వస్తి చెప్పారు. అకౌంట్లో డబ్బులున్నా..తీసుకునే వీలులేక సెలవు రోజుల్లోనూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. వరుసగా మూడు రోజులు హాలిడేస్ వస్తే నగరంలో వీకెండ్ జోష్ కనిపిస్తుంది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సిటీలో ఏటీఎంలు మూతపడడం..బ్యాంకులు చుక్కలు చూపుతుండడంతో చేతిలో నగదు లేకుండా పోతోంది. ఉన్నకొద్దిపాటి డబ్బులను ఆచితూచి ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో సరదాలకు ఫుల్‌స్టాప్ పెట్టారు నగరవాసులు. ఇక నగరంలో నగదు కష్టాలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ శనివారం వివిధ ప్రాంతాల్లో విజిట్ నిర్వహించగా..ఏటీఎంలు, బ్యాంకుల నిర్వహణ డొల్లతనం బయటపడింది. రెండువేల నగదు కోసం నగరవాసులు పడుతున్న కష్టాలు వెలుగుచూశాయి. 96 శాతం ఏటీఎంలు మూతబడే కన్పించారుు. అన్ని చోట్లా అవుటాఫ్ సర్వీస్, నో క్యాష్ బోర్డులే దర్శనమిచ్చాయి.
నో వీకెండ్..నో జాయ్
Published Sun, Dec 11 2016 3:28 AM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM
Advertisement
Advertisement