no cash boards
-
ఎనీ టైమ్ మూత
ఆదిలాబాద్‌టౌన్: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకొని రెండేళ్లు దాటినప్పటికీ ఇంకా నోట్ల కష్టాలు తీరడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. 2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ ఆకస్మిక నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. ఈ నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. ప్రజలు పగలనకా రాత్రనకా ఏటీఎం కేంద్రాల వద్ద బారులు తీరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితి అంతగా లేనప్పటికీ ఏటీఎం కేంద్రాలు ‘నో క్యాష్’ బోర్డులతో దర్శనమి స్తున్నాయి. మరికొన్ని కేంద్రాల్లో నామ్‌కే వాస్తేగా డబ్బులు ఉన్నప్పటికీ ఏటీఎం మిషన్లు మొరాయిస్తున్నాయి. సాంకేతిక సమస్య కారణంగా వినియోగదారులు అందులో నుంచి డబ్బులను తీసుకోలేకపోతున్నారు. నెల మొదటి, రెండో వారాల్లో వేతనాలు తీసుకునేందుకు ప్రజలు పట్టణ ప్రాంతాల్లోని ఏటీఎం సెంటర్ల కోసం చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఏ కేంద్రంలో డబ్బులు ఉంటే అక్కడ గంటల కొద్ది బారులు తీరాల్సిన దుస్థితి దాపురించింది. ఇన్ని అవస్థలు ఎదుర్కొంటున్నా సంబంధిత బ్యాంక్ అధికారులు మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో.. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 70 వరకు ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. ఆదిలాబాద్ పట్టణంలో వివి ధ బ్యాంకులకు చెందిన ఏటీఎం కేంద్రాలు 55 వరకు ఉండగా, మిగతా 17 మండలాల్లో 15 ఏటీఎం సెంటర్ల వరకు ఉన్నాయి. ఇందులో నుంచి సగానికి పైగా ఏటీఎం కేంద్రాల్లో ఎప్పుడు నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు కారణంగా అప్పటి నుంచి కొన్ని ఏటీఎంలలో ఆయా బ్యాంకుల యాజమాన్యాలు డబ్బులు వేయడం లేదని తెలుస్తోంది. దాదాపు ఓ 20 కేం ద్రాల్లో ఎప్పుడు చూసినా జనాలతో రద్దీగా కనిపిస్తున్నాయి. మరో పది ఏటీఎం కేంద్రాల్లో మిషన్లను తొలగించగా, మిగతా కేంద్రాలు సాకేంతిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో వినియోగదారులకు ఇది శాపంగా మారింది. నో క్యాష్ బోర్డులు ఆదిలాబాద్ పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో గల వివిధ బ్యాంకుల ఏటీఎం కేంద్రాలు ఎప్పుడు చూసినా మూసివేసి కనిపించడం, నోక్యాష్, అండర్ రిపేర్ అనే బోర్డులతో దర్శనమిస్తున్నాయి. దీంతో వినియోగదారులు ఆ బోర్డులను చూసి వేరే కేంద్రాల వైపు పరుగులు తీస్తున్నారు. అక్కడ కూడా ఏదో ఒక సమస్యతో ఏటీఎం కేంద్రం పనిచేయకపోవడంతో పట్టణమంతా ఓ రౌండ్ కొట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఏ కేంద్రంలో డబ్బులు ఉన్నాయో తెలుసుకొని అక్కడికి వెళ్లే సరికి జనాలు బారులు తీరడం, గంటల కొద్ది సమయం వెచ్చించి మరీ డబ్బులు డ్రా చేయాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి కొంత బాగున్నప్పటికీ పల్లె ప్రాంతాల్లోనైతే కేంద్రాలు ఎప్పుడు చూసినా మూసివేసి ఉంటున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు సైతం పట్టణాలు, జిల్లా కేంద్రాలకు చేరుకొని పైసలు తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ సైతం వారికి తిప్పలు తప్పడంలేదు. పండుగలొస్తే.. పైసల పరేషాన్ పండుగలు, సెలవు రోజులు ఉంటే ఏటీఎం కేంద్రాల్లో డబ్బులు లేక జనాలు అవస్థల పాలవుతున్నారు. పండుగ కోసం డబ్బులు తీసుకుందామని వచ్చేవారికి ఈ కేంద్రాలు నిరాశకు గురిచేస్తున్నాయి. బ్యాంకులు కూడా సెలవు రోజుల్లో పనిచేయకపోవడంతో ప్రజలకు పైసల కష్టాలు తప్పడంలేదు. తమతమ ఖాతాల్లో డబ్బులు ఉన్నప్పటికీ అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా డబ్బులు డ్రా చేసుకోలేక, పండుగల సమయంలో ఏ వస్తువులు కొనుగోలు చేసుకోలేక మనోవేదనకు గురవుతున్నారు. సమస్య పెరుగుతోంది ఏటీఎం సెంటర్లు నో క్యాష్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. అత్యవసర సమయంలో డబ్బుల కోసం వెళ్తే ఊరంతా తిరగాల్సి వస్తోంది. ఏ ఏటీఎం కేంద్రంలో డబ్బులు ఉన్నాయో స్నేహితుల ద్వారా తెలుసుకొని అక్కడికి వెళ్తున్నాం. అక్కడ సైతం భారీ సంఖ్యలో ప్రజలు ఉండడంతో లైన్లో నిలబడి మరీ డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి. రోజులు గడిచిన కొద్దీ నోట్ల సమస్య పెరుగుతూనే ఉంది. సంబంధిత అధికారులు స్పందించి వినియోగదారుల నోట్ల కష్టాలను తీర్చాలి. – గజేందర్, ఆదిలాబాద్ నోట్ల సమస్యలో మార్పు లేదు గత రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. కానీ ఇప్పటివరకు కూడా నోట్ల సమస్య మాత్రం తీరడంలేదు. ఏ ఏటీఎం కేంద్రానికి వెళ్లి ఏదో కారణంగా డబ్బులు డ్రా చేసుకోలేకపోతున్నాం. కొన్ని కేంద్రాలైతే అసలు తెరుచుకోవడంలేదు. సమస్యను ఎవరికి చెప్పాలో కూడా తెలియని పరిస్థితి. బ్యాంక్ అధికారులకు చెబితే స్పందించడంలేదు. నోట్ల కష్టాలతో సతమతం అవుతున్నాం. – వృకోధర్, ఆదిలాబాద్ -
ఏటీఎంలో డబ్బుల్లేవ్ !
చుంచుపల్లి: ఆధునిక సేవలు విస్తరిస్తున్నా అదే తరహాలో వినియోగదారులకు సేవలందించడంలో పలు బ్యాంకులు విఫలమవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఏటీఎం కేంద్రాలలో తగినంత నగదును అందుబాటులో ఉంచలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా వినియోగదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెంలోనే పరిస్థితి ఇలా ఉంటే..మారుమూల ప్రాంతాల పరిస్థితి మరీ అధ్వానం. ప్రధాన ఏటీఎం కేంద్రాలలో రెండు రోజులుగా నగదు కొరత వినియోగదారులను వేధిస్తోంది. పండగ పూట ఏటీఎం కేంద్రాలు ఖాళీగా దర్శనమిస్తుండడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. దసరాకు చేతిలో డబ్బు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. పైగా రోజువారి విత్ డ్రా పరిమితిని ఇటీవల మరింతగా తగ్గించడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ప్రస్తుతం వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు చెందిన సుమారు 25 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 114 ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో చాలావరకు సక్రమంగా పనిచేయడం లేదు. దాదాపు 70 శాతం ఏటీఎంలలో నగదు కొరత ఉంది. కొత్త నోట్లు మార్కెట్లోకి వచ్చాయనే కారణంతో చాలా ఏటీఎం కేంద్రాలను మూసి ఉంచుతున్నారు. ముఖ్యం గా ప్రతినెల మొదటి వారంలో ఏ ఏటీఎంలో చూసినా పనిచేయడం లేదని, ఔట్ ఆఫ్ సర్వీస్ అనే బోర్డులు దర్శనమిస్తుంటాయి. ఈ సమయంలో వివిధ రకాల ఉద్యోగులు, పింఛన్‌దారులు డబ్బులు డ్రా చేయడానికి నానా తంటాలు పడుతుం టారు. దూర ప్రాంతాల నుంచి వివిధ అవసరాల నిమిత్తం పట్టణానికి వచ్చేవారి ఇబ్బందులు వర్ణనాతీతం. చాలామంది జేబులో డబ్బులు ఎక్కువగా లేకున్నా.. ఏటీఎం కార్డు ఉందనే ధైర్యంతో బయటకు వెళుతున్నారు. అయితే ఏటీఎం కేంద్రాలు పనిచేయకపోవడంతో చేతిలో డబ్బులు లేక పండగ పూట ఏం చేయాలో.. తెలియక వినియోగదారులు నిరాశకు లోనవుతున్నారు. బ్యాంకుల ఆంక్షలతో అవస్థలు.. ఓ వైపు ఏటీఎంలలో డబ్బులు లేక.. మరోవైపు బ్యాంకుల ఆంక్షలతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఒక బ్యాంకుకు చెందిన ఏటీఎం కార్డు మరో బ్యాంకు ఏటీఎం కేంద్రంలో వినియోగించడానికి పరిమితులను నిర్దేశించారు. నెలలో 3 సార్లు మాత్రమే వాటిని ఉపయోగించుకోవచ్చు. అది కూడా పరిమిత మొత్తంలోనే నగదు తీసుకోవాల్సి ఉంటుంది. అంతకు మించితే ఫైన్ వసూలు చేస్తున్నారు. ప్రతీ నెలా ఇదే సమస్య ఏర్పడుతోందని పలువురు వినియోగదారులు వాపోతున్నారు. బ్యాంకు అధికారులకు చెప్పినా సరైన స్పందన లేదని అంటున్నారు. ఇక అక్టోబర్ 1 నుంచి విత్‌డ్రా పరిమితిని రూ. 20 వేలకు తగ్గించడంతో తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోందని చెపుతున్నారు. ఇప్పటికైనా బ్యాంకు అధికారులు స్పందించి ఏటీఎం కేంద్రాలలో తగినంత నగదు నిల్వ ఉండేలా చర్య తీసుకోవాలని కోరుతున్నారు. అన్ని ఏటీఎంలు తిరిగినా ఫలితం లేదు నగదు డ్రా చేయడానికి పట్టణంలోని అన్ని ఏటీఎంల వద్దకు వెళ్లాను. ఎక్కడ చూసినా డబ్బులు లేవు. కొన్ని చోట్ల ఏటీఎంలు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. బ్యాంకు అధికారులు వినియోగదారుల ఇబ్బందులను గ్రహించి నగదు ఉండేలా చర్యలు తీసుకోవాలి. -ఎం.కోటేశ్వరరావు -
డబ్బుల్ నిల్!
నగదు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. నోట్ల రద్దునాటి పరిస్థితులు పునరావృతమవుతూ.. డబ్బులు దొరకక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వారంరోజులుగా బ్యాంకుల్లో అరకొర చెల్లింపులతో ప్రజలు విసిగిపోతున్నారు. జిల్లావ్యాప్తంగా 90 శాతం ఏటీఎం కేంద్రాలు ఎప్పుడు చూసినా మూసివేసే దర్శనమిస్తున్నాయి. బ్యాంకులకు డిపాజిట్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు. దీంతో బ్యాంకుల్లో నగదు లావాదేవీలు గతంతో పోల్చితే గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతున్న వేతనాలు తీసుకోవడానికీ అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కరీంనగర్‌బిజినెస్: జిల్లా వ్యాప్తంగా నగదు లావాదేవీలు రోజురోజుకూ పడిపోతున్నాయి. దీనికి ముఖ్య కారణం డిపాజిట్ల ద్వారా బ్యాంకులకు రావాల్సిన నగదు ఆశించినస్థాయిలో రాకపోవడమేనిని తెలు స్తోంది. జిల్లా వ్యాప్తంగా 485 బ్యాంకులున్నాయి. ఇందులో 315 జాతీయ బ్యాంకులు, 68 ప్రైవేట్, 91 గ్రామీణ, 11 సహకార బ్యాంకులు సేవలందిస్తున్నాయి. వీటన్నిటి ద్వారా పనిదినాల్లో దాదాపు గతంలో రూ.200 కోట్లపైగానే లావాదేవీలు జరిగేవి. నగరప్రాంతాల్లో ఉన్న బ్యాంకుల్లో కొంచెం ఎక్కువగా.. గ్రామీణ ప్రాంతాల్లో కాస్తా తక్కువగా లావాదేవీలు సాగేవి. ప్రస్తుతం నగదు కొరత ఏర్పడడంతో ప్రతిరోజూ లావాదేవీలు రూ.100కోట్లకు మించడం లేదని స్వయంగా బ్యాంకు అధికారులే చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా గల బ్యాంకుల్లో ఈ నాలుగైదు రోజుల్లో రూ.80 నుంచి రూ.90 కోట్ల మధ్యనే జరిగినట్లు సమాచారం. బ్యాంకుల్లో నగదును బట్టి ఖాతాదారులకు కేవలం రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకే చెల్లింపులు జరిపినట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని బ్యాంకులు రూ.10 వేలతోనే సరిపుచ్చుతున్నారు. మూగబోతున్న ఏటీఎం కేంద్రాలు ఏటీఎం కేంద్రాల పరిస్థితి వారంరోజులుగా దారుణంగా తయారైంది. జిల్లావ్యాప్తంగా వివిధ బ్యాంకులకు సంబంధించి పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కలుపుకుని 176 ఏటీఎం కేంద్రాలు సేవలందిస్తున్నాయి. ఇందులో వారంరోజులుగా దాదాపు 138 ఏటీఎం కేంద్రాలు మూగనోము ప్రదర్శిస్తున్నాయి. బ్యాంకుల్లో కావాల్సినంత చెల్లింపులు లేకపోవడం, అవసరమున్నప్పుడు ఎన్ని ఏటీఎం కేంద్రాలు తిరిగి నా డబ్బులు లభించకపోవడంతో ఉద్యోగులు, వ్యా పారులు నానా అవస్థలు పడుతున్నారు. గురువారం కొన్ని ఏటీఎంలలో నగదు నింపడంతో కాస్తా మెరుగుపడిందని ఖాతాదారులు చెబుతున్నారు. పెళ్లివారికి ఇక్కట్లు ప్రస్తుతం వివాహ ముహూర్తాలు ఎక్కవగా ఉండడంతో నగదు కొరత పెళ్ళింటివారిని నానా అవస్థలకు గురిచేస్తుంది. షాపింగ్‌లు ఇతరత్రాల కొనుగోళ్లలో కార్డులు, డిజిటల్ పేమెంట్ల ద్వారా జరిగినప్పుటికీ పలు విషయాల్లో డిజిటల్ సేవలు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. కచ్చితంగా పలు పనులకు నగదు అవసరముండడంతో ఇటూ బ్యాంకుల్లో ఇచ్చేది సరిపోక, ఏటీంఎం కేంద్రాలు పనిచేయక ఇరుగుపొరుగు, బంధువుల వద్ద అప్పులు చేస్తూ నెట్టుకొస్తున్నట్లు తెలిసింది. కొనసాగుతున్న కష్టాలు... వారంపదిరోజుల నుండి నగదు కష్టాలు మరి ఎక్కువయ్యాయి. డబ్బులు దొరకక అన్ని వర్గాల ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. ఇవన్నీ చూస్తున్న ఖాతా దారులు బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్లు చేయాలంటేనే జంకుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి నగదును తెప్పిస్తున్నట్లు తెలిసింది. కేవలం తెలంగాణ, ఆంద్రప్రదేశ్, బీహార్లోనే నగదు కష్టాలుండగా నగదు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్రాలకు నగదు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే రెండు, మూడు రోజుల్లో నగదు ఇక్కట్లు దూరమవుతాయని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రజలు డబ్బులు ఇంట్లో పెట్టుకోకుండా బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తేనే ఇబ్బందులు దూరమవుతాయని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. -
కరెన్సీ కొరత
దేశాన్ని డిజిటల్ బాట పట్టించి నగదురహిత ఆర్థిక వ్యవస్థను సాకారం చేస్తామని చెప్పిన పాలకుల లక్ష్యం కాస్తా దారి తప్పి ఎటో పోయింది. పెద్ద నోట్ల రద్దు ప్రహ సనానికి ముందు కళాకాంతులతో చల్లని లోగిళ్లుగా వెలిగిన ఏటీఎంలు ఆ తర్వాత షట్టర్లు దించుకుని... డబ్బు లేదని చెప్పే కాగితాలు, అట్టలు అతికించుకుని దీన వదనాలతో దర్శనమివ్వడం మొదలైంది. కాస్త ఓపిక పడితే అంతా సర్దుకుంటుందని ఎప్పటికప్పుడు జనం సహనంతో ఎదురుచూస్తుంటే ఉన్నకొద్దీ పరిస్థితి మరింత దిగజారుతోంది. నగరాలు, పట్టణాలు, పల్లెలు ఒకే తీరుగా నగదు కొరతతో ఇబ్బం దులెదుర్కొంటున్నాయి. పది పన్నెండు రాష్ట్రాల్లో అన్ని బ్యాంకుల ఏటీఎంలు ఖాళీ డబ్బాలుగా మిగిలిపోయాయి. అటు కేంద్ర ప్రభుత్వమూ, రిజర్వ్ బ్యాంకు అక్క డక్కడ కొన్ని సమస్యలు మినహా అంతా బాగానే ఉన్నదని ఇస్తున్న వివరణలు అంద రినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. దేశంలోని 2.2 లక్షల కోట్ల ఏటీఎంలలో దాదాపు 80 శాతం ఇంచక్కా పనిచేస్తున్నాయని కేంద్రం నమ్మబలుకుతోంది. ఆ నోటితోనే ఒకటి రెండు రోజుల్లో అంతా సర్దుకుంటుందని హామీ ఇస్తోంది. కానీ ఎస్బీఐ రీసెర్చ్ ప్రకారం దేశంలో రూ. 70,000 కోట్ల మేర కొరత ఉంది. ఈ నెల మొదటి నుంచి ఇంతవరకూ ఏటీఎంలలో ఉంచే డబ్బును ప్రభుత్వ రంగ బ్యాంకులు 30 శాతం మేర తగ్గించేశాయని ఏటీఎం పరిశ్రమల సమాఖ్య చెబుతోంది. దేశంలో ప్రతి నెలా ఏటీఎంల నుంచి ఖాతాదార్లు సగటున రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ. 2.4 లక్షల కోట్ల వరకూ విత్‌డ్రా చేసుకుంటారని అంచనా. అంత మొత్తం ఏటీఎంలలో ఉండేలా చూసుకోవడంలో బ్యాంకులెందుకు విఫల మయ్యాయి? నిజానికిది హఠాత్తుగా వచ్చిపడిన సమస్య కాదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత మొదలైన ఈ సమస్య కొద్దో గొప్పో తేడాతో నిరంతరం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా మూడు నాలుగు నెలల నుంచి మరింత ఉగ్రరూపం దాల్చింది. మీడి యాలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ తరచు దీనిపై కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. అయినా కేంద్రంగానీ, రిజర్వ్‌బ్యాంక్ గానీ సకాలంలో మేల్కొనలేదు. కరెన్సీ కొరత తాత్కాలికమేనంటూ వివరణనిచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చాలినంత కరెన్సీ చలామణిలో ఉన్నదని చెబుతున్నారు. చలామణి అంటే నగదు లావాదేవీలు జరగడం. బ్యాంకులకు డబ్బు వస్తూ పోతూ ఉండటం. ఎక్కడో ఒక చోట అది ఆగిపోయినప్పుడు కొరత మొదలవుతుంది. కరెన్సీ కష్టాలకు ఒక్కొ క్కరు ఒక్కో రకమైన కారణం చెబుతున్నారు. పంటల కొనుగోళ్ల సీజన్ కారణమని ఒక రంటే, రాష్ట్రాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కారణమని మరికొందరు, మొత్తం డబ్బు బ్యాంకులో పెట్టుకోవడం కన్నా దగ్గరుంచుకుంటే మంచిదని జనం అనుకోవడం వల్లే ఈ స్థితి తలెత్తిందని ఇంకొందరు భాష్యం చెబుతున్నారు. ఇలా అంటున్నవారంతా సామాన్యులు కాదు. అందులో కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్య దర్శి, ఎస్బీఐ చైర్మన్ వగైరాలున్నారు. కానీ పంటల సీజన్, సంక్షేమ పథకాలు వంటివి ఇంతకు ముందూ ఉన్నాయి. ఇప్పుడే అవి కరెన్సీ కొరతకు కారణమెలా అయ్యాయి? కొత్తగా ఖాతాలు తెరిచేవారినుంచి డెబిట్ కార్డుకోసమని రూ. 130 నుంచి రూ. 300 వరకూ వసూలు చేస్తున్న సంగతి బ్యాంకులకు గుర్తుందో లేదో తెలియదు. పైగా ఖాతాలో తగినంత మొత్తంలో డబ్బులేదని తెలియక ఏటీఎం దగ్గరకెళ్లి కార్డు ఉపయోగించిన వారికి దాదాపు రూ. 25 వడ్డిస్తున్నాయి. అలాగే పరిమితికి మించి లావాదేవీలు నడిపినా, అసలు లావాదేవీలే జరపకపోయినా బ్యాంకులు సర్‌చార్జీల మోత మోగిస్తున్నాయి. వేరే బ్యాంకుల ఏటీఎంల దగ్గర డ్రా చేసుకోవడానికి పరిమి తులు పెట్టి అవి మించితే వడ్డిస్తున్నాయి. ఇన్ని రకాలుగా ఖాతాదారుల నుంచి ఏటా వేల కోట్లు రాబట్టుకుంటున్న బ్యాంకులు తమ ఏటీఎంలు ఖాళీగా ఉంచినం దుకూ, ఖాతాదార్లకు అవసరం పడిన సమయంలో డబ్బు అందించలేకపోయినం దుకూ పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయా? పెద్ద నోట్ల రద్దు తర్వాత దాదాపు 40 శాతం ఏటీఎంలు ఎప్పుడూ ఖాళీగానే దర్శనమిస్తున్నాయని గణాం కాలు చెబుతున్నాయి. ఖాతా ఉన్న బ్యాంకు ఏటీఎం డబ్బు రాల్చనప్పుడు తప్పని సరై మరో బ్యాంకు ఏటీఎంకు ఎవరైనా పరుగెడతారు. అలాంటివారందరిపైనా చార్జీలు విధించడం వ్యాపారమవుతుందా, నిలువుదోపిడీ అవుతుందా? అసలు తాము డబ్బు దాచుకుంటున్న బ్యాంకు సమయానికి మొహం చాటేసిందన్న అభి ప్రాయం ఖాతాదారుల్లో ఒకసారంటూ ఏర్పడితే... బ్యాంకింగ్ వ్యవస్థపై ఒకసారి నమ్మకం కోల్పోతే వాటి పర్యవసానాలెలా ఉంటాయో రిజర్వ్Sబ్యాంకుకు తెలిసే ఉండాలి. అయినా మూడు నాలుగు నెలలుగా ఏర్పడ్డ కరెన్సీ కొరతను అది గుడ్లప్ప గించి చూస్తూ ఉండిపోయింది. బ్యాంకింగ్ రంగం అంటే డబ్బుతో వ్యాపారం చేయడం. ఖాతాదార్లు జమచేసే సొమ్ముతో అధిక వడ్డీలకు అప్పులిచ్చి లాభపడటం వాటి ప్రధాన వ్యాపకం. అలా అప్పులిచ్చే ముందు తీసుకుంటున్నవారు తీర్చగలరో లేదో చూడాల్సి ఉంటుంది. ఆ స్తోమత ఉన్నదని గుర్తించాక తగినంత మేర స్థిరాస్తులను కుదువ పెట్టుకుని డబ్బు విడుదల చేస్తాయి. కానీ పబ్లిక్ రంగం, ప్రైవేటు రంగం అనే తేడా లేకుండా దేశంలోని ప్రధాన బ్యాంకులన్నీ ఈ కార్యకలాపాలను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమవుతున్నాయి. బ్యాంకుల ఈ చేతగానితనాన్ని ఆసరా చేసుకుని విజయ్ మాల్యా, నీరవ్‌మోదీ లాంటివారు వేల కోట్ల రూపాయలకు ఎగనామం పెట్టి విదే శాలకు పరారవుతున్నారు. దానికితోడు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎఫ్ఆర్ డీఐ బిల్లు చట్టమైతే బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ముకు భద్రత ఉండదన్న భయం సామాన్య పౌరుల్లో ఏర్పడింది. తమపై ఏర్పడ్డ ఈ అవిశ్వాసాన్ని తొలగించేందుకు బ్యాంకులు చేసిందేమీ లేదు. సమస్య ఏర్పడినప్పుడు అందుకు గల కారణాలేమిటో పౌరులకు చెప్పాల్సిన బాధ్యత రిజర్వ్‌బ్యాంకుకు, కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అందుకు బదులు అంతా సవ్యంగానే ఉన్నదని దబాయిస్తే నమ్మడానికెవరూ సిద్ధంగా లేరు. -
తీరని కరెన్సీ కష్టాలు...
న్యూఢిల్లీ: కరెన్సీ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని పలు ఏటీఎంలలో నగదు కొరత కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, బిహార్, త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటక తదితర రాష్ట్రాల్లోని పలు ఏటీఎంలు పనిచేయకపోవడమో లేదా నో క్యాష్ బోర్డులు వేలాడదీసో దర్శనమిస్తూ పెద్ద నోట్ల రద్దు సమయంలో పరిస్థితులను గుర్తుకు తెస్తున్నాయి. దేశరాజధాని న్యూఢిల్లీలో కూడా బుధవారం కొన్ని ఏటీఎంలలో అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు దర్శనమిచ్చాయి. మరోవైపు, కరెన్సీ సమస్యలను వేగవంతంగా పరిష్కరిస్తున్నామని, దేశవ్యాప్తంగా ఉన్న 2.2 లక్షల ఏటీఎంలలో దాదాపు 80 శాతం ఏటీఎంలు మళ్లీ సాధారణంగా పనిచేస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతకు ముందు ఇది అరవై శాతమే ఉంది. రానున్న ఎన్నికలు, పంటల కొనుగోళ్ల కోసం చెల్లింపులు మొదలైన వాటి కారణంగా నగదుకు అసాధారణ డిమాండ్ నెలకొన్నట్లు అధికారులు వివరించారు. బ్యాంకులు వేగంగా ఏటీఎంలలో నగదు భర్తీ చేస్తుండగా, నాలుగు ప్రింటింగ్ ప్రెస్‌లు నిరంతరాయంగా చిన్న నోట్ల ముద్రణ కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. అటు ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఏటీఎంలను రూ. 500 నోట్లతో భర్తీ చేయాలని సూచించారు. అలాగే, శాఖలన్నింటికీ నగదు సరఫరాను మరింతగా పెంచాలని, 80 శాతం పైగా ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రాల వారీగా డిమాండ్ తీరుతెన్నులను కేంద్రం విశ్లేషిస్తోంది. వారాంతంలోగా సాధారణ పరిస్థితి..: 24 గంటల వ్యవధిలో తమ ఏటీఎంలలో నగదు లభ్యతను మరింతగా పెంచినట్లు ఎస్బీఐ వెల్లడించింది. క్రితంరోజున 85% ఏటీఎంలు పనిచేస్తుండగా.. బుధవారం 92% ఏటీఎంలు అందుబాటులో ఉన్నట్లు వివరించింది. వారాంతం లోగా సాధారణ పరిస్థితి నెలకొనవచ్చని అంచనాలు ఉన్నాయి. నగదు కొరత కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనట్లు కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ తెలిపాయి. తమ 9,679 ఏటీఎంలలో 90% ఏటీఎంలలో సాధారణంగానే నగదు లభ్యత ఉంటుందని, ఇప్పుడూ అదే పరిస్థితి కొనసాగుతోందని పీఎన్బీ ప్రతినిధి తెలిపారు. నగదు కొరత 70వేల కోట్లు: ఎస్బీఐ రీసెర్చ్ ముంబై: ఇటు ప్రభుత్వం, అటు రిజర్వ్ బ్యాంక్.. కరెన్సీ కొరతేమీ లేదంటున్నప్పటికీ.. ఏకంగా రూ. 70,000 కోట్ల మేర కొరత ఉండొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. ఏటీఎంల నుంచి నెలవారీగా జరిగే విత్‌డ్రాయల్స్‌లో ఇది మూడో వంతు కావడం గమనార్హం. ఆర్థిక వృద్ధి, ప్రజల వద్ద ఉన్న కరెన్సీ, పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలు మొదలైన వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఎస్బీఐ రీసెర్చ్ నగదు కొరత గణాంకాలను అంచనా వేసింది. నామినల్ జీడీపీ వృద్ధి 9.8% స్థాయిలో ఉన్న పక్షంలో మార్చి ఆఖరుకి ప్రజల వద్ద రూ. 19.4 లక్షల కోట్లు ఉండాలని, అయితే రూ. 17.5 లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయని ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది. అలాగని ఈ రూ. 1.9 లక్షల కోట్ల మొత్తాన్ని లోటుగా చూడటానికి లేదని, ఇందులో రూ. 1.2 లక్షల కోట్ల మొత్తం డిజిటల్ లావాదేవీలది ఉం టుందని తెలిపింది. ఆ రకంగా చూస్తే మొత్తం మీద సుమారు రూ. 70,000 కోట్లు మేర లోటు ఉండొచ్చని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం ఏటీఎంల నుంచి డెబిట్ కార్డుల ద్వారా రూ. 15.29 లక్షల కోట్లు నగదు విత్‌డ్రాయల్ లావాదేవీలు జరిగాయని, అంతక్రితం ఆరు నెలలతో పోలిస్తి ఇది 12.2% అధికమని వివరించింది. కొరతతో వాటికి మేలు!! ప్రస్తుత కరెన్సీ కొరత వల్ల తమకు ప్రయోజనం కలిగిందంటున్నాయి మొబైల్ వాలెట్ సంస్థలు. పేటీఎం, మొబిక్విక్, ఫోన్‌పే వంటి సంస్థలు వాటి ప్లాట్‌ఫామ్‌లలో డిజిటల్ లావాదేవీలు పెరిగాయని పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పట్టణాల నుంచి గతనెలతో పోలిస్తే లావాదేవీలు 30 శాతం పెరిగాయని పేటీఎం బ్రాండ్ కలిగిన వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. మొబిక్విక్ సహవ్యవస్థాపకురాలు, డైరెక్టర్ ఉపాసన టకు మాట్లాడుతూ.. తాజా నగదు కొరత వల్ల చాలా మంది మొబైల్ వాలెట్లను వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ‘గత కొన్ని రోజులుగా మా ప్లాట్‌పామ్‌లో డిజిటల్ పేమెంట్స్, క్యూఆర్ ఆధారిత చెల్లింపులలో 27 శాతం వృద్ధి నమోదయ్యింది’ అని వివరించారు. -
నోటు కష్టం
ఈయన పేరు ఉప్పరి ధర్మరాజు. క్రిష్ణగిరి మండలం మాదాపురం గ్రామానికి చెందిన ఈయన పొలంలో పండిన వేరుశనగలను మద్దతు ధరతో ఆయిల్‌ఫెడ్ కొనుగోలు కేంద్రంలో అమ్ముకున్నాడు. ఇందుకు సంబంధించి రూ.95వేలు వెల్దుర్తి ఏపీజీబీలోని ఆయన ఖాతాకు 15 రోజుల క్రితం జమ అయింది. 10 రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా నగదు లేదని సమాధానమిస్తున్నారు. గట్టిగా అడిగితే నగదు రావడం లేదని చెబుతున్నారు. కర్నూలు(అగ్రికల్చర్)/వైఎస్ఆర్ సర్కిల్: అసలే మొదటి వారం.. ఆపై నగదు కొరత.. ఇంకేముంది. ఎక్కడ చూసినా రూకలకు ఇక్కట్లే. ఏటీఎంల ముందు నో క్యాష్ బోర్డులు, బ్యాంకుల్లో తర్వాత రండి అనే సమాధానాలు నిత్యకృత్యమయ్యాయి. ఫలితంగా అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా వేతన జీవుల అవస్థలు అన్నీఇన్నీ కావు. ఇదీ పరిస్థితి.. జీతాలు, పింఛన్ల పంపిణీ కోసం జిల్లాకు కనీసం రూ.100 కోట్లు అవసరముండగా బ్యాంకుల్లో రూ.20 కోట్లు కూడా లేని దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో పింఛన్ల పంపిణీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోరాదని, ఇందుకు అవసరమైన నగదు సిద్ధం చేయాలన్న కలెక్టర్ ఆదేశాల మేరకు రూ.30 కోట్లు అత్యవసరంగా సర్దుబాటు చేయాలని ఎల్డీఎం 5 రోజుల క్రితమే ఆర్బీఐని కోరినా ఫలితం లేకుండా పోయింది. ఎఫ్ఆర్డీఏ బిల్లు వల్ల కలిగే పరిమాణాలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లడంతో బ్యాంకులకు డిపాజిట్లు రావడం తగ్గిపోయింది. ఇదే సమయంలో బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణ మూడు,నాలుగు రెట్లు పెరిగింది. దీంతో నగదు కష్టాలు పెరిగిపోయాయి. పింఛన్లు, జీతాల పంపిణే కష్టంగా మారింది. రైతులు ఇతర వర్గాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. జిల్లాలో 465 బ్యాంకు శాఖలుండగా 80 శాతం డబ్బులేక దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. కోటి రూపాయలు పంపాలని ప్రాంతీయ కార్యాలయాలను కోరితే రూ.5లక్షలు కూడా ఇవ్వడం లేదు. ఏటీఎంలదీ ఇదే పరిస్థితి. జిల్లాలో 485 ఏటీఎంలుండగా 85శాతం వరకు నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఫలితంగా 20 రోజులుగా బ్యాంకుల్లో లావాదేవీలు గణనీయంగా పడిపోయాయి. ఈ కారణంగా మళ్లీ పెద్ద నోట్ల రద్దునాటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 6 నెలలుగా నగదు సరఫరా బంద్.. రిజర్వు బ్యాంకు నుంచి దాదాపు ఆరు నెలలుగా నగదు సరఫరా బంద్ అయింది. ‘తగినంత నగదు ముద్రించి పంపాము. ప్రజల్లోకి వెళ్లిన నగదు సర్క్యులేషన్లో లేదు. దాచి పెట్టుకుంటుండటం వల్ల నగదు సమస్య ఏర్పడుతోంది. ప్రభుత్వం, బ్యాంకులే సమన్వయంతో నగదు కొరత తీర్చుకోవాలి’ అని ఆర్బీఐ అధికారులు స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో నగదు రహిత లావాదేవీలు పెంచుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు. నగదు రహిత లావాదేవీలు పడిపోవడం, ప్రజల్లోకి వెళ్లిన నగదు తిరిగి బయటికి రాకపోతుండటం, డిపాజిట్లు బంద్ కావడం, ఆర్బీఐ నుంచి నగదు రావడం నిలిచిపోవడం తదితర కారణాల వల్ల క్యాష్ కష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొన్ని బ్యాంకులు నగదు కోసం రేపు, మాపు అంటుండగా మరికొన్ని బ్యాంకుల్లో రూ.50వేలు అడిగితే రూ.10 వేలు, రూ.5వేలు ఇచ్చి పంపుతున్నారు. దీంతో అందరూ అవస్థలు పడుతున్నారు. బ్లాక్ అవుతున్న పెద్ద నోట్లు.. రూ.2వేల నోట్ల సర్క్యులేషన్ గణనీయంగా పడిపోయింది. ఈ నోట్ల ముద్రణను ఆర్బీఐ పూర్తిగా నిలిపివేసింది. బ్యాంకుల నుంచి బయటికి వెళ్లిన నోట్లు ఎక్కడివక్కడ బ్లాక్ అవుతున్నాయి. పెద్ద నోట్లను చాలా వరకు లాకర్లలో పెడుతున్నట్లు సమాచారం. రూ.15వేల కంటే ఎక్కువ ఇవ్వలేము.... ఆర్బీఐ నుంచి ఆరు నెలలుగా నగదు రావడం లేదు. దీంతో క్యాష్కు ఇబ్బందిగా ఉంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ఒక్క ట్రెజరీ బ్యాంకుకే రూ.5కోట్లు అవసరం. 15 రోజుల నుంచి రోజు కింత తీసిపెడుతూ రూ.కోటి వరకు నిల్వ ఉంచాం. ఉద్యోగుల ఖాతాలకు జీతాలు జమ అయినా.. రూ.15వేల కంటే ఎక్కువ ఇవ్వలేం. ట్రెజరీ బ్రాంచి ఏటీఎంలో మాత్రం నగదు ఉంచుతున్నాం. బయటి వాళ్లు వచ్చి నగదు తీసుకుంటున్న కారణంగా రాత్రిళ్లు క్లోజ్ చేస్తున్నాం. – కల్యాణ్‌కుమార్, చీఫ్ మేనేజర్, ఎస్బీఐ ట్రెజరీ బ్రాంచ్ -
లబ్‌డబ్బు!
ఫైనాన్సియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ (ఎఫ్ఆర్డీఐ) బిల్లు–2017... పార్లమెంటులో ప్రవేశపెట్టగానే ఊహాగానాలు మొదలయ్యాయి. బ్యాంకులు దివాళాతీస్తే ఖాతాదారుల సొమ్ము హారతికర్పూరంలా కరిగిపోతుందనే పుకార్లు షికార్లు చేశాయి! ఇవే ‘పెద్ద కరెన్సీ నోట్ల రద్దు’ తర్వాత నాటి పరిస్థితిని పునరావృతం చేశాయి! గత వారం రోజుల నుంచి ప్రజల నగదు కష్టాలు పరాకాష్టకు చేరాయి. జిల్లాలో 90 శాతం ఏటీఎంలు ఖాళీ అయిపోయాయి. క్యాష్ రీసైకిల్ మెషిన్ల వద్ద ఎవ్వరైనా నగదు డిపాజిట్ చేస్తే తప్ప మరో దారి కనిపించట్లేదు. మరోవైపు బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్లు నిలిచిపోయాయి. డిపాజిట్ల ఉపసంహరణ కూడా తారస్థాయికి చేరింది. దీంతో బ్యాంకుల్లో లావాదేవీలు దాదాపుగా పడిపోయాయి. సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: 2016 నవంబర్ 8వ తేదీన రూ.500, రూ.1000 కరెన్సీ నోట్ల రద్దు తర్వాత నగదు కోసం ప్రజలకు రోజూ ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో 15 నెలల తర్వాత ఇంచుమించు అదే పరిస్థితి కొనసాగుతోంది. కొత్త రూ.2000 కరెన్సీ నోట్లు తొలినాళ్లలో హల్చల్ చేసినా క్రమేపీ చలామణి తగ్గిపోతున్నాయి. రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి వస్తున్న నోట్లకు, అవి ప్రజల్లో వెళ్లి మళ్లీ బ్యాంకుకు తిరిగొస్తున్న నోట్ల సంఖ్యకు చాలాచాలా వ్యత్యాసం కనిపిస్తోందని బ్యాంకు అధికారులే చెబుతున్నారు. క్రమేపీ బ్యాంకింగ్ వ్యవస్థ గాడిన పడుతుందనే సమయంలో గత ఏడాది చివర్లో ఎఫ్ఆర్డీఐ బిల్లు పిడుగులా వచ్చిపడింది. ఈ బిల్లు ఉద్దేశాలు ఏమైనప్పటికీ ప్రజల సందేహాలను నివృత్తి చేయడంలో అటు ప్రభుత్వాలు, ఇటు బ్యాంకులు విఫలమయ్యాయి. దీని ప్రభావం తొలుత ఫిక్సిడ్ డిపాజిట్లపై పడింది. ఏదొక అత్యవసర పని పేరుచెప్పి అవసరం ఉన్నా లేకపోయినా ఖాతాదారులు ఉపసంహరణ మొదలైంది. ఈ రెండు నెలల్లో అది తారస్థాయికి చేరింది. మరోవైపు బ్యాంకుల్లో డిపాజిట్లు దాదాపుగా నిలిచిపోయాయి. డ్వాక్రా పొదుపు సంఘాలతో పాటు పెట్రోలు బంకులు, మద్యం దుకాణాల యజమానులు చేస్తున్న డిపాజిట్లే కాస్త ఆదుకుంటున్నాయి. సాధారణంగా బ్యాంకులు తమవద్దకు వచ్చే డిపాజిట్ల సొమ్మునే తిరిగి ఖాతాదారులకు చెల్లింపులు చేస్తుంటాయి. ఇప్పుడది పూర్తిగా గాడితప్పింది. బ్యాంకుల్లో నగదు నిల్వ దాదాపుగా అడుగంటిపోయినట్లు వినికిడి. అన్ని జాతీయ బ్యాంకులకు చెందిన నగదు భద్రతా కేంద్రాలు (చెస్ట్‌లు) నిండుకున్నాయని తెలిసింది. దీంతో ఏటీఎంల్లో నింపడానికి నగదు లేక షట్టర్లు దించేస్తున్నారు. వారం రోజులుగా మరీ దుర్భరం గత శుక్రవారం బంద్, రెండో శనివారం, ఆదివారం... ఇలా వరుసగా మూడు రోజులు బ్యాంకులు పనిచేయలేదు. దీంతో ఎక్కడికక్కడ ఏటీఎంలన్నీ ఖాళీ అయిపోయాయి. ఆ తర్వాత నుంచి నగదు విత్‌డ్రాలే తప్ప బ్యాంకుల్లో డిపాజిట్లు కరువైపోయాయి. ఈ దుర్భర పరిస్థితి ఫలితంగా అనధికారికంగానే ఆంక్షలు అమలు చేస్తున్నారు. విత్‌డ్రా రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పరిమితం చేసేశారు. బ్యాంకుల వద్ద నగదు లేక ఈనెల పింఛన్ల పంపిణీ కూడా ఆలస్యమైపోయింది. జిల్లాలో పింఛన్లకు రూ.40 కోట్ల వరకూ నగదు అవసరం. కానీ ఇప్పటికీ పింఛన్ల పంపిణీ కొలిక్కిరాలేదు. రోజువారీ లావాదేవీలు రూ.10 కోట్లే... జాతీయ, ప్రైవేట్, సహకార బ్యాంకులు జిల్లాలో 24 ఉన్నాయి. వాటి బ్రాంచిలు 260 ఉన్నాయి. వీటికి అనుబంధంగా 300 వరకూ ఏటీఎంలు ఉన్నాయి. కానీ తర్వాత నిర్వహణ సరిగా లేక 32 ఏటీఎంల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. 268 ఏటీఎం వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. వాటిలో రోజుకు సగటున రూ.10 కోట్లు వరకూ నగదు ఉంచాల్సి ఉంది. కానీ వాటిలో 60 వరకూ క్యాష్ రీసైకిల్ ఏటీఎంలే. వాటిలో ఎవ్వరైనా డిపాజిట్ చేస్తే మరెవ్వరికైనా ఆ నగదును విత్‌డ్రా చేసే అవకాశం లభిస్తోంది. ప్రస్తుతం జిల్లా అవసరాల కోసం రోజుకు రూ.200 కోట్లు నగదు కావాలి. కానీ ప్రస్తుతం బ్యాంకుల్లో రోజువారీ లావాదేవీలు రూ.10 కోట్లుకు మించట్లేదని సమాచారం. ‘నగదురహితం’లో నగుబాటు నగదు ఆధారిత లావాదేవీలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం నగదురహిత లావాదేవీల విధానాన్ని ప్రభుత్వం ఒక ఉద్యమంలా తెరపైకి తెచ్చి ఏడాదైనా ఆచరణలో నవ్వుల పాలైందనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో శ్రీకాకుళం నగరపాలక సంస్థతో పాటు నాలుగు పురపాలక సంఘాలు, సుమారు 2,200 గ్రామాలు ఉన్నాయి. ఏజెన్సీలో పలుచోట్ల బ్యాంకులు మండల కేంద్రాలకే పరిమితమయ్యాయి. నగదు విత్‌డ్రా కోసం ఖాతాదారులు గ్రామాల నుంచి కొన్ని కిలోమీటర్లు ప్రయాణించి రావాల్సి వస్తోంది. తీరా బ్యాంకుల వద్ద ‘నో క్యాష్’ బోర్డులు కనిపించేసరికి తీవ్ర నిరాశకు గురవుతున్నారు. శ్రీకాకుళంలో రైతుబజారు వద్ద తెరిచిన స్వైపింగ్ మెషిన్ ఒక్కరోజు ముచ్చటే అయ్యింది. ప్రతి ఆర్టీసీ బస్సులోనూ స్వైపింగ్ మెషిన్ అందుబాటులో ఉంచుతామని, బ్యాంకు ఆఫ్ బరోడా ద్వారా 430 మెషిన్లు తెప్పించామని అధికారులు ప్రకటించినా అవేవీ వాడకంలో కనిపించట్లేదు. 17 మద్యం దుకాణాలు, 8 బార్ల వద్ద మాత్రమే పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మిషన్లు ఉన్నాయి. విద్యుత్తు బిల్లుల చెల్లింపుల కోసం 50 స్వైపింగ్ మెషిన్లు వాడుతున్నారు. మండలానికి ఒకటి చొప్పున 38 డిజిటల్ గ్రామాలను ప్రకటించినప్పటికీ అక్కడా పూర్తిస్థాయిలో నగదురహిత విధానం అమలుకావట్లేదు. నోటు కష్టాలకు నిదర్శనాలు కొన్ని... పలాస నియోజకవర్గ పరిధిలో సుమారు పదివేల మంది కార్మికులకు ముందస్తుగా అందించాల్సిన నగదు ఇవ్వలేక 160 జీడిపరిశ్రమల యజమానులు ఇబ్బందిపడుతున్నారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 19 ఏటీఎంల్లో ఒక్క హెచ్డీఎఫ్సీ ఏటీఎంలోనే అరకొరగా నగదు ఉంటోంది. దీంతో అక్కడ ఖాతాదారులు బారులు తీరుతున్నారు. ∙ వంశధార పునరావాస కాలనీల్లో నిర్వాసితులు సొంతంగా ఇల్లు నిర్మించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకుల్లో తమ ఖాతాల్లోని సొమ్ము తీయాలంటే రోజుకు రూ.5 వేలు మించి ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్.ఎన్.పేట, హిరమండలం, కొత్తూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న అనేక బ్యాంకుల్లో సుమారు 4,500 మంది వరకు నిర్వాసితులు తమకు వచ్చిన ప్యాకేజీ డబ్బులు డిపాజిట్లు, ఎస్బి ఖాతాల్లో ఉంచినట్లు నిర్వాసితులే చెపుతున్నారు. ∙ జిల్లావ్యాప్తంగా 2 లక్షలకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటి బిల్లులకు సం బంధించిన మొత్తం లబ్ధిదారుల ఖాతాల్లోకి సరిగా జమకావటం లేదు. దీంతో పేదలు ఇబ్బందిపడుతున్నారు. రూ.100 కోట్లు కావాలని ఆర్బీఐకి విన్నవించాం... జిల్లాలో వచ్చేనెలలో తలెత్తే నగదు అవసరాల కోసం రూ. 100 కోట్లు నగదు అవసరమని ఆర్బీఐకి వినతి పంపించాం. ఇది ఈనెల 28వ తేదీకల్లా వస్తుందని ఆశిస్తున్నాం. ప్రస్తుత అవసరాలకు పొరుగునున్న ఒడిశా రాష్ట్రంలోని బ్యాంకుల నుంచి నగ దు సర్దుబాటు చేస్తున్నాం. నెట్‌బ్యాంకింగ్ తదితర నగదురహిత లావాదేవీలను ప్రజలు విరివిగా నిర్వహిస్తే ఇంత ఇబ్బంది తలెత్తదు. అలాగే ఎఫ్ఆర్డీఐ బిల్లుపై సందేహాలు కూడా తగదు. దానివల్ల ఖాతాదారులకు నష్టమేమీ ఉండదు. – పి.వెంకటేశ్వరరావు, జిల్లా లీడ్‌బ్యాంకు మేనేజరు -
నో క్యాష్
సాక్షి, మచిలీపట్నం/ సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నగదు కష్టాలు తీవ్రమవుతున్నాయి. బ్యాంకుల్లో అవసరమైన మేరకు నగదు డ్రా చేయడం సాధ్యపడట్లేదు. పర్సులో డబ్బు ఖాళీ అయితే ఏటీఎం నుంచి డ్రా చేయాలనుకునే వారి కష్టాలు వర్ణనాతీతం. ఎందుకీ సమస్య ♦ కృష్ణాజిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల ప్రధాన శాఖలు 846 ఉండగా, ఆయా బ్యాంకులకు సంబంధించి 1,051 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 80శాతం ఏటీఎంల్లో నగదు కొరత ఏర్పడింది. ♦ గుంటూరు జిల్లాలో మొత్తం బ్యాంకులు (బ్రాంచీలతో కలిపి) 824 ఉండగా, 870కి పైగా ఏటీఏంలు ఉన్నాయి. ఇందులో 70 శాతం పైగా ఏటీఎంలు పనిచేయట్లేదు. ప్రధాన బ్యాంకులకు సంబంధించిన ఏటీఎంలలో సైతం డబ్బు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో 30 శాతానికి పైగా ఏటీఎంలు శాశ్వతంగా మూతపడ్డాయి. 2016, నవంబర్‌లో కేంద్రం పెద్దనోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కొంతకాలం నగదు కష్టాలు వెంటాడాయి. ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. కారణాలివీ.. నగదు కష్టాలకు రెండు కారణాలు ప్రముఖంగా నిలుçస్తున్నాయని బ్యాంకర్లు స్పష్టీకరిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ నుంచి జిల్లాకు నగదు నిల్వలు స్తంభించడం, పార్లమెంట్లో ఎఫ్ఆర్డీఐ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు ఉండటాన్ని కారణంగా పేర్కొంటున్నారు. దీంతో బ్యాంకు ఖాతాల్లో నగదుపై ఖాతాదారులకు అధికారం ఉండదనే ప్రచారం ప్రస్తుతం బాగా జరుగుతోంది. రోజూ రూ.కోట్లల్లో లావాదేవీలు ♦ కృష్ణాజిల్లాలో అన్ని బ్యాంకుల్లో కలిపి నిత్యం దాదాపు రూ.200 నుంచి రూ.250 కోట్ల మేర నగదు లావాదేవీలు జరుగుతుంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, సామాజిక పింఛన్‌దారులకు చెల్లింపులు.. తదితరాలకు ప్రతినెలా మొదటి వారంలో అయితే పెద్ద ఎత్తున నిధులు అవసరమవుతాయి. ఉద్యోగుల వేతనాల చెల్లింపులు అత్యధిక శాతం ఎస్బీఏలోనే జరుగుతాయి. ఈ బ్యాంకులకు తొలివారం రూ.300 కోట్లకుపైగా అవసరమని తెలిసింది. ♦ గుంటూరు జిల్లాలోని బ్యాంకుల్లో 2017, అక్టోబర్ నాటికి రూ.25,325 కోట్ల డిపాజిట్లు ఉండేవి. ప్రతి ఏడాది బ్యాంకుల్లో 15–17 శాతం డిపాజిట్లు పెరిగేవి. అయితే, అందులో ఖాతాదారులు ఇప్పటికే 10 శాతం మేర డిపాజిట్లు తీసుకున్నారు. జిల్లాలోని బ్యాంకుల్లో రూ.3,382.28 కోట్ల మేర అప్పులు ఉన్నట్లు తెలిసింది. గతంలో ఎన్పీఏ (నిర్థారక ఆస్తులు) 1 నుంచి 2 శాతం మాత్రమే ఉండేవి. ప్రస్తుతం వాటి విలువ 13–14 శాతం పెరగటంతో బ్యాంకులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. కేవలం విత్‌డ్రాలే.. కరెన్సీ కష్టాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని బ్యాంకు శాఖల్లో నగదు జమ తక్కువగా, చెల్లింపులు (విత్‌డ్రా)లు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో విత్‌డ్రాలకు అవసరమైన మేర నగదు సమకూర్చడం తలనొప్పిగా పరిణమించింది. ప్రధానంగా రూ.2వేలు, రూ.500 నోట్ల కొరత అధికమైంది. బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా చేసినప్పుడు వచ్చే రూ.500, రూ.2వేల నోట్లను చాలామంది భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇళ్లల్లోనే దాచుకుంటున్నారు. తిరిగి వాటిని బ్యాంకుల్లో జమ చేసేందుకు సాహసించట్లేదు. వ్యాపారులే ఆదరువు ఇతర బ్యాంకులు, శాఖలు.. ప్రైవేట్ బ్యాంకులతో మాట్లాడుకుని ఏరోజుకారోజు నగదు సర్దుబాటు చేసుకుంటున్నాయి. పెట్రోల్ బంకులు, మద్యం దుకాణాలు, ఆర్టీసీ డిపోలు, కొందరు వ్యాపారుల నుంచి నిత్యం వచ్చే నగదు జమలు ప్రస్తుతం బ్యాంకర్లకు ఆదరువుగా నిలుస్తున్నాయి. పార్లమెంట్లో ఎఫ్ఆర్డీఐ బిల్లు ప్రవేశ పెడుతున్నారనే ప్రచారం, దీనివల్ల బ్యాంకుల్లో నగదుపై ప్రభుత్వానికి అజమాయిషీ ఉంటుందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అధికంగా ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని, ప్రస్తుతం అలాంటిదేమీ లేదని, ఆ బిల్లు అమలు ప్రక్రియ పరిశీలించేందుకు ఇంకా కమిటీని మాత్రమే ఏర్పాటు చేశారని బ్యాంకర్లు చెబుతున్నా.. అది ప్రజల్లో నెలకొన్న అభద్రతాభావాన్ని రూపుమాపడం లేదు. -
కరెన్సీ కటకట
ధర్మవరానికి చెందిన ఓబిరెడ్డి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా పెట్రోల్ అయిపోయింది. పెట్రోలు బంకులో స్వైపింగ్ మిషన్ పనిచేయలేదు. డబ్బులు తీసుకుందామని ఏటీఎంకు వెళితే నగదు లేదని మూసివేశారు. నాలుగైదు ఏటీఎంలు తిరిగినా అదే కథ. చివరికి తన స్నేహితునికి ఫోన్ చేసిన రూ.500 అప్పు ఇప్పించుకుని పెట్రోల్ పోయించుకున్నాడు. నగదు చేతిలో లేక ఏటీఎంలలో రాక జిల్లాలోని జనం పడుతున్న ఇబ్బందులకు ఓబిరెడ్డి ఉదంతమే నిదర్శనం. ► జిల్లాలోని ప్రధాన బ్యాంకులు 36 ► 456 అన్ని బ్యాంకుల శాఖలు ► రూ.కోట్లలో 50–70 రోజూ విత్‌డ్రా అవుతున్న మొత్తం ధర్మవరం: జిల్లాలో ఎవరి నోట విన్నా.. కరెన్సీ కష్టాలే. ఖాతాలో డబ్బులున్నా.. చిల్లిగవ్వ చేతికందక జనమంతా ఇబ్బందులు పడుతున్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత డిపాజిట్లు తగ్గిపోవడం... విత్‌డ్రాలు పెరిగిపోవడంతో అన్ని బ్యాంకుల్లో నగదు నిండుకుంటోంది.. ఇక నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు లావాదేవీల రుసుముమలకు భయపడి జనం రహిత లావాదేవీలను అంగీకరించడం లేదు. దీంతో జిల్లాలోని ఏ ఏటీఎం ముందు చూసినా నోక్యాష్ బోర్డులు కనిపిస్తోంది. అరా కొరా ఉన్నా.. జనం బారులు తీరికనిపిస్తున్నారు. ఇక రెండు, మూడు రోజులు సెలవు వచ్చిందంటే...పరిస్థితి చాలా దారుణంగా ఉంటోంది. జమకాని నగదు: జిల్లాలోని చాలా బ్యాంకుల్లో నగదు విత్‌డ్రా అవుతోందే తప్ప డిపాజిట్(జమ) కావడం లేదు. బయటికి చెప్పకపోయినప్పడికీ బ్యాంకర్లను ఈ విషయం చాలా కలవరపాటుకు గురిచేస్తోంది. పెద్ద నోట్ల రద్దు సమయంలో తొలి రెండు నెలలు ప్రజలు డబ్బుల కోసం పడరానిపాట్లు పడ్డారు. ఆ తరువాత కొంత సర్దుకున్నప్పటికీ నానాటికీ పెరుతున్న బ్యాంకుల నిబంధనలు వినియోగదారులను బ్యాంకు అంటేనే బెంబేలెత్తిపోతున్నారు. బ్యాంకులు ఏంటీఎంల ద్వారా నగదులావాదేవీలపై చార్జీల భారం మోపుతుండటం, మినిమం బ్యాలెన్స్ ఉండాలన్న నిబంధనల నేపథ్యంలో ప్రజలు బ్యాంకుల్లో నగదు జమచేయడం లేదు. దీనికి తోడు ఎఫ్‌డీఐ రూమర్లపై రిజర్వ్‌బ్యాంక్ కూడా స్పష్టమైన ప్రకటనేదీ వెలువరించకపోవడంతో బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు తగ్గిపోవడానికి కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నగదుకు తీవ్ర కొరత ఏర్పడింది. బ్యాంకుల్లోనూ∙కొరత: జిల్లాలో మొత్తం 36 ప్రిన్సిపల్ బ్యాంకులుండగా.. వాటికి 456 శాఖలు ఉన్నాయి. అదేవిధంగా ఆయా బ్యాంకుల శాఖలకు సంబంధించిన 556 ఏటీఎం కేంద్రాలున్నాయి. మరో 50 దాకా ఏటీఎంలను ఇండిక్యాష్ తదితర ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్నాయి. బ్యాంకర్లు తెలిపిన మేరకు ఆయా బ్యాంకులు, వాటి శాఖలు, ఏటీఎంలలో సాధారణ సమయాల్లో అయితే రోజుకు రూ.50 నుంచి 70 కోట్ల మేర నగదు ఉపసంహరణలు జరుగుతుండగా..అదే మొత్తంలో నగదు డిపాజిట్లు (జమ)జరుగుతుంటాయి. అయితే పెద్దనోట్ల రద్దు తర్వాత చాలామంది బ్యాంకుల్లో డబ్బును జమ చేసేందుకు ఇష్టపడటం లేదు. దీంతో నగదు డిపాట్, ఉప సంహరణల తేడా 20 నుంచి 30 శాతం ఉన్నట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. ఈనేపథ్యంలో బ్యాంకు నుంచి విత్‌డ్రా చేసిన మొత్తం డబ్బులో 30 శాతం దాకా వినియోగదారులు తమ వద్దే ఉంచుకుంటున్నట్లు సమాచారం. దీంతోనే బ్యాంకుల్లో నగదు కొరత ఏర్పడిందని చెబుతున్నారు. మరోవైపు ఆర్బీఐ నుంచి నగదు రాకపోవడం కూడా కరెన్సీ కటకటకు మరో కారణంగా తెలుస్తోంది. -
క్యాష్ కష్టాలు
ఫొటోలో చంటి బిడ్డతో ఉన్న ఆమె పేరు అరుణ. నెల మొదటి వారం కావడంతో ఇంటిలో సరకులు నిండుకున్నాయి. చేతిలో డబ్బులు లేవు. ఏటీఏంలో తీసుకొని సరుకులు తీసుకెళ్లాలని కోడలు, చంటి బిడ్డను వెంటబెట్టుకుని బజారులోకి వచ్చారు. ఎక్కడ చూసినా ఏటీఏంలలో డబ్బు రాలేదు. చివరకు నగరం పాలెం ఎస్బీఐ బ్రాంచి వద్ద తప్పకుండా డబ్బు ఉంటుందని వచ్చారు. అక్కడా నిరాశ ఎదురైంది. ఆమె మధ్యాహ్నం 12గంట నుంచి 1 గంట వరకు అక్కడే వేచి ఉన్నారు. బ్యాంకు అధికారులు ఏటీఎంలో డబ్బు పెడితే తీసుకెళ్లాలని చంటి పిల్లతో నిరీక్షించక తప్పలేదు. సాక్షి, అమరావతి బ్యూరో: జిల్లాలో నగదు కష్టాలు ప్రజల్ని వెంటాడుతూనే ఉన్నాయి. తాము కష్టపడి, సంపాదించుకొన్న సొమ్మును తీసుకోవటానికి కూడా నిబంధనలు ఏమిటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర నిమిత్తం పెద్ద మొత్తంలో డబ్బులు తీయాలంటే, బ్యాంకుల్లో సైతం నగదు నిల్వలు ఉండక ఖాతాదారులు అల్లాడిపోతున్నారు. జిల్లాలో మొత్తం 824 బ్యాంకుల బ్రాంచీలు, 870కి పైగా ఏటీఏంలు ఉన్నాయి. ఇందులో 70 శాతం పైగా పనిచేయడం లేదు. ప్రధాన బ్యాంకులకు సంబంధించిన ఏటీఎంలలో సైతం డబ్బులు పెట్టక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో 30 శాతం పైగా ఏటీఎంలు శాశ్వతంగా మూతపడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో పెద్దమొత్తంలో నగదు డ్రా చేసేందు ఖాతాదారులు వెళితే, డబ్బులు లేక నాలుగు రోజుల పాటు వాయిదాల పరిస్థితిలో ఇచ్చే దుస్థితి నెలకొంది. ప్రధానంగా క్యాష్ సర్క్యులేషన్ లేకపోవటంతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని బ్యాంకు వర్గాలు పేర్కొంటున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు విత్ డ్రా ప్రధానంగా ఎఫ్ఆర్డీఐ బిల్లు పార్లమెంట్లో ప్రవేశ పెడతారనే సమాచారం లీకు కావడంతో ఖాతాదారులు ఫిక్స్డ్ డిపాజిట్లను తీసేసుకుంటున్నారు. బ్యాంకులు, ఏటీఎంలనుంచి తీసుకొన్న నగదును, తిరిగి బ్యాంకులో వేయకుండా ఎలాంటి పరిస్థితులు వస్తాయోననే ఉద్దేశంతో తమ వద్దే ఉంచుకొంటున్నారు. ఎఫ్ఆర్డీఐ బిల్లు ఊహాగానాలు రాక ముందు అంటే 2017, అక్టోబరు నాటికి జిల్లాలోని బ్యాంకుల్లో రూ. 25,325 కోట్ల డిపాజిట్లు ఉండేవి. ప్రతి ఏడాది 15–17 శాతం పెరిగేవి. అయితే, అందులో అనూహ్యంగా ఖాతాదారులు ఇప్పటికే 10 శాతం మేర డిపాజిట్లు తీసుకున్నారు. దీంతో వాటి వృద్ధి రేటు తగ్గిపోయింది. ప్రధానంగా జిల్లాలో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే అప్పులు ఎక్కువగా ఉండటం గమనార్హం. జిల్లాలో బ్యాంకుల్లో రూ3,382.28 కోట్ల మేర అప్పులు ఉన్నట్లు తెలిసింది. గతంలో ఎన్పీఏ(నిరర్థక ఆస్తులు) 1నుంచి2 శాతం మాత్రమే ఉండేవి. ప్రస్తుతం వాటి విలువ 13–14 శాతం పెరగటంతో బ్యాంకులు తీవ్ర సంక్షోభంలో కురుకొని పోయాయి. మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్టు ఎఫ్ఆర్డీఐ బిల్లు వస్తుందనే సమాచారం బ్యాంకుల్ని మరింత కష్టాలోకి నెట్టింది. ఈ బిల్లు రాక మునుపు బ్యాంకులు దివాలా తీసినా లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ ఉండేది. ప్రస్తుతం ఈ బిల్లు అచరణ రూపం దాల్చితే రూ. 10 లక్షల మేర ఇన్సూరెన్స్ ఉంటుంది. బ్యాంకులకు సంబంధించి అప్పులు పెరిగిపోయినప్పుడు, ఈ బిల్లు ద్వారా బ్యాంకుల వద్ద ఉన్న డిపాజిట్లను తీసుకొని అప్పులు చెల్లించే వెసులు బాటు ఉంది. రిజర్వ్ బ్యాంకులకు రాని నగదు జిల్లాలో పెద్ద నోట్ల రద్దు సమయంలో దాదాపు రూ.13వేల కోట్లకు పైగా పెద్ద నోట్లలను జిల్లానుంచి రిజర్వ్ బ్యాంకుకు పంపారు. రిజర్వ్ బాంకు దశల వారీగా 2017 ఏప్రియల్ 18 వరకు మరలా నగదును పంపింది. అప్పటి నుంచి నగదు సరఫరా చేయకుండా నిలిపివేసింది. మీ డబ్బు మీకు ఇచ్చాం..., సర్దుకోండి అని రిజర్వ్ బ్యాంకు వర్గాలనుంచి సమాచారం వచ్చినట్లు తెలిసింది. ప్రధానంగా బ్యాంకుల నుంచి డబ్బు ఎక్కువగా డ్రా చేయడం, జమ చేయడం తక్కువగా ఉండటంతో ఇబ్బందులు తలెత్తున్నాయి. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఏం, బ్యాంకుల వద్ద డబ్బులు లేక జనాలు అల్లాడిపోతున్నారు. -
అయ్యో ఏటీఎంలలో డబ్బుల్లేవే..!
ఏలూరు (మెట్రో): పండగ రోజుల్లోనూ చేతుల్లో పైసలు లేవు. బంధుమిత్రులతో కళకళలాడాల్సిన తెలుగు లోగిళ్లలో.. సొమ్ములు లేని వెలితి కనిపిస్తోంది. నగదు కోసం జిల్లావాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. పండగ వేళ.. ఇదేం బాధ అనుకుంటూ ఏటీఎం కార్డులు పట్టుకుని కాళ్లకు పని చెబుతున్నారు. కనిపించిన ప్రతి ఏటీఎంకు వెళ్లి నగదు కోసం యత్నిస్తున్నారు. అయినా ఫలితం ఉండడం లేదు. నో క్యాష్ బోర్డులే ఏ బ్యాంకు ఏటీఎం అయినా ప్రస్తుతం నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం రిజర్వుబ్యాంకు నుంచి నగదు రాకపోవడమేనని తెలుస్తోంది. పండగ నేపథ్యంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా నగదు కావాల్సి ఉంటుందని రిజర్వు బ్యాంకుకు ఇక్కడి బ్యాంకులు ముందే నివేదించినా అక్కడి నుంచి ఎటువంటి సమాధానం లేకపోవడంతో బ్యాంకర్లు తామేమీ చేయలేమంటూ చేతులెత్తేశారు. ఇప్పటికే ప్రజల వద్ద వినియోగానికి మించి నగదు నిల్వలు ఉన్నాయని రిజర్వు బ్యాంకు నోట్లను పంపడం నిలిపేసింది. నగదు డిపాజిట్లు అరకొరే.. ఇదిలా ఉంటే వారం రోజులుగా జిల్లావ్యాప్తంగా నగదు డిపాజిట్లు అరొకరగానే జరిగాయి. నగదు ఉపసంహరణలే ఎక్కువగా జరిగాయి. ఫలితంగా నగదు లేకుండా పోయింది. జిల్లా వ్యాప్తంగా ఇలా .. జిల్లా వ్యాప్తంగా 39 బ్యాంకులు, 615 బ్రాంచిలు ఉన్నాయి. 671 ఎటీఎంలు ఉన్నాయి. గత గురు, శుక్రవారాల్లో జిల్లా వ్యాప్తంగా రూ.200 కోట్ల మేర నగదు ఉపసంహరణలు జరిగాయని సమాచారం. దీంతో బ్యాంకుల్లో నగదు నిల్వలు నిండుకున్నాయి. మరో నాలుగు రోజులు ఇంతే.. మరో నాలుగు రోజులు పండగ సెలవులు కావడంతో బ్యాంకులు పనిచేయవు. బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేసే అవకాశమే లేదు. ఇప్పటికే జిల్లాలో కోడిపందేలు, ఇతరత్రా పనుల కోసం భారీస్థాయిలో నగదు నిల్వలు అట్టేపెట్టుకున్నారు. దీంతో ఈ నాలుగు రోజులూ సామాన్యులకు సొమ్ములు లభించని దుస్థితి నెలకొంది. ఫలితంగా చేతిలో పైసల్లేకుండా పండగ ఎలా చేసుకోవాలో తెలీక సామాన్యులు సతమతమవుతున్నారు. మూడురోజుల్లో వెసులుబాటు మరో మూడురోజుల్లో సమస్య పరిష్కారమయ్యే ఆస్కారం ఉంది. ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం కంటే నగదు తీసుకునేందుకే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో నగదు నిల్వలు లేవు. రిజర్వు బ్యాంకుకు విషయాన్ని చెప్పినా అక్కడి నుంచి స్పందన లేదు. ప్రజల వద్ద నగదు ఎక్కువగానే ఉందని చెబుతున్నారు. రైతులకు ధాన్యం సొమ్ములు జమకావడం కూడా నగదు కొరతకు ఒక కారణమే. మరో మూడు రోజుల్లో కాస్త వెసులుబాటు కలిగే అవకాశం ఉంది. – పి.సూర్యారావు, లీడ్‌బ్యాంకు మేనేజర్ -
తీవ్రస్ధాయికి చేరిన కరెన్సీ కష్టాలు
-
అంతటా నో క్యాష్ బోర్డులే: ఎంపీ రేణుక
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణల్లో ఎక్కడ చూసినా నగదు నిల్వలు లేవంటూ ఏటీఎంల ముందు బోర్డులు పెడుతున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. పెద్ద నోట్లరద్దు ప్రక్రియను తాము స్వాగతి స్తున్నామని, అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆమె ఈ అంశాన్ని లేవనెత్తారు. బ్యాంకులకు వెళ్లినా నగదు ఉపసంహరణ సేవలు అందడం లేదన్నారు. ప్రజల కష్టాలను ఇకనైనా తొలగిం చాలన్నారు. -
నోటు.. దొరికితే ఒట్టు!
♦ కరెన్సీ కోసం జనం తిప్పలు ♦ నెలరోజులైనా తీరని గోస ♦ రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’ సర్వే ♦ పనిచేయని ఏటీఎంలు.. ఎక్కడికెళ్లినా ‘నో క్యాష్’ బోర్డులు ♦ జిల్లాల్లో 245 ఏటీఎంల పరిశీలన.. 210 ఏటీఎంలో డబ్బులే లేవు ♦ హైదరాబాద్‌లో 335 ఏటీఎంల్లో.. 324 మూత సాక్షి, హైదరాబాద్: ‘‘పొద్దున్నే పనులు మానుకొని వచ్చి ఏటీఎం ముందు లైన్లో నిలబడ్డా.. నాలుగు గంటలు ఉంటే రూ.2 వేలు వచ్చాయి..’ – వరంగల్ జిల్లాలో ఓ సామాన్యుడి గోస ‘‘నేను ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఎన్టీఆర్నగర్, కొత్తపేట్, దిల్సుఖ్నగర్, మలక్‌పేట్, అంబర్పేట్, రామంతాపూర్, ఉప్పల్, నాగోల్ ప్రాంతాల్లోని ఏటీఎంలన్నీ చూశా. ఎక్కడా క్యాష్ లేదు. ఎక్కడికెళ్లినా నో క్యాష్ బోర్డులే కనిపించాయి..’’ – హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ఆవేదన ...ఇవి మచ్చుకు రెండు ఉదాహరణలే! రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇవే పాట్లు కనిపిస్తున్నాయి. పెద్ద నోట్లు రద్దు చేసి నెల దాటినా జనానికి కరెన్సీ కష్టాలు తప్పడం లేదు. బ్యాంకుల్లో తగినంత నగదు లేక, ఏటీఎంలలో డబ్బుల్లేక విలవిల్లాడుతున్నారు. రాత్రింబవళ్లు ఇటు బ్యాంకులు, అటు ఏటీఎంల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వెళ్లినచోటల్లా ‘ఔట్ ఆఫ్ సర్వీస్’, ‘నో క్యాష్’ బోర్డులే వెక్కిరి స్తున్నాయి. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రోజుల తరబడి ఏటీఎం కేంద్రాలు మూతబడి ఉన్నాయి. పనిచేస్తున్న చోట డబ్బులు పెట్టిన నిమిషాల వ్యవధిలో నగదు నిల్వలు నిండు కుంటున్నాయి. తర్వాత ఎప్పట్లాగే బోర్డులు దర్శనమిస్తున్నాయి. జనం కరెన్సీ కష్టాలపై ‘సాక్షి’ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి సర్వే చేపట్టింది. 245 ఏటీఎంలు.. 210లో నో క్యాష్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు కలిపి 7,548 ఏటీఎం మిషన్లున్నా యి. రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత కొత్తగా అందుబాటులోకి వచ్చిన రూ.2 వేల నోట్లను ఏటీఎం మిషన్ల ద్వారా పంపిణీ చేసే అవకాశం లేకుండా పోయింది. సాంకేతిక సమస్యలు అధిగమించడంతో పాటు రాష్ట్రంలో ఇప్పటివరకు 4 వేల ఏటీఎంలలో సాఫ్ట్వేర్ అప్డేట్ ప్రక్రియ పూర్తయింది. కానీ వీటన్నిటి ద్వారా నగదు పంపిణీ జరగడం లేదు. బ్యాంకుల వద్ద నగదు కొరతతో ఏటీఎం కేంద్రాలు తెరుచుకోవడం లేదు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఏటీఎంలను పరిశీలించగా.. చాలాచోట్ల ‘నో క్యాష్ బోర్డు’లు కనిపించాయి. 245 ఏటీఎంల వద్ద సర్వే చేపట్టగా.. అందులో 210 ఏటీఎంలల్లో నగదు లేదని తేలింది. 35 ఏటీఎంలు పనిచేస్తున్నట్లు కనిపించినా... కాసేపటికే అందులో నగదు అయిపోయింది. మొత్తంగా 87.75 శాతం ఏటీఎంలు పనిచేయలేదు. సొంత ఖాతాదారులకే నగదు! నగదు కొరత ఉండడంతో పలు బ్యాంకులు, ఏటీఎంలలో కేవలం సొంత శాఖలకు సంబంధించిన కార్డుల్ని మాత్రమే అంగీకరిస్తున్నాయి. నగదు అందుబాటులో ఉంటే సొంత ఖాతాదారులు మాత్రమే నగదును తీసుకునేలా ఏర్పాట్లు చేశాయి. దీంతో గంటల తరబడి క్యూ లైన్లో నిల్చున్నా.. తీరా మిషన్‌లో కార్డును స్వైప్ చేసి అవాక్కవ్వాల్సిన పరిస్థితి వస్తోంది. ఇక నెలసరి వేతనాలు పొందే చిరుద్యోగులు నగదు కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. నేడు, రేపు మరిన్ని కష్టాలు బ్యాంకులకు వరుసగా సెలవులు రావడంతో కరెన్సీ కష్టాలు తీవ్రమయ్యా యి. నగదు అందుబాటులో ఉన్న ఏటీఎంల వద్ద శనివారం భారీగా క్యూలైన్లు కనిపించాయి. ఆది, సోమ వారాలు సైతం సెలవు దినాలే కావడం తో ఏటీఎంలు పనిచేసే అవకాశాలు తక్కువే. దీంతో కరెన్సీ కష్టాలు మరింత ఎక్కువ కానున్నాయి. రాజధానిలో ఎక్కడ చూసినా బారులే.. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మొత్తం 335 ఏటీఎంలను పరిశీలించగా వాటిలో 11 ఏటీఎంలు మాత్రమే పనిచేశా యి. మిగతా 324 ఏటీఎంలు మూసి ఉన్నాయి. తెరిచిన ఏటీఎం కేంద్రాలన్నింటిలోనూ ఉదయం 9 నుంచి 11 గంటల వరకే డబ్బులు అయిపోయాయి. పనిచేసే ఏటీఎంల ముందు వందలాది మంది బారులు తీరి కనిపించారు. కాసేపటికే నగదు అయిపోవడంతో ఎందరో నిస్సహాయంగా వెనుదిరిగి వెళ్లారు. -
నోటు.. దొరికితే ఒట్టు!
-
నో వీకెండ్..నో జాయ్
సాక్షి, సిటీబ్యూరో/ఉప్పల్/నాగోల్/ కూకట్పల్లి/రాంగోపాల్‌పేట్: డబ్బు ఇప్పుడు ఒక మాయా వస్తువైంది. కనీకనిపించనట్లు, ఉండీ లేనట్లు, చేతికి వచ్చీ రానట్లు...అంతా ఎడారిలో ఎండమావుల సదృశ్యంగా మారింది. డబ్బుల కోసం రోడ్డెక్కే ప్రతి వ్యక్తిని బ్యాంకులు, ఏటీఎంలు అపహాస్యం చేస్తున్నాయి. ఖాతాల్లో డబ్బులు ఉన్నా అవసరానికి వినియోగించుకోలేని దుస్థితి. కష్టపడి సంపాదించుకున్న డబ్బులను అవసరానికి వాడుకునే హక్కు లేకుండా పోయింది. గంటల తరబడి పడిగాపులు కాస్తే వెయ్యో, రెండు వేలో చేతిలో పెట్టి పంపించే బ్యాంకులు ఒకవైపు...ఎప్పుడు తెచుకుంటాయో, ఎప్పుడు మూసుకుంటాయో తెలియని ఏటీఎంలు మరోవైపు లక్షలాది జనాన్ని నానా అగచాట్లకు గురి చేస్తున్నాయి. తెల్లారిందంటే చాలు జనం ఇళ్ల నుంచి నేరుగా ఏటీఎంలు, బ్యాంకులకే పరుగులు తీస్తున్నారు. కానీ ఎంత దూరం వెళ్లినా ఎండమావులను తలపించే విధంగా సగం మూసి, సగం తెరుచుకొన్న షట్టర్లతో కనిపించే ఏటీఎంలు, ‘ఔట్ ఆఫ్ సర్వీస్’ అంటూ వేలాడే బోర్డులు ప్రజలను వెక్కిరిస్తున్నాయి. ఒకవేళ ఎక్కడో ఒక చోట తెరుచుకొన్నా క్షణాల్లోనే డబ్బులు ఖాళీ అవుతున్నాయి. లైన్లో ఉన్న జనం లైన్లో ఉండగానే ‘నో క్యాష్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అర్దరాత్రి, తెల్లవారు జామున..సమయం ఏదైతేనేం. ప్రాంతం ఏదైతేనేం...కనిపించే దృశ్యం ఇదే. నెల రోజులు దాటినా జనానికి కరెన్సీ కష్టాలు తప్పడం లేదు. పెళ్లిళ్లు నిలిచిపోతున్నాయి. శుభకార్యాలు ఆగిపోతున్నాయి. ఆపదలు వేధిస్తున్నాయి. అత్యవసరాలు నిలదీస్తున్నారుు.డబ్బు కొరత కారణంగా సగటు నగర జీవి ఎన్ని బాధలు పడాలో అన్నీ పడుతున్నాడు. నగరంలో కరెన్సీ కష్టాలను తెలుసుకునేందుకు శనివారం పలు మార్గాల్లో సాక్షి బృదం ‘స్పెషల్ విజిట్’ నిర్వహించింది. ఈ బృందం పర్యటించిన అన్ని మార్గాల్లోనూ 96 శాతం ఏటీఎంలు ‘ ఔటాఫ్ సర్వీస్’ బోర్డులతోనే కనిపించాయి. పర్యటన ఇలా సాగింది... ఎల్బీనగర్, చైతన్యపురి, దిల్సుఖ్నగర్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్ మార్గం, చందానగర్ నుంచి బోరుున్‌పల్లి వరకు, ఉప్పల్ గాంధీ బొమ్మ నుంచి అంబర్పేట్ వరకు ఛే నెంబర్, రామంతాపూర్, హబ్సిగూడ, నల్లకుంట, విద్యానగర్, మెట్టుగూడ, ప్రాంతాల్లో, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి జనరల్ బజార్ మీదుగా బేగంపేట్, అమీర్‌పేట్, పంజగుట్ట, సోమాజిగూడ, రాణీగంజ్, ప్యారడైజ్, తదితర ప్రాంతాల మీదుగా ఈ పర్యటన సాగింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సాగిన ఈ పర్యటనలో ఎస్బీహెచ్, ఎస్బీఐ.హెడీఎఫ్సీ, ఐసీఐసీఐ, కెనరా, విజయ, డీసీబీ, ఆంధ్రా తదితర బ్యాంకులకు చెందిన మొత్తం 335 ఏటీఎంలను పరిశీలించగా వాటిలో 11 ఏటీఎంలు మాత్రమే పనిచేశాయి. మిగతా 324 ఏటీఎంలు మూసి ఉన్నాయి. తెరిచిన ఏటీఎం కేంద్రాలన్నింటిలోనూ ఉదయం 9 నుంచి 11 గంటల వరకే డబ్బులు ఖాళీ అయ్యాయి. ఒకవైపు వందలాది మంది లైన్లలో ఉండగానే ఏటీఎంల్లో డబ్బులు ఖాళీ అయ్యాయి. ఎంతో ఆశగా వచ్చిన వాళ్లు నిరాశతో, నిస్సహాయంగా వెనుదిరిగి వెళ్లారు. వివిధ మార్గాల్లో... చైతన్యపురి నుంచి చాదర్‌ఘాట్ వరకు రోడ్డుకు ఇరువైపులా 35 ఏటీఎంలు ఉన్నారుు. కానీ ఏ ఒక్క ఏటీఎంలోనూ నగదు లేదు. దిల్సుఖ్నగర్ చౌరస్తాలో ఉన్న ఆంధ్రాబ్యాంకు ఏటీఎంలో మాత్రం నగదు జమచేసే మిషన్ తప్ప.. డ్రా చేసే ఏటీఎం పనిచేయడం లేదు. మలక్‌పేట డి మార్ట్ వద్ద స్వైపింగ్ మిషన్ ద్వారా రూ.2 వేలు ఇస్తున్నారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున జనం క్యూలో నిలబడ్డారు. సికింద్రాబాద్ నుంచి సోమాజిగూడ మార్గంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మోండా, ఎంజీరోడ్, ఆర్పీరోడ్, ప్యాట్నీ, బేగంపేట్, గ్రీన్ ల్యాండ్స, అమీర్‌పేట్, పంజగుట్ట, రాజ్‌భవన్, నెక్లెస్‌రోడ్ రాణిగంజ్, ఎంజీ రోడ్ వరకు ఏ ఒక్క ఏటీఎం పనిచేయలేదు. ప్రతి ఏటీఎం వద్ద నో క్యాష్ బోర్డులు వెక్కిరిస్తూ కనిపించాయి. గ్రీన్ల్యాండ్సలోని విజయ బ్యాంకు వద్ద ఉదయం 10 గంటల నుంచి 11.30గంటల వరకు వినియోగదారులు డబ్బు డ్రా చేసుకున్నారు. 11.30 గంటలకు డబ్బు అయిపోవడంతో నో క్యాష్ బోర్డు పెట్టారు. అప్పటికే వందల మంది క్యూలో ఉన్న ప్రజలు ఉసూరుమంటూ వెళ్లిపోయారు. ప్యాట్నీ సెంటర్లోని ఎస్బీహెచ్ వద్ద నో క్యాష్ బోర్డు ఉన్నా...ప్రజలు పెద్ద ఎత్తున క్యూ లైన్లో నిల్చున్నారు. డబ్బు వస్తుందేమోనని ఆశతో ఎదురు చూశారు. కానీ గంటల తరబడి ఎదురు చూసినా ఫలితం కనిపించలేదు. ఈ రూట్లో ఉన్న 81 ఏటీఎంలలో గంట పాటు గ్రీన్ల్యాండ్స వద్ద ఉన్న ఏటీఎం ఒక్కటే పని చేసింది. చందానగర్ నుంచి బోరుున్‌పల్లి వరకు నిర్వహించిన విజిట్‌లో మొత్తం 165 ఏటీఎంలలో 129 ఏటీఎంలు మూసి ఉన్నారుు. 4 మాత్రమే గంట సేపు డబ్బులు అందించాయి. మరో 32 ఏటీఎంలు తెరుచుకొని ఉన్నాయి. కానీ డబ్బుల్లేవు. నిజాంపేట రోడ్డులోని విజయబ్యాంకు ఏటీఎం ఉదయం 9.30 గంటలకు ప్రజలకు డబ్బులు అందించింది. కొద్ది సేపట్లోనే ‘నో క్యాష్ బోర్డు’ పెట్టేశారు. కూకట్‌పల్లిలోని డి మార్ట్ మాల్ వద్ద ఉదయం 6 గంటల నుంచి ప్రజలు లైన్లో నిల్చొని టోకెన్ తీసుకుని డబ్బుల కోసం వేచి ఉన్నారు. ఇక్కడ కేవలం 150 మందికి రూ.2000 నోటును అందజేశారు. హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని హైదర్‌నగర్, నిజాంపేట రోడ్డు, అడ్డగుట్ట, భాగ్యనగర్ కాలనీలోని ఏటీఎంలు ఎక్కడ చూసినా నో క్యాష్ బోర్డులు కన్పించాయి. కొన్ని చోట్ల 20 రోజులైనా క్యాష్ పెట్టడం లేదని స్థానికులు పేర్కొన్నారు. నిజాంపేట రోడ్డులోని ఆంధ్రాబ్యాంకు యూకో బ్యాంకు , భాగ్యనగర్ కాలనీలోని ఆంధ్రాబ్యాంకుతో పాటు ఎస్బీఐ ఏటీఎంలు తెరిచినప్పటికీ ఉండకపోవడంతో ఖాతాదారులు ఏటీఎం సెంటర్ల వద్దకు వచ్చి నోక్యాష్‌బోర్డులు ఉండటంతో వెనుదిరిగివెళ్తున్నారు బాలానగర్, ఫతేనగర్‌లోని ఏటీఎంలలో అన్ని మూత ఉన్నారుు. కేవలం రెండు ఏటీఎంలు మాత్రమే పని చేశాయి. ఉప్పల్ నుంచి అంబర్పేట్ మార్గంలో రామంతాపూర్, హబ్సిగూడ, మెట్టుగూడ, తార్నాక, విద్యానగర్, నల్లకుంట, ఛే నెంబర్, అంబర్పేట్ ప్రాంతాల్లో మొత్తం 34 ఏటీఎంలుండగా కేవలం ఆరు ఏటీఎంలు మాత్రమే పనిచేశాయి. నోట్ల రద్దు పుణ్యమా అని సిటీజనులు వీకెండ్ సరదాలకు స్వస్తి చెప్పారు. అకౌంట్లో డబ్బులున్నా..తీసుకునే వీలులేక సెలవు రోజుల్లోనూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. వరుసగా మూడు రోజులు హాలిడేస్ వస్తే నగరంలో వీకెండ్ జోష్ కనిపిస్తుంది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సిటీలో ఏటీఎంలు మూతపడడం..బ్యాంకులు చుక్కలు చూపుతుండడంతో చేతిలో నగదు లేకుండా పోతోంది. ఉన్నకొద్దిపాటి డబ్బులను ఆచితూచి ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో సరదాలకు ఫుల్స్టాప్ పెట్టారు నగరవాసులు. ఇక నగరంలో నగదు కష్టాలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ శనివారం వివిధ ప్రాంతాల్లో విజిట్ నిర్వహించగా..ఏటీఎంలు, బ్యాంకుల నిర్వహణ డొల్లతనం బయటపడింది. రెండువేల నగదు కోసం నగరవాసులు పడుతున్న కష్టాలు వెలుగుచూశాయి. 96 శాతం ఏటీఎంలు మూతబడే కన్పించారుు. అన్ని చోట్లా అవుటాఫ్ సర్వీస్, నో క్యాష్ బోర్డులే దర్శనమిచ్చాయి. -
తిండికీ పైసల్లేవ్!
-
తిండికీ పైసల్లేవ్!
నగదు కోసం రాష్ట్రవ్యాప్తంగా జనం అవస్థలు బ్యాంకులు, ఏటీఎంల వద్దే పడిగాపులు వైద్యానికి సొమ్ము కోసం కొందరు నిత్యావసరాలకు డబ్బు కోసం మరికొందరు ఎవరిని కదిలించినా కన్నీటి గాథలే నానా ఇబ్బందులూ పడుతున్న వృద్ధులు ఊరుకాని ఊరులో పర్యాటకుల అవస్థలు చాలా బ్యాంకుల వద్ద ‘నో క్యాష్’ బోర్డులు చాలా చోట్ల పనిచేయని ఏటీఎంలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న ప్రజానీకం సాక్షి, హైదరాబాద్ ఒక్కొక్కరిది ఒక్కో దీనావస్థ.. బ్యాంకులు, ఏటీఎంల వద్ద ఎవరిని కదిలించినా కన్నీటి గాథలే. చేతిలో చిల్లిగవ్వలేక రోజు గడవడమే కష్టంగా ఉన్నది కొందరైతే.. వైద్యం, మందుల కొనుగోలు వంటి అత్యవసరాలకూ డబ్బుల్లేక అల్లాడుతున్నవారు మరి కొందరు. కష్టాలు తీరుతున్నాయంటూ కేంద్ర ప్రభుత్వం ఓవైపు ప్రకటనలు చేస్తుండగానే.. మరోవైపు పరిస్థితి రోజురోజుకు మరింత దారుణంగా మారుతోంది. కొద్దిరోజులు ఓపిక పడితే పరిస్థితి కాస్త కుదుటపడుతుందని ఇంతకాలం లేని సహనాన్ని తెచ్చిపెట్టుకున్న సాధారణ ప్రజలు... ఇక కరెన్సీ కష్టాలను మోసే పరిస్థితి కనిపించడం లేదు. రోజురోజుకు ఇబ్బందులు పెరుగుతుండటంతో జనం సహనం కోల్పోతున్నారు. బ్యాంకుల్లో సిబ్బందితో వాదోపవాదాలకు దిగుతున్నారు. బైఠాయింపులు, ధర్నాలతో నిరసనలు తెలుపుతున్నారు. ఎక్కడ చూసినా ‘నో క్యాష్’ రిజర్వు బ్యాంకు నుంచి బ్యాంకులకు నగదు సరఫరా నామమాత్రంగా ఉండటంతో నగదు ఇవ్వలేకపోతున్నాయి. ఒక్కో బ్యాంకుకు రోజుకు కనీసం రూ.కోటి వరకు డిమాండ్ ఉండగా.. సరఫరా అవుతున్నది రూ.5 లక్షల నుంచి గరిష్టంగా రూ.20 లక్షల వరకే. దీంతో ఒక్కో ఖాతాదారు రోజుకు రూ.10 వేలు (వారంలో గరిష్టంగా రూ.24 వేలు) వరకు పొందవచ్చంటూ కేంద్రం చేసిన ప్రకటన ఎక్కడా అమలు కావడం లేదు. కొన్నిచోట్ల రూ.2 వేలు మాత్రమే ఇస్తున్నారు. కొన్ని బ్రాంచీలకు రెండుమూడు రోజులకోమారు మాత్రమే నగదు వస్తుండటంతో వాటి వద్ద ‘క్యాష్ లేదు’ అనే బోర్డులు వెక్కిరిస్తున్నాయి. ఏటీఎంలదీ ఇదే పరిస్థితి. ఎప్పుడు నగదు లోడ్ చేస్తారో తెలియక ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ప్రజలు కాపలా కాయాల్సి వస్తోంది. కొన్ని చోట్ల పొద్దునే వచ్చి ఏటీఎంల ముందు నిలబడుతున్నారు. చాలా చోట్ల నగదు పెట్టిన కాసేపటికే అయిపోతోంది. అరుపులు.. కేకలు.. తిట్లు.. నగదు దొరకని పరిస్థితుల్లో ఎవరిని నిలదీయాలో తెలియక జనం మండిపడుతున్నారు. ఆర్బీఐ నుంచి నగదు రాకుంటే మేమేం చేస్తామంటూ బ్యాంకు అధికారులు చేతులెత్తేస్తుండటంతో.. జనం వారిపైనే కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. వాదోపవాదాలకు దిగుతున్నారు. ‘నో క్యాష్’ నోటీసులను చూసి.. ‘పెద్దోళ్లకు దొడ్డిదారిన ఇచ్చి మాకు లేదని చెప్తారా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బ్యాంకు అధికారులు పోలీసులను ఆశ్రయిస్తుండంతో ఇద్దరు ముగ్గురేసి కానిస్టేబుళ్లు పహారా కాయాల్సి వస్తోంది. చిరిగిన నోట్లు మళ్లీ జనంలోకి.. చిరిగిన నోట్లు, అతుకులు, పెన్ను గీతలు పడిన నోట్లను వీలైనంత వరకు చలామణీలో ఉంచరు. అలాంటి నోట్ల స్థానంలో కొత్త నోట్లను తేవటం ఆర్బీఐ నిత్య కృత్యం. ఇందులో భాగంగా బ్యాంకులు నిత్యం పాత, చిరిగిన నోట్లను ఆర్బీఐకి పంపుతుంటాయి. కానీ అలాంటి చిరిగిన, అతుకులున్న పాత నోట్లు ఇప్పుడు మళ్లీ బ్యాంకుల ద్వారా చలామణీలోకి వస్తున్నాయి. నగదు సరఫరా కోసం డిమాండ్, కరెన్సీ ప్రింటింగ్ చాలినంత లేకపోవటంతో.. ఆర్బీఐ తన వద్ద ఉన్న చిరిగిన నోట్లను మళ్లీ బ్యాంకులకు పంపుతోంది. ఇటీవల స్టేట్‌బ్యాంకు చెస్ట్‌కు భారీగా ఇలాంటి నోట్లు వచ్చి పడ్డాయి. రెండు రోజుల క్రితం మెహిదీపట్నం సర్కిల్లోని ఓ బ్యాంకు మేనేజర్ అలాంటి రూ.30 లక్షల నోట్లను తెప్పించారు. నలుగురు సిబ్బందిని పెట్టి వాటిలో కాస్త మెరుగ్గా ఉన్న నోట్లను వేరుచేసి.. ఖాతాదారులకు పంపిణీ చేశారు. అలాగే చెస్ట్‌లో పోగుపడ్డ రూ.10 నాణేలను రూ.2 వేలకు ఓ మూటగా కట్టి ఖాతాదారులకు అందిస్తున్నారు. ‘కావాల్సినంత నగదు సరఫరా కానప్పుడు ఇంతకంటే చేసేదేముంది..’ అని ఆ బ్యాంకు మేనేజర్ పేర్కొన్నారు. నోట్ల ప్రింటింగ్ తప్పులతో సమస్యలు కొత్త రూ.500 నోట్లు వస్తున్నాయని, రెండు మూడు రోజుల్లో నగదు కష్టాలు తీరుతాయంటూ ఇటీవల ఆర్బీఐ ప్రకటనలు చేసింది. అందుకు అనుగుణంగానే దాదాపు రూ.500 కోట్ల వరకు రూ.500 కొత్త నోట్లు తెలంగాణకు వచ్చాయి. కానీ వాటి ముద్రణలో భారీ లోపాలున్నట్టు గుర్తించడంతో ఆ నోట్లన్నీ తిరుగుటపాలో వెనక్కు వెళ్లిపోయాయని వార్తలు వచ్చాయి. ఆ నోట్లు మార్కెట్లోకి వచ్చి ఉంటే ఇన్ని కష్టాలు ఉండేవి కావని బ్యాంకర్లు బహిరంగంగానే చెబుతున్నారు. ఇక తొలి విడత ప్రింటైన రూ.2 వేల నోట్లలోనూ కొన్ని తప్పులు దొర్లినా.. ఆర్బీఐ అలాగే మార్కెట్లోకి విడుదల చేసింది. రెండో విడతలో ముద్రించిన రూ.2 వేల నోట్లు భారీ మొత్తంలో బ్యాంకులకు రానున్నాయి. ఈ వికలాంగ మహిళ పేరు సురేఖ. మెహిదీపట్నం సమీపంలోని ఇంద్రానగర్ నివాసి. ఆమె రెండు కాళ్లు చచ్చుబడటంతో చక్రాల కుర్చీకే పరిమితమై ఉంటున్నారు. ఇటీవల చేతుల్లో తీవ్రంగా నొప్పి మొదలైంది. చేతిలో డబ్బులు లేక ఆసుపత్రికి వెళ్లలేకపోయారు. నాలుగు రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా నగదు దొరకలేదు. శుక్రవారం కూడా బ్యాంకుకు వచ్చిన ఆమె ‘నగదు లేదు’ అన్న నోటీస్ చూసి కన్నీటి పర్యంతమయ్యారు. తన మూడు చక్రాల సైకిల్‌పై ఇలా తిరగలేకపోతున్నానని, చేతులు నొప్పితో ఇబ్బందిగా ఉందని కన్నీటి పర్యంతమయ్యారు. ‘సాక్షి’ ప్రతినిధులు ఆమె గురించి వాకబు చేస్తుండటాన్ని గమనించిన బ్యాంకు సిబ్బంది.. అప్పటికప్పుడు ఆమెను లోనికి తీసుకెళ్లి రూ.4 వేల నగదు ఇచ్చి పంపారు. జనం ఉద్దెర పెడితే నే బతికేదెట్లా..? ఈయన పేరు మహబూబ్.. గోల్కొండలో ఉండే ఆయన గుడిమల్కాపూర్ మార్కెట్లో కూరగాయలు కొని తోపుడుబండిపై కాలనీల్లో తిరిగి అమ్ముతుంటారు. కొన్ని రోజులుగా చిల్లర లేదంటూ కొనుగోలుదారులు ఉద్దెర పెడుతున్నారు. ఇలా రూ.ఆరు వేల వరకు పేరుకుపోయాయి. దీంతో మార్కెట్లో కూరగాయలు కొనేందుకు డబ్బుల్లే మూడు రోజులపాటు వేరే పనులకు వెళ్లి.. రూ.వేయి సంపాదించుకున్నారు. మళ్లీ శుక్రవారం కూరగాయలు కొనుక్కుని అమ్మకానికి వచ్చారు. మళ్లీ ఉద్దెర పెట్టేందుకే ప్రజలు అడగటంతో దిక్కుతోచనిస్థితిలో పడిపోయాడు. ఇలాగైతే తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని వాపోతున్నారు. నా కూతురు కాన్పు ఎట్లా? ఈయన రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ వెంకటేశ్వరరావు. కార్వాన్కు చెందిన ఆయన కుమార్తె తొలి కాన్పునకు సిద్ధంగా ఉంది. మరో రెండు రోజుల్లో సిజేరియన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. దీంతో కనీసం రూ.25 వేలు సమకూర్చుకోవాలని నాలుగు రోజులుగా బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నారు. గురువారం ఏకంగా 22 ఏటీఎంల చుట్టూ తిరగ్గా రూ.4 వేలు లభించాయి. శుక్రవారం తన ఖాతా నుంచి రూ.10 వేలు తీసుకుందామని గుడిమల్కాపూర్‌లోని ఆంధ్రా బ్యాంకుకు వచ్చారు. భారీగా జనం ఉండడంతో లోపలికి వెళ్లే అవకాశం లేకపోయింది. తోపులాటలో కళ్లు తిరిగి కిందపడిపోవటంతో చేసేది లేక ఇంటిముఖం పట్టారు. తన ఖాతాలో రూ.2 లక్షల నగదు ఉందని, కనీసం రూ.10వేలు ఇవ్వడం లేదేమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు బయటే వృద్ధుల ఎదురుచూపు ఈ దంపతులు ధర్మరాజు, సూర్యకాంతమ్మ. వారం రోజులుగా చేతిలో డబ్బుల్లేవు. ధర్మరాజు ఉబ్బసంతో బాధపడుతుండడంతో వైద్యం కోసం వెళ్లాల్సి ఉంది. ఆయన ఖాతానుంచి రూ.4 వేల పింఛన్ డబ్బులు, ఆమె ఖాతా నుంచి రూ.4 వేల నగదు కలిపి రూ.8 వేలు పొందాలని బ్యాంకుకు వచ్చారు. కానీ అప్పటికే బ్యాంకు ముందు జనం భారీగా గుమిగూడి ఉండడంతో.. సిబ్బంది లేనికి అనుమతించలేదు. దీంతో బ్యాంకు అరుగుపై కూర్చుని సాయం కోసం ఎదురుచూశారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో సాయంత్రం ఇంటిముఖం పట్టారు. హైదరాబాద్‌లో కేరళ యువకుల తిప్పలు కేరళలోని అలప్పీకి చెందిన యువ పర్యాటకుల బృందం హైదరాబాద్‌కు వచ్చింది. వెంట తెచ్చుకున్న డబ్బులు ఖర్చయిపోయాయి. కేరళకు తిరిగి వెళ్దామంటే రైలు టికెట్ కూడా కొనే పరిస్థితి లేదు. చేతిలో డెబిట్ కార్డున్నా టికెట్ కొనడం కష్టంగా మారింది. ఓ రైల్వే స్టేషన్‌కు వెళ్తే కార్డు అంగీకరించబోమని అక్కడి సిబ్బంది చెప్పారని వారు వాపోయారు. సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లలో కార్డు అనుమతిస్తున్నా వారికి తెలియదు. శుక్రవారం చేతిలో రూ.80 మాత్రమే ఉండటంతో స్నేహితులంతా బిస్కట్లు కొనుక్కుని తిన్నారు. ఉదయం 8 గంటలకు మెహిదీపట్నంలోని స్టేట్‌బ్యాంకు ఏటీఎం ముందు నిలబడ్డారు. సాయంత్రం వరకు డబ్బు రాకపోవడంతో తమకేమైనా సాయం చేయండంటూ అందరినీ అడుగుతూ కనిపించారు. వారికి హిందీ, తెలుగు రాకపోవటంతో స్థానికులకు వారి గోడు అర్థం కాలేదు. వృద్ధుడిని బలిగొన్న చిల్లర.. బ్యాంకుల ఎదుట క్యూలైన్లు రంగారెడ్డి జిల్లా కొందుర్గులో మీరాపురం సామేల్ (68) అనే వృద్ధుడి ప్రాణాలు బలిగొన్నారుు. రెండు రోజులకింద ఆసరా పింఛన్ డబ్బుల కోసం వెళ్లిన ఆయన... గంటల తరబడి నిల్చోవడంతో క్యూలోనే సొమ్మసిల్లిపడిపోయాడు. దీంతో ఆయనను హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. ఈయన పేరు ఖాజా మొహినుద్దీన్. కొద్ది నెలల క్రితం విద్యుదాఘాతానికి గురికావడంతో చేతులు, కాళ్లను తొలగించి కృత్రిమ అవయవాలు అమర్చారు. ఇవి దెబ్బతినడంతో ఆసుపత్రికి వెళ్తే.. కొత్తవి అమర్చు కోవాలని, రూ.25 వేలు ఖర్చవుతుందని చెప్పారు. దీంతో 3 రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు. శుక్రవారం విజయనగర్ కాలనీలోని బ్యాంకుకు వచ్చిన ఆయన.. క్యూను చూసి కంగుతిన్నారు. అతని దీనావస్థను చూసిన మేనేజర్ రూ. 4 వేల నగదు ఇప్పించారు. ఇలా ఎన్నిరోజులు గడిస్తే రూ.25 వేలు జమకావాలంటూ మొహినుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వృద్ధురాలి పేరు ఇందిర. కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఈమెకు విశాఖపట్నంలో బ్యాంకు ఖాతా ఉంది. అత్యవసరంగా డబ్బు కావాల్సి వచ్చింది. 3 రోజులుగా ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నా దొరకడం లేదు. ఆమె వంతు వచ్చేసరికే డబ్బు అయిపోతుండడంతో శుక్రవారం ఏటీఎం తెరవకముందే వచ్చి ఇలా కూర్చున్నారు. సాయంత్రం వరకు ఎదురు చూసినా ఆ ఏటీఎంకు నగదు రాలేదు. డబ్బుకోసం ఇబ్బందిగా ఉందంటూ దీనంగా చెబుతున్నా.. జాలిపడటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయత. -
ఫస్టొచ్చింది.... పైసల్లేవ్!
-
ఫస్టొచ్చింది.. పైసల్లేవ్!
బ్యాంకుల్లో నిండుకున్న నగదు పట్టణాలు, నగరాల్లో ‘నో క్యాష్’ బోర్డులు నయా పైసా లేని గ్రామీణ ప్రాంత బ్యాంక్‌లు 1,816 బ్యాంకు శాఖల్లో పక్షం రోజులుగా లావాదేవీలు బంద్ ప్రజల్లో అశాంతి పెరుగుతోంది.. శాంతిభద్రతల సమస్యగా మారొచ్చు కేంద్రానికి ఇంటెలిజెన్స బ్యూరో హెచ్చరిక గొడవలు మొదలైతే ఆపడం ఎవరితరం కాదని వ్యాఖ్య బ్యాంకుల వద్ద పోలీసు బందోబస్తు పెట్టండి డీజీపీని కోరిన రిజర్వ్ బ్యాంకు హైదరాబాద్‌లోని బ్యాంకు శాఖలు.. 1,526 పైసా కూడా ఇవ్వనివి.. 1,100 ఇతర ప్రధాన నగరాల్లోని బ్యాంకు శాఖలు 674 పైసా కూడా ఇవ్వనివి.. 500 రాష్ట్రంలోని ప్రభుత్వరంగ బ్యాంకుల ఏటీఎంలు 3,400 వీటిలో పనిచేస్తున్నవి 400 (బుధవారం నాటి పరిస్థితి ఇది..) సాక్షి, హైదరాబాద్ ఒకటో తారీఖు వచ్చేసింది.. ఇక కరెన్సీ కష్టాలు మరింత తీవ్రం కానున్నాయి! గురువారం పరిస్థితి ఎలా ఉంటుందోనని హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాల్లోని బ్యాంక్ సిబ్బందిలో ఆందోళన మొదలైంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, ఖమ్మం నగరాల్లోని చాలా వరకు బ్యాంక్ శాఖల్లో నగదు లేదు. అక్కడక్కడ ఎస్బీఐ బ్రాంచీలకు రిజర్వుబ్యాంక్ నుంచి కొంత నగదు అందుతున్నా.. అది మొదటి గంటలో వచ్చే ఖాతాదారులకే సరిపోతోంది. అదీ ఒక్కొక్కరికి రూ.4 వేలు మాత్రమే అందించగలుగుతున్నారు. మిగిలిన అన్ని బ్యాంక్‌ల శాఖలు నో క్యాష్ బోర్డులు తగిలిస్తున్నాయి. రాజధాని హైదరాబాద్‌లో 1,526 బ్యాంక్ శాఖలు ఉండగా బుధవారం 1,100 శాఖల నుంచి ఖాతాదారులకు పైసా కూడా అందలేదు. రాష్ట్రంలోని ఇతర నగరాల్లో 674 బ్యాంక్ శాఖలు ఉండగా.. 500కు పైగా బ్రాంచీల్లో డబ్బు లేదు. ఉన్నకొద్దిపాటి బ్రాంచీల్లో రూ.2 నుంచి 4 వేలు ఇస్తున్నారు. రాజధాని సహా ఇతర నగరాల్లో 3,400 ప్రభుత్వరంగ బ్యాంకుల ఏటీఎంలు ఉండగా వాటిలో 400 ఏటీఎంల్లో కూడా నగదు సౌకర్యం లేదు. ఏ ఏటీఎంలో అరుునా నగదు లోడ్ చేస్తే గంటలోనే అయిపోతోంది. ఈ నేపథ్యంలో గురువారం నాటి పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని, బ్యాంక్‌కు నగదు కోసం వచ్చే ఖాతాదారులకు సమాధానం చెప్పలేమని ప్రధాన బ్యాంక్‌ల ఉన్నతాధికారులు రిజర్వుబ్యాంక్ దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైతే పోలీసు బందోబస్తు పెట్టుకోవడం మినహా ఈ విషయంలో తాము చేయగలిగిందేమీ లేదని రిజర్వుబ్యాంక్ స్పష్టం చేసింది. బ్యాంకుల వద్ద బందోబస్తు.. నగదు కొరత రోజురోజుకూ తీవ్రమవుతుండడం, అక్కడక్కడ బ్యాంక్ సిబ్బందితో ఖాతాదారులు గొడవ పడుతున్న ఘటనల నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి కొద్దిరోజుల పాటు బ్యాంకుల వద్ద పోలీసు బందోబస్తు పెట్టాలని రిజర్వు బ్యాంక్... తెలంగాణ డీజీపీని కోరింది. ఈ మేరకు ముంబై కార్యాలయం నుంచి ఫ్యాక్స్ ద్వారా లేఖ అందినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి తోడు నగదు కొరత శాంతిభద్రతల సమస్యగా మారే ప్రమాదం ఉందంటూ ఇంటెలిజెన్స బ్యూరో (ఐబీ) కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉన్నదని, నగదు కొరతతో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే గొడవలు ఆపడం ఎవరితరం కాదని కేంద్రానికి తెలిపింది. పట్టణ, నగర ప్రాంతాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉందని నివేదించింది. రాష్ట్రంలో అక్కడక్కడ చోటుచేసుకున్న ఘటనలను సైతం ప్రస్తావించింది. బ్యాంక్‌లకు వెళ్లడానికి మహిళా సిబ్బంది జంకుతున్నారని, అనారోగ్య కారణాలతో వారు సెలవులకు దరఖాస్తు చేశారని ఐబీ తన నివేదికలో కేంద్రం దృష్టికి తెచ్చింది. డబ్బు కోసం వచ్చిన ఖాతాదారులకు సమాధానం చెప్పలేక, వారితో వాగ్వాదానికి దిగలేక మహిళా సిబ్బంది లీవ్‌లో వెళ్తున్నారని ఓ బ్యాంక్ ఉన్నతాధికారి పేర్కొన్నారు. పరిస్థితిలో మార్పు లేకపోతే గ్రామీణ ప్రాంతాల బ్యాంక్‌లను మూసివేయడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని ఆ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. రోగుల అష్టకష్టాలు కరెన్సీ కొరతతో ముఖ్యంగా రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ‘‘నాకు షుగర్ వ్యాధి. ఫార్మసీకి వెళ్లి మందులు కొనుగోలు చేయడానికి పాత నోట్లు లేవు. పది రోజులుగా ట్యాబ్లెట్ వేసుకోలేదు. బ్యాంక్‌కు వైద్యుని మందుల చీటి తీసుకుని వెళ్లా. ఖాతాలో పెన్షన్ డబ్బు జమ అయింది. కానీ ఇవ్వడానికి వాళ్ల దగ్గర నగదు లేదట’’ అని రిటైర్డ్ టీచర్ సత్యనారాయణ ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్ గన్‌ఫౌండ్రిలోని ఓ బ్యాంక్ మేనేజర్‌తో ఎంతగా మొరపెట్టుకున్నా ఆయన ససేమిరా అన్నారని చెప్పారు. ‘‘నా దగ్గర ఉంటే ఇచ్చేవాడిని. జేబులో ఖర్చులకు రూ.250 ఉన్నాయి. ఎవరైనా ఉంటే రూ.500 ఇవ్వండని మా స్టాఫ్‌ను అడిగా, ఎవరి దగ్గరా నగదు లేదు. ఏం చేయమంటారు’’ అని మేనేజర్ అన్నట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇంటిల్లిపాది జ్వరంతో బాధపడుతున్నా డబ్బుల్లేక వైద్యుని దగ్గరకు వెళ్లలేని దీనస్థితిలో బాధపడుతున్న కుటుంబాలు కోకొల్లలున్నారుు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 1,816 బ్యాంక్ శాఖల్లో పక్షం రోజులుగా నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నారుు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే నగదు అందుబాటులో లేని కారణంగా రెండు లక్షల మంది ఉపాధికి దూరమయ్యారు. కరెన్సీ కష్టాలపై ఇటీవల కలెక్టర్లు సీఎం కేసీఆర్‌కు ఒక నివేదిక సమర్పించారు. వ్యవసాయం కుదేలైందని, నీటి వసతి ఉన్న చోట కూడా ఖర్చులకు డబ్బుల్లేక రైతులు పనులను నిలిపివేశారని ఖమ్మం జిల్లా నివేదికలో పేర్కొన్నారు. ఆర్బీఐ సమాచారం ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లో నవంబర్ 9న మూతపడ్డ గ్రామీణ ప్రాంతాల్లోని 799 ఏటీఎంలలో నేటికి ఒక్కటి కూడా తెరుచుకోలేదు. మరో వారమైనా అవి పని చేస్తాయన్న నమ్మకం కుదరడం లేదని ఏటీఎంలు నిర్వహిస్తున్న ఓ సంస్థ పేర్కొంది. మున్సిపాలిటీల్లో అదే పరిస్థితి చిరు వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే చిన్న చిన్న పట్టణాల్లోని లక్షలాది మంది పరిస్థితి దయనీయంగా మారింది. మొదట్లో వారం పాటు ఖాతాదారులకు కనీసం ఐదారు వేలు అందించిన బ్యాంక్‌లు నవంబర్ 20 తర్వాత నయా పైసా కూడా చెల్లించలేదు. బ్యాంక్‌లో పొదుపు చేసుకున్న చిరు వ్యాపారులు ఇప్పుడది తీసుకునే దారి లేక పస్తులుండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని జిల్లా కలెక్టర్లు తమ నివేదికల్లో తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో చిరు వ్యాపారాలు చేసే వారికి 15 రోజులుగా ఉపాధి లేకుండా పోయింది. మరో నాలుగైదు రోజుల్లో పట్టణ ప్రాంతాల్లో చాలా ఏటీఎంలు పనిచేస్తాయని రిజర్వుబ్యాంక్ వర్గాలు చెబుతున్నాయి. రూ.500 నోట్లు వచ్చేదాకా పరిస్థితిలో మార్పు ఉండదని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. -
బ్యాంకులో లేవు.. ఏటీఎంలో రావు
-
బ్యాంకులో లేవు.. ఏటీఎంలో రావు
⇒ కరెన్సీ కోసం జనం విలవిల.. ఏటీఎంలు.. ఎనీటైం మూత.. ⇒ ఎక్కడికెళ్లినా ‘నో క్యాష్’ బోర్డులే ⇒ మూడొంతులకుపైగా పనిచేయని మిషన్లు ⇒ బుధవారం నగదు సరఫరా లేక మరింత పెరిగిన ఇక్కట్లు ⇒ బ్యాంకులకూ అందని డబ్బులు ⇒ నేడు కూడా ఇదే పరిస్థితి! సంజీవయ్య.. వయసు 72 ఏళ్లు.. ఆయన ఖాతాలో పింఛన్ కింద రూ. వెయ్యి పడింది. ఏటీఎంకు వచ్చాడు. కానీ ఏటీఎంలో రూ. 2 వేల నోట్లే ఉన్నాయి. ఖాతాలో ఉన్నది రూ.వెయ్యి మాత్రమే. దీంతో చేసేది లేక తన ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్లాడు. అక్కడా రూ. 2 వేల నోట్లే ఉండటంతో తీవ్ర ఆవేదన చెందాడు. తనకు మందుల కోసం అత్యవసరంగా డబ్బు కావాలని కన్నీటి పర్యంతం కావటంతో బ్రాంచ్ మేనేజర్ తన జేబులోని డబ్బు అతని చేతిలో పెట్టి పంపించాడు. (గౌరిభట్ల నరసింహమూర్తి) కరెన్సీ కష్టాలు సగటు జీవిని వెంటాడుతూనే ఉన్నాయి. బ్యాంకులు, కొన్ని ఏటీఎంలలో రెండ్రోజుల క్రితం వరకు ఓ మోస్తరుగా నగదు అందుబాటులో ఉన్నా మంగళ, బుధవారాల్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. నగదుకు కొరత లేదని రిజర్వు బ్యాంకు ప్రకటిస్తున్నా.. బ్యాంకులు, ఏటీఎంలకు మాత్రం డబ్బు చేరటం లేదు. బుధవారం సమస్య మరింత తీవ్రమైంది. బ్యాంకుల చెస్ట్‌లకు నగదు చేరకపోయేసరికి సింహభాగం బ్యాంకులు, ఏటీఎంలకు డబ్బు పంపలేమని అక్కడి సిబ్బంది తేల్చి చెప్పారు. దీంతో స్టేట్‌బ్యాంకు ఏటీఎంలు, ప్రైవేటు బ్యాంకులకు చెందిన 20 శాతం ఏటీఎంలు మాత్రమే పనిచేశాయి. అందులో ప్రైవేటు బ్యాంకు ఏటీఎంలలో ఉదయం గంటసేపటికే నగదు ఖాళీ కావటంతో మూసేశారు. సాయంత్రం వేళ స్టేట్ బ్యాంకు ఏటీఎంలలో కొన్ని పనిచేయటంతో ప్రజలు వాటి ముందు క్యూలు కట్టారు. అవి మినహా మిగతా బ్యాంకుల ఏటీఎంలన్నీ మూతపడే ఉండేసరికి నగదు కోసం జనం పడరాని పాట్లు పడ్డారు. ఈ విషయమై బ్యాంకు సిబ్బందిని నిలదీస్తే.. ఏటీఎంలలో భర్తీ చేసే నగదుకు సంబంధించి తమకు సంబంధం ఉండదన్నారు. దీంతో సిబ్బందితో ప్రజలు వాదనకు దిగడంతో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గురువారం కూడా పరిస్థితి ఇంతకన్నా భిన్నంగా ఉండదని తెలుస్తోంది. బ్యాంకుల కష్టాలు బ్యాంకులవి... ఏటీఎంలలో, బ్యాంకుల్లో డబ్బు లేదని ఖాతాదారులు సిబ్బందిని శాపనార్ధాలు పెడుతుండగా మరోవైపు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక బ్యాంకు అధికారులు గగ్గోలు పెడుతున్నారు. గత రెండ్రోజులుగా చెస్టుల నుంచి డబ్బు రాకపోతుండటంతో వారు బ్యాంకుకు రావాలంటేనే జంకుతున్నారు. న్యూమల్లేపల్లిలోని ఎస్బీఐలో గత రెండు రోజుల్లో ఏకంగా రూ.ఐదున్నర కోట్లు ఖాతాల్లో డిపాజిట్ అయ్యాయి. అయితే ఖాతాదారులకు డబ్బు ఇవ్వటానికి మాత్రం చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది. ఆర్బీఐ నుంచి డబ్బు రానందున తాము నగదు పంపలేమంటూ చెస్ట్ సిబ్బంది చెప్పటంతో బ్యాంకు అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. చివరకు బ్రాంచి మేనేజర్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న మరో బ్యాంకు మేనేజర్‌ను బతిమిలాడి రూ.20 లక్షల నగదు తెప్పించి ఖాతాదారులకు తలాకొంత పంపిణీ చేశారు. ఆ మొత్తం కేవలం అరగంటలో అయిపోయేసరికి మిగతా ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి సర్దిచెప్పలేక నానా హైరానా పడ్డారు. గురువారానికి రూ.కోటి నగదు పంపాలని చెస్ట్‌కు రిక్వెస్ట్ పెడితే అక్కడి నుంచి ‘కష్టమే’ అన్న సమాధానం రావటంతో ఎలా గట్టెక్కాలో తెలియక తల పట్టుకున్నారు. అన్ని బ్యాంకుల్లో దాదాపు ఇదే పరిస్థితి. కొన్ని ప్రైవేటు బ్యాంకులకు రెండుమూడు రోజులుగా నగదు రావటం లేదు. కొన్నింటికి మాత్రం రూ.10 లక్షల చొప్పున రావటంతో పావుగంటలోనే నిండుకుంటున్నాయి. ఇంటి అద్దె ఎలా? ఈయన బీహెచ్ఈఎల్ నివాసి ఉమర్. మెహిదీపట్నంలో విద్యుత్తు లైన్మెన్గా పనిచేస్తున్నాడు. ఈ నెల ఇంటి అద్దె చెల్లించలేకపోవటంతో యజమానుల ఒత్తిడి తీవ్రమైంది. దీంతో బుధవారం మూడునాలుగు డెబిట్ కార్డులు పట్టుకుని ఏటీఎంల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. రూ.10 వేలు అవసరమైతే అతికష్టమ్మీద రూ.2 వేలు దొరికాయి. దీంతో మళ్లీ గురువారం ఉదయమే వచ్చి ఏటీఎంల వేట మొదలుపెడతానంటున్నాడు. ‘ఫీజు’కు పరీక్షే.. ఇతను సయ్యద్ అమీర్. సిస్కో సర్టిఫైడ్ నెట్వర్కింగ్ ఫ్రొఫెషనల్ పరీక్షకు ఫీజు కట్టాల్సి ఉంది. రూ.13 వేలు అవసరం కావటంతో తెలిసినవారి డెబిట్‌కార్డులు పట్టుకుని ఏటీఎంల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. చివరకు విజయనగర్‌కాలనీలోని రెండు స్టేట్‌బ్యాంక్ ఏటీఎంల నుంచి రూ.4 వేలు డ్రా చేసుకున్నాడు. రెండు రోజుల్లో మిగతా మొత్తం ఎలా పొందాలో తెలియక ఆందోళన చెందుతున్నాడు. అమ్మా.. రాలేను..! కార్వాన్కు చెందిన ఈ విద్యార్థి పేరు రాఘవేంద్ర. అత్యవసరంగా రమ్మని సొంతూరు నుంచి తల్లిదండ్రులు కబురుపెట్టారు. మహబూబ్‌నగర్ సమీపంలోని ఊరికి వెళ్లాలి. జేబులో రూ.2 వేల నోటు ఉంది. కానీ ఆటో, బస్సులో చిల్లర లేదనటంతో మంగళవారం ఊరి ప్రయాణం రద్దు చేసుకున్నాడు. రూ.వంద నోట్ల కోసం రెండు రోజులుగా ఏటీఎం చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదు. బుధవారం రాత్రి గుడిమల్కాపూర్ స్టేట్‌బ్యాంకు ఏటీఎంలో నగదు లోడ్ చేశారని తెలిసి వచ్చి ఇలా నిలుచున్నాడు. క్షవరానికి తిప్పలే..! ఈయన పేరు జహంగీర్. క్షవరం చేయించుకునేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక పక్కింటివారి వద్ద చిల్లర అడగాల్సి వచ్చిందంటూ ఆయన వాపోతున్నాడు. నాలుగు రోజులుగా డబ్బుల కోసం ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండటం లేదంటూ ఆవేదన చెందాడు. అక్కరకు రాని పెద్ద నోటు! ఈయన పేరు సయ్యద్ ముజాహుద్దీన్. జేబులో మూడు రూ.2 వేల నోట్లున్నాయి. నాలుగు రోజుల క్రితం డ్రా చేసుకున్నవవి. కానీ ఎక్కడా చిల్లర దొరక్కపోవడంతో పాలు కూడా కొనలేని దుస్థితిలో ఉన్నాడు. బుధవారం సాయంత్రం స్టేట్‌బ్యాంకు ఏటీఎంలో డబ్బులున్నాయని తెలిసి వెళ్లాడు. మళ్లీ రూ.2 వేల నోటే వస్తుందని భయపడి రూ.1900 అని టైప్ చేసి 19 వంద నోట్లు పొంది ఇంటిబాటపట్టాడు. ఖాతాలో డబ్బున్నా ఎందుకివ్వరు? ఈ మహిళ ఉదయమే చెక్కు పట్టుకుని బ్యాంకుకు వచ్చింది. కానీ అందులో చిన్న పొరపాటు ఉండటంతో ఇంటికెళ్లి మరో చెక్కు తెచ్చేలోపు బ్యాంకులో నగదు అరుుపోరుుంది. దీంతో తన ఖాతాలో రూ.లక్ష ఉండి కూడా చిల్లర పొందలేని పరిస్థితి ఏంటని బ్రాంచి మేనేజర్‌ను నిలదీసింది. గురువారం ఉదయం వస్తే ఏదోరకంగా డబ్బు ఇప్పిస్తానని ఆయన సముదారుుంచి పంపారు. ఏటీఎంలో ‘మార్పు’ ఏది? ఆర్బీఐ నుంచి వచ్చే నగదులో రూ.2 వేల నోట్లే ఎక్కువగా ఉంటున్నాయి. రూ.100 నోట్లు నామమాత్రంగానే వస్తున్నాయి. కానీ ఇప్పటికీ మూడొంతులకుపైగా ఏటీఎంలు రూ.2 వేల కొత్త నోట్ల పంపిణీకి తగ్గట్టుగా మార్పులు (మాడిఫై) చేయలేదు. దీంతో వాటికి రూ.100 నోట్లు మాత్రమే పంపిణే చేయాల్సి వస్తోంది. ‘మా బ్యాంకులో రోజుకు సగటున రూ.4 కోట్ల వరకు డిపాజిట్లు వస్తున్నారుు. కానీ బ్యాంకు ఏటీఎంను మాడిఫై చేయకపోవటంతో ఆరు రోజులుగా మూతపడే ఉంటోంది. ఖాతాదారులు గొడవ చేస్తుండటంతో ఏం చేయాలో పాలుపోవటం లేదు’ అని ఎస్బీఐ సీనియర్ మేనేజర్ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఈయన పేరు తుకారాం. గుడిమల్కాపూర్‌లో ఉంటున్నాడు. గత 3 రోజులుగా ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నా ‘నో క్యాష్’ బోర్డులు వెక్కిరిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. బుధవారం ఇంటికి చేరువలోని ఆంధ్రాబ్యాంకు ఏటీఎం తెరిచి ఉండటంతో ఆశగా పరుగెత్తాడు. కానీ అక్కడ కేవలం డిపాజిట్ మిషన్ మాత్రమే పనిచేస్తోంది. ఏటీఎం ఎప్పట్లాగే ‘నో క్యాష్’ అంటూ వెక్కిరించింది. -
బ్యాంకుల్లో పైసల్లేవ్...మరో ఐదు రోజులింతే..!
-
బ్యాంకుల్లో పైసల్లేవ్!
ఉన్నదంతా డిపాజిట్ చేసి విత్‌డ్రాకు నోచుకోని జనం ♦ చేతిలో చిల్లిగవ్వలేని దుస్థితితో సామాన్యుల ఆందోళన ♦ ఉన్న నగదునే సర్దాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచన ♦ గ్రామీణ ప్రాంత బ్యాంకుల్లో కార్యకలాపాలు బంద్ ♦ మధ్యాహ్నానికే నోక్యాష్ బోర్డులు తగిలిస్తున్న వైనం ♦ రుణం మంజూరైనా నగదుకు నోచుకోని రైతాంగం ♦ జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి ♦ రూ. రెండు వేలు కూడా ఇవ్వలేమంటున్న సిబ్బంది ♦ ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో చిరు వ్యాపారులు ♦ మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి: బ్యాంకింగ్ వర్గాలు ♦ హైదరాబాద్‌కు కొత్త రూ. 500 నోట్లు రాకపోవడంపై అనుమానాలు సాక్షి, హైదరాబాద్ ‘ఉన్న పెద్ద నోట్లు బ్యాంకులో డిపాజిట్ చేశా.. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేదు.. బ్యాంకుకు వెళితే డబ్బులు లేవంటున్నారు.. నిత్యావసరాలకు కూడా సొమ్ము లేదు.. ఏం చేయాలో అర్థం కావడం లేదు..’.. ప్రస్తుతం ఎక్కడ, ఎవరి నోట విన్నా ఇదే మాట. పాత నోట్లు చెల్లవనడంతో జనమంతా చేతిలో ఉన్న డబ్బును బ్యాంకుల్లో జమ చేశారు. ఇప్పుడు డ్రా చేసుకుందామనుకుంటే బ్యాంకులన్నీ ఖాళీ. రాజధాని హైదరాబాద్ నుంచి గ్రామీణ ప్రాంతాల దాకా ఇదే పరిస్థితి. అన్ని చోట్లా వాణిజ్య బ్యాంకులు ‘నో క్యాష్’ బోర్డులు తగిలిస్తున్నాయి. రోజూ మధ్యాహ్నం నుంచే కార్యకలాపాలు నిలిపివేస్తున్నాయి. రద్దయిన పెద్ద నోట్లను మాత్రం జమ చేసుకుంటున్నాయి. ఎవరైనా నగదు కోసం వస్తే వారి పేరు, ఫోన్ నంబర్ రిజిస్టర్లో రాసి వెళ్లాలని, నగదు రాగానే ఫోన్ చేస్తామంటూ బ్యాంకుల సిబ్బంది తిప్పిపంపుతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనం అత్యవసరంగా నగదు కోసం బ్యాంకులకు వెళుతున్న కొందరు నగదు లేదంటుండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలైతే ఆవేదనతో శాపనార్థాలు పెడుతున్నారు. జ్వరం వచ్చిన పిల్లాడిని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లడానికి కూడా డబ్బులు లేవంటూ సోమవారం బంజారాహిల్స్ యాక్సిస్ బ్యాంకుకు వచ్చిన ఇందిరాదేవి అనే గృహిణి కంటతడి పెట్టారు. ‘‘ఇలాంటి పరిస్థితి నా పాతికేళ్ల సర్వీసులో ఎప్పుడూ చూడలేదు. అత్యవసరంగా నగదు కోసం వచ్చేవారిని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. కానీ మేమేం చేయగలం..’’ అని ఎస్బీఐ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వివాహం జరుగనున్న కుటుంబాలకు రూ.2.5 లక్షలు, ఇతర ఖాతాదారులకు వారానికి రూ.24 వేలు ఇవ్వాలన్న నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. కొన్ని బ్యాంకులు మాత్రం పెళ్లి కార్డులు పట్టుకుని వచ్చేవారికి అతికష్టం మీద రూ.లక్ష వరకు ఇవ్వగలుగుతున్నాయి. ఇక మరో చిత్రమైన పరిస్థితి ఏమిటంటే రిజర్వుబ్యాంకు నలిగిపోయి చిరిగిపోవడానికి సిద్ధంగా ఉన్న రూ.100 నోట్లను కూడా బ్యాంకులకు సరఫరా చేస్తోంది. అత్యవసరంగా కావాలని వెళ్లిన వారికి ఈ నోట్లు ఇస్తున్నారు. బయట ఆ నోట్లు చెల్లుబాటు కావడం లేదు. మామూలు రోజులకంటే తగ్గిన పంపిణీ రిజర్వుబ్యాంకు మామూలు రోజుల్లోనే ఒక్క హైదరాబాద్ నగరంలోని బ్యాంకులకు తన నగదు కేంద్రాల నుంచి రూ.2,500 కోట్ల విలువైన నోట్లను సరఫరా చేస్తుంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు పంపేది మరో రూ.1,700 కోట్లు. కానీ గత పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేసిన మొత్తం రూ.1,200 కోట్లు మాత్రమే. ఇందులోనూ వెయ్యి కోట్ల రూపాయలు రూ.2 వేల నోట్లుకాగా.. వంద రూపాయల నోట్లు రూ.200 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. రిజర్వుబ్యాంకు అధికార వర్గాల సమాచారం ప్రకారం... హైదరాబాద్, సికింద్రాబాద్‌లతో పాటు రంగారెడ్డి జిల్లా పరిధిని కూడా కలుపుకొంటే బ్యాంకులు, ఏటీఎంల ద్వారా నిత్యం రూ.12 వేల కోట్ల కార్యకలాపాలు జరిగేవి. కానీ గత పది రోజుల్లో మొత్తంగా కూడా జరిగిన లావాదేవీలు సుమారు రూ.1,750 కోట్లు మాత్రమే. ఇక కొత్త నోట్లు పెట్టేందుకు వీలుగా దేశవ్యాప్తంగా 40 శాతం ఏటీఎంలను సరిచేయడం పూర్తయిందని కేంద్రం చెబుతోంది. కానీ హైదరాబాద్‌లో 15 శాతం ఏటీఎంలు కూడా పనిచేయడం లేదు. ఏటీఎంల కార్యకలాపాలను పర్యవేక్షించే ఓ అధికారి చెప్పిన ప్రకారం.. హైదరాబాద్‌లోని 78 శాతం ఏటీఎంలలో నగదు లేదు. ఈ నెల 9వ తేదీ నుంచి పనిచేయని ఏటీఎంలు 71 శాతం దాకా ఉన్నాయి. అయితే మరో పది రోజుల్లో 75 శాతం ఏటీఎంల సాఫ్ట్వేర్ అప్డేషన్ పూర్తవుతుందని ఆ అధికారి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మరీ దారుణం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాణిజ్య బ్యాంకులకు గత వారం రోజులుగా నగదు పంపిణీ కావడం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అన్ని రకాల వ్యాపారాలు మూతపడ్డాయని తెలంగాణ లీడ్ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) రిజర్వుబ్యాంకుకు నివేదించింది. గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతం వ్యాపారాలు బ్యాంకింగ్ లావాదేవీలతో నిమిత్తం లేకుండా జరుగుతాయని.. నోట్ల రద్దుతో నగదు చలామణీలో లేకపోవడం వల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కూడా రిజర్వుబ్యాంకు దృష్టికి తెచ్చింది. ఇక నగదు లేని కారణంగా ఉపాధి హామీ పనులు దాదాపు అన్ని చోట్లా నిలిచిపోయాయి. గృహ, భవన నిర్మాణాలు ఆగిపోయాయి. ప్రాజెక్టులు, రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో కూలీలకు పనిలేకుండా పోయింది. ప్రాజెక్టుల నిర్మాణాలూ నిలిచిపోయాయి. ‘మేం రోజూ రూ.10 కోట్ల మేర నగదును కూలీలకు పంపిణీ చేస్తాం. కానీ బ్యాంకు నుంచి నగదు లభించకపోవడంతో.. మూడు రోజులుగా పనులన్నీ నిలిపివేశాం..’’ అని నిర్మాణ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. నగదు లేక పడిపోయిన అమ్మకాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నగదు అందుబాటులో లేని కారణంగా అన్ని రకాల ఉత్పత్తుల అమ్మకాలు పడిపోయాయి. కాయగూరలకు ధరలు లేక రైతులు తమ గ్రామాల్లో ఉచితంగా పంచిపెడుతున్నారు. పట్టణాలకు కాయగూరల సరఫరా ఆగిపోయింది. వచ్చిన కాయగూరలను కూడా కొనుగోలు చేసేవారు కరువయ్యారు. గ్రామీణ ప్రాంతాల నుంచి సైకిళ్ల మీద తెచ్చి విక్రయించేవారు అరువుపై ఇస్తున్నారు. మండల కేంద్రాల్లో వ్యాపారం లేక అన్ని రకాల దుకాణాలూ మూతపడ్డాయి. జనం ప్రయాణాలు రద్దు చేసుకోవడంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ బాగా పడిపోయింది. ఆటోలు నడపుకొని జీవించే వారికి ఉపాధి దెబ్బతిన్నది. చిన్న చిన్న శుభకార్యాలకు వెళుతున్న వారు కూడా చిల్లర లేక రూ.500, రూ.1,000 పాత నోట్లనే బహుమతులుగా ఇస్తున్నారు. మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి నగదు కొరత సమస్య మరో నాలుగైదు రోజులపాటు తప్పదని రిజర్వుబ్యాంకు తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో బ్యాంకులు డోలాయమానంలో పడ్డాయి. రూ.10, 20, 50, 100 నోట్లు తెచ్చి బ్యాంకులో జమ చేయాలంటూ వ్యాపారం చేసే తమ ఖాతాదారులను కోరుతున్నాయి. అవసరమైతే కొంత మొత్తంలో కమీషన్ ఇస్తామని కూడా కొన్ని బ్యాంకులు చెబుతున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్ బంకులకు చిల్లర నోట్లు వస్తున్నా వాటి సిబ్బంది కమీషన్ ప్రాతిపదికన అమ్ముకుంటున్నారు. హైదరాబాద్‌కు కొత్త రూ.500 నోటు రాలేదేం? కొత్త రూ.500 నోట్లు దేశవ్యాప్తంగా విడుదలైనా... హైదరాబాద్ బ్యాంకులకు మాత్రం ఇంకా రాలేదు. చిల్లర కొరతకు ఇదే ప్రధాన కారణమని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నా.. రేపు, మాపు అంటూ రిజర్వుబ్యాంకు సాగదీస్తూనే ఉంది. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కూడా రూ.500 నోట్లు సరఫరా చేసినా.. తెలంగాణకు అందకపోవడంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వు బ్యాంకు కావాలనే పంపడం లేదని బ్యాంకర్లు ఆరోపిస్తున్నారు. -
ఏటీఎంల వద్ద ఆందోళన చేస్తే చర్యలు: సవాంగ్
విజయవాడ: బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద రాజకీయపక్షాలు ఆందోళన చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. నగరంలోని ఏటీఎం కేంద్రాల వద్ద పరిస్థితులను పరిశీలించిన ఆయన ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చూసేందుకు ముందుగానే హెచ్చరికలు జారీచేశారు. పెద్దనోట్ల రద్దుతో సామాన్యులకే కాదు వ్యాపారులకు సమస్యలు తలెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులే విజయవాడ ఏటీఎం సెంటర్ల వద్ద దర్శనమిస్తున్నాయి. నగరంలోని అన్ని ఏటీఎం సెంటర్ల వద్ద పెద్ద సంఖ్యలో జనం బారులు తీరారు. దాదాపు చాలా ఏటీఎం కేంద్రాల్లో నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. రూ.30 లక్షలకు మించి నగదును ఏటీఎం కేంద్రాల్లో ఉంచలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. రూ.2వేలకు మించి నగదు డ్రా చేసుకునే అవకాశం ఉన్నా.. సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోవడంతో ఏటీఎం మెషీన్ నుంచి డబ్బు రావడం లేదని పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు ఆందోళన చేస్తే చర్యలు తీసుకునేందుకు సిద్ధమని నగర సీపీ తెలిపారు.