దేశాన్ని డిజిటల్ బాట పట్టించి నగదురహిత ఆర్థిక వ్యవస్థను సాకారం చేస్తామని చెప్పిన పాలకుల లక్ష్యం కాస్తా దారి తప్పి ఎటో పోయింది. పెద్ద నోట్ల రద్దు ప్రహ సనానికి ముందు కళాకాంతులతో చల్లని లోగిళ్లుగా వెలిగిన ఏటీఎంలు ఆ తర్వాత షట్టర్‌లు దించుకుని... డబ్బు లేదని చెప్పే కాగితాలు, అట్టలు అతికించుకుని దీన వదనాలతో దర్శనమివ్వడం మొదలైంది. కాస్త ఓపిక పడితే అంతా సర్దుకుంటుందని ఎప్పటికప్పుడు జనం సహనంతో ఎదురుచూస్తుంటే ఉన్నకొద్దీ పరిస్థితి మరింత దిగజారుతోంది. నగరాలు, పట్టణాలు, పల్లెలు ఒకే తీరుగా నగదు కొరతతో ఇబ్బం దులెదుర్కొంటున్నాయి. పది పన్నెండు రాష్ట్రాల్లో అన్ని బ్యాంకుల ఏటీఎంలు ఖాళీ డబ్బాలుగా మిగిలిపోయాయి.
అటు కేంద్ర ప్రభుత్వమూ, రిజర్వ్ బ్యాంకు అక్క డక్కడ కొన్ని సమస్యలు మినహా అంతా బాగానే ఉన్నదని ఇస్తున్న వివరణలు అంద రినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. దేశంలోని 2.2 లక్షల కోట్ల ఏటీఎంలలో దాదాపు 80 శాతం ఇంచక్కా పనిచేస్తున్నాయని కేంద్రం నమ్మబలుకుతోంది. ఆ నోటితోనే ఒకటి రెండు రోజుల్లో అంతా సర్దుకుంటుందని హామీ ఇస్తోంది. కానీ ఎస్‌బీఐ రీసెర్చ్ ప్రకారం దేశంలో రూ. 70,000 కోట్ల మేర కొరత ఉంది. ఈ నెల మొదటి నుంచి ఇంతవరకూ ఏటీఎంలలో ఉంచే డబ్బును ప్రభుత్వ రంగ బ్యాంకులు 30 శాతం మేర తగ్గించేశాయని ఏటీఎం పరిశ్రమల సమాఖ్య చెబుతోంది. దేశంలో ప్రతి నెలా ఏటీఎంల నుంచి ఖాతాదార్లు సగటున రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ. 2.4 లక్షల కోట్ల వరకూ విత్‌డ్రా చేసుకుంటారని అంచనా. అంత మొత్తం ఏటీఎంలలో ఉండేలా చూసుకోవడంలో బ్యాంకులెందుకు విఫల మయ్యాయి?
నిజానికిది హఠాత్తుగా వచ్చిపడిన సమస్య కాదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత మొదలైన ఈ సమస్య కొద్దో గొప్పో తేడాతో నిరంతరం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా మూడు నాలుగు నెలల నుంచి మరింత ఉగ్రరూపం దాల్చింది. మీడి యాలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ తరచు దీనిపై కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. అయినా కేంద్రంగానీ, రిజర్వ్‌బ్యాంక్ గానీ సకాలంలో మేల్కొనలేదు. కరెన్సీ కొరత తాత్కాలికమేనంటూ వివరణనిచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చాలినంత కరెన్సీ చలామణిలో ఉన్నదని చెబుతున్నారు.
చలామణి అంటే నగదు లావాదేవీలు జరగడం. బ్యాంకులకు డబ్బు వస్తూ పోతూ ఉండటం. ఎక్కడో ఒక చోట అది ఆగిపోయినప్పుడు కొరత మొదలవుతుంది. కరెన్సీ కష్టాలకు ఒక్కొ క్కరు ఒక్కో రకమైన కారణం చెబుతున్నారు. పంటల కొనుగోళ్ల సీజన్ కారణమని ఒక రంటే, రాష్ట్రాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కారణమని మరికొందరు, మొత్తం డబ్బు బ్యాంకులో పెట్టుకోవడం కన్నా దగ్గరుంచుకుంటే మంచిదని జనం అనుకోవడం వల్లే ఈ స్థితి తలెత్తిందని ఇంకొందరు భాష్యం చెబుతున్నారు. ఇలా అంటున్నవారంతా సామాన్యులు కాదు. అందులో కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్య దర్శి, ఎస్‌బీఐ చైర్మన్ వగైరాలున్నారు. కానీ పంటల సీజన్, సంక్షేమ పథకాలు వంటివి ఇంతకు ముందూ ఉన్నాయి. ఇప్పుడే అవి కరెన్సీ కొరతకు కారణమెలా అయ్యాయి?
కొత్తగా ఖాతాలు తెరిచేవారినుంచి డెబిట్ కార్డుకోసమని రూ. 130 నుంచి రూ. 300 వరకూ వసూలు చేస్తున్న సంగతి బ్యాంకులకు గుర్తుందో లేదో తెలియదు. పైగా ఖాతాలో తగినంత మొత్తంలో డబ్బులేదని తెలియక ఏటీఎం దగ్గరకెళ్లి కార్డు ఉపయోగించిన వారికి దాదాపు రూ. 25 వడ్డిస్తున్నాయి. అలాగే పరిమితికి మించి లావాదేవీలు నడిపినా, అసలు లావాదేవీలే జరపకపోయినా బ్యాంకులు సర్‌చార్జీల మోత మోగిస్తున్నాయి. వేరే బ్యాంకుల ఏటీఎంల దగ్గర డ్రా చేసుకోవడానికి పరిమి తులు పెట్టి అవి మించితే వడ్డిస్తున్నాయి. ఇన్ని రకాలుగా ఖాతాదారుల నుంచి ఏటా వేల కోట్లు రాబట్టుకుంటున్న బ్యాంకులు తమ ఏటీఎంలు ఖాళీగా ఉంచినం దుకూ, ఖాతాదార్లకు అవసరం పడిన సమయంలో డబ్బు అందించలేకపోయినం దుకూ పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయా? పెద్ద నోట్ల రద్దు తర్వాత దాదాపు 40 శాతం ఏటీఎంలు ఎప్పుడూ ఖాళీగానే దర్శనమిస్తున్నాయని గణాం కాలు చెబుతున్నాయి.
ఖాతా ఉన్న బ్యాంకు ఏటీఎం డబ్బు రాల్చనప్పుడు తప్పని సరై మరో బ్యాంకు ఏటీఎంకు ఎవరైనా పరుగెడతారు. అలాంటివారందరిపైనా చార్జీలు విధించడం వ్యాపారమవుతుందా, నిలువుదోపిడీ అవుతుందా? అసలు తాము డబ్బు దాచుకుంటున్న బ్యాంకు సమయానికి మొహం చాటేసిందన్న అభి ప్రాయం ఖాతాదారుల్లో ఒకసారంటూ ఏర్పడితే... బ్యాంకింగ్ వ్యవస్థపై ఒకసారి నమ్మకం కోల్పోతే వాటి పర్యవసానాలెలా ఉంటాయో రిజర్వ్Sబ్యాంకుకు తెలిసే ఉండాలి. అయినా మూడు నాలుగు నెలలుగా ఏర్పడ్డ కరెన్సీ కొరతను అది గుడ్లప్ప గించి చూస్తూ ఉండిపోయింది.
బ్యాంకింగ్ రంగం అంటే డబ్బుతో వ్యాపారం చేయడం. ఖాతాదార్లు జమచేసే సొమ్ముతో అధిక వడ్డీలకు అప్పులిచ్చి లాభపడటం వాటి ప్రధాన వ్యాపకం. అలా అప్పులిచ్చే ముందు తీసుకుంటున్నవారు తీర్చగలరో లేదో చూడాల్సి ఉంటుంది. ఆ స్తోమత ఉన్నదని గుర్తించాక తగినంత మేర స్థిరాస్తులను కుదువ పెట్టుకుని డబ్బు విడుదల చేస్తాయి. కానీ పబ్లిక్ రంగం, ప్రైవేటు రంగం అనే తేడా లేకుండా దేశంలోని ప్రధాన బ్యాంకులన్నీ ఈ కార్యకలాపాలను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమవుతున్నాయి.
బ్యాంకుల ఈ చేతగానితనాన్ని ఆసరా చేసుకుని విజయ్ మాల్యా, నీరవ్‌మోదీ లాంటివారు వేల కోట్ల రూపాయలకు ఎగనామం పెట్టి విదే శాలకు పరారవుతున్నారు. దానికితోడు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎఫ్‌ఆర్ డీఐ బిల్లు చట్టమైతే బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ముకు భద్రత ఉండదన్న భయం సామాన్య పౌరుల్లో ఏర్పడింది. తమపై ఏర్పడ్డ ఈ అవిశ్వాసాన్ని తొలగించేందుకు బ్యాంకులు చేసిందేమీ లేదు. సమస్య ఏర్పడినప్పుడు అందుకు గల కారణాలేమిటో పౌరులకు చెప్పాల్సిన బాధ్యత రిజర్వ్‌బ్యాంకుకు, కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అందుకు బదులు అంతా సవ్యంగానే ఉన్నదని దబాయిస్తే నమ్మడానికెవరూ సిద్ధంగా లేరు.
Comments
Please login to add a commentAdd a comment