బ్యాంకులో లేవు.. ఏటీఎంలో రావు | no cash boards at banks and atms due to demonetization | Sakshi
Sakshi News home page

బ్యాంకులో లేవు.. ఏటీఎంలో రావు

Published Thu, Nov 24 2016 2:30 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

బ్యాంకులో లేవు.. ఏటీఎంలో రావు - Sakshi

బ్యాంకులో లేవు.. ఏటీఎంలో రావు

కరెన్సీ కోసం జనం విలవిల..  ఏటీఎంలు.. ఎనీటైం మూత..
ఎక్కడికెళ్లినా ‘నో క్యాష్’ బోర్డులే
మూడొంతులకుపైగా పనిచేయని మిషన్లు
బుధవారం నగదు సరఫరా లేక మరింత పెరిగిన ఇక్కట్లు
బ్యాంకులకూ అందని డబ్బులు
నేడు కూడా ఇదే పరిస్థితి!

 
 సంజీవయ్య.. వయసు 72 ఏళ్లు.. ఆయన ఖాతాలో పింఛన్ కింద రూ. వెయ్యి పడింది. ఏటీఎంకు వచ్చాడు. కానీ ఏటీఎంలో రూ. 2 వేల నోట్లే ఉన్నాయి. ఖాతాలో ఉన్నది రూ.వెయ్యి మాత్రమే. దీంతో చేసేది లేక తన ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్లాడు. అక్కడా రూ. 2 వేల నోట్లే ఉండటంతో తీవ్ర ఆవేదన చెందాడు. తనకు మందుల కోసం అత్యవసరంగా డబ్బు కావాలని కన్నీటి పర్యంతం కావటంతో బ్రాంచ్ మేనేజర్ తన జేబులోని డబ్బు అతని చేతిలో పెట్టి పంపించాడు.
 
 (గౌరిభట్ల నరసింహమూర్తి)
 కరెన్సీ కష్టాలు సగటు జీవిని వెంటాడుతూనే ఉన్నాయి. బ్యాంకులు, కొన్ని ఏటీఎంలలో  రెండ్రోజుల క్రితం వరకు ఓ మోస్తరుగా నగదు అందుబాటులో ఉన్నా మంగళ, బుధవారాల్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. నగదుకు కొరత లేదని రిజర్వు బ్యాంకు ప్రకటిస్తున్నా.. బ్యాంకులు, ఏటీఎంలకు మాత్రం డబ్బు చేరటం లేదు. బుధవారం సమస్య మరింత తీవ్రమైంది. బ్యాంకుల చెస్ట్‌లకు నగదు చేరకపోయేసరికి సింహభాగం బ్యాంకులు, ఏటీఎంలకు డబ్బు పంపలేమని అక్కడి సిబ్బంది తేల్చి చెప్పారు. దీంతో స్టేట్‌బ్యాంకు ఏటీఎంలు, ప్రైవేటు బ్యాంకులకు చెందిన 20 శాతం ఏటీఎంలు మాత్రమే పనిచేశాయి. అందులో ప్రైవేటు బ్యాంకు ఏటీఎంలలో ఉదయం గంటసేపటికే నగదు ఖాళీ కావటంతో మూసేశారు.

సాయంత్రం వేళ స్టేట్ బ్యాంకు ఏటీఎంలలో కొన్ని పనిచేయటంతో ప్రజలు వాటి ముందు క్యూలు కట్టారు. అవి మినహా మిగతా బ్యాంకుల ఏటీఎంలన్నీ మూతపడే ఉండేసరికి నగదు కోసం జనం పడరాని పాట్లు పడ్డారు. ఈ విషయమై బ్యాంకు సిబ్బందిని నిలదీస్తే.. ఏటీఎంలలో భర్తీ చేసే నగదుకు సంబంధించి తమకు సంబంధం ఉండదన్నారు. దీంతో సిబ్బందితో ప్రజలు వాదనకు దిగడంతో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గురువారం కూడా పరిస్థితి ఇంతకన్నా భిన్నంగా ఉండదని తెలుస్తోంది.
 
 బ్యాంకుల కష్టాలు బ్యాంకులవి...
 ఏటీఎంలలో, బ్యాంకుల్లో డబ్బు లేదని ఖాతాదారులు సిబ్బందిని శాపనార్ధాలు పెడుతుండగా మరోవైపు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక బ్యాంకు అధికారులు గగ్గోలు పెడుతున్నారు. గత రెండ్రోజులుగా చెస్టుల నుంచి డబ్బు రాకపోతుండటంతో వారు బ్యాంకుకు రావాలంటేనే జంకుతున్నారు. న్యూమల్లేపల్లిలోని ఎస్‌బీఐలో గత రెండు రోజుల్లో ఏకంగా రూ.ఐదున్నర కోట్లు ఖాతాల్లో డిపాజిట్ అయ్యాయి. అయితే ఖాతాదారులకు డబ్బు ఇవ్వటానికి మాత్రం చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది. ఆర్‌బీఐ నుంచి డబ్బు రానందున తాము నగదు పంపలేమంటూ చెస్ట్ సిబ్బంది చెప్పటంతో బ్యాంకు అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. చివరకు బ్రాంచి మేనేజర్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న మరో బ్యాంకు మేనేజర్‌ను బతిమిలాడి రూ.20 లక్షల నగదు తెప్పించి ఖాతాదారులకు తలాకొంత పంపిణీ చేశారు.

ఆ మొత్తం కేవలం అరగంటలో అయిపోయేసరికి మిగతా ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి సర్దిచెప్పలేక నానా హైరానా పడ్డారు. గురువారానికి రూ.కోటి నగదు పంపాలని చెస్ట్‌కు రిక్వెస్ట్ పెడితే అక్కడి నుంచి ‘కష్టమే’ అన్న సమాధానం రావటంతో ఎలా గట్టెక్కాలో తెలియక తల పట్టుకున్నారు. అన్ని బ్యాంకుల్లో దాదాపు ఇదే పరిస్థితి. కొన్ని ప్రైవేటు బ్యాంకులకు రెండుమూడు రోజులుగా నగదు రావటం లేదు. కొన్నింటికి మాత్రం రూ.10 లక్షల చొప్పున రావటంతో పావుగంటలోనే నిండుకుంటున్నాయి.

 ఇంటి అద్దె ఎలా?
ఈయన బీహెచ్‌ఈఎల్ నివాసి ఉమర్. మెహిదీపట్నంలో విద్యుత్తు లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల ఇంటి అద్దె చెల్లించలేకపోవటంతో యజమానుల ఒత్తిడి తీవ్రమైంది. దీంతో బుధవారం మూడునాలుగు డెబిట్ కార్డులు పట్టుకుని ఏటీఎంల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. రూ.10 వేలు అవసరమైతే అతికష్టమ్మీద రూ.2 వేలు దొరికాయి. దీంతో మళ్లీ గురువారం ఉదయమే వచ్చి ఏటీఎంల వేట మొదలుపెడతానంటున్నాడు.

 ‘ఫీజు’కు పరీక్షే..
ఇతను సయ్యద్ అమీర్. సిస్కో సర్టిఫైడ్ నెట్‌వర్కింగ్ ఫ్రొఫెషనల్ పరీక్షకు ఫీజు కట్టాల్సి ఉంది. రూ.13 వేలు అవసరం కావటంతో తెలిసినవారి డెబిట్‌కార్డులు పట్టుకుని ఏటీఎంల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. చివరకు విజయనగర్‌కాలనీలోని రెండు స్టేట్‌బ్యాంక్ ఏటీఎంల నుంచి రూ.4 వేలు డ్రా చేసుకున్నాడు. రెండు రోజుల్లో మిగతా మొత్తం ఎలా పొందాలో తెలియక ఆందోళన చెందుతున్నాడు.

 అమ్మా.. రాలేను..!
 కార్వాన్‌కు చెందిన ఈ విద్యార్థి పేరు రాఘవేంద్ర. అత్యవసరంగా రమ్మని సొంతూరు నుంచి తల్లిదండ్రులు కబురుపెట్టారు. మహబూబ్‌నగర్ సమీపంలోని ఊరికి వెళ్లాలి. జేబులో రూ.2 వేల నోటు ఉంది. కానీ ఆటో, బస్సులో చిల్లర లేదనటంతో మంగళవారం ఊరి ప్రయాణం రద్దు చేసుకున్నాడు. రూ.వంద నోట్ల కోసం రెండు రోజులుగా ఏటీఎం చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదు. బుధవారం రాత్రి గుడిమల్కాపూర్  స్టేట్‌బ్యాంకు ఏటీఎంలో నగదు లోడ్ చేశారని తెలిసి వచ్చి ఇలా నిలుచున్నాడు.

 క్షవరానికి తిప్పలే..!
 ఈయన పేరు జహంగీర్. క్షవరం చేయించుకునేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక పక్కింటివారి వద్ద చిల్లర అడగాల్సి వచ్చిందంటూ ఆయన వాపోతున్నాడు. నాలుగు రోజులుగా డబ్బుల కోసం ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండటం లేదంటూ ఆవేదన చెందాడు.

 అక్కరకు రాని పెద్ద నోటు!
 ఈయన పేరు సయ్యద్ ముజాహుద్దీన్. జేబులో మూడు రూ.2 వేల నోట్లున్నాయి. నాలుగు రోజుల క్రితం డ్రా చేసుకున్నవవి. కానీ ఎక్కడా చిల్లర దొరక్కపోవడంతో పాలు కూడా కొనలేని దుస్థితిలో ఉన్నాడు. బుధవారం సాయంత్రం స్టేట్‌బ్యాంకు ఏటీఎంలో డబ్బులున్నాయని తెలిసి వెళ్లాడు. మళ్లీ రూ.2 వేల నోటే వస్తుందని భయపడి రూ.1900 అని టైప్ చేసి 19 వంద నోట్లు పొంది ఇంటిబాటపట్టాడు.

 ఖాతాలో డబ్బున్నా ఎందుకివ్వరు?
ఈ మహిళ ఉదయమే చెక్కు పట్టుకుని బ్యాంకుకు వచ్చింది. కానీ అందులో చిన్న పొరపాటు ఉండటంతో ఇంటికెళ్లి మరో చెక్కు తెచ్చేలోపు బ్యాంకులో నగదు అరుుపోరుుంది. దీంతో తన ఖాతాలో రూ.లక్ష ఉండి కూడా చిల్లర పొందలేని పరిస్థితి ఏంటని బ్రాంచి మేనేజర్‌ను నిలదీసింది. గురువారం ఉదయం వస్తే ఏదోరకంగా డబ్బు ఇప్పిస్తానని ఆయన సముదారుుంచి పంపారు.

 ఏటీఎంలో ‘మార్పు’ ఏది?
 ఆర్బీఐ నుంచి వచ్చే నగదులో రూ.2 వేల నోట్లే ఎక్కువగా ఉంటున్నాయి. రూ.100 నోట్లు నామమాత్రంగానే వస్తున్నాయి. కానీ ఇప్పటికీ మూడొంతులకుపైగా ఏటీఎంలు రూ.2 వేల కొత్త నోట్ల పంపిణీకి తగ్గట్టుగా మార్పులు (మాడిఫై) చేయలేదు. దీంతో వాటికి రూ.100 నోట్లు మాత్రమే పంపిణే చేయాల్సి వస్తోంది. ‘మా బ్యాంకులో రోజుకు సగటున రూ.4 కోట్ల వరకు డిపాజిట్లు వస్తున్నారుు. కానీ బ్యాంకు ఏటీఎంను మాడిఫై చేయకపోవటంతో ఆరు రోజులుగా మూతపడే ఉంటోంది. ఖాతాదారులు గొడవ చేస్తుండటంతో ఏం చేయాలో పాలుపోవటం లేదు’ అని ఎస్‌బీఐ సీనియర్ మేనేజర్ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.
 
 ఈయన పేరు తుకారాం.  గుడిమల్కాపూర్‌లో ఉంటున్నాడు. గత 3 రోజులుగా ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నా ‘నో క్యాష్’ బోర్డులు వెక్కిరిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. బుధవారం ఇంటికి చేరువలోని ఆంధ్రాబ్యాంకు ఏటీఎం తెరిచి ఉండటంతో ఆశగా పరుగెత్తాడు. కానీ అక్కడ కేవలం డిపాజిట్ మిషన్ మాత్రమే పనిచేస్తోంది. ఏటీఎం ఎప్పట్లాగే ‘నో క్యాష్’ అంటూ వెక్కిరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement