ఫస్టొచ్చింది.. పైసల్లేవ్! | no cash boards at so many atm centers | Sakshi
Sakshi News home page

ఫస్టొచ్చింది.. పైసల్లేవ్!

Published Thu, Dec 1 2016 2:39 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

ఫస్టొచ్చింది.. పైసల్లేవ్! - Sakshi

ఫస్టొచ్చింది.. పైసల్లేవ్!

  • బ్యాంకుల్లో నిండుకున్న నగదు
  •  పట్టణాలు, నగరాల్లో ‘నో క్యాష్’ బోర్డులు
  •  నయా పైసా లేని గ్రామీణ ప్రాంత బ్యాంక్‌లు
  •  1,816 బ్యాంకు శాఖల్లో పక్షం రోజులుగా లావాదేవీలు బంద్
  •  ప్రజల్లో అశాంతి పెరుగుతోంది.. శాంతిభద్రతల సమస్యగా మారొచ్చు
  •  కేంద్రానికి ఇంటెలిజెన్‌‌స బ్యూరో హెచ్చరిక
  •  గొడవలు మొదలైతే ఆపడం ఎవరితరం కాదని వ్యాఖ్య
  •  బ్యాంకుల వద్ద పోలీసు బందోబస్తు పెట్టండి
  •  డీజీపీని కోరిన రిజర్వ్ బ్యాంకు
  •  హైదరాబాద్‌లోని బ్యాంకు శాఖలు..  1,526
     పైసా కూడా ఇవ్వనివి..  1,100
     ఇతర ప్రధాన నగరాల్లోని బ్యాంకు శాఖలు   674
     పైసా కూడా ఇవ్వనివి..  500
     రాష్ట్రంలోని ప్రభుత్వరంగ బ్యాంకుల ఏటీఎంలు  3,400
     వీటిలో పనిచేస్తున్నవి  400
     (బుధవారం నాటి పరిస్థితి ఇది..)

    సాక్షి, హైదరాబాద్
    ఒకటో తారీఖు వచ్చేసింది.. ఇక కరెన్సీ కష్టాలు మరింత తీవ్రం కానున్నాయి! గురువారం పరిస్థితి ఎలా ఉంటుందోనని హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాల్లోని బ్యాంక్ సిబ్బందిలో ఆందోళన మొదలైంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, ఖమ్మం నగరాల్లోని చాలా వరకు బ్యాంక్ శాఖల్లో నగదు లేదు. అక్కడక్కడ ఎస్‌బీఐ బ్రాంచీలకు రిజర్వుబ్యాంక్ నుంచి కొంత నగదు అందుతున్నా.. అది మొదటి గంటలో వచ్చే ఖాతాదారులకే సరిపోతోంది. అదీ ఒక్కొక్కరికి రూ.4 వేలు మాత్రమే అందించగలుగుతున్నారు. మిగిలిన అన్ని బ్యాంక్‌ల శాఖలు నో క్యాష్ బోర్డులు తగిలిస్తున్నాయి. రాజధాని హైదరాబాద్‌లో 1,526 బ్యాంక్ శాఖలు ఉండగా బుధవారం 1,100 శాఖల నుంచి ఖాతాదారులకు పైసా కూడా అందలేదు.
     
     రాష్ట్రంలోని ఇతర నగరాల్లో 674 బ్యాంక్ శాఖలు ఉండగా.. 500కు పైగా బ్రాంచీల్లో డబ్బు లేదు. ఉన్నకొద్దిపాటి బ్రాంచీల్లో రూ.2 నుంచి 4 వేలు ఇస్తున్నారు. రాజధాని సహా ఇతర నగరాల్లో 3,400 ప్రభుత్వరంగ బ్యాంకుల ఏటీఎంలు ఉండగా వాటిలో 400 ఏటీఎంల్లో కూడా నగదు సౌకర్యం లేదు. ఏ ఏటీఎంలో అరుునా నగదు లోడ్ చేస్తే గంటలోనే అయిపోతోంది. ఈ నేపథ్యంలో గురువారం నాటి పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని, బ్యాంక్‌కు నగదు కోసం వచ్చే ఖాతాదారులకు సమాధానం చెప్పలేమని ప్రధాన బ్యాంక్‌ల ఉన్నతాధికారులు రిజర్వుబ్యాంక్ దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైతే పోలీసు బందోబస్తు పెట్టుకోవడం మినహా ఈ విషయంలో తాము చేయగలిగిందేమీ లేదని రిజర్వుబ్యాంక్ స్పష్టం చేసింది.
     
     బ్యాంకుల వద్ద బందోబస్తు..
     నగదు కొరత రోజురోజుకూ తీవ్రమవుతుండడం, అక్కడక్కడ బ్యాంక్ సిబ్బందితో ఖాతాదారులు గొడవ పడుతున్న ఘటనల నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి కొద్దిరోజుల పాటు బ్యాంకుల వద్ద పోలీసు బందోబస్తు పెట్టాలని రిజర్వు బ్యాంక్... తెలంగాణ డీజీపీని కోరింది. ఈ మేరకు ముంబై కార్యాలయం నుంచి ఫ్యాక్స్ ద్వారా లేఖ అందినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి తోడు నగదు కొరత శాంతిభద్రతల సమస్యగా మారే ప్రమాదం ఉందంటూ ఇంటెలిజెన్‌‌స బ్యూరో (ఐబీ) కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉన్నదని, నగదు కొరతతో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే గొడవలు ఆపడం ఎవరితరం కాదని కేంద్రానికి తెలిపింది.
     
     పట్టణ, నగర ప్రాంతాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉందని నివేదించింది. రాష్ట్రంలో అక్కడక్కడ చోటుచేసుకున్న ఘటనలను సైతం ప్రస్తావించింది. బ్యాంక్‌లకు వెళ్లడానికి మహిళా సిబ్బంది జంకుతున్నారని, అనారోగ్య కారణాలతో వారు సెలవులకు దరఖాస్తు చేశారని ఐబీ తన నివేదికలో కేంద్రం దృష్టికి తెచ్చింది. డబ్బు కోసం వచ్చిన ఖాతాదారులకు సమాధానం చెప్పలేక, వారితో వాగ్వాదానికి దిగలేక మహిళా సిబ్బంది లీవ్‌లో వెళ్తున్నారని ఓ బ్యాంక్ ఉన్నతాధికారి పేర్కొన్నారు. పరిస్థితిలో మార్పు లేకపోతే గ్రామీణ ప్రాంతాల బ్యాంక్‌లను మూసివేయడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని ఆ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement