లబ్‌డబ్బు! | 'No cash' boards back at ATMs | Sakshi
Sakshi News home page

లబ్‌డబ్బు!

Published Fri, Feb 16 2018 12:04 PM | Last Updated on Fri, Feb 16 2018 12:04 PM

'No cash' boards back at ATMs - Sakshi

ఫైనాన్సియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ (ఎఫ్‌ఆర్‌డీఐ) బిల్లు–2017...  పార్లమెంటులో ప్రవేశపెట్టగానే ఊహాగానాలు మొదలయ్యాయి. బ్యాంకులు దివాళాతీస్తే ఖాతాదారుల సొమ్ము హారతికర్పూరంలా కరిగిపోతుందనే పుకార్లు షికార్లు చేశాయి! ఇవే ‘పెద్ద కరెన్సీ నోట్ల రద్దు’ తర్వాత నాటి పరిస్థితిని పునరావృతం చేశాయి! గత వారం రోజుల నుంచి ప్రజల నగదు కష్టాలు పరాకాష్టకు చేరాయి. జిల్లాలో 90 శాతం ఏటీఎంలు ఖాళీ అయిపోయాయి. క్యాష్‌ రీసైకిల్‌ మెషిన్ల వద్ద ఎవ్వరైనా నగదు డిపాజిట్‌ చేస్తే తప్ప మరో దారి కనిపించట్లేదు. మరోవైపు బ్యాంకుల్లో ఫిక్సిడ్‌ డిపాజిట్‌లు నిలిచిపోయాయి. డిపాజిట్‌ల ఉపసంహరణ కూడా తారస్థాయికి చేరింది. దీంతో బ్యాంకుల్లో లావాదేవీలు దాదాపుగా పడిపోయాయి.

సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: 2016 నవంబర్‌ 8వ తేదీన రూ.500, రూ.1000 కరెన్సీ నోట్ల రద్దు తర్వాత నగదు కోసం ప్రజలకు రోజూ ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో 15 నెలల తర్వాత ఇంచుమించు అదే పరిస్థితి కొనసాగుతోంది. కొత్త రూ.2000 కరెన్సీ నోట్లు తొలినాళ్లలో హల్‌చల్‌ చేసినా క్రమేపీ చలామణి తగ్గిపోతున్నాయి. రిజర్వుబ్యాంకు ఆఫ్‌ ఇండియా  (ఆర్‌బీఐ) నుంచి వస్తున్న నోట్లకు, అవి ప్రజల్లో వెళ్లి
మళ్లీ బ్యాంకుకు తిరిగొస్తున్న నోట్ల సంఖ్యకు చాలాచాలా వ్యత్యాసం కనిపిస్తోందని బ్యాంకు అధికారులే చెబుతున్నారు. క్రమేపీ బ్యాంకింగ్‌ వ్యవస్థ గాడిన పడుతుందనే సమయంలో గత ఏడాది చివర్లో ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు పిడుగులా వచ్చిపడింది.

ఈ బిల్లు ఉద్దేశాలు ఏమైనప్పటికీ ప్రజల సందేహాలను నివృత్తి చేయడంలో అటు ప్రభుత్వాలు, ఇటు బ్యాంకులు విఫలమయ్యాయి. దీని ప్రభావం తొలుత ఫిక్సిడ్‌ డిపాజిట్లపై పడింది. ఏదొక అత్యవసర పని పేరుచెప్పి అవసరం ఉన్నా లేకపోయినా ఖాతాదారులు ఉపసంహరణ మొదలైంది. ఈ రెండు నెలల్లో అది తారస్థాయికి చేరింది. మరోవైపు బ్యాంకుల్లో డిపాజిట్‌లు దాదాపుగా నిలిచిపోయాయి. డ్వాక్రా పొదుపు సంఘాలతో పాటు పెట్రోలు బంకులు, మద్యం దుకాణాల యజమానులు చేస్తున్న డిపాజిట్‌లే కాస్త ఆదుకుంటున్నాయి. సాధారణంగా బ్యాంకులు తమవద్దకు వచ్చే డిపాజిట్‌ల సొమ్మునే తిరిగి ఖాతాదారులకు చెల్లింపులు చేస్తుంటాయి. ఇప్పుడది పూర్తిగా గాడితప్పింది. బ్యాంకుల్లో నగదు నిల్వ దాదాపుగా అడుగంటిపోయినట్లు వినికిడి. అన్ని జాతీయ బ్యాంకులకు చెందిన నగదు భద్రతా కేంద్రాలు (చెస్ట్‌లు) నిండుకున్నాయని తెలిసింది. దీంతో  ఏటీఎంల్లో నింపడానికి నగదు లేక షట్టర్లు దించేస్తున్నారు.

వారం రోజులుగా మరీ దుర్భరం
గత శుక్రవారం బంద్, రెండో శనివారం, ఆదివారం... ఇలా వరుసగా మూడు రోజులు బ్యాంకులు పనిచేయలేదు. దీంతో ఎక్కడికక్కడ ఏటీఎంలన్నీ ఖాళీ అయిపోయాయి. ఆ తర్వాత నుంచి నగదు విత్‌డ్రాలే తప్ప బ్యాంకుల్లో డిపాజిట్‌లు కరువైపోయాయి. ఈ దుర్భర పరిస్థితి ఫలితంగా అనధికారికంగానే ఆంక్షలు అమలు చేస్తున్నారు. విత్‌డ్రా రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పరిమితం చేసేశారు. బ్యాంకుల వద్ద నగదు లేక ఈనెల పింఛన్ల పంపిణీ కూడా ఆలస్యమైపోయింది. జిల్లాలో పింఛన్లకు రూ.40 కోట్ల వరకూ నగదు అవసరం. కానీ ఇప్పటికీ పింఛన్ల పంపిణీ కొలిక్కిరాలేదు.

రోజువారీ లావాదేవీలు రూ.10 కోట్లే...
జాతీయ, ప్రైవేట్, సహకార బ్యాంకులు జిల్లాలో 24 ఉన్నాయి. వాటి బ్రాంచిలు 260 ఉన్నాయి. వీటికి అనుబంధంగా 300 వరకూ ఏటీఎంలు ఉన్నాయి. కానీ తర్వాత నిర్వహణ సరిగా లేక 32 ఏటీఎంల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. 268 ఏటీఎం వర్కింగ్‌ కండిషన్‌లో ఉన్నాయి. వాటిలో రోజుకు సగటున రూ.10 కోట్లు వరకూ నగదు ఉంచాల్సి ఉంది. కానీ వాటిలో 60 వరకూ క్యాష్‌ రీసైకిల్‌ ఏటీఎంలే. వాటిలో ఎవ్వరైనా డిపాజిట్‌ చేస్తే మరెవ్వరికైనా ఆ నగదును విత్‌డ్రా చేసే అవకాశం లభిస్తోంది. ప్రస్తుతం జిల్లా అవసరాల కోసం రోజుకు రూ.200 కోట్లు నగదు కావాలి. కానీ ప్రస్తుతం బ్యాంకుల్లో రోజువారీ లావాదేవీలు రూ.10 కోట్లుకు మించట్లేదని సమాచారం.

‘నగదురహితం’లో నగుబాటు
నగదు ఆధారిత లావాదేవీలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం నగదురహిత లావాదేవీల విధానాన్ని ప్రభుత్వం ఒక ఉద్యమంలా తెరపైకి తెచ్చి ఏడాదైనా ఆచరణలో నవ్వుల పాలైందనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో శ్రీకాకుళం నగరపాలక సంస్థతో పాటు నాలుగు పురపాలక సంఘాలు, సుమారు 2,200 గ్రామాలు ఉన్నాయి. ఏజెన్సీలో పలుచోట్ల బ్యాంకులు మండల కేంద్రాలకే పరిమితమయ్యాయి. నగదు విత్‌డ్రా కోసం ఖాతాదారులు గ్రామాల నుంచి కొన్ని కిలోమీటర్లు ప్రయాణించి రావాల్సి వస్తోంది. తీరా బ్యాంకుల వద్ద ‘నో క్యాష్‌’ బోర్డులు కనిపించేసరికి తీవ్ర నిరాశకు గురవుతున్నారు. శ్రీకాకుళంలో రైతుబజారు వద్ద తెరిచిన స్వైపింగ్‌ మెషిన్‌ ఒక్కరోజు ముచ్చటే అయ్యింది. ప్రతి ఆర్టీసీ బస్సులోనూ స్వైపింగ్‌ మెషిన్‌ అందుబాటులో ఉంచుతామని, బ్యాంకు ఆఫ్‌ బరోడా ద్వారా 430 మెషిన్లు తెప్పించామని అధికారులు ప్రకటించినా అవేవీ వాడకంలో కనిపించట్లేదు. 17 మద్యం దుకాణాలు, 8 బార్‌ల వద్ద మాత్రమే పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) మిషన్లు ఉన్నాయి. విద్యుత్తు బిల్లుల చెల్లింపుల కోసం 50 స్వైపింగ్‌ మెషిన్లు వాడుతున్నారు. మండలానికి ఒకటి చొప్పున 38 డిజిటల్‌ గ్రామాలను ప్రకటించినప్పటికీ అక్కడా పూర్తిస్థాయిలో నగదురహిత విధానం అమలుకావట్లేదు. 

నోటు కష్టాలకు నిదర్శనాలు కొన్ని...
పలాస నియోజకవర్గ పరిధిలో సుమారు పదివేల మంది కార్మికులకు ముందస్తుగా అందించాల్సిన నగదు ఇవ్వలేక 160 జీడిపరిశ్రమల యజమానులు ఇబ్బందిపడుతున్నారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 19 ఏటీఎంల్లో ఒక్క హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలోనే అరకొరగా నగదు ఉంటోంది. దీంతో అక్కడ ఖాతాదారులు బారులు తీరుతున్నారు.
∙ వంశధార పునరావాస కాలనీల్లో నిర్వాసితులు సొంతంగా ఇల్లు నిర్మించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకుల్లో తమ ఖాతాల్లోని సొమ్ము తీయాలంటే రోజుకు రూ.5 వేలు మించి ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌.ఎన్‌.పేట, హిరమండలం, కొత్తూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న అనేక బ్యాంకుల్లో సుమారు 4,500 మంది వరకు నిర్వాసితులు తమకు వచ్చిన ప్యాకేజీ డబ్బులు డిపాజిట్లు, ఎస్‌బి ఖాతాల్లో ఉంచినట్లు నిర్వాసితులే చెపుతున్నారు.
∙  జిల్లావ్యాప్తంగా 2 లక్షలకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటి బిల్లులకు సం బంధించిన మొత్తం లబ్ధిదారుల ఖాతాల్లోకి సరిగా జమకావటం లేదు. దీంతో పేదలు ఇబ్బందిపడుతున్నారు.

రూ.100 కోట్లు కావాలని ఆర్బీఐకి విన్నవించాం...
జిల్లాలో వచ్చేనెలలో తలెత్తే నగదు అవసరాల కోసం రూ. 100 కోట్లు నగదు అవసరమని ఆర్‌బీఐకి వినతి పంపించాం. ఇది ఈనెల 28వ తేదీకల్లా వస్తుందని ఆశిస్తున్నాం. ప్రస్తుత అవసరాలకు పొరుగునున్న ఒడిశా రాష్ట్రంలోని బ్యాంకుల నుంచి నగ దు సర్దుబాటు చేస్తున్నాం. నెట్‌బ్యాంకింగ్‌ తదితర నగదురహిత లావాదేవీలను ప్రజలు విరివిగా నిర్వహిస్తే ఇంత ఇబ్బంది తలెత్తదు. అలాగే ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లుపై సందేహాలు కూడా తగదు. దానివల్ల ఖాతాదారులకు నష్టమేమీ ఉండదు. – పి.వెంకటేశ్వరరావు, జిల్లా లీడ్‌బ్యాంకు మేనేజరు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement