బ్యాంకుల్లో పైసల్లేవ్‌! | No cash boards at banks | Sakshi
Sakshi News home page

బ్యాంకుల్లో పైసల్లేవ్‌!

Published Tue, Nov 22 2016 2:00 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM

బ్యాంకుల్లో పైసల్లేవ్‌!

బ్యాంకుల్లో పైసల్లేవ్‌!

ఉన్నదంతా డిపాజిట్‌ చేసి విత్‌డ్రాకు నోచుకోని జనం
చేతిలో చిల్లిగవ్వలేని దుస్థితితో సామాన్యుల ఆందోళన
ఉన్న నగదునే సర్దాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచన
గ్రామీణ ప్రాంత బ్యాంకుల్లో కార్యకలాపాలు బంద్‌
మధ్యాహ్నానికే నోక్యాష్‌ బోర్డులు తగిలిస్తున్న వైనం
రుణం మంజూరైనా నగదుకు నోచుకోని రైతాంగం
జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి
రూ. రెండు వేలు కూడా ఇవ్వలేమంటున్న సిబ్బంది
  ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో చిరు వ్యాపారులు
  మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి: బ్యాంకింగ్‌ వర్గాలు
  హైదరాబాద్‌కు కొత్త రూ. 500 నోట్లు రాకపోవడంపై అనుమానాలు  

సాక్షి, హైదరాబాద్‌
‘ఉన్న పెద్ద నోట్లు బ్యాంకులో డిపాజిట్‌ చేశా.. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేదు.. బ్యాంకుకు వెళితే డబ్బులు లేవంటున్నారు.. నిత్యావసరాలకు కూడా సొమ్ము లేదు.. ఏం చేయాలో అర్థం కావడం లేదు..’.. ప్రస్తుతం ఎక్కడ, ఎవరి నోట విన్నా ఇదే మాట. పాత నోట్లు చెల్లవనడంతో జనమంతా చేతిలో ఉన్న డబ్బును బ్యాంకుల్లో జమ చేశారు. ఇప్పుడు డ్రా చేసుకుందామనుకుంటే బ్యాంకులన్నీ ఖాళీ. రాజధాని హైదరాబాద్‌ నుంచి గ్రామీణ ప్రాంతాల దాకా ఇదే పరిస్థితి. అన్ని చోట్లా వాణిజ్య బ్యాంకులు ‘నో క్యాష్‌’ బోర్డులు తగిలిస్తున్నాయి. రోజూ మధ్యాహ్నం నుంచే కార్యకలాపాలు నిలిపివేస్తున్నాయి. రద్దయిన పెద్ద నోట్లను మాత్రం జమ చేసుకుంటున్నాయి. ఎవరైనా నగదు కోసం వస్తే వారి పేరు, ఫోన్‌ నంబర్‌ రిజిస్టర్‌లో రాసి వెళ్లాలని, నగదు రాగానే ఫోన్‌ చేస్తామంటూ బ్యాంకుల సిబ్బంది తిప్పిపంపుతున్నారు.

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనం
అత్యవసరంగా నగదు కోసం బ్యాంకులకు వెళుతున్న కొందరు నగదు లేదంటుండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలైతే ఆవేదనతో శాపనార్థాలు పెడుతున్నారు. జ్వరం వచ్చిన పిల్లాడిని డాక్టర్‌ దగ్గరకు తీసుకువెళ్లడానికి కూడా డబ్బులు లేవంటూ సోమవారం బంజారాహిల్స్‌ యాక్సిస్‌ బ్యాంకుకు వచ్చిన ఇందిరాదేవి అనే గృహిణి కంటతడి పెట్టారు. ‘‘ఇలాంటి పరిస్థితి నా పాతికేళ్ల సర్వీసులో ఎప్పుడూ చూడలేదు. అత్యవసరంగా నగదు కోసం వచ్చేవారిని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. కానీ మేమేం చేయగలం..’’ అని ఎస్‌బీఐ సీనియర్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వివాహం జరుగనున్న కుటుంబాలకు రూ.2.5 లక్షలు, ఇతర ఖాతాదారులకు వారానికి రూ.24 వేలు ఇవ్వాలన్న నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. కొన్ని బ్యాంకులు మాత్రం పెళ్లి కార్డులు పట్టుకుని వచ్చేవారికి అతికష్టం మీద రూ.లక్ష వరకు ఇవ్వగలుగుతున్నాయి. ఇక మరో చిత్రమైన పరిస్థితి ఏమిటంటే రిజర్వుబ్యాంకు నలిగిపోయి చిరిగిపోవడానికి సిద్ధంగా ఉన్న రూ.100 నోట్లను కూడా బ్యాంకులకు సరఫరా చేస్తోంది. అత్యవసరంగా కావాలని వెళ్లిన వారికి ఈ నోట్లు ఇస్తున్నారు. బయట ఆ నోట్లు చెల్లుబాటు కావడం లేదు.

మామూలు రోజులకంటే తగ్గిన పంపిణీ
రి
జర్వుబ్యాంకు మామూలు రోజుల్లోనే ఒక్క హైదరాబాద్‌ నగరంలోని బ్యాంకులకు తన నగదు కేంద్రాల నుంచి రూ.2,500 కోట్ల విలువైన నోట్లను సరఫరా చేస్తుంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు పంపేది మరో రూ.1,700 కోట్లు. కానీ గత పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేసిన మొత్తం రూ.1,200 కోట్లు మాత్రమే. ఇందులోనూ వెయ్యి కోట్ల రూపాయలు రూ.2 వేల నోట్లుకాగా.. వంద రూపాయల నోట్లు రూ.200 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. రిజర్వుబ్యాంకు అధికార వర్గాల సమాచారం ప్రకారం... హైదరాబాద్, సికింద్రాబాద్‌లతో పాటు రంగారెడ్డి జిల్లా పరిధిని కూడా కలుపుకొంటే బ్యాంకులు, ఏటీఎంల ద్వారా నిత్యం రూ.12 వేల కోట్ల కార్యకలాపాలు జరిగేవి. కానీ గత పది రోజుల్లో మొత్తంగా కూడా జరిగిన లావాదేవీలు సుమారు రూ.1,750 కోట్లు మాత్రమే. ఇక కొత్త నోట్లు పెట్టేందుకు వీలుగా దేశవ్యాప్తంగా 40 శాతం ఏటీఎంలను సరిచేయడం పూర్తయిందని కేంద్రం చెబుతోంది. కానీ హైదరాబాద్‌లో 15 శాతం ఏటీఎంలు కూడా పనిచేయడం లేదు. ఏటీఎంల కార్యకలాపాలను పర్యవేక్షించే ఓ అధికారి చెప్పిన ప్రకారం.. హైదరాబాద్‌లోని 78 శాతం ఏటీఎంలలో నగదు లేదు. ఈ నెల 9వ తేదీ నుంచి పనిచేయని ఏటీఎంలు 71 శాతం దాకా ఉన్నాయి. అయితే మరో పది రోజుల్లో 75 శాతం ఏటీఎంల సాఫ్ట్‌వేర్‌ అప్‌డేషన్‌ పూర్తవుతుందని ఆ అధికారి చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల్లో మరీ దారుణం
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాణిజ్య బ్యాంకులకు గత వారం రోజులుగా నగదు పంపిణీ కావడం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అన్ని రకాల వ్యాపారాలు మూతపడ్డాయని తెలంగాణ లీడ్‌ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ హైదరాబాద్‌ (ఎస్‌బీహెచ్‌) రిజర్వుబ్యాంకుకు నివేదించింది. గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతం వ్యాపారాలు బ్యాంకింగ్‌ లావాదేవీలతో నిమిత్తం లేకుండా జరుగుతాయని.. నోట్ల రద్దుతో నగదు చలామణీలో లేకపోవడం వల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కూడా రిజర్వుబ్యాంకు దృష్టికి తెచ్చింది. ఇక నగదు లేని కారణంగా ఉపాధి హామీ పనులు దాదాపు అన్ని చోట్లా నిలిచిపోయాయి. గృహ, భవన నిర్మాణాలు ఆగిపోయాయి. ప్రాజెక్టులు, రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో కూలీలకు పనిలేకుండా పోయింది. ప్రాజెక్టుల నిర్మాణాలూ నిలిచిపోయాయి. ‘మేం రోజూ రూ.10 కోట్ల మేర నగదును కూలీలకు పంపిణీ చేస్తాం. కానీ బ్యాంకు నుంచి నగదు లభించకపోవడంతో.. మూడు రోజులుగా పనులన్నీ నిలిపివేశాం..’’ అని నిర్మాణ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

నగదు లేక పడిపోయిన అమ్మకాలు
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నగదు అందుబాటులో లేని కారణంగా అన్ని రకాల ఉత్పత్తుల అమ్మకాలు పడిపోయాయి. కాయగూరలకు ధరలు లేక రైతులు తమ గ్రామాల్లో ఉచితంగా పంచిపెడుతున్నారు. పట్టణాలకు కాయగూరల సరఫరా ఆగిపోయింది. వచ్చిన కాయగూరలను కూడా కొనుగోలు చేసేవారు కరువయ్యారు. గ్రామీణ ప్రాంతాల నుంచి సైకిళ్ల మీద తెచ్చి విక్రయించేవారు అరువుపై ఇస్తున్నారు. మండల కేంద్రాల్లో వ్యాపారం లేక అన్ని రకాల దుకాణాలూ మూతపడ్డాయి. జనం ప్రయాణాలు రద్దు చేసుకోవడంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ బాగా పడిపోయింది. ఆటోలు నడపుకొని జీవించే వారికి ఉపాధి దెబ్బతిన్నది. చిన్న చిన్న శుభకార్యాలకు వెళుతున్న వారు కూడా చిల్లర లేక రూ.500, రూ.1,000 పాత నోట్లనే బహుమతులుగా ఇస్తున్నారు.

మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి
నగదు కొరత సమస్య మరో నాలుగైదు రోజులపాటు తప్పదని రిజర్వుబ్యాంకు తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో బ్యాంకులు డోలాయమానంలో పడ్డాయి. రూ.10, 20, 50, 100 నోట్లు తెచ్చి బ్యాంకులో జమ చేయాలంటూ వ్యాపారం చేసే తమ ఖాతాదారులను కోరుతున్నాయి. అవసరమైతే కొంత మొత్తంలో కమీషన్‌ ఇస్తామని కూడా కొన్ని బ్యాంకులు చెబుతున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్‌ బంకులకు చిల్లర నోట్లు వస్తున్నా వాటి సిబ్బంది కమీషన్‌ ప్రాతిపదికన అమ్ముకుంటున్నారు.

హైదరాబాద్‌కు కొత్త రూ.500 నోటు రాలేదేం?
కొత్త రూ.500 నోట్లు దేశవ్యాప్తంగా విడుదలైనా... హైదరాబాద్‌ బ్యాంకులకు మాత్రం ఇంకా రాలేదు. చిల్లర కొరతకు ఇదే ప్రధాన కారణమని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నా.. రేపు, మాపు అంటూ రిజర్వుబ్యాంకు సాగదీస్తూనే ఉంది. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కూడా రూ.500 నోట్లు సరఫరా చేసినా.. తెలంగాణకు అందకపోవడంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వు బ్యాంకు కావాలనే పంపడం లేదని బ్యాంకర్లు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement