న్యూఢిల్లీ: కరెన్సీ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని పలు ఏటీఎంలలో నగదు కొరత కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, బిహార్, త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటక తదితర రాష్ట్రాల్లోని పలు ఏటీఎంలు పనిచేయకపోవడమో లేదా నో క్యాష్ బోర్డులు వేలాడదీసో దర్శనమిస్తూ పెద్ద నోట్ల రద్దు సమయంలో పరిస్థితులను గుర్తుకు తెస్తున్నాయి. దేశరాజధాని న్యూఢిల్లీలో కూడా బుధవారం కొన్ని ఏటీఎంలలో అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు దర్శనమిచ్చాయి. మరోవైపు, కరెన్సీ సమస్యలను వేగవంతంగా పరిష్కరిస్తున్నామని, దేశవ్యాప్తంగా ఉన్న 2.2 లక్షల ఏటీఎంలలో దాదాపు 80 శాతం ఏటీఎంలు మళ్లీ సాధారణంగా పనిచేస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతకు ముందు ఇది అరవై శాతమే ఉంది. రానున్న ఎన్నికలు, పంటల కొనుగోళ్ల కోసం చెల్లింపులు మొదలైన వాటి కారణంగా నగదుకు అసాధారణ డిమాండ్ నెలకొన్నట్లు అధికారులు వివరించారు. బ్యాంకులు వేగంగా ఏటీఎంలలో నగదు భర్తీ చేస్తుండగా, నాలుగు ప్రింటింగ్ ప్రెస్‌లు నిరంతరాయంగా చిన్న నోట్ల ముద్రణ కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. అటు ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఏటీఎంలను రూ. 500 నోట్లతో భర్తీ చేయాలని సూచించారు. అలాగే, శాఖలన్నింటికీ నగదు సరఫరాను మరింతగా పెంచాలని, 80 శాతం పైగా ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రాల వారీగా డిమాండ్ తీరుతెన్నులను కేంద్రం విశ్లేషిస్తోంది.
వారాంతంలోగా సాధారణ పరిస్థితి..: 24 గంటల వ్యవధిలో తమ ఏటీఎంలలో నగదు లభ్యతను మరింతగా పెంచినట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. క్రితంరోజున 85% ఏటీఎంలు పనిచేస్తుండగా.. బుధవారం 92% ఏటీఎంలు అందుబాటులో ఉన్నట్లు వివరించింది. వారాంతం లోగా సాధారణ పరిస్థితి నెలకొనవచ్చని అంచనాలు ఉన్నాయి. నగదు కొరత కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనట్లు కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ తెలిపాయి. తమ 9,679 ఏటీఎంలలో 90% ఏటీఎంలలో సాధారణంగానే నగదు లభ్యత ఉంటుందని, ఇప్పుడూ అదే పరిస్థితి కొనసాగుతోందని పీఎన్‌బీ ప్రతినిధి తెలిపారు.
నగదు కొరత 70వేల కోట్లు: ఎస్‌బీఐ రీసెర్చ్
ముంబై: ఇటు ప్రభుత్వం, అటు రిజర్వ్ బ్యాంక్.. కరెన్సీ కొరతేమీ లేదంటున్నప్పటికీ.. ఏకంగా రూ. 70,000 కోట్ల మేర కొరత ఉండొచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. ఏటీఎంల నుంచి నెలవారీగా జరిగే విత్‌డ్రాయల్స్‌లో ఇది మూడో వంతు కావడం గమనార్హం. ఆర్థిక వృద్ధి, ప్రజల వద్ద ఉన్న కరెన్సీ, పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలు మొదలైన వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఎస్‌బీఐ రీసెర్చ్ నగదు కొరత గణాంకాలను అంచనా వేసింది. నామినల్ జీడీపీ వృద్ధి 9.8% స్థాయిలో ఉన్న పక్షంలో మార్చి ఆఖరుకి ప్రజల వద్ద రూ. 19.4 లక్షల కోట్లు ఉండాలని, అయితే రూ. 17.5 లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయని ఎస్‌బీఐ రీసెర్చ్ పేర్కొంది. అలాగని ఈ రూ. 1.9 లక్షల కోట్ల మొత్తాన్ని లోటుగా చూడటానికి లేదని, ఇందులో రూ. 1.2 లక్షల కోట్ల మొత్తం డిజిటల్ లావాదేవీలది ఉం టుందని తెలిపింది. ఆ రకంగా చూస్తే మొత్తం మీద సుమారు రూ. 70,000 కోట్లు మేర లోటు ఉండొచ్చని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం ఏటీఎంల నుంచి డెబిట్ కార్డుల ద్వారా రూ. 15.29 లక్షల కోట్లు నగదు విత్‌డ్రాయల్ లావాదేవీలు జరిగాయని, అంతక్రితం ఆరు నెలలతో పోలిస్తి ఇది 12.2% అధికమని వివరించింది.
కొరతతో వాటికి మేలు!!
ప్రస్తుత కరెన్సీ కొరత వల్ల తమకు ప్రయోజనం కలిగిందంటున్నాయి మొబైల్ వాలెట్ సంస్థలు. పేటీఎం, మొబిక్విక్, ఫోన్‌పే వంటి సంస్థలు వాటి ప్లాట్‌ఫామ్‌లలో డిజిటల్ లావాదేవీలు పెరిగాయని పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పట్టణాల నుంచి గతనెలతో పోలిస్తే లావాదేవీలు 30 శాతం పెరిగాయని పేటీఎం బ్రాండ్ కలిగిన వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. మొబిక్విక్ సహవ్యవస్థాపకురాలు, డైరెక్టర్ ఉపాసన టకు మాట్లాడుతూ.. తాజా నగదు కొరత వల్ల చాలా మంది మొబైల్ వాలెట్లను వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ‘గత కొన్ని రోజులుగా మా ప్లాట్‌పామ్‌లో డిజిటల్ పేమెంట్స్, క్యూఆర్ ఆధారిత చెల్లింపులలో 27 శాతం వృద్ధి నమోదయ్యింది’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment