‘ఉన్న పెద్ద నోట్లు బ్యాంకులో డిపాజిట్ చేశా.. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేదు.. బ్యాంకుకు వెళితే డబ్బులు లేవంటున్నారు.. నిత్యావసరాలకు కూడా సొమ్ము లేదు.. ఏం చేయాలో అర్థం కావడం లేదు..’.. ప్రస్తుతం ఎక్కడ, ఎవరి నోట విన్నా ఇదే మాట. పాత నోట్లు చెల్లవనడంతో జనమంతా చేతిలో ఉన్న డబ్బును బ్యాంకుల్లో జమ చేశారు. ఇప్పుడు డ్రా చేసుకుందామనుకుంటే బ్యాంకులన్నీ ఖాళీ. రాజధాని హైదరాబాద్ నుంచి గ్రామీణ ప్రాంతాల దాకా ఇదే పరిస్థితి. అన్ని చోట్లా వాణిజ్య బ్యాంకులు ‘నో క్యాష్’ బోర్డులు తగిలిస్తున్నాయి. రోజూ మధ్యాహ్నం నుంచే కార్యకలాపాలు నిలిపివేస్తున్నాయి. రద్దయిన పెద్ద నోట్లను మాత్రం జమ చేసుకుంటున్నాయి. ఎవరైనా నగదు కోసం వస్తే వారి పేరు, ఫోన్ నంబర్ రిజిస్టర్‌లో రాసి వెళ్లాలని, నగదు రాగానే ఫోన్ చేస్తామంటూ బ్యాంకుల సిబ్బంది తిప్పిపంపుతున్నారు.