
ఏటీఎంల వద్ద ఆందోళన చేస్తే చర్యలు: సవాంగ్
విజయవాడ: బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద రాజకీయపక్షాలు ఆందోళన చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. నగరంలోని ఏటీఎం కేంద్రాల వద్ద పరిస్థితులను పరిశీలించిన ఆయన ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చూసేందుకు ముందుగానే హెచ్చరికలు జారీచేశారు. పెద్దనోట్ల రద్దుతో సామాన్యులకే కాదు వ్యాపారులకు సమస్యలు తలెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులే విజయవాడ ఏటీఎం సెంటర్ల వద్ద దర్శనమిస్తున్నాయి.
నగరంలోని అన్ని ఏటీఎం సెంటర్ల వద్ద పెద్ద సంఖ్యలో జనం బారులు తీరారు. దాదాపు చాలా ఏటీఎం కేంద్రాల్లో నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. రూ.30 లక్షలకు మించి నగదును ఏటీఎం కేంద్రాల్లో ఉంచలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. రూ.2వేలకు మించి నగదు డ్రా చేసుకునే అవకాశం ఉన్నా.. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయకపోవడంతో ఏటీఎం మెషీన్ నుంచి డబ్బు రావడం లేదని పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు ఆందోళన చేస్తే చర్యలు తీసుకునేందుకు సిద్ధమని నగర సీపీ తెలిపారు.