cp gautam sawang
-
యూజ్ యువర్ హెల్మెట్
విజయవాడ: రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని నగరంలో 4వ తరగతి చదువుతున్న ఓ బాలుడు ప్రచార కార్యక్రమం చేపట్టారు. కృష్ణలంకకు చెందిన జయ చంద్రప్రసాద్ అనే బాలుడు రెండు వారాలుగా చిన్న సైకిల్‌తో హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రద్దీ ఉండే ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఆ బాలుడు కమిషనరేట్‌లో సీపీ డి.గౌతం సవాంగ్‌ను కలిశాడు. ప్రతి రోజు తాను స్కూల్ నుంచి వచ్చిన తరువాత యూజ్ యువర్ హెల్మెట్ అనే బోర్డుతో హెల్మెట్ పెట్టుకుని ప్రచారం చేస్తున్నట్లు సీపీకి వివరించాడు. ఈ సందర్భంగా సీపీ బాలుడిని అభినందించారు. ఈ బాలుడి కార్యక్రమం స్ఫూర్తిగా అందరూ హెల్మెట్ ధరించాలని కోరారు. -
ఈ ముఠాకు సంబంధాలు ఉన్నాయా..
విజయవాడ: నగరంలో బీసెంట్ రోడ్లో జరిగిన దోపిడీ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. మహారాష్ట్రకు చెందిన గ్యాంగ్ ఈ దోపిడీకి పాల్పడినట్లు నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనలో పాల్గొన్న ముగ్గురు నిందితులను గుర్తించాం. వర్షం కారణంగా సీసీ కెమెరాలో నిందితుల ముఖాలు స్పష్టంగా కనపడటం లేదు. దోపిడీకి సంబంధించిన కీలక ఆధారాలు సేకరించాం. నిందితులను పట్టుకునేందుకు నాలుగు రాష్ట్రాలకు ప్రత్యేక పోలీస్ బృందాలను పంపామని ఆయన తెలిపారు. వీలైనంత త్వరలో వారిని పట్టుకుంటాం. కార్ఖానా గురించి పూర్తిగా తెలిసిన వారే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని ఆయన అన్నారు. వైజాగ్, కర్నూల్ లో జరిగిన దోపిడీకి ఈ ముఠాకు సంబంధాలు ఉన్నాయా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఏటీఎంల వద్ద ఆందోళన చేస్తే చర్యలు: సవాంగ్
విజయవాడ: బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద రాజకీయపక్షాలు ఆందోళన చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. నగరంలోని ఏటీఎం కేంద్రాల వద్ద పరిస్థితులను పరిశీలించిన ఆయన ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చూసేందుకు ముందుగానే హెచ్చరికలు జారీచేశారు. పెద్దనోట్ల రద్దుతో సామాన్యులకే కాదు వ్యాపారులకు సమస్యలు తలెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులే విజయవాడ ఏటీఎం సెంటర్ల వద్ద దర్శనమిస్తున్నాయి. నగరంలోని అన్ని ఏటీఎం సెంటర్ల వద్ద పెద్ద సంఖ్యలో జనం బారులు తీరారు. దాదాపు చాలా ఏటీఎం కేంద్రాల్లో నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. రూ.30 లక్షలకు మించి నగదును ఏటీఎం కేంద్రాల్లో ఉంచలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. రూ.2వేలకు మించి నగదు డ్రా చేసుకునే అవకాశం ఉన్నా.. సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోవడంతో ఏటీఎం మెషీన్ నుంచి డబ్బు రావడం లేదని పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు ఆందోళన చేస్తే చర్యలు తీసుకునేందుకు సిద్ధమని నగర సీపీ తెలిపారు. -
‘మదర్’కు పునీత పట్టం ఆనందదాయకం
విజయవాడ (మొగల్రాజపురం) : మదర్ థెరిస్సాకు పునీత పట్టం (సెయింట్ హుడ్) అందజేయడం చాలా సంతోషించదగిన విషయమని నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఆదివారం ఉదయం సిద్ధార్థ కళాశాల సమీపంలోని మదర్ థెరిస్సా విగ్రహానికి ఆయన పూలమాలవేసి అంజలిఘటించారు. మదర్‌థెరిస్సాకు వాటికన్ సిటీలో లక్షలాది మంది మధ్య పోప్ ఫ్రాన్సస్ సెయింట్ హుడ్ (పునీత పట్టం) అందజేస్తున్న సందర్భంగా నగరంలోని సీఆర్ఐ, విజయవాడ కేథటిక్ డయోసిస్, మిషనరీ ఆఫ్ చారిటీ సిస్టర్స్ సంయుక్త ఆధ్వర్యంలో పటమట సైంట్ పాల్స్ కథెడ్రల్ చర్చి నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు మీదుగా సిద్ధార్థ కళాశాల సమీపంలో ఉన్న మదర్‌థెరిస్సా విగ్రహం వరకు సాగింది. అక్కడ జరిగిన కార్యక్రమంలో గౌతమ్ సవాంగ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుష్టు రోగులు, దీనులు, అనాథలను అక్కున చేర్చుకొన్న మహిమాన్వితురాలు మదర్ థెరిస్సా అని కొనియాడారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా అందరితో అమ్మ అని అప్యాయంగా పిలిపించుకున్న మహోన్నత వ్యక్తి మదర్థెరిస్సాని పేర్కొన్నారు. లయోలా కళాశాల సీనియర్ ఫ్యాకల్టీ ఫాదర్ రవిశేఖర్ మాట్లాడుతూ 1977లో సంభవించిన దివిసీమ ఉప్పెనలో మృతి చెందిన వారి శరీరాలకు మదర్‌థెరిస్సా స్వయంగా దహన సంస్కారాలను నిర్వహించిన గొప్ప మానవతావాది అని కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ కన్వీనర్, మూడో డివిజన్ కార్పొరేటర్ బొప్పన భవకుమార్, ఆంధ్రా లయోలా కళాశాల డైరెక్టర్ రెక్స్ ఎంజిలో, గుణదల మాత పుణ్యక్షేత్రం ఫాదర్స్ మువ్వల ప్రసాద్, జోబిబాబు, మరియదాస్, సిస్టర్ రోజా, డయోసిస్ గురువులు, సిస్టర్స్, మదర్‌థెరిస్సా అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జయహో.. మదర్ థెరిస్సా జయహో మదర్‌థెరిస్సా అనే నినాదంతో సిద్ధార్థ కళాశాల సమీపంలోని మదర్‌థెరిస్సా విగ్రహం పరిసర ప్రాంతాలు హోరెత్తాయి. వాటికన్ సిటీలో విశ్వమాత మదర్‌థెరిస్సాకు పునీత పట్టం అందజేస్తున్న సందర్భంగా నగరంలో ‘అమ్మ’ అభిమానులు ఆమె ఫొటోలు చేతపట్టుకుని లబ్బీపేట, పెజ్జోనిపేట, పటమట ప్రాంతాల నుంచి బైక్ ర్యాలీ ద్వారా కొందరు, పాదయాత్రగా ఇంకొందరు సిద్ధార్థ కళాశాల సమీపంలో ఉన్న మదర్‌థెరిస్సా విగ్రహం వద్దకు చేరుకున్నారు. అమ్మపై అభిమానాన్ని చాటుకున్నారు. తెల్ల జెండాలతో అధిక సంఖ్యలో సిస్టర్స్ పాదయాత్రలో పాల్గొన్నారు. -
సవాంగ్ సెలవు రద్దు