నగరంపాలెం ఏటీఎం వద్ద నగదు కోసం వేచి ఉన్న ప్రజలు
ఫొటోలో చంటి బిడ్డతో ఉన్న ఆమె పేరు అరుణ. నెల మొదటి వారం కావడంతో ఇంటిలో సరకులు నిండుకున్నాయి. చేతిలో డబ్బులు లేవు. ఏటీఏంలో తీసుకొని సరుకులు తీసుకెళ్లాలని కోడలు, చంటి బిడ్డను వెంటబెట్టుకుని బజారులోకి వచ్చారు. ఎక్కడ చూసినా ఏటీఏంలలో డబ్బు రాలేదు. చివరకు నగరం పాలెం ఎస్‌బీఐ బ్రాంచి వద్ద తప్పకుండా డబ్బు ఉంటుందని వచ్చారు. అక్కడా నిరాశ ఎదురైంది. ఆమె మధ్యాహ్నం 12గంట నుంచి 1 గంట వరకు అక్కడే వేచి ఉన్నారు. బ్యాంకు అధికారులు ఏటీఎంలో డబ్బు పెడితే తీసుకెళ్లాలని చంటి పిల్లతో నిరీక్షించక తప్పలేదు.
సాక్షి, అమరావతి బ్యూరో: జిల్లాలో నగదు కష్టాలు ప్రజల్ని వెంటాడుతూనే ఉన్నాయి. తాము కష్టపడి, సంపాదించుకొన్న సొమ్మును తీసుకోవటానికి కూడా నిబంధనలు ఏమిటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర నిమిత్తం పెద్ద మొత్తంలో డబ్బులు తీయాలంటే, బ్యాంకుల్లో సైతం నగదు నిల్వలు ఉండక ఖాతాదారులు అల్లాడిపోతున్నారు. జిల్లాలో మొత్తం 824 బ్యాంకుల బ్రాంచీలు, 870కి పైగా ఏటీఏంలు ఉన్నాయి. ఇందులో 70 శాతం పైగా పనిచేయడం లేదు. ప్రధాన బ్యాంకులకు సంబంధించిన ఏటీఎంలలో సైతం డబ్బులు పెట్టక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో 30 శాతం పైగా ఏటీఎంలు శాశ్వతంగా మూతపడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో పెద్దమొత్తంలో నగదు డ్రా చేసేందు ఖాతాదారులు వెళితే, డబ్బులు లేక నాలుగు రోజుల పాటు వాయిదాల పరిస్థితిలో ఇచ్చే దుస్థితి నెలకొంది. ప్రధానంగా క్యాష్ సర్క్యులేషన్ లేకపోవటంతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని బ్యాంకు వర్గాలు పేర్కొంటున్నాయి.
ఫిక్స్‌డ్ డిపాజిట్లు విత్ డ్రా
ప్రధానంగా ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశ పెడతారనే సమాచారం లీకు కావడంతో ఖాతాదారులు ఫిక్స్‌డ్ డిపాజిట్లను తీసేసుకుంటున్నారు. బ్యాంకులు, ఏటీఎంలనుంచి తీసుకొన్న నగదును, తిరిగి బ్యాంకులో వేయకుండా ఎలాంటి పరిస్థితులు వస్తాయోననే ఉద్దేశంతో తమ వద్దే ఉంచుకొంటున్నారు. ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు ఊహాగానాలు రాక ముందు అంటే 2017, అక్టోబరు నాటికి జిల్లాలోని బ్యాంకుల్లో రూ. 25,325 కోట్ల డిపాజిట్లు ఉండేవి. ప్రతి ఏడాది 15–17 శాతం పెరిగేవి. అయితే, అందులో అనూహ్యంగా ఖాతాదారులు ఇప్పటికే 10 శాతం మేర డిపాజిట్లు తీసుకున్నారు. దీంతో వాటి వృద్ధి రేటు తగ్గిపోయింది. ప్రధానంగా జిల్లాలో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే అప్పులు ఎక్కువగా ఉండటం గమనార్హం. జిల్లాలో బ్యాంకుల్లో రూ3,382.28 కోట్ల మేర అప్పులు ఉన్నట్లు తెలిసింది. గతంలో ఎన్‌పీఏ(నిరర్థక ఆస్తులు) 1నుంచి2 శాతం మాత్రమే ఉండేవి. ప్రస్తుతం వాటి విలువ 13–14 శాతం పెరగటంతో బ్యాంకులు తీవ్ర సంక్షోభంలో కురుకొని పోయాయి. మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్టు ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు వస్తుందనే సమాచారం బ్యాంకుల్ని మరింత కష్టాలోకి నెట్టింది. ఈ బిల్లు రాక మునుపు బ్యాంకులు దివాలా తీసినా లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ ఉండేది. ప్రస్తుతం ఈ బిల్లు అచరణ రూపం దాల్చితే రూ. 10 లక్షల మేర ఇన్సూరెన్స్ ఉంటుంది. బ్యాంకులకు సంబంధించి అప్పులు పెరిగిపోయినప్పుడు, ఈ బిల్లు ద్వారా బ్యాంకుల వద్ద ఉన్న డిపాజిట్లను తీసుకొని అప్పులు చెల్లించే వెసులు బాటు ఉంది.
రిజర్వ్ బ్యాంకులకు రాని నగదు
జిల్లాలో పెద్ద నోట్ల రద్దు సమయంలో దాదాపు రూ.13వేల కోట్లకు పైగా పెద్ద నోట్లలను జిల్లానుంచి రిజర్వ్ బ్యాంకుకు పంపారు. రిజర్వ్ బాంకు దశల వారీగా 2017 ఏప్రియల్ 18 వరకు మరలా నగదును పంపింది. అప్పటి నుంచి నగదు సరఫరా చేయకుండా నిలిపివేసింది. మీ డబ్బు మీకు ఇచ్చాం..., సర్దుకోండి అని రిజర్వ్ బ్యాంకు వర్గాలనుంచి సమాచారం వచ్చినట్లు తెలిసింది. ప్రధానంగా బ్యాంకుల నుంచి డబ్బు ఎక్కువగా డ్రా చేయడం, జమ చేయడం తక్కువగా ఉండటంతో ఇబ్బందులు తలెత్తున్నాయి. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఏం, బ్యాంకుల వద్ద డబ్బులు లేక జనాలు అల్లాడిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment