ఆ వ్యక్తి మహా నటుడని తేలింది.. | Police catch the ATM Thief in Guntur district | Sakshi
Sakshi News home page

ఆ వ్యక్తి మహా నటుడని తేలింది..

Published Wed, Oct 11 2017 8:36 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Police catch the ATM Thief in Guntur district - Sakshi

సాక్షి, గుంటూరు: ఏటీఎంకు వెళ్తున్నారా తస్మాత్‌ జాగ్రత్త. ఎప్పుడూ వెళ్ళే ఏటీఎమ్మే కదా అంతగా భయపడుతున్నారేమిటా అని అనుకుంటున్నారా ఇందులో ఒకింత అతిశయోక్తి లేదు. ఏటీఎం, ఆన్‌లైన్‌ మోసాలు వరుసగా జరుగుతున్న కథనాలు రోజూ మీడియా ద్వారా తెలుసుకుంటున్నా.. కేటుగాళ్ళ మాయమాటలకు, నటనలకు ఏదో ఒక చోట ఎవరో ఒకరు మోసపోయి వారి వలలో పడుతున్నారు. గుంటూరులో పోలీసులకు దొరికినా నిందితుడు మహానటుడని తేలింది.

మాయగాళ్ళు చదువులేని వాళ్లనే కాదు, విద్యావంతులని, ఉద్యోగులను సైతం తెలివితేటలతో బురిడి కొట్టించి వారి అకౌంట్‌లోని లక్షలాది రూపాయలు కాజేస్తున్నారు. ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లినప్పుడు దోచుకోవడం కాదు.. మీతో మాట్లాడుతూనే అకౌంట్‌లో లక్షలు కాజేయటం ఈ కేటుగాళ్ల స్పెషాలిటీ.

గుంటూరులో ఓ విశ్రాంత ఉపాధ్యాయుడి వృద్ధాప్య సమస్యను కాష్‌ చేసుకున్నాడు ఓ ఏటీఎం దొంగ. కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. అయితే  ఈ ఒక్క కేసులోనేకాక అనేక జిల్లాల్లో ఇటువంటి ఘరానా మోసాలకు నిందితుడు తెగబడ్డాడని తెలుసుకున్న పోలీసులే అవాక్కయ్యారు. అన్నిచోట్లా సవాలు విసిరి దొరక్కుండా తిరిగిన ఈ  ఘరాన మోసగాడు గుంటూరులోనే పోలీసులకు చిక్కాడు

కార్డు కాజేయడమే కాదు డ్రా చేయడంలోను..
బ్రాడీపేటకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు క్షత్రి రఘునాథ్‌ సింగ్‌ మే 27న వాచ్‌ రిపేరు కోసం జిన్నా టవర్‌ సెంటర్‌కు వచ్చాడు. స్పేర్‌ పార్ట్‌లు లేవని తెలిసి ఇంటికి వెళ్లే క్రమంలో చందన బ్రదర్స్‌ వద్ద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంకు వెళ్లాడు. అకౌంట్‌లో బ్యాలెన్స్‌ పరిశీలించే క్రమంలో కొంత తడబడ్డాడు. ఇది గమనించిన ఓ 30 ఏళ్ల వ్యక్తి సార్‌.. మీరు పెద్దవారు. మీకు నేను సహాయం చేస్తాను.. అంటూ కార్డు తీసుకుని పిన్‌ నెంబర్‌ అడిగి తెలుసుకుని బ్యాలెన్స్‌ చెక్‌ చేసి తిరిగి కార్డు ఇచ్చేశాడు. ఇంటికి చేరిన రఘునాథ్‌ సింగ్‌ మరుసటి రోజు అకౌంట్‌లో రూ.2 లక్షలు డ్రా చేసినట్లు సెల్‌లో అనేక మెసేజ్‌లు చూసి కంగుతిన్నాడు. దీంతో కుటుంబసభ్యులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి లాలాపేట ఎస్‌హెచ్‌వో తిరుమలరావుకు కేసు విచారణ బాధ్యత అప్పగించారు.

సీసీ కెమెరా ఫుటేజీల పరిశీలన..
దీంతో పోలీసులు ఏటీఎం సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. అనంతరం డ్రా చేసిన వివరాలనుబట్టీ నగరంపాలెం ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్‌ ఏటీఎం సీసీ కెమెరా ఫుటేజీలను కూడా పరిశీలించారు. అయితే నిందితుడు కార్డుని ఒక్కసారే ఉపయోగించాడు. పరిమితికి మించి డబ్బు డ్రా చేయడం ఎలా సాధ్యమా అని పోలీసులే తల పట్టుకోవాల్సి వచ్చింది. లోతుగా విచారించగా డబ్బులు ఇతరుల అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడు మహా నటుడని తేలింది.

బాధితుడి చేతికి నకిలీ కార్డు..
రఘునాథ్‌ సింగ్‌ ఏటీఎం కార్డు కాజేసిన నిందితుడు అతని దగ్గరున్న ఓ నకిలీ ఏటీఎం కార్డుని బాధితుడి చేతిలో పెట్టాడు. నగరంపాలెం ఏటీఎంకు వెళ్లి మొదట రూ.40 వేలు డ్రా చేశాడు. ఏటీఎం క్యూ లైనులో ఉన్న వ్యక్తిని సంప్రదించి తన సమీప బంధువు ఆసుపత్రిలో ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాడని, డబ్బు అత్యవరసమైందని చెప్పి నమ్మించాడు. రఘునాథ్‌ సింగ్‌ అకౌంట్‌లోని డబ్బును ఆ వ్యక్తి అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ చేసి అతని ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు డ్రా చేశాడు.

క్యూ లైన్‌లోని మరో ఇద్దరిని కూడా ఇలాగే మోసం చేశాడు. అయితే వీరిలో ఒక వ్యక్తి ఎందుకైనా మంచిదని నిందితుడి సెల్‌ ఫోన్‌ నెంబర్‌ తీసుకుని డయిల్‌ చేసిన తర్వాత డబ్బులు డ్రా చేసి ఇచ్చాడు.  ఈ ఆధారంగానే పోలీసులు నిందితుడి ఫోన్‌ కాల్‌ డీటెల్స్‌ తీసి అడ్రసును కనుగొన్నారు. కేటుగాడిని ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం వేములపాడు గ్రామానికి చెందిన ముప్పరాజు సురేంద్రగా గుర్తించారు. అక్కడి పోలీసుల సహాయంతో నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

డొంక కదిలింది ఇలా..
సురేంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా తిరుపతి, నెల్లూరు, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, చిలకలూరిపేట, నరసరావుపేట, ఏలూరు, భీమవరం, గుంటూరులలో వరుసగా 14 ఏటీఎంలలో మోసాలకు పాల్పడి డబ్బులు కాజేసినట్లు నిర్థారించారు. అన్నిచోట్లా అమాయకంగా నటిస్తూ సందర్భానికి తగ్గట్లుగా మాట్లాడుతూ ఉద్యోగులు, విద్యావంతులు, మహిళలు, అమాయకులను మోసం చేసినట్లుగా తేలింది. పోలీసులు సురేంద్రను అరెస్టు చేసి రూ.1,45,000 నగదు, బంగారు ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడా చిక్కకుండా వరుస మోసాలకు తెగబడుతున్న నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన అప్పటి ఈస్ట్‌ డీఎస్పీ సంతోష్‌కుమార్‌, లాలాపేట ఎస్‌హెచ్‌వో తిరుమలరావు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement