సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ ఏ.శ్రీనివాసరావు, సీఐ అశోక్‌కుమార్
బాపట్ల(గుంటూరు జిల్లా): పట్టణంలో కొద్ది రోజుల కిందట సంచలనం సృష్టించిన చోరీ కేసును పట్టణ పోలీసులు ఛేదించారు. నిందితురాలి నుంచి రూ.15.37లక్షలతో పాటు 6.83లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాదీనం చేసుకున్నారు. అత్యంత చాకచక్యంతో కేసును ఛేదించిన సీఐ అశోక్‌కుమార్‌ను డీఎస్పీ ఏ.శ్రీనివాసరావు బుధవారం అభినందించారు. ఆయన కథనం ప్రకారం... బాపట్ల పట్టణం భీమావారిపాలేనికి చెందిన కారుమూరి శివరామప్రసాద్ గత నెల 29న కుటుంబ సభ్యులతో కలసి ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం కడవకుదురులో బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి సాయంత్రం వచ్చేసరికి ఇంట్లో బీరువా పగలగొట్టి ఉండటంతో చోరీ జరిగిందని గుర్తించి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి రెండు టీములుగా ఏర్పడ్డారు.
వేలిముద్రలు ఆధారంగా చోరీ చేసింది శీలం దుర్గగా గుర్తించారు. ఆమె స్వగ్రామం తెనాలి మండలం చిన్నరావూరు. అయితే, ప్రస్తుతం రేపల్లెలోని నేతాజీనగర్‌లో నివాసం ఉంటోంది. చిత్తు కాగితాలు ఏరేందుకు రేపల్లె నుంచి బస్సులో వచ్చి చోరీకి పాల్పడింది. చోరీ చేసిన అనంతరం నాగాయలంక మండలం భావదేవరపల్లిలోని బంధువుల ఇంట్లో దాక్కుంది. విషయాన్ని తెలుసుకున్న బాపట్ల పోలీసులు అక్కడకు వెళ్లి దుర్గను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద ఉన్న రూ.15.37లక్షలు, 121 గ్రాముల బంగారం, 48 గ్రాముల వెండిని స్వాదీనం చేసుకున్నారు,
తెలంగాణలో రెండు చోరీలు
నిందితురాలు భర్త చనిపోవడంతో మళ్లీ వివాహం చేసుకుంది. ఈమె రెండో భర్త కూడా చావుబతుకుల్లో ఉండటంతో దొంగతనాలకు అలవాటుపడింది. అతను కూడా చనిపోవడంతో దొంగతనాలనే వృత్తిగా చేసుకుని జీవిస్తున్నట్లు డీఎస్పీ ఏ.శ్రీనివాసరావు తెలిపారు. నిందితురాలు తెలంగాణ రాష్ట్రంలోని కీసర, ఘట్‌కేసర్ వద్ద కూడా రెండు చోరీలకు పాల్పడినట్లు చెప్పారు. ఈ రెండు ప్రాంతాల్లో 60 గ్రాముల బంగారం, కేజీ వెండి వరకు చోరీ చేయగా.. వారికి సమాచారం ఇచ్చామని తెలిపారు. కేసును వెంటనే ఛేదించిన సీఐ అశోక్‌కుమార్, ఏఎస్‌ఐలు డి.రోసిబాబు, కె.ధనుంజయ, హెడ్‌కానిస్టేబుళ్లు శేషగిరిరావు, నరేంద్రను అభినందించడంతో పాటు అవార్డుల కోసం వారి పేర్లను పంపనున్నట్లు డీఎస్పీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment