నగదు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. నోట్ల రద్దునాటి పరిస్థితులు పునరావృతమవుతూ.. డబ్బులు దొరకక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వారంరోజులుగా బ్యాంకుల్లో అరకొర చెల్లింపులతో ప్రజలు విసిగిపోతున్నారు. జిల్లావ్యాప్తంగా 90 శాతం ఏటీఎం కేంద్రాలు ఎప్పుడు చూసినా మూసివేసే దర్శనమిస్తున్నాయి. బ్యాంకులకు డిపాజిట్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు. దీంతో బ్యాంకుల్లో నగదు లావాదేవీలు గతంతో పోల్చితే గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతున్న వేతనాలు తీసుకోవడానికీ అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
కరీంనగర్‌బిజినెస్: జిల్లా వ్యాప్తంగా నగదు లావాదేవీలు రోజురోజుకూ పడిపోతున్నాయి. దీనికి ముఖ్య కారణం డిపాజిట్ల ద్వారా బ్యాంకులకు రావాల్సిన నగదు ఆశించినస్థాయిలో రాకపోవడమేనిని తెలు స్తోంది. జిల్లా వ్యాప్తంగా 485 బ్యాంకులున్నాయి. ఇందులో 315 జాతీయ బ్యాంకులు, 68 ప్రైవేట్, 91 గ్రామీణ, 11 సహకార బ్యాంకులు సేవలందిస్తున్నాయి. వీటన్నిటి ద్వారా పనిదినాల్లో దాదాపు గతంలో రూ.200 కోట్లపైగానే లావాదేవీలు జరిగేవి. నగరప్రాంతాల్లో ఉన్న బ్యాంకుల్లో కొంచెం ఎక్కువగా.. గ్రామీణ ప్రాంతాల్లో కాస్తా తక్కువగా లావాదేవీలు సాగేవి. ప్రస్తుతం నగదు కొరత ఏర్పడడంతో ప్రతిరోజూ లావాదేవీలు రూ.100కోట్లకు మించడం లేదని స్వయంగా బ్యాంకు అధికారులే చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా గల బ్యాంకుల్లో ఈ నాలుగైదు రోజుల్లో రూ.80 నుంచి రూ.90 కోట్ల మధ్యనే జరిగినట్లు సమాచారం. బ్యాంకుల్లో నగదును బట్టి ఖాతాదారులకు కేవలం రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకే చెల్లింపులు జరిపినట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని బ్యాంకులు రూ.10 వేలతోనే సరిపుచ్చుతున్నారు.
మూగబోతున్న ఏటీఎం కేంద్రాలు
ఏటీఎం కేంద్రాల పరిస్థితి వారంరోజులుగా దారుణంగా తయారైంది. జిల్లావ్యాప్తంగా వివిధ బ్యాంకులకు సంబంధించి పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కలుపుకుని 176 ఏటీఎం కేంద్రాలు సేవలందిస్తున్నాయి. ఇందులో వారంరోజులుగా దాదాపు 138 ఏటీఎం కేంద్రాలు మూగనోము ప్రదర్శిస్తున్నాయి. బ్యాంకుల్లో కావాల్సినంత చెల్లింపులు లేకపోవడం, అవసరమున్నప్పుడు ఎన్ని ఏటీఎం కేంద్రాలు తిరిగి నా డబ్బులు లభించకపోవడంతో ఉద్యోగులు, వ్యా పారులు నానా అవస్థలు పడుతున్నారు. గురువారం కొన్ని ఏటీఎంలలో నగదు నింపడంతో కాస్తా మెరుగుపడిందని ఖాతాదారులు చెబుతున్నారు.
పెళ్లివారికి ఇక్కట్లు
ప్రస్తుతం వివాహ ముహూర్తాలు ఎక్కవగా ఉండడంతో నగదు కొరత పెళ్ళింటివారిని నానా అవస్థలకు గురిచేస్తుంది. షాపింగ్‌లు ఇతరత్రాల కొనుగోళ్లలో కార్డులు, డిజిటల్ పేమెంట్ల ద్వారా జరిగినప్పుటికీ పలు విషయాల్లో డిజిటల్ సేవలు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. కచ్చితంగా పలు పనులకు నగదు అవసరముండడంతో ఇటూ బ్యాంకుల్లో ఇచ్చేది సరిపోక, ఏటీంఎం కేంద్రాలు పనిచేయక ఇరుగుపొరుగు, బంధువుల వద్ద అప్పులు చేస్తూ నెట్టుకొస్తున్నట్లు తెలిసింది.
కొనసాగుతున్న కష్టాలు...
వారంపదిరోజుల నుండి నగదు కష్టాలు మరి ఎక్కువయ్యాయి. డబ్బులు దొరకక అన్ని వర్గాల ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. ఇవన్నీ చూస్తున్న ఖాతా దారులు బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్లు చేయాలంటేనే జంకుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి నగదును తెప్పిస్తున్నట్లు తెలిసింది. కేవలం తెలంగాణ, ఆంద్రప్రదేశ్, బీహార్‌లోనే నగదు కష్టాలుండగా నగదు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్రాలకు నగదు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే రెండు, మూడు రోజుల్లో నగదు ఇక్కట్లు దూరమవుతాయని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రజలు డబ్బులు ఇంట్లో పెట్టుకోకుండా బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తేనే ఇబ్బందులు దూరమవుతాయని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment