ముసురు.. ముసుగు | non stop rains in district | Sakshi
Sakshi News home page

ముసురు.. ముసుగు

Published Tue, Jul 18 2017 12:02 AM | Last Updated on Tue, Sep 5 2017 4:15 PM

ముసురు.. ముసుగు

ముసురు.. ముసుగు

కానరాని ఎండ పొడ
జిల్లా వ్యాప్తంగా వర్షాలు
నిండుగా ప్రవహిస్తున్న కొండవాగులు
నీట మునిగిన పంట పొలాలు
గోదావరిలో పెరుగుతున్న నీటిమట్టం
పశ్చిమ డెల్టాకు నీటి విడుదల కుదింపు
భారీ వర్షాలన్న వాతావరణ శాఖ 
అన్నదాతల ఆందోళన
 
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా చినుకులు పడుతూనే ఉన్నాయి. రానున్న ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనం తీవ్రరూపు దాల్చి వాయుగుండంగా మారుతుందని వాతావరణ  నిపుణులు చేసిన హెచ్చరికతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 
 
కొవ్వూరు :రెండు రోజుల నుంచి జిల్లాలో ఓ మోస్తారు వర్షం కురిసింది. బుట్టాయగూడెం మండలంలో జల్లేరు, రౌతుగూడెంవాగు, కొవ్వాడ కాలువ, కన్నాపురం వాగులతోపాటు ఎర్రవాగు తదితర కొండ వాగులు నిండుగా ప్రవహిస్తున్నాయి. కన్నాపురం, రౌతుగూడెం, విప్పలపాడు వాగులయితే పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో 
ఈ మార్గంలో ప్రయాణికులు రాకపోకల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, కొవ్వూరు మండలాల్లో లోతట్టు ప్రాంతంలో ఉన్న సుమారు వెయ్యి ఎకరాలకు పైగా వరిపంట ముంపు బారిన పడింది. నరసాపురం, మొగల్తూరు, యలమంచిలి తదితర మండలాల్లో పలుచోట్ల వరి నారుమళ్లు నీటమునిగాయి. ప్రస్తుతానికి ఈ పంటలకు అంత నష్టం లేకపోయినప్పటికీ మరిన్ని రోజుల పాటు నీటిలో నానితే నారుకుళ్లి పోతుంది. తద్వారా రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. రానున్న 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తా యని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఎగువ ప్రాంతంలో వర్షాలు కురవడంతో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.
డెల్టాకు నీటివిడుదల కుదింపు : అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు సాగునీటి విడుదలను భారీగా కుదించారు. పశ్చిమ డెల్టాకు ఆదివారం ఐదు వేల క్యూసెక్కులు విడుదల చేసిన అధికారులు సోమవారం సాయంత్రం నుంచి మూడు వేల క్యూసెక్కులు తగ్గించి రెండు వేల క్యూసెక్కుల నీరు విడిచిపెడుతు న్నారు. ఆదివారం మూడు డెల్టాలకు 8,700 క్యూసెక్కులు అందించిన అధికారులు సోమవారం సాయంత్రం నుంచి 4,100 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తున్నారు. దీనిలో తూర్పు డెల్టాకు 900, సెంట్రల్‌ డెల్టాకు 1,200, పశ్చిమ డెల్టాకు రెండు వేల క్యూసెక్కుల చోప్పున సాగునీరు విడుదల చేస్తున్నారు.
గోదావరిలో పెరుగుతున్న ఇ¯ŒSఫ్లో:
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద పెరుగుతోంది. సోమవారం ఉద యం 42,993 క్యూసెక్కులు ఉన్న ఇ¯ŒSఫ్లో సాయంత్రానికి 90,564 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో ఉభయ గోదావరి డెల్టా ఆయకట్టుకి సాగునీరు విడిచిపెట్టగా 86,464 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. ధవళేశ్వరం వద్ద ఇ¯ŒSఫ్లో పెరుగుతున్న దృష్ట్యా ఆనకట్టకు నాలుగు ఆర్మ్‌ల వద్ద ఉన్న 175 గేట్లలో 143 గేట్లును 0.20 ఎత్తులేపి వరదను దిగువకు విడిచి పెడుతున్నారు. ఎగువున భద్రాచలంలో సోమవారం ఉదయం 13.50 అడుగులున్న నీటిమట్టం సాయంత్రానికి 16.50 అడుగులకు పెరిగింది. కొయిదాలో ఉదయం 6.35 మీటర్లు ఉన్న నీటిమట్టం సాయంత్రం ఆరుగంటలకు 7 మీటర్లుకు పెరిగింది.
స్తంభించిన జనజీవనం :
సోమవారం ఉదయం నుంచి వర్షం తెరిపివ్వకుండా చినుకులు పడుతూనే ఉండడంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. జన జీవనం స్తంభించడంతో వ్యాపారాలు సైతం మందకొడిగానే నడిచాయి. కొందరు వ్యాపారులు ముసురును దృష్టిలో ఉంచుకుని దుకాణాలు తెరవలేదు. వర్షాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల  ప్రయివేటు పాఠశాలల్లో పిల్లల్ని  మధ్యాహ్నం నుంచి ఇళ్లకు పంపించి వేశారు. పట్టణాల్లో రోడ్లుపైన, వీధుల్లోను తోపుడు బండ్లుపై  చిరు వ్యాపారులు చేసుకునే వర్తకులపై వర్షం తీవ్ర ప్రభావం చూపించింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement