ఏ ముక్క ముట్టలేం | non veg and Essential goods high rates in market | Sakshi
Sakshi News home page

ఏ ముక్క ముట్టలేం

Published Thu, Jun 16 2016 11:18 AM | Last Updated on Mon, Sep 4 2017 2:38 AM

ఏ ముక్క ముట్టలేం

ఏ ముక్క ముట్టలేం

 ► భారీగా పెరిగిన మటన్, చికెన్ ధరలు
 ► కూరగాయల ధరలతో పోటీ
 ► నిలకడగా చేపల ధరలు
 ► సామాన్య, మధ్య తరగతి ప్రజలు మాంసాహారానికి దూరం

శ్రీకాకుళం:
మటన్, చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలతో పోటీ పడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో, ఈ ప్రభావం వీటిపై పడింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు మాంసాహారానికి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. వారాంతరాల్లో కూడా మాంసాహారం తినే పరిస్థితి కనిపించడం లేదు. కూరగాయల ధరలు పెరగడంతో ఇదే అదునుగా వ్యాపారులు చికెన్, మటన్ ధరలును మరింత పెంచేశారు. చేపల ధరలే కాస్త అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు అందరి చూపు చేపలవైపే ఉంది. చికెన్ స్కిన్‌లెస్ కిలో రూ.200 ఉంది. మటన్ ధర మరింత పైపైకి పోతోంది. ప్రస్తుతం కిలో రూ.500పైగా పలుకుతోంది. ఈ ధరలు ఎందుకు పెరుగుతాయి, ఎవరు పెంచుతారు, ఎప్పుడు పెంచుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ధరలపై అధికారుల నియంత్రణ ఉందా? లేక వ్యాపారులే నచ్చినపుడు పెంచుకోవచ్చునా తెలియక ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.  

ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం
కూరగాయలు తిందామంటే ధరలు మండుతున్నాయి. చికెన్, మటన్ ముట్టకోలేం. ఎలా బతకాలని సామాన్య, మధ్య తరగతి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు ధరల నియంత్రణలో విఫలమయ్యాయని మండిపడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా నిత్యవసర సరుకుల ధరలు, కూరగాయలు, చికెన్, మటన్ ధరలు అకాశానంటాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పేదలు బతకడం కష్టమని వాపోతున్నారు.

వ్యాపారాలు అంతంత మాత్రమే
ప్రస్తుతం ఎండలు కారణంగా కోళ్లు అంతగా సరఫరా కావడం లేదు. ఇదే చికెన్ ధర పెరగడానికి కారణం. ఫౌల్ట్రీ నుంచి తెచ్చేటప్పుడు కొన్ని కోళ్లు చచ్చిపోతున్నాయి. ఈ నష్టాన్ని భర్తీ చేయాలంటే ధర పెంచక తప్పదు. ప్రస్తుతం వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.
 - వై.రాజు, చికెన్ సెంటర్ యజమాని, శ్రీకాకుళం
 
కాళీ సంచితో తిరిగి వస్తున్నాం

ప్రస్తుతం అరకొర జీతంతో బతకాలంటేనే చాలా కష్టంగా ఉంది. మార్కెట్‌లో ఏ కూరగాయలు కొనాలన్నా కిలో రూ.40పై మాటే. ధరలకు భయపడి ఏమి కొనకుండా ఖాళీ సంచితో తిరిగి వస్తున్నాం. చికెన్, మటన్ ధరలంటే మరి చెప్పనక్కర్లేదు. -ఎం.త్రినాథరావు, ప్రైవేటు ఉద్యోగి, శ్రీకాకుళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement