పంటలు ఎండుతున్నా పట్టించుకోరా
పంటలు ఎండుతున్నా పట్టించుకోరా
Published Sat, Feb 11 2017 11:17 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
- మార్చి 20 వరకు నీరస్తామని కలెక్టర్ మాట తప్పారు
- కేసీ, హంద్రీనీవా ఆయకట్టు రైతులను ఆదుకోండి
- నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య
కల్లూరు(రూరల్): హంద్రీనీవా, కేసీ కెనాల్ ఆయకట్టు కింద సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నా ఎవరికీ పట్టడం లేదని నందికొట్కూరు ఎమ్మెల్యే వై. ఐజయ్య ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయకట్టు రైతులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సమృద్ధిగా నారు పోసి పంటలు సాగు చేస్తున్న సమయంలో ఈ నెల 3వ తేదీన హంద్రీనీవా పథకం 2 పంపులు, కేసీ కెనాల్‌కు 2 పంపులను బంద్ చేయించారన్నారు. విషయాన్ని కలెక్టర్ విజయమోహన్ దృష్టికి తీసుకెళ్లడంతో 4వ తేదీన మళ్లీ హంద్రీనీవా, కేసీ కెనాల్ సాగునీటిని విడుదల చేశారన్నారు. తిరిగి 10వ తేదీ శుక్రవారం హంద్రీనీవా, కేసీ కెనాల్‌కు సాగునీటిని నిలిపివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. మార్చి 20 వరకు సమృద్ధిగా సాగునీటిని అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో సమస్యను ఫోన్‌లో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడండని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడితే కలెక్టర్, ఎస్‌ఈ, సీఈతో మాట్లాడి రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారని స్పష్టం చేశారు. హంద్రీనీవా, కేసీ కెనాల్ నుంచి వచ్చే 800 క్యూసెక్కుల సాగునీరు నిలిచిపోయిందన్నారు. రైతులను టీడీపీ ప్రభుత్వం నానా అవస్థలకు గురి చేస్తోందని మండిపడ్డారు. శ్రీశైలం జలాశయం 886 అడుగుల ఉందని, హంద్రీనీవా మల్యాల, ముచ్చుమర్రి వద్ద 846 అడుగులు ఉన్నా రైతులకు నీళ్లు ఎందుకివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఏమైనా అయితే ఇరిగేషన్ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావు బాధ్యత వహించాలని చెప్పారు.
అనంతపురం జిల్లాకు హంద్రీనీవా నుంచి పుష్కలంగా నీళ్లు పారుతున్నాయని చెప్పారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా హంద్రీనీవా, కేసీ కెనాల్ ఆయకట్టు రైతులకు సాగునీరు అందించేంత వరకు పోరాడుతామని భరోసా ఇచ్చారు. సంకిరేణిపల్లె మాజీ సర్పంచ్ కె. పక్కీరయ్య మాట్లాడుతూ రబీ సీజన్‌లో మినుములు, వేరుశనగ, వరి, కంది పంటలు వేసుకున్నామని, సాగునీరు లేక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలంటే లేదంటే పంటలు ఎండిపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. సమావేశంలో రైతులు ప్రభాకర్‌రెడ్డి, కేశవరెడ్డి, మద్దిలేటి, వెంకటేశ్వర్లు, కురువన్న, ఈశ్వరయ్య, కె మల్లయ్య, ఆనంద్, బాలయ్య, చిన్న కురుమన్న, నాగేశ్వరరావు, గోపన్న, నాగమల్లయ్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement