మహిళల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ
♦ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ
యాడికి : కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన నిరుపేదలకు దక్కడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ ధ్వజమెత్తారు. యాడికిలో మంగళవారం నిర్వహించిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘోరంగా విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు. టీడీపీ పాలన అంతా అవినీతిలో కూరుకుపోయిందని నిప్పులు చెరిగారు. మోసపూరిత హామీలతో అన్ని వర్గాల వారిని ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల టీడీపీ పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని తెలిపారు. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు మరెంతో దూరంలో లేవన్నారు.
అనంతరం ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త వీఆర్ రామిరెడ్డి పాల్గొన్నారు.