Sankarnarayana
-
బీసీ సంక్షేమశాఖ మంత్రిగా శంకరనారాయణ
అనంతపురం: రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు సంపాదించుకున్న పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణకు బీసీ సంక్షేమశాఖ అప్పగించారు. ఈ మేరకు శనివారం ఉదయం మంత్రిగా రాజధానిలో శంకరనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే శాఖల కేటాయింపుపై ఆసక్తి నెలకొంది. ఎవరెవరికి ఏయే శాఖ అప్పగిస్తారనే ఉత్కంఠకు సాయంత్రం తెరపడింది. ఈ క్రమంలో జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్న శంకరనారాయణకు బీసీ సంక్షేమశాఖ అప్పగించారు. బీసీలు అధికంగా ఉన్న జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించిన శంకరనారాయణకు అధిష్టానం బీసీ సంక్షేమశాఖ అప్పగించింది. విషయం తెలుసుకున్న జిల్లాలోని బీసీలు సంబరాలు జరుపుకొన్నారు. వెనుకబడిన అనంతపురం లాంటి జిల్లాలో బీసీల అభివృద్ధి ఆశాజనకంగా ఉంటుందని జిల్లావాసులు ఆశిస్తున్నారు. మంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్లిన పలువురు శంకరనారాయణను కలిసి అభినందించారు. పెనుకొండ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అధినేత నమ్మకాన్ని వమ్ము చేయను మంత్రి వర్గంలో చోటు కల్పించడం తన అదృష్టమని శంకరనారాయణ చెప్పారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకున్నారని ఆయన నమ్మకాన్ని వమ్ము చేయననన్నారు. బీసీ సంక్షేమశాఖ అప్పగించడం చాలా సంతోషమని, బలహీన వర్గాల అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానన్నారు. పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలను ఎప్పటికీ మరువనన్నారు. అందరి సహకారంతో జిల్లాలో పార్టీ అభివృద్ధితో పాటు, బీసీల సంక్షేమశానికి చర్యలు తీసుకుంటానన్నారు. -
మంత్రులను బర్త్రఫ్ చేసే ధైర్యముందా ?
పెనుకొండ: వేరుశనగ పంట ఎండుతున్న విషయం తెలియదని ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ తప్పుబట్టారు. ఇందుకు బాధ్యులుగా మంత్రులు, అధికారులను చూపుతున్నారన్నారు. మంత్రులను బర్త్రఫ్ చేసి, అధికారులపై చర్యలు తీసుకునే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా? అని ఆయన ప్రశ్నించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 12 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలను గెలిపించిన ఈ జిల్లాకు ముఖ్యమంత్రి చేసింది ఏమీ లేదన్నారు. గత 20 రోజులకు పైగా వైఎస్సార్సీపీ, కమ్యూనిస్ట్ పార్టీలు తీవ్ర వర్షాభావంతో వేరుశనగ ఎండుతోందని పదేపదే అధికారులకు విన్నవించినా ఎలాంటి స్పందన లేదన్నారు. రెయిన్గన్లు, ఫారంపాండ్స్ అపహాస్యమై నీరుగారిపోయాయన్నారు. ఈ సమయంలో తన ప్రతిష్ట మసకబారకుండా ఉండటానికే కరువు పరిస్థితి తన దృష్టికి రాలేదంటున్నారని ఆయన పేర్కొన్నారు. వేరుశనగ పంట వేసి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ. 20 వేలు నష్టపరిహారం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణా జలాలను హంద్రీనీవా ద్వారా జిల్లాకు అందించి జిల్లాను సస్యశ్యామలం చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న హంద్రీనీవా పనులన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. -
అర్హులకు సంక్షేమ ఫలాలు దక్కడం లేదు
♦ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్నారాయణ యాడికి : కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన నిరుపేదలకు దక్కడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్నారాయణ ధ్వజమెత్తారు. యాడికిలో మంగళవారం నిర్వహించిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘోరంగా విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు. టీడీపీ పాలన అంతా అవినీతిలో కూరుకుపోయిందని నిప్పులు చెరిగారు. మోసపూరిత హామీలతో అన్ని వర్గాల వారిని ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల టీడీపీ పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని తెలిపారు. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు మరెంతో దూరంలో లేవన్నారు. అనంతరం ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త వీఆర్ రామిరెడ్డి పాల్గొన్నారు. -
లింకులతో రుణమాఫీకి తూట్లు
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్.శంకర్నారాయణ అనంతపురం అర్బన్: ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలుచేయలేని చంద్రబాబు నాయుడు కమిటీలతో కాలయాపన చేసి, ఇప్పుడు లింకులతో రుణమాఫీకి తూట్లు పొడుస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎం శంకరనారాయణ విమర్శించారు. స్థానిక రెండవ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు జిల్లాలో 20 లక్షల మంది రైతులకు రూ.6098 కోట్లు, డ్వాక్రా మహిళా సంఘాలకు రూ.1240 కోట్లు, చేనేతలకు సంబంధించి రూ.35 కోట్ల రుణాలను షరతులు లేకుండా మాఫీ చేస్తానని హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. ఆధార్, వ్యవసాయ భూమికి దస్తావేజులు కనపరచాలని.. మహిళా సంఘాలకు ఒక్క గ్రూపునకు రూ.లక్ష వరకే మాఫీ చేస్తామని.. ఇలాంటి లింకులు పెట్టి రుణమాఫీ పథకాన్ని నీరుగార్చేందుకు యత్నిస్తున్నారన్నారు. దీనివల్ల జిల్లాలోనే రైతులకు, మహిళా సంఘాలకు ఒరిగేదేమీ లేదని, పైగా వారు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం భేషరతుగా రుణాలన్నీ మాఫీ చేయాలని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. లేకపోతే రైతులు, మహిళలు తిరుగుబాటు చేస్తారని, అనంతర పరిణామాలకు ప్రభుత్వమే భాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. లింకుల రుణమాఫీపై ప్రజాపక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేపడుతుందన్నారు. రుణమాఫీ పథకంలో వీలైనంత వరకు మాఫీని తగ్గించాలనే భావనతో అనేక లింకులు పెట్టి రుణ మాఫీ విధానాలను మారుస్తున్నారని ఆయన తెలిపారు. ఈ లింకుల విధానం చేయడం వల్ల అనేక మంది రైతులు, అనేక మంది డ్వాక్రా మహిళలు నష్టపోయే అవకాశముందన్నారు. దీని వల్ల జిల్లాలోనే రైతులకు, మహిళా సంఘాలకు వరిగేదేమీ లేదని ఆయన తెలిపారు. ఈ లింకుల రుణమాఫీని పక్కనపెట్టి భేషరతుగా ఇచ్చిన హామీ ప్రకారం రుణాలన్నీ మాఫీ చేయాలని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. అలాకాని పక్షంలో రైతులు, మహిళలు తిరుగుబాటు చేస్తారని జరిగే పరిణామాలకు ప్రభుత్వమే భాధ్యత వహించాలని, ఆయన హెచ్చరించారు. లింకుల రుణమాఫీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరుగుబాటు తప్పదని ఆయన స్పష్టం చేశారు.