మంత్రులను బర్త్‌రఫ్ చేసే ధైర్యముందా ?
పెనుకొండ: వేరుశనగ పంట ఎండుతున్న విషయం తెలియదని ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ తప్పుబట్టారు. ఇందుకు బాధ్యులుగా మంత్రులు, అధికారులను చూపుతున్నారన్నారు. మంత్రులను బర్త్‌రఫ్ చేసి, అధికారులపై చర్యలు తీసుకునే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా? అని ఆయన ప్రశ్నించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 12 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలను గెలిపించిన ఈ జిల్లాకు ముఖ్యమంత్రి చేసింది ఏమీ లేదన్నారు. గత 20 రోజులకు పైగా వైఎస్సార్‌సీపీ, కమ్యూనిస్ట్ పార్టీలు తీవ్ర వర్షాభావంతో వేరుశనగ ఎండుతోందని పదేపదే అధికారులకు విన్నవించినా ఎలాంటి స్పందన లేదన్నారు.
రెయిన్‌గన్లు, ఫారంపాండ్స్ అపహాస్యమై నీరుగారిపోయాయన్నారు. ఈ సమయంలో తన ప్రతిష్ట మసకబారకుండా ఉండటానికే కరువు పరిస్థితి తన దృష్టికి రాలేదంటున్నారని ఆయన పేర్కొన్నారు. వేరుశనగ పంట వేసి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ. 20 వేలు నష్టపరిహారం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణా జలాలను హంద్రీనీవా ద్వారా జిల్లాకు అందించి జిల్లాను సస్యశ్యామలం చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న హంద్రీనీవా పనులన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.