- వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్.శంకర్‌నారాయణ
అనంతపురం అర్బన్: ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలుచేయలేని చంద్రబాబు నాయుడు కమిటీలతో కాలయాపన చేసి, ఇప్పుడు లింకులతో రుణమాఫీకి తూట్లు పొడుస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎం శంకరనారాయణ విమర్శించారు. స్థానిక రెండవ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు జిల్లాలో 20 లక్షల మంది రైతులకు రూ.6098 కోట్లు, డ్వాక్రా మహిళా సంఘాలకు రూ.1240 కోట్లు, చేనేతలకు సంబంధించి రూ.35 కోట్ల రుణాలను షరతులు లేకుండా మాఫీ చేస్తానని హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. ఆధార్, వ్యవసాయ భూమికి దస్తావేజులు కనపరచాలని.. మహిళా సంఘాలకు ఒక్క గ్రూపునకు రూ.లక్ష వరకే మాఫీ చేస్తామని.. ఇలాంటి లింకులు పెట్టి రుణమాఫీ పథకాన్ని నీరుగార్చేందుకు యత్నిస్తున్నారన్నారు.
దీనివల్ల జిల్లాలోనే రైతులకు, మహిళా సంఘాలకు ఒరిగేదేమీ లేదని, పైగా వారు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం భేషరతుగా రుణాలన్నీ మాఫీ చేయాలని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. లేకపోతే రైతులు, మహిళలు తిరుగుబాటు చేస్తారని, అనంతర పరిణామాలకు ప్రభుత్వమే భాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. లింకుల రుణమాఫీపై ప్రజాపక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేపడుతుందన్నారు.
రుణమాఫీ పథకంలో వీలైనంత వరకు మాఫీని తగ్గించాలనే భావనతో అనేక లింకులు పెట్టి రుణ మాఫీ విధానాలను మారుస్తున్నారని ఆయన తెలిపారు. ఈ లింకుల విధానం చేయడం వల్ల అనేక మంది రైతులు, అనేక మంది డ్వాక్రా మహిళలు నష్టపోయే అవకాశముందన్నారు. దీని వల్ల జిల్లాలోనే రైతులకు, మహిళా సంఘాలకు వరిగేదేమీ లేదని ఆయన తెలిపారు.
ఈ లింకుల రుణమాఫీని పక్కనపెట్టి భేషరతుగా ఇచ్చిన హామీ ప్రకారం రుణాలన్నీ మాఫీ చేయాలని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. అలాకాని పక్షంలో రైతులు, మహిళలు తిరుగుబాటు చేస్తారని జరిగే పరిణామాలకు ప్రభుత్వమే భాధ్యత వహించాలని, ఆయన హెచ్చరించారు. లింకుల రుణమాఫీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరుగుబాటు తప్పదని ఆయన స్పష్టం చేశారు.