రొద్దంలో బాణసంచా పేలుస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
అనంతపురం: రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు సంపాదించుకున్న పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణకు బీసీ సంక్షేమశాఖ అప్పగించారు. ఈ మేరకు శనివారం ఉదయం మంత్రిగా రాజధానిలో శంకరనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే శాఖల కేటాయింపుపై ఆసక్తి నెలకొంది. ఎవరెవరికి ఏయే శాఖ అప్పగిస్తారనే ఉత్కంఠకు సాయంత్రం తెరపడింది. ఈ క్రమంలో జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్న శంకరనారాయణకు బీసీ సంక్షేమశాఖ అప్పగించారు.
బీసీలు అధికంగా ఉన్న జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించిన శంకరనారాయణకు అధిష్టానం బీసీ సంక్షేమశాఖ అప్పగించింది. విషయం తెలుసుకున్న జిల్లాలోని బీసీలు సంబరాలు జరుపుకొన్నారు. వెనుకబడిన అనంతపురం లాంటి జిల్లాలో బీసీల అభివృద్ధి ఆశాజనకంగా ఉంటుందని జిల్లావాసులు ఆశిస్తున్నారు. మంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్లిన పలువురు శంకరనారాయణను కలిసి అభినందించారు. పెనుకొండ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు.
అధినేత నమ్మకాన్ని వమ్ము చేయను
మంత్రి వర్గంలో చోటు కల్పించడం తన అదృష్టమని శంకరనారాయణ చెప్పారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకున్నారని ఆయన నమ్మకాన్ని వమ్ము చేయననన్నారు. బీసీ సంక్షేమశాఖ అప్పగించడం చాలా సంతోషమని, బలహీన వర్గాల అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానన్నారు. పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలను ఎప్పటికీ మరువనన్నారు. అందరి సహకారంతో జిల్లాలో పార్టీ అభివృద్ధితో పాటు, బీసీల సంక్షేమశానికి చర్యలు తీసుకుంటానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment