ప్రొద్దుటూరు టౌన్: ఈమె పేరు రామాంజనమ్మ. పట్టణంలోని రామేశ్వరం రోడ్డులో నివాసం ఉంటోంది. భర్తకు అనారోగ్యం కారణంగా పండ్ల వ్యాపారం చేసి కుటుంబాన్ని ఆమె పోషిస్తోంది. వన్ టౌన్‌సర్కిల్ వద్ద ఆమె వ్యాపారం చేస్తుండగా ఇద్దరు ద్విచక్రవాహనంలో వచ్చి రూ.500 నోటు ఇచ్చి అరటి పండ్లు తీసుకున్నారు. ఆమె వారికి రూ.470 చిల్లర ఇచ్చింది. మరో వ్యక్తి రూ.500 నోటు ఇచ్చి ద్రాక్ష పండ్లు కావాలని అడిగాడు. ఆమె చిల్లర లేదని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆమె రూ.500 నోటు పరిశీలించగా అది జిరాక్స్ పేపర్ అని గుర్తించి లబోదిబోమంది. రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు వ్యాపారం చేస్తే రూ.100–150 మిగులుతుందని, జిరాక్స్ పేపర్ ఇచ్చి ఇలా మోసం చేయడం ఏమిటని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.