రాజన్న ధర్మకర్తల మండలికి నోటిఫికేషన్
-
20 రోజుల్లోగా దరఖాస్తులకు ఆహ్వానం
వేములవాడ: వేములవాడ రాజన్న ధర్మకర్తల మండలి నియామకానికి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ నెల 6న విడుదలైన జీవో 349 అనుసారం 20 రోజుల్లోగా ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి, కమిషనర్‌తోపాటు రాష్ట్రంలోని 34(6ఏ టెంపుల్స్) దేవాలయాల ఈవోలకు ఈ సమాచారాన్ని చేరవేసినట్లు ఇందులో పేర్కొన్నారు. అయితే ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలను మాత్రం ప్రకటించకపోవడంతో టీఆర్‌ఎస్ నాయకులు అధికారులను సంప్రదిస్తున్నారు. గతంలో డిగ్రీ అర్హత ఉండాలని ఒక నిబంధన విధించారని, ఆ నిబంధన మేరకు అర్హత అడుగుతారా? లేక ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఆశావహులు ఆలోచనలో పడ్డారు. ట్రస్టుబోర్డు సభ్యుల సంఖ్య సైతం ప్రకటించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని రాజన్న ఆలయం, ధర్మపురి ఆలయాలకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో దరఖాస్తు చేసుకునేందుకు ఆశావహులు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఎమ్మెల్యే రమేశ్‌బాబు జర్మనీకి వెళ్లడంతో ఆయన రాకకోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆలయ అధికారులు ధర్మకర్తల మండలి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.