సంచలనం రేపుతున్న ఎన్ఆర్ఐ మృతి!? | nri goutham reddy dies in a suspect case | Sakshi
Sakshi News home page

సంచలనం రేపుతున్న ఎన్ఆర్ఐ మృతి!?

Published Fri, Sep 2 2016 9:18 PM | Last Updated on Sat, Jul 6 2019 12:47 PM

అనుమానాస్పద స్థితిలో కాలిపోయి ఉన్న ఎన్ఆర్ఐ గౌతమ్ రెడ్డి మృతదేహం, ఇన్ సెట్లో.. గౌతమ్ రెడ్డి(ఫైల్ ఫొటో) - Sakshi

అనుమానాస్పద స్థితిలో కాలిపోయి ఉన్న ఎన్ఆర్ఐ గౌతమ్ రెడ్డి మృతదేహం, ఇన్ సెట్లో.. గౌతమ్ రెడ్డి(ఫైల్ ఫొటో)

రసూల్‌పురా:  అనుమానాస్పద స్థితిలో ఓ ఎన్‌ఆర్‌ఐ మృతిచెందాడు. గతనెల 29న కెన్యా నుంచి పాతబోయిన్‌పల్లిలోని తన ఇంటికి చేరుకున్న ఆయన వాకింగ్‌కని ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయాడు. ఐదు రోజుల తర్వాత శవమై కనిపించాడు. అతడిది ఆత్మహత్యా? హత్యా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బోయిన్‌పల్లి పోలీసుల కథనం ప్రకారం...పాతబోయిన్‌పల్లి రాజారెడ్డికాలనీకి చెందిన గౌతమ్‌రెడ్డి (30) ఎనిమిదేళ్ల క్రితం కెన్యా వెళ్లి వ్యాపారం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. ఎనిమిది నెలల క్రితం కర్నూలు డోన్‌కు చెందిన యామినితో ఈయనకు పెళ్లైంది. కాగా, గౌతమ్‌రెడ్డి గతనెల 29న కెన్యా నుంచి రాజారెడ్డికాలనీలోని తన ఇంటికి వచ్చాడు. అదేరోజు రాత్రి 7.20కి వాకింగ్‌కు వెళ్లొస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.

ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు 30న బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా... శుక్రవారం బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని డయిరీఫాం వద్ద నిర్మానుష్య ప్రదేశంలోని చెట్లపొదల్లో ఒంటిపై దుస్తులు కాలిపోయి, కుళ్లిన స్థితిలో ఓ శవం పడి ఉండగా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా..

ఖాళీ పెట్రోల్‌ బాటిల్, పక్కనే ఓ పర్సు పడి ఉన్నాయి. పర్సు ఆధారంగా పోలీసులు మృతుడు ఎన్‌ఆర్‌ఐ గౌతమ్‌రెడ్డిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా, మృతుడికి నగరంలో శత్రువులు లెవరూ లేరని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

 ఆత్మ‘హత్య’?
గౌతమ్‌రెడ్డి ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే, కెన్యా నుంచి నగరానికి వచ్చి ప్రాణం తీసుకోవాల్సిన అఘాయిత్యం ఏమిటని అంటున్నారు. గతనెల 29న సాయంత్రం ఇంటికి చేరుకున్న గౌతమ్‌రెడ్డి.. ఇంట్లో ఉన్న మూడు గంటల్లో ఏదైనా సంఘటన జరిగిందా? అని అనుమానిస్తున్నారు. ఈ విషయంపై మృతుడి భార్య, ఇతర కుటుంబ సభ్యులు నోరు విప్పితేనే అసలు విషయం బయటకు వస్తుందంటున్నారు.

ఇదిలా ఉండగా.. మృతదేహం లభించిన స్థలం రెండు అపార్ట్‌మెంట్ల మధ్య ఉండటం, ఒకవేళ పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటే అతని హాహాకారాలు అక్కడ నివాసం ఉండేవారికి వినిపించకోపోవడం అనుమానాలకు తావిస్తోంది.    పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో గౌతమ్‌రెడ్డి తన వెంట సెల్‌ఫోన్‌ పట్టుకెళ్లాడని, వాచ్‌ ధరించి ఉన్నాడని కుటుంబ సభ్యులు పేర్కొనడం, ఆ తర్వాత  సెల్‌ఫోన్‌ తీసుకెళ్లలేదని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement