rasoolpura
-
రసూల్‌పురా ఫ్లై ఓవర్ డిజైన్.. మారున్..
సాక్షి, సిటీబ్యూరో: హై సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) పథకం కింద ఫ్లై ఓవర్లు, రహదారులు తదితర పనులకు ప్రభుత్వం రూ.7 వేల కోట్లకు పైగా పరిపాలన అనుమతులు మంజూరు చేయడంతో పనులు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లోని క్షేత్రస్థాయి పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే రూపొందించిన డిజైన్లను మార్చాలని భావిస్తున్నారు. అలా.. ఆల్విన్ జంక్షన్, జేఎన్టీయూ జంక్షన్ల వద్ద డిజైన్ల మార్పునకు ఇప్పటికే కన్సల్టెంట్లను ఆహా్వనించిన అధికారులు తాజాగా రసూల్‌పురా ఫ్లై ఓవర్/అండర్‌పాస్ డిజైన్లను కూడా మార్చేందుకు సిద్ధమయ్యారు. ప్రత్యామ్నాయ డిజైన్ అవసరం.. మెట్రో రెండోదశ దృష్టిలో ఉంచుకొని ఆల్విన్, జేఎన్టీయూ జంక్షన్ల వద్ద డిజైన్ల మార్పుకు సిద్ధమైన అధికారులు బేగంపేట సమీపంలోని రసూల్‌పురా ఫ్లై ఓవర్ /అండర్‌పాస్ నిర్మాణానికి డిఫెన్స్ భూములు సేకరించాల్సి ఉందన్నారు. ఎక్కువ భూ ములు ఇచ్చేందుకు సంబంధిత అధికారులు సుముఖంగా లేకపోవడంతో భూసేకరణ వీలైనంత తగ్గించేందుకు కొత్త డిజైన్ల కోసం కన్సల్టెంట్లను ఆహా్వనించినట్లు పేర్కొన్నారు. ఈ టెండరు పొందే కన్సల్టెంట్స్ ఇప్పటికే ఉన్న డిజైన్‌ను పరిశీలించి, ప్రత్యా మ్నాయ డిజైన్‌ను రూపొందించాల్సి ఉంటుంది. రూ.105 కోట్లు మంజూరు.. ⇒ ఈ ఫ్లై ఓవర్/అండర్‌పాస్ పనులకు ప్రభుత్వం రూ. 105 కోట్లు మంజూరు చేయడంతో పని ప్రారంభించేందుకు పరిస్థితుల్ని అధ్యయనం చేసిన అధికారులు ప్రత్నామ్నాయ డిజైన్‌తో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ రిపోర్ట్ కోసం (పీపీఆర్) కన్సల్టెంట్లను ఆహా్వనించారు. తక్కువ భూసేకరణతో పాటు ప్రజల భద్రత, సేవల పెంపుదల కొత్త డిజైన్ ప్రధాన లక్ష్యం. సేకరించాల్సిన ఆస్తుల సరిహద్దులతోపాటు యుటిలిటీస్ షిఫ్టింగ్ వంటి అంశాలను కూడా బేరీజు వేసి, ఉన్న డిజైన్ కంటే మెరుగైన డిజైన్ రూపొందించాల్సి ఉంటుంది. ⇒ సమీప ప్రాంతాల్లో ప్రస్తుతం పురోగతిలో ఉన్న ప్రాజెక్టులు, మెట్రో రైలు, బీఆర్టీఎస్, సీటీఎస్ మాస్టర్ప్లాన్లను కూడా దృష్టిలో ఉంచుకోవడంతో పాటు ప్రాజెక్టు వ్యయం తగ్గేందుకు కూడా తగిన మార్గాలుంటే సూచించాలి. ఇంకా, మేజర్ జంక్షన్లు, బాటిల్‌నెక్స్, ప్రార్థనా మందిరాలు, శ్మశాన వాటికల వంటి వాటిని దృష్టిలో ఉంచుకోవాలి. రాబోయే ఇరవయ్యేళ్ల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ఫ్రీగా ప్రయాణం సజావుగా సాగేందుకు శాశ్వత పరిష్కారంగా కొత్త డిజైన్ ప్లాన్ ఉండాలి. -
బేగంపేట మార్గంలో మళ్లీ ట్రాఫిక్ ఆంక్షలు.. ఫిబ్రవరి 21 వరకు..
సాక్షి, హైదరాబాద్: బేగంపేట రసూల్‌పురా చౌరస్తా– మినిస్టర్ రోడ్డులోని రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్ మధ్య ఉన్న నాలా పునరుద్ధరణ దృష్ట్యా ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జీహెచ్ఎంసీ ఎస్ఎన్డీపీ–11 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అభ్యర్ధన మేరకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 21 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ► బేగంపేట ఫ్లైఓవర్ వైపు నుంచి కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్డు, రాణిగంజ్, నల్లగుట్ట, పీవీఎన్ఆర్ మార్గ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను రసూల్ చౌరస్తా వద్ద రైట్ టర్న్ తీసుకోవడానికి అనుమతించరు. అయితే అక్కడ యూ టర్న్ తీసుకోవచ్చు. బేగంపేట ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను హనుమాన్ టెంపుల్ నుంచి ఫుడ్‌వరల్డ్, సింథికాలనీ మీదుగా రాంగోపాల్‌పేట పీఎస్, మినిస్టర్ రోడ్డు, కిమ్స్ హాస్పిటల్ వైపు అనుమతిస్తారు. ► రాణిగంజ్, నల్లగుట్ట, పీవీఎన్ఆర్ మార్గ్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను రసూల్‌పురా వైపు అనుమతించరు. వీరు రాంగోపాల్‌పేట పీఎస్, సింథికాలనీ, ఫుడ్‌వరల్డ్, హనుమాన్ టెంపుల్ మీదుగా రసూల్‌పురా వైపు వెళ్లాల్సి ఉంటుంది. ► సికింద్రాబాద్ వైపు నుంచి కిమ్స్ ఆస్పత్రి వైపు వచ్చే ట్రాఫిక్‌ను సైతం హనుమాన్ టెంపుల్ నుంచి ఫుడ్‌వరల్డ్, సింథికాలనీ, రాంగోపాల్‌పేట పీఎస్ వద్ద ఎడమ వైపు మళ్లి మినిస్టర్ రోడ్డులో కిమ్స్ వైపునకు వెళ్లవచ్చు. లేదా సీటీఓ ప్యారడైజ్, రాణిగంజ్ వద్ద కుడివైపునకు మళ్లి కిమ్స్ వైపు మళ్లవచ్చు. ► అంబులెన్స్‌లు లేదా రోగులు బేగంపేట ఫ్లైఓవర్ నుంచి మినిస్టర్ రోడ్డు కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లేవారు సీటీఓ/ మీటింగ్ పాయింట్ వద్ద యూ టర్న్ తీసుకుని సింథికాలనీ, రాంగోపాల్ పేట పీఎస్ నుంచి కిమ్స్ హాస్పిటల్ వైపుగా వెళ్లేందుకు బైలేన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ► భారీ వాహనాలు (బస్సులు, డీసీఎంలు, లారీలు) హనుమాన్ దేవాలయం నుంచి సింథికాలనీ, పీజీ రోడ్డు, సికింద్రాబాద్ వైపు రెండు వైపులా అనుమతించరు. ఆ వాహనాలు మినిస్టర్ రోడ్డుకు చేరుకోవడానికి రాణిగంజ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. నగర పౌరులు ఈ ఆంక్షలను గమనించి సూచించిన మార్గాల్లో గానీ, ప్రత్యామ్నాయ మార్గాల్లో గానీ తమ గమ్యస్థానాలను సులువగా చేరుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు. -
బైక్‌పై వెళ్లి.. ఆకస్మిక తనిఖీలు చేపట్టిన హైదరాబాద్ కలెక్టర్
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య హైదరాబాద్‌లో భాగంగా కరోనా మహమ్మారి కట్టడి కోసం వంద శాతం లక్ష్యంగా కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంపై హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆదివారం సికింద్రాబాద్ రసూల్‌పురాలోని గన్‌బజార్ కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్న వాక్సి నేషన్ సెంటర్‌ను ఆయన సందర్శించారు. కారు వెళ్లలేని కాలనీలకు కలెక్టర్ బైక్‌పై వెళ్లారు. ఓ వ్యక్తి బైక్ నడుపుతుండగా ఆయన వెనక కూర్చుని తనిఖీలకు దిగారు. ఇంటికి స్టిక్కర్ అంటించారా? లేదా? అని పరిశీలించారు. అధికారులు వచ్చి వాక్సినేషన్ గురించి వివరించి వివరాలు సేకరించారా? లేదా? అని స్థానికులను ఆరా తీశారు. ఆయన వెంట డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి తదితరులు ఉన్నారు. చదవండి: కత్తులు పట్టుకొని బాలీవుడ్ డైలాగులు.. వాట్సాప్ స్టేటస్లు -
డెంగ్యూతో ఆరేళ్ల బాలిక మృతి
రసూల్‌పురా (హైదరాబాద్ సిటీ) : కంటోన్మెంట్ బోర్డు 3వవార్డు పరిధిలోని బాలంరాయి ఈద్గాలో ఆరేళ్ళ బాలిక ప్రాణాంతకమైన డెంగ్యూ వ్యాధి బారిన పడి మృతి చెందింది. స్థానికంగా నివాసం ఉండే ఖదీర్‌పాష, జూబీన్‌బేగంల ఆరేళ్ల కూతురు ఆసిఫా ఫాతిమా సికింద్రాబాద్‌లోని ఎంఎస్ క్రియేటివ్ స్కూల్లో ఒకటోతరగతి చదువుతున్నది. మూడు రోజుల క్రితం ఫాతిమాకు తీవ్ర జ్వరం వచ్చింది. కార్ఖానలోని సౌమ్య ఆసుపత్రిలో చేర్పించారు. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి డెంగ్యూ వ్యాధి ఉన్నట్లు వైద్యులు తేల్చారు. దీంతో శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్‌లోని రెయిన్బో చిల్డ్రన్స్ ఆసుపత్రికి హుటాహుటిన తీసుకెళ్ళారు. ఆదివారం తెల్లవారుజామున ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. -
సంచలనం రేపుతున్న ఎన్ఆర్ఐ మృతి!?
రసూల్‌పురా: అనుమానాస్పద స్థితిలో ఓ ఎన్ఆర్ఐ మృతిచెందాడు. గతనెల 29న కెన్యా నుంచి పాతబోయిన్‌పల్లిలోని తన ఇంటికి చేరుకున్న ఆయన వాకింగ్‌కని ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయాడు. ఐదు రోజుల తర్వాత శవమై కనిపించాడు. అతడిది ఆత్మహత్యా? హత్యా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోయిన్పల్లి పోలీసుల కథనం ప్రకారం...పాతబోయిన్‌పల్లి రాజారెడ్డికాలనీకి చెందిన గౌతమ్‌రెడ్డి (30) ఎనిమిదేళ్ల క్రితం కెన్యా వెళ్లి వ్యాపారం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. ఎనిమిది నెలల క్రితం కర్నూలు డోన్‌కు చెందిన యామినితో ఈయనకు పెళ్లైంది. కాగా, గౌతమ్‌రెడ్డి గతనెల 29న కెన్యా నుంచి రాజారెడ్డికాలనీలోని తన ఇంటికి వచ్చాడు. అదేరోజు రాత్రి 7.20కి వాకింగ్‌కు వెళ్లొస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు 30న బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా... శుక్రవారం బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని డయిరీఫాం వద్ద నిర్మానుష్య ప్రదేశంలోని చెట్లపొదల్లో ఒంటిపై దుస్తులు కాలిపోయి, కుళ్లిన స్థితిలో ఓ శవం పడి ఉండగా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా.. ఖాళీ పెట్రోల్ బాటిల్, పక్కనే ఓ పర్సు పడి ఉన్నాయి. పర్సు ఆధారంగా పోలీసులు మృతుడు ఎన్ఆర్ఐ గౌతమ్‌రెడ్డిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా, మృతుడికి నగరంలో శత్రువులు లెవరూ లేరని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆత్మ‘హత్య’? గౌతమ్‌రెడ్డి ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే, కెన్యా నుంచి నగరానికి వచ్చి ప్రాణం తీసుకోవాల్సిన అఘాయిత్యం ఏమిటని అంటున్నారు. గతనెల 29న సాయంత్రం ఇంటికి చేరుకున్న గౌతమ్‌రెడ్డి.. ఇంట్లో ఉన్న మూడు గంటల్లో ఏదైనా సంఘటన జరిగిందా? అని అనుమానిస్తున్నారు. ఈ విషయంపై మృతుడి భార్య, ఇతర కుటుంబ సభ్యులు నోరు విప్పితేనే అసలు విషయం బయటకు వస్తుందంటున్నారు. ఇదిలా ఉండగా.. మృతదేహం లభించిన స్థలం రెండు అపార్ట్మెంట్ల మధ్య ఉండటం, ఒకవేళ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటే అతని హాహాకారాలు అక్కడ నివాసం ఉండేవారికి వినిపించకోపోవడం అనుమానాలకు తావిస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో గౌతమ్‌రెడ్డి తన వెంట సెల్‌ఫోన్ పట్టుకెళ్లాడని, వాచ్ ధరించి ఉన్నాడని కుటుంబ సభ్యులు పేర్కొనడం, ఆ తర్వాత సెల్‌ఫోన్ తీసుకెళ్లలేదని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. -
ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
రసూల్‌పురా : ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అని నార్త్‌జోన్ ట్రాఫిక్ ఏసీపీ ముత్యంరెడ్డి అన్నారు. మారేడుపల్లి ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ లేని 150 మంది వాహనదారులు, లెసైన్స్ లేని 25 మంది ద్విచక్ర వాహనదారులు పట్టుపడ్డారు. వీరికి జరిమానా విధించారు. సుమారు 500ల మంది వాహనదారులకు హెల్మెట్ వాడకంపై కౌన్సెలింగ్ ఇచ్చారు. రూ.100, రూ.150 రూపాయల చొప్పున జరిమానా విధించి వారి వివరాలను డేటాబేస్‌లో పొందుపరిచారు. మరోసారి పట్టుబడితే ట్రాఫిక్ ఉల్లంఘన చట్టం ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సైలు అమానుల్లా, శ్రీనివాస్‌రావులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బైకులను ధ్వంసం చేసిన అగంతకులు
హైదరాబాద్ : రసూల్‌పురా ఇందిరానగర్‌లో గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు బైకులు, సైకిళ్లను దహనం చేశారు. స్థానికంగా నివాసం ఉంటున్న సిద్దులు కుటుంబానికి చెందిన మూడుబైకులు, ఒక సైకిల్ని రాత్రి ఇంటి ముందు పార్కు చేశారు. తెల్లవారు జామున అగంతకులు ఆ బైకులు, సైకిల్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో వాహానాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని చెప్పుతున్నారు. సిద్దులు కుటుంబానికి ఎవరి మీదనైనా అనుమానం ఉందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ఉద్యోగానికి వెళ్లి అదృశ్యమైన యువతి
రసూల్‌పురా (హైదరాబాద్) : ఉద్యోగానికి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన బోయిన్పల్లి పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం... బోయిన్పల్లి చినతోకట్ట సంజీవయ్యకాలనీలో ఉండే బి. ప్రభాకర్ కుమార్తె మౌనిక(19) ఓ ప్రైవేటు కార్యాలయంలో పనిచేస్తోంది. కాగా ఆమె ఈ నెల 6వ తేదీన ఉద్యోగానికి వెళుతున్నానంటూ ఉదయం 9.30 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి వెళ్లింది. అయితే సాయంత్రం ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఆరా తీసినా ఫలితం కనిపించలేదు. దీంతో వారు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు. -
వెలుగుబాట
‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. సదా మీ సేవలో మేము సైతం అంటూ చేతులు కలిపి... తమ చేతల వివరాలను పంచుకుంటున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్న ఐదో కథనమిది. పొద్దంతా స్వేదం చిందిస్తే తప్ప పూట గడవని నేపథ్యం.. అడుగు ముందుకు వేయాలంటే అడ్డం పడే పేదరికం.. బతుకుల్ని వెక్కిరించే నిరక్షరాస్యత.. అయినా ప్రతికూల పరిస్థితులకు వారు తలవంచలేదు. తాము పడిన కష్టం మరెవరూ పడకూడదనే తలంపుతో ఒక మంచి ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. బస్తీలకు ‘కంటిచూపు’గా మారి వెలుగుబాట చూపుతున్నారు. rakshana161@gmail.com రసూల్‌పురా మురికివాడ. ఆ బస్తీలో తెల్లవారుతూనే అందరినీ పలకరించేది పేదరికమే. పొద్దంతా పని చేస్తేనే అందరికీ పూట గడిచేది. జి.జ్యోతి, రజని, సరిత, శివరంజని, కె.పుష్పలత. పి.పుష్ప, రజిత, సురేఖ.. ఈ పరిస్థితులకు వీరూ మినహాయింపు కాదు. అంతంత మాత్రం చదువులు.. నిరుపేద బతుకులు.. పొద్దునే ఇల్లు విడిచి వెళ్లిన అమ్మానాన్నలు పనిచేసి మళ్లీ ఏ రాత్రికో ఇంటికి రావడం ఏళ్ల తరబడి చూశారు. చదువుకోవాలన్న ఆశను ఆర్థిక దుస్థితి చిదిమేసింది. కన్నీళ్లతో పాటు ఆశలు, ఆశయాల్ని దిగమింగుకుని పెరిగిన వీరిలో.. తమలాగే తమ పిల్లలు, ఇతరులు కష్టాలు పడకూడదని తలిచారు. ఏదైనా చేయాలనే వీరి ఆశయానికి.. ‘ఆపరేషన్ ఐసెట్ యూనివర్సల్’ సంస్థ సేవా కార్యక్రమాలు ప్రేరణనిచ్చాయి. వెంటనే అందులో హెల్త్ కో-ఆర్డినేటర్లుగా చేరారు. తమకు వచ్చిన, నేర్చిన విద్యతోనే బస్తీవాసుల్ని ఆరోగ్యంపై చైతన్యం చేసేవారు. రోజూ తమలాంటి ఎన్నో కుటుంబాలను కలిసే వారు. పిల్లలకు విద్య ప్రాధాన్యాన్ని వివరిస్తూనే కంటి సంరక్షణ చర్యలను వివరించే వారు. కొన్నాళ్లకు ఆపరేషన్ ఐసెట్ యూనివర్సల్ ప్రాజెక్టు వర్క్ పూర్తికావడంతో వీరంతా ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేశారు. అప్పుడే సొంతంగా బస్తీవాసుల కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. 2011 మార్చిలో ‘ర క్షణ వెల్ఫేర్ అసోసియేషన్’ ఏర్పాటు చేశారు. ఇందుకు కుటుంబసభ్యులు, స్థానికుల సహకారం అందింది. దీంతో పూర్తి స్థాయి సేవా కార్యక్రమాలను విస్తృతం చేశారు. ‘డబ్బులున్న వారు ఇంకా డబ్బు సంపాదించడంలోనే నిమగ్నమైపోతున్నారు. మరి పేదల గురించి ఎవరు పట్టించుకుంటారు?’.. ఈ ప్రశ్నే తమ సేవకు పునాది అని ఈ ఎనిమిది మంది చెబుతారు. పేద బతుకుల్లో వెలుగులు రసూల్‌పుర మురికివాడలోని శ్రీలంకబస్తీ, ఇందిరమ్మనగర్, రసూల్‌పుర, సీబీఎన్ నగర్, అన్నానగర్, అర్జున్‌నగర్, అంబేద్కర్ నగర్, కృష్ణానగర్, సిల్వర్ కంపెనీ, 105 గల్లీ, బీరప్పగుడి, రావిచెట్టు గల్లీ.. ఈ బస్తీల్లోని ఇంటింటికీ ‘రక్షణ’ సభ్యులు తిరిగి విద్య, వైద్యంపై ప్రజలను జాగృతం చేస్తారు. అనారోగ్య సమస్యలతో బాధపడే వారిని గుర్తిస్తారు. వారి కోసం వారానికి ఒక ఉచిత వైద్య శిబిరం నిర్వహించి మందులను పంపిణీ చేస్తున్నారు. ప్రత్యేకించి కంటి లోపాలున్న వారిని గుర్తించే బృహత్తర కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నారు. వీరి కోసం ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి, ఆపరేషన్ ఐసైట్ వారి సహకారంతో వైద్యం అందిస్తున్నారు. బస్తీవాసుల్లో కంటి శుక్లాలు గుర్తించడం, చూపు అవశ్యకత, పోషకాహారంతో కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నామన్నారు సంస్థ అధ్యక్షురాలు సరిత. బస్తీలకు ‘కంటిచూపు’ చాలా వర కు కంటి సమస్యలు పౌష్టికాహార లోపంతోనే తలెత్తుతున్నాయని గుర్తించిన వీరు.. బాల్యం నుంచే పోషక విలువలు గల ఆహారం అందజేస్తే సమస్య పరిష్కారమైనట్టేనని తెలుసుకున్నారు. ఈ క్రమంలో రసూల్‌పురా పరిసర ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు సహకరించడంతో పాటు పలు పాఠశాలల విద్యార్థులు, గర్భిణులకు పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. పిల్లల రోజువారీ మెనూలో అధిక పోషక పదార్థాలు లభించే ఆహారం తీసుకునేలా వారిని చైతన్య పరుస్తూ ముందుకెళుతున్నారు. ‘రక్షణ’ సభ్యులు తలా చేయి వేసుకొని పిల్లలకు పౌష్టికాహరం అందిస్తున్నారు. పిల్లలకు, వారి తల్లిదండ్రులకు చదువు వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. ‘మా కృషిని గుర్తించిన ఒకటి, రెండు ఎన్జీవోలు ఆసరానిస్తుండటంతో సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నామ’ని చెప్పారు సంస్థ కార్యదర్శి జ్యోతి. ‘ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా.. అనుకున్న దారిలో ముందుకెళ్తున్నాం. వందలాది మందికి కాటరాక్ట్ ఆపరేషన్లు, మెరుగైన చూపు కోసం కళ్లజోళ్లు పంపిణీ చేశాం. పేదరికం వెక్కిరిస్తున్నా.. కుటుంబసభ్యుల సహకారంతో నలుగురికీ సేవ చేయగలుగుతున్నామంటున్నారు ‘రక్షణ’ సభ్యులు.