వెలుగుబాట
‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. సదా మీ సేవలో మేము సైతం అంటూ చేతులు కలిపి... తమ చేతల వివరాలను పంచుకుంటున్నాయి.
ఈ వరుసలో ప్రచురితమవుతున్న ఐదో కథనమిది. పొద్దంతా స్వేదం చిందిస్తే తప్ప పూట గడవని నేపథ్యం.. అడుగు ముందుకు వేయాలంటే అడ్డం పడే పేదరికం.. బతుకుల్ని వెక్కిరించే నిరక్షరాస్యత.. అయినా ప్రతికూల పరిస్థితులకు వారు తలవంచలేదు. తాము పడిన కష్టం మరెవరూ పడకూడదనే తలంపుతో ఒక మంచి ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. బస్తీలకు ‘కంటిచూపు’గా మారి వెలుగుబాట చూపుతున్నారు.
rakshana161@gmail.com
రసూల్‌పురా మురికివాడ. ఆ బస్తీలో తెల్లవారుతూనే అందరినీ పలకరించేది పేదరికమే. పొద్దంతా పని చేస్తేనే అందరికీ పూట గడిచేది. జి.జ్యోతి, రజని, సరిత, శివరంజని, కె.పుష్పలత. పి.పుష్ప, రజిత, సురేఖ.. ఈ పరిస్థితులకు వీరూ మినహాయింపు కాదు. అంతంత మాత్రం చదువులు.. నిరుపేద బతుకులు.. పొద్దునే ఇల్లు విడిచి వెళ్లిన అమ్మానాన్నలు పనిచేసి మళ్లీ ఏ రాత్రికో ఇంటికి రావడం ఏళ్ల తరబడి చూశారు. చదువుకోవాలన్న ఆశను ఆర్థిక దుస్థితి చిదిమేసింది.
కన్నీళ్లతో పాటు ఆశలు, ఆశయాల్ని దిగమింగుకుని పెరిగిన వీరిలో.. తమలాగే తమ పిల్లలు, ఇతరులు కష్టాలు పడకూడదని తలిచారు. ఏదైనా చేయాలనే వీరి ఆశయానికి.. ‘ఆపరేషన్ ఐసెట్ యూనివర్సల్’ సంస్థ సేవా కార్యక్రమాలు ప్రేరణనిచ్చాయి. వెంటనే అందులో హెల్త్ కో-ఆర్డినేటర్లుగా చేరారు. తమకు వచ్చిన, నేర్చిన విద్యతోనే బస్తీవాసుల్ని ఆరోగ్యంపై చైతన్యం చేసేవారు. రోజూ తమలాంటి ఎన్నో కుటుంబాలను కలిసే వారు. పిల్లలకు విద్య ప్రాధాన్యాన్ని వివరిస్తూనే కంటి సంరక్షణ చర్యలను వివరించే వారు.
కొన్నాళ్లకు ఆపరేషన్ ఐసెట్ యూనివర్సల్ ప్రాజెక్టు వర్క్ పూర్తికావడంతో వీరంతా ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేశారు. అప్పుడే సొంతంగా బస్తీవాసుల కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. 2011 మార్చిలో ‘ర క్షణ వెల్ఫేర్ అసోసియేషన్’ ఏర్పాటు చేశారు. ఇందుకు కుటుంబసభ్యులు, స్థానికుల సహకారం అందింది. దీంతో పూర్తి స్థాయి సేవా కార్యక్రమాలను విస్తృతం చేశారు. ‘డబ్బులున్న వారు ఇంకా డబ్బు సంపాదించడంలోనే నిమగ్నమైపోతున్నారు. మరి పేదల గురించి ఎవరు పట్టించుకుంటారు?’.. ఈ ప్రశ్నే తమ సేవకు పునాది అని ఈ ఎనిమిది మంది చెబుతారు.
పేద బతుకుల్లో వెలుగులు
రసూల్‌పుర మురికివాడలోని శ్రీలంకబస్తీ, ఇందిరమ్మనగర్, రసూల్‌పుర, సీబీఎన్ నగర్, అన్నానగర్, అర్జున్‌నగర్, అంబేద్కర్ నగర్, కృష్ణానగర్, సిల్వర్ కంపెనీ, 105 గల్లీ, బీరప్పగుడి, రావిచెట్టు గల్లీ.. ఈ బస్తీల్లోని ఇంటింటికీ ‘రక్షణ’ సభ్యులు తిరిగి విద్య, వైద్యంపై ప్రజలను జాగృతం చేస్తారు. అనారోగ్య సమస్యలతో బాధపడే వారిని గుర్తిస్తారు. వారి కోసం వారానికి ఒక ఉచిత వైద్య శిబిరం నిర్వహించి మందులను పంపిణీ చేస్తున్నారు.
ప్రత్యేకించి కంటి లోపాలున్న వారిని గుర్తించే బృహత్తర కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నారు. వీరి కోసం ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి, ఆపరేషన్ ఐసైట్ వారి సహకారంతో వైద్యం అందిస్తున్నారు. బస్తీవాసుల్లో కంటి శుక్లాలు గుర్తించడం, చూపు అవశ్యకత, పోషకాహారంతో కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నామన్నారు సంస్థ అధ్యక్షురాలు సరిత.
బస్తీలకు ‘కంటిచూపు’
చాలా వర కు కంటి సమస్యలు పౌష్టికాహార లోపంతోనే తలెత్తుతున్నాయని గుర్తించిన వీరు.. బాల్యం నుంచే పోషక విలువలు గల ఆహారం అందజేస్తే సమస్య పరిష్కారమైనట్టేనని తెలుసుకున్నారు. ఈ క్రమంలో రసూల్‌పురా పరిసర ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలకు సహకరించడంతో పాటు పలు పాఠశాలల విద్యార్థులు, గర్భిణులకు పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. పిల్లల రోజువారీ మెనూలో అధిక పోషక పదార్థాలు లభించే ఆహారం తీసుకునేలా వారిని చైతన్య పరుస్తూ ముందుకెళుతున్నారు. ‘రక్షణ’ సభ్యులు తలా చేయి వేసుకొని పిల్లలకు పౌష్టికాహరం అందిస్తున్నారు. పిల్లలకు, వారి తల్లిదండ్రులకు చదువు వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు.
‘మా కృషిని గుర్తించిన ఒకటి, రెండు ఎన్జీవోలు ఆసరానిస్తుండటంతో సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నామ’ని చెప్పారు సంస్థ కార్యదర్శి జ్యోతి. ‘ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా.. అనుకున్న దారిలో ముందుకెళ్తున్నాం. వందలాది మందికి కాటరాక్ట్ ఆపరేషన్‌లు, మెరుగైన చూపు కోసం కళ్లజోళ్లు పంపిణీ చేశాం. పేదరికం వెక్కిరిస్తున్నా.. కుటుంబసభ్యుల సహకారంతో నలుగురికీ సేవ చేయగలుగుతున్నామంటున్నారు ‘రక్షణ’ సభ్యులు.