మేక్ ఎ స్మైల్ | great response from charitable organizations with sada mee seva | Sakshi
Sakshi News home page

మేక్ ఎ స్మైల్

Published Sat, Nov 15 2014 12:25 AM | Last Updated on Thu, May 24 2018 1:33 PM

మేక్ ఎ  స్మైల్ - Sakshi

మేక్ ఎ స్మైల్

‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. సదా మీ సేవలో మేము సైతం అంటూ చేతులు కలిపి... తమ చేతల వివరాలను పంచుకుంటున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్న నాలుగో కథనమిది.  మార్పు మంచిదైతే.. అది ఎక్కడ మొదలైనా అంతటికీ పాకుతుంది. అందుకే కేరళలో మొదలైన ఓ మంచి మార్పు.. సిటీకి చేరింది. ‘మేక్ ఎ డిఫరెన్స్’ (మ్యాడ్)గా వచ్చి మనసున్న హైదరాబాదీలను కదిలించి.. మారాజులను చేసింది.

తోటివారికి తోచిన సాయం చేయడానికి తీరిక చూసుకునేలా చేసింది. ఆ సాయం చదువైతే.. అంతకు మించిన మార్పు ఇంకే ం కావాలి చెప్పండి. తొమ్మిదేళ్ల కిందట కేరళలో కొందరు స్నేహితులు ఓ బాయ్స్ హాస్టల్‌కు వెళ్లారు. అక్కడున్న కుర్రాళ్లు.. లెక్కల్లో ఏవో డౌట్లుంటే వీరిని అడిగారు. పిల్లల ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పారు. ఆ మిత్ర బృందం వెనుదిరిగే సమయంలో.. ఓ బాలుడు ‘అన్నా.. మళ్లీ ఎప్పుడొస్తారు..?’ అని అడిగాడు. ‘వచ్చే వారం’ అన్నారు.

ఆ సంఘటనే ‘మేక్ ఎ డిఫరెన్స్’కు బీజం వేసింది. ఈ సేవాభావానికి అది మొదటి నెలవైంది. ఆ మిత్రులు మొదటి వాలంటీర్లయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 23 మ్యాడ్ సెంటర్లున్నాయి. ఇందులో రెండు వేల మంది వాలంటీర్లున్నారు. ఐదు వేల మంది అనాథ పిల్లలకు మ్యాడ్ తరఫున ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్‌మెంట్, ఎంకరేజ్‌మెంట్.. ఇలా రకరకాల సేవలందుతున్నాయి.
 
నగరంలో మార్పు..

హైదరాబాద్‌లో ఏడు మ్యాడ్ సెంటర్లున్నాయి. అమీర్‌పేట్, బోయిన్‌పల్లి, సీతాఫల్‌మండి, కోఠి, మలక్‌పేట, ఖైరతాబాద్, ముషీరాబాద్‌లోని అనాథాశ్రమాల్లో మ్యాడ్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ అనాథాశ్రమాల్లో మూడు వందలకు పైగా చిన్నారులు ఉన్నారు. వారాంతాల్లో వాలంటీర్లు ఈ హోమ్స్‌కి వెళ్లి చిన్నారులకు మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో ట్యూషన్ చెప్తారు. నగరంలో వాలంటీర్ల సంఖ్య వెయ్యికి పైమాటే. వీరిలో టీచర్లు మొదలు విద్యార్థుల వరకూ అన్ని రంగాలకు చెందిన వారు ఉన్నారు.

‘మాకు తోచినట్టు నాలుగక్షరాలు చెప్పి వచ్చేస్తే సరిపోదు.. ఏ టీచర్ (వాలంటీర్) ఎలా చెబుతున్నారో.. విద్యార్థుల నుంచి మ్యాడ్ సెంటర్ హెడ్ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. దాన్ని బట్టి మా బోధనలో లోటుపాట్లు తెలుసుకుని మార్చుకోవాల్సి ఉంటుంది. వాలంటీర్‌గా చేస్తున్న సేవే కదా అన్న చిన్న చూపు ఇక్కడ ఉండదు. అంతా ప్రొఫెషనల్‌గా ఉంటుంది’ అని చెప్పారు అలేఖ్య.

అన్నీ వారే..
మ్యాడ్ సభ్యులు అక్షర జ్ఞానం వెలిగించడమే కాదు.. పిల్లలకు ఆనంద జ్యోతులు పంచుతున్నారు. ఆలనాపాలనా కరువైన చిన్నారులకు అన్నీ వీళ్లే అవుతారు. పండుగల వేళ అన్ని సెంటర్లకు సందడి మోసుకొస్తారు. మ్యాడ్ సభ్యుల పుట్టిన రోజులు, పెళ్లి రోజులు.. ఇలా ఏ వేడుకైనా ఆ సెంటర్లలోనే చేసుకుని వాళ్ల ఆనందం పిల్లలతో పంచుకుంటారు. అంతేకాదు పిల్లల్లోని కళలను వెలికితీసే కార ్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. కొన్ని వేడుకలకు సెలబ్రిటీలను తీసుకొస్తారు కూడా.

మొన్నామధ్య ముషీరాబాద్‌లోని రెయిన్‌బో చిల్డ్రన్స్ హోమ్‌కి సానియా మీర్జాని తీసుకొచ్చి చిన్నారుల ముఖాల్లో సంతోషం నింపారు. అలాగే నగరానికి వచ్చే విదేశీయులను కూడా ఈ సెంటర్లకు తీసుకొచ్చి పిల్లలకు కొత్త పరిచయాలు చేస్తుంది మ్యాడ్. ‘చదువు, ఉద్యోగం, కుటుంబం.. ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే. వీకెండ్‌లో కొన్ని గంటలు ఈ పిల్లల దగ్గరకు వెళ్లి వారికి పాఠాలు చెప్పడం మంచి అనుభూతినిస్తుంది’ అని చెప్పారు సిద్ధి. చిన్నారులతో అనుబంధం పెరగటానికి వారి దగ్గరికి వెళ్లినపుడు ఒట్టి చేతుల్తో కాకుండా బిస్కెట్లు, చాక్లెట్లు తీసుకెళ్తుంటారు.
 
మెంబర్ కావాలంటే..
వీలున్నప్పుడు ఈ సెంటర్లకు వెళ్లి తెలిసిన నాలుగు అక్షరం ముక్కలు చెప్పేస్తే మనం కూడా మ్యాడ్ సభ్యులం అయిపోవచ్చు అనుకుంటే పొరపాటు. ఇందులో సభ్యులుగా చేరితే కనీసం ఏడాది పాటు పనిచేయాల్సి ఉంటుంది. ముందుగా మ్యాడ్ వెబ్‌సైట్(ఠీఠీఠీ.ఝ్చజ్ఛ్చుఛీజీజజ.జీ)లో లాగిన్ కావాలి. అందులో జాయిల్ లింక్‌లోకి వెళ్లి మీ వివరాలన్నీ అప్‌డేట్ చేస్తే మీకు ఇంటర్వ్యూకి కాల్ వస్తుంది. సదరు వ్యక్తి మ్యాడ్ సభ్యుడిగా పనికొస్తారో లేదో అందులో తేల్చేస్తారు.

‘మ్యాడ్ చదువు, సర్టిఫికెట్ చూడదు. పిల్లలతో కలసిపోయే మనస్తత్వాన్ని చూస్తుంది’ అని చెబుతారు స్వాతి. ప్రతి సభ్యుడి నుంచి రూ.700 డిపాజిట్ కట్టించుకుంటారు. ఏడాది తర్వాత సభ్యుడు తన డబ్బులు రిటర్న్ తీసుకోవచ్చు. ఏడాదిలోపు మానే సే వారికి అవి తిరిగి ఇవ్వరు. ఆ పైకాన్ని విద్యార్థుల అవసరాలకు మళ్లిస్తారు. ఒక సభ్యుడిని ఎన్నుకునే విషయంలో ఎంత నిక్కచ్చిగా ఉంటుందో.. నా అన్నవారు లేని విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు ఇవ్వడంలోనూ అంతే పట్టుదలగా ఉంది. మ్యాడ్ సేవలు మరింత వేగంగా విస్తరించాలని కోరుకుందాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement