సంబరాల సంస్కృతి | traditions with celebrations | Sakshi
Sakshi News home page

సంబరాల సంస్కృతి

Published Sun, Mar 22 2015 11:13 PM | Last Updated on Thu, May 24 2018 1:33 PM

సంబరాల సంస్కృతి - Sakshi

సంబరాల సంస్కృతి

బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి ఈస్ట్‌మన్ కలర్ పిక్చర్స్ వరకూ.. లేడీస్ క్లబ్ సీన్లు చాలానే చూశాం. సినీఫక్కీలో చెప్పాలంటే లేడీస్ క్లబ్ అంటే.. చారడేసి కళ్లు కనిపించకుండా బారడేసి గాగుల్స్.. ఖరీదైన రిస్ట్ వాచ్..ఆపై హ్యాండ్‌బ్యాగ్ వేసుకున్న అతివలే కళ్లముందు కదలాడతారు. ‘ఓ పదివేలు కావాలి.. మా క్లబ్ తరఫున ఈవెంట్ చేస్తున్నాం’ అని పతిదేవుడ్ని పట్టుపట్టి చెక్కుపట్టే క్యారెక్టర్లు మనకు ఎప్పుడో పరిచయం. కానీ సంస్కృతి లేడీస్ క్లబ్ మాత్రం ఇందుకు భిన్నం. సుమారు మూడు దశాబ్దాల కిందట పురుడుపోసుకున్న ఈ క్లబ్.. సంస్కృతి, సంప్రదాయాలకు కేరాఫ్‌గా నిలుస్తూ, చారిటీకి వెన్యూగా మారుతోంది.
 ..:: ఎస్.సత్యబాబు
 
ఏడుగురితో(కుముద్, సరోజ్ రోహిత్(లేటు), రేణుజీవన్, లతాకపాడియా, లీలమ్ కపాడియా, కోకిలా కడాకియా,  వీణాదేశాయ్) 1987లో మొదలైంది సంస్కృతి. దాదాపు 3 దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ లేడీస్ క్లబ్ పలు ఈవెంట్లతో సిటీలో  సందడి  చేస్తోంది.

సార్ధక నామం..
పోష్ లైఫ్ స్టయిల్, పబ్ ఈవెంట్లు, స్టార్ హోటల్స్ ఎక్స్‌పోలు వీటిలో ఏది లేకపోయినా అది లేడీస్ క్లబ్ కానేకాదనే  పరిస్థితిలో.. సంస్కృతి మాత్రం పేరుకు తగ్గట్టే ఈ శైలికి భిన్నం. ‘ఇండియన్ కల్చర్‌ని ప్రమోట్ చేయడంలో మహిళల బాధ్యత సుస్పష్టం. అందుకు మా క్లబ్ కట్టుబడి ఉంది’ అని చెప్తారు డాక్టర్ కుముద్‌దారియా. మన సంస్కృతిని మనం కాపాడుకుంటూనే మోడ్రన్ వరల్డ్‌లో మమేకం కావాలనేది తమ లక్ష్యమంటున్నారు.
 
సెలక్టివ్  మెంబర్స్..
క్లబ్ స్థాపించిన తొలి ఏడాది 40 మంది సభ్యులు చేరారు. ప్రస్తుత సంఖ్య 152 మాత్రమే. ‘ కుల మతాలకు అతీతంగా మంచి ఆలోచనలు, వ్యక్తిత్వం, సోషలైజింగ్‌పై ఆసక్తి, వ్యక్తిగత పేరు ప్రతిష్టలు.. ఇలాంటి వాటికి ప్రాధాన్యమిస్తూ మెంబర్‌షిప్స్ ఇస్తున్నాం. మా క్లబ్‌లో మార్వాడీలు, గుజరాతీలు, మరాఠీలు, పంజాబీలు, జైన్‌లు, తెలుగువాళ్లు.. ఇలా భిన్న సంస్కృతులకు చెందిన వాళ్లున్నారు’ అని చెప్పారు కుముద్.

నెలవారీగా ఏర్పాటు చేసే 10 సమావేశాల్లో  కుకరీ క్లాసెస్, ఫ్యాషన్ షోల వంటి సరదా ఈవెంట్లుంటాయి. దేశ విదేశాల్లోని భిన్న రంగాలకు చెందిన విజయవంతమైన వ్యక్తుల్నిఆహ్వానించి వారి సక్సెస్ స్టోరీలను, ఎదుర్కున్న ఆటుపోట్లను  తమ సభ్యులకు వివరించి, ఆ సమావేశాలను స్ఫూర్తిదాయకంగా మలుస్తున్నామని వివరించారు. సానియామీర్జా, రేణుకాచౌదరి, స్మృతి ఇరానీ, స్వామి చిన్మయానంద, సోను నిగమ్, తేజ్‌దీప్‌కౌర్, కిరణ్‌బేడీ తదితర ప్రముఖులెందరో తమ క్లబ్‌కు అతిథులుగా విచ్చేసి.. తమ అనుభవాలను పంచుకున్నారని ఆమె చెప్పారు.
 
సేవా‘శిఖర’మ్..
క్లబ్ ఆధ్వర్యంలో విభిన్న చారిటీ యాక్టివిటీస్ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా చెప్పుకోవాల్సింది మానసిక వికలాంగ బాల బాలికల కోసం బేగంపేట, ప్రకాష్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ‘సంస్కృతి శిఖర’ స్కూల్ గురించి. ‘డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లల సంఖ్య సిటీలో గణనీయంగా పెరుగుతున్నా, తగిన సంఖ్యలో స్కూల్స్ లేవు. దీనిని దృష్టిలో ఉంచుకుని 2000 సంవత్సరంలో ఈ స్కూల్ నెలకొల్పాం. ఇప్పుడు ఇందులో 75 మంది విద్యార్థులున్నారు. అన్ని స్కూల్స్‌లాగానే సిలబస్, ఎగ్జామ్స్ వంటివన్నీ నిర్వహిస్తున్నాం’ అని కుముద్ తెలిపారు. స్పీచ్ థెరీపీ, ఫిజియోథెరపీలతో పాటు ఈ చిన్నారులు తమ కాళ్లపై తాము నిలబడేందుకు తోడ్పడే విధంగా పేపర్‌బ్యాగ్స్ వంటి వినియోగ వస్తువుల తయారీని నేర్పిస్తున్నారు.

అన్ని రకాల వసతులతో, మామూలు స్కూళ్లకంటే ఎంతో మెరుగ్గా దీన్ని వీరు నిర్వహించడం చూస్తే అబ్బురమనిపిస్తుంది. క్లబ్ సభ్యుల్లో పలువురు టీచర్లుగా సైతం అవతారమెత్తి చిన్నారులకు బోధనా సేవలు అందిస్తున్నారు. ‘సంగీతం వచ్చినవారు సంగీతం, డ్యాన్స్ వచ్చిన వారు డ్యాన్స్.. నేర్పుతున్నారు. కొందరు సభ్యులు ఒక్కో చిన్నారి చొప్పున దత్తత తీసుకుని బాగోగులు చూసుకుంటున్నారు’ అంటూ వివరించారు సంస్కృతి క్లబ్‌కు చెందిన వందన షెట్టి.

తమ నెలవారీ మీటింగ్స్‌లో ఒకటి తప్పకుండా స్కూల్‌లో ఏర్పాటు చేస్తామని, ఈ సందర్భంగా పిల్లల కోసం పిల్లల చేత కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహిస్తామని చెప్పారామె. తమ పాఠశాల పిల్లలు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ పలు పోటీల్లో పాల్గొని మెడల్స్ సాధించారని స్కూల్ ప్రిన్సిపాల్ వందనాగౌడ్ వివరించారు.
 
భవిష్యత్తు లక్ష్యాలివే..
తమ కార్యక్రమాలు నిర్విరామంగా జరిపేందుకు మూడేళ్లకు ఒకసారి ఫండ్‌రైజింగ్ ఈవెంట్స్ నిర్వహిస్తామంటున్న కుముద్.. ఆధునిక యువతుల్లో సంస్కృతి సంప్రదాయాల పట్ల చైతన్యం పెంచడం, అదే సమయంలో ప్రపంచవ్యాప్త అవకాశాలు అందుకునేందుకు చేయూతనివ్వడం.. మానసిక వికలాంగ చిన్నారులకు అందిస్తున్న సేవలను విస్తృతం చేయడం వంటివి తమ భవిష్యత్ లక్ష్యాలుగా వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement