sada mee seva
-
ఫ్రెండ్స్ ఫర్ సేవ
‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. సదా మీ సేవలో మేము సైతం అంటూ చేతులు కలిపి... తమ చేతల వివరాలను పంచుకుంటున్నాయి.ఈ వరుసలో ప్రచురితమవుతున్న ఏడవ కథనమిది. అన్నార్తుల ఆకలి తీర్చడం.. రక్తమిచ్చి ప్రాణాలు నిలపడం.. చేతనైనంతలోసాటి వారిని ఆదుకోవడం.. ఇవే లక్ష్యాలుగా ముందుకు సాగుతున్న ‘ఫ్రెండ్స్ ఫర్ సేవ’ చారిటీ ఆర్గనైజేషన్ గురించి పరిచయం... గచ్చిబౌలిలో ఐఐఐటీ (ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) విద్యార్థుల మనసుకు అద్దమే ‘ఫ్రెండ్స్ ఫర్ సేవా’. మూడేళ్ల క్రితం ఫణీంద్ర అనే ఐఐఐటీ స్టూడెంట్‌కి ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే స్నేహితులందరినీ కూర్చోబెట్టి విషయం చెప్పాడు. ‘దాదాపు రెండు వేల మంది విద్యార్థులుండే మా ఇన్స్టిట్యూట్.. ఫ్రెండ్స్ ఫర్ సేవకి ఒక కొత్త అర్థం చెప్పింది. మొదట అనాథాశ్రమాలు విజిట్ చేయడంతో మొదలుపెట్టిన మా కార్యక్రమాలు రక్తదానాల వరకూ వెళ్లింది. మూడేళ్లలో ఊహించిన రీతిలో కొనసాగిన మా సేవా కార్యక్రమాలకు మా ఆలోచనే పెట్టుబడి. తీరిక సమయమే మా చారిటీ’ అని చెప్పారు బాలకృష్ణ అనే సభ్యుడు. ఐఐఐటీలో రీసెర్చ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బాలకృష్ణ స్టూడెంట్స్‌ని ఈ సంస్థలో చేర్చడంలో చురుకైన పాత్ర పోషించారు. ఆసుపత్రులే వేదికగా.. ‘మా సంస్థ తరపు నుంచి రక్తదానం చేయడానికి దాదాపు వెయ్యి మందికి పైగా సభ్యులు అందుబాటులో ఉంటారు. నగరంలో ఓ ఇరవై ఆసుపత్రుల్లోని బ్లెడ్బ్యాంకుల్లో మా కాంటాక్ట్ నంబర్లను పెట్టాం. అక్కడ ఎవరికైనా రక్తం అవసరమైతే వెంటనే మా సంస్థ యాక్టివ్ మెంబర్లకు కబురు వస్తుంది. మేం వెంటనే స్పందించి అందుబాటులో ఉన్న వ్యక్తిని అక్కడికి పంపిస్తాం. ఇప్పటి వరకు దాదాపు మూడు వేల మందికి రక్తం అందించాం. రక్తంతో పాటు ప్లేట్లెట్ల దానానికి కూడా మా సంస్థ సభ్యులు సిద్ధంగా ఉన్నారు’ అని చెప్పారు ఫణీంద్ర. నిజానికి రక్తదానం అంటే ఒక ఆఫీసు...బ్యాంకు వంటి హంగామా లేకుండా ఆసుపత్రుల్లోని బ్యాంకులనే తమ వేదికలుగా మలుచుకున్న తీరు ఫ్రెండ్స్ ఫర్ సేవ ప్రత్యేకతను తెలియజేస్తున్నాయి. విజిటింగ్ హోమ్స్.. మూడేళ్ల నుంచి తన సేవల్ని అందిస్తున్న ‘ఫ్రెండ్స్ ఫర్ సేవ’ గత ఏడాది నుంచి మరిన్ని సేవలకు వేదికైంది. నగరంలోని అనాథ, వృద్ధాశ్రమాలను ప్రతీ వారంతా సందర్శించడం ‘విజిటింగ్ హోమ్స్’ కార్యక్రమం ఉద్దేశం. దీని కోసం ఐఐఐటీలో గ్రూపులుగా విడిపోయి పనిచేస్తున్నారు. ఏదో వెళ్లి అక్కడి వారిని చూసి రావడం కాకుండా రోజంతా అక్కడే ఉండి వారి జీవన విధానం, చదువు, ఆరోగ్యం వంటి విషయాల గురించి వివరాలు కనుక్కుని వారికి ఏ విధంగా సాయపడగలరో తెలుసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో అవసరమైతే వెంటనే స్పందించి వారికి తగిన సాయం చేస్తున్నారు. పేద పిల్లల పుస్తకాలకు, బట్టలకు ఆర్థికసాయం చేయడం వంటివీ చేస్తున్నారు. షేరింగ్ ఫుడ్.. షేరింగ్ ఫుడ్ అనేది ‘ఫ్రెండ్స్ ఫర్ సేవా’ ప్రధాన ఉద్దేశం అంటారు బాలకృష్ణ. ఈ సేవా కార్యక్రమం కోసం వీరంతా ఐఐఐటీ క్యాంటీన్ నిర్వాహకులతో మాట్లాడి.. అక్కడ మిగిలిన భోజనంతో పాటు కొన్ని డబ్బులిచ్చి ప్రత్యేకంగా భోజనం వండించుకుని వాటిని ప్యాకింగ్ చేసి అనాథాశ్రమాలకు తీసుకెళ్లి పంచుతున్నారు. అప్పుడప్పుడు రోడ్లపై కనిపించే యాచకులకూ వీటిని అందజేస్తున్నారు. ‘అన్ని దానాల్లోకెల్లా గొప్పది, అవసరమైంది అన్నదానమే కదా! మా ఇన్స్టిట్యూట్లో చాలామంది విద్యార్థులు క్యాంటీన్లో తినకుండా బయటికెళ్లి తినొస్తుంటారు. దాంతో బోలెడంత ఫుడ్ వృథా అవుతోంది. అది గమనించిన మేము ముందుగానే క్యాంటీన్ వారితో మాట్లాడి మరి కొంత ఫుడ్‌ని తయారుచేయించుకుని మేమే స్వయంగా ప్యాకింగ్ చేసుకుని తీసుకెళ్లి అనాథలకు, యాచకులకు పంచుతున్నాం. కొన్ని అనాథాశ్రమాల్లో ఫుడ్ తీసుకోరు. వారికి డబ్బులిచ్చి అక్కడే వండించి పెడుతున్నాం. మా సంస్థ చేస్తున్న కార్యక్రమాల క్రెడిట్ మా ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్న, పనిచేస్తున్న వారందరిది. ఎందుకుంటే ఏ సందర్భంలో ఎవరిని ఏ సాయం అడిగినా కాదనకుండా ముందుకొస్తారు’ అని గర్వంగా చెప్పారు బాలకృష్ణ. ఒకచోట చదువుకునే విద్యార్థులు, ఒకచోట పనిచేసే ఉద్యోగస్తులు దాదాపు కుటుంబసభ్యుల్లాంటి వారు. వారి ఆలోచనలు కలిస్తే ఆచరణ పెద్ద విషయం కాదు. మంచి సేవా కార్యక్రమానికి వారు నడుంబిగిస్తే వారి చుట్టుపక్కలున్న సాయం కోసం ఎదురుచూసే ప్రతి ఒక్కరు అదృష్టవంతులకిందే లెక్క. దానికి ‘ఫ్రెండ్స్ ఫర్ సేవా’ చేస్తున్న సేవే నిదర్శనం. డేటాబేస్.. ఏదో ఒక ఆసుపత్రి నుంచి రక్తం కావాలంటూ ఫోన్ కాల్ రాగానే గంటల వ్యవధిలో దాతను అందుబాటులోకి తేవడం చిన్న విషయం కాదు. ఫ్రెండ్స్ ఫర్ సేవా సభ్యులు దీనికోసం ప్రత్యేకంగా ఒక డేటాబేస్‌ని తయారు చేసుకున్నారు. దానిద్వారా ఏ గ్రూప్ బ్లెడ్ డోనర్నైనా నిమిషాల్లో అందుబాటులోకి తేగలుగుతున్నారు. ‘దీనికోసం మా ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్‌కి కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నాం. రక్తదానం ఎంత అవసరమో తెలియజేసే మా క్లాసులు వారిని ఫ్రెండ్స్ ఫర్ సేవా కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొనేలా చేస్తున్నాయి’ అంటారు ప్రదీప్. లక్ష్మణ్, శ్రీకాంత్, సాయిరామ్, నితీష్...మరికొందరు ఈ సంస్థకు సంబంధించి మిగతా కార్యక్రమాలకు పూర్తిస్థాయిలో తమ సేవల్ని అందిస్తున్నారు. -
అక్షర సేన..
‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. సదా మీ సేవలో మేము సైతం అంటూ చేతులు కలిపి... తమ చేతల వివరాలను పంచుకుంటున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్న ఆరో కథనమిది. కాలేజ్ డేస్ అంటే ఎంజాయ్‌మెంట్‌కు కేరాఫ్ అనుకుంటారు. కానీ ఈ టీనేజర్లు మాత్రం.. చదువుకొంటూనే పలు గ్రామాలను దత్తత తీసుకుని అక్షర జ్యోతులు వెలిగిస్తున్నారు. ఇప్పుడు బెనోవెలెంట్ కాజ్ సంస్థగా మారి మురికివాడలు, గ్రామాల్లో పర్యటిస్తూ.. సమస్యలు తెలుసుకుని అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ‘వసుధైక కుటుంబం’ దిశగా అడుగులేస్తున్నారు. కాలేజ్ డేస్‌లో కుర్రాళ్లు టూ టైప్స్ ఉంటారు. ఎంజాయ్మెంట్ తప్ప మరొకటి ఆలోచించని వాళ్లు ఓ రకమైతే.. కెరీర్ తప్ప మరో ధ్యాస పట్టని వాళ్లు ఇంకో రకం. కానీ.. బెనోవెలెంట్ కాజ్ కుర్రాళ్లు మాత్రం సోషల్ రెస్పాన్సిబిలిటీని భుజానికెత్తుకుని శభాష్ అనిపించుకుంటున్నారు. చదువుసంధ్యలతో పాటు సేవబాటలోనూ ముందుంటున్నారు. సమాజం కోసం ఏదో ఒకటి చేయాలన్న తపన వీరిని అందరివాళ్లను చేసింది. చిన్ననాటి నుంచి సేవాభావం కలిగిన గుంటూరు జిల్లా అమరావతి మండలం నరుకుల్లపాడుకి చెందిన కర్రా దుర్గారావు ఎంబీఏ చదువు కోసం సీబీఐటీ కళాశాలలో చేరడంతోనే ‘స్టూడెంట్ సోషల్ సర్వీస్ సంస్థ’కు బీజం పడింది. ఇంటర్ రోజుల్లోనే తోటి విద్యార్థుల సహకారంతో పలు గ్రామాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించిన దుర్గారావు.. ఇక్కడి మిత్రులతో కలసి స్టూడెంట్ సోషల్ సర్వీస్ సంస్థకు రూపకల్పన చేశాడు. అక్షర సేద్యం.. తమ సేవా కార్యక్రమాలను క్రమంగా విస్తరించిన ఎస్ఎస్ఎస్ సభ్యులు.. అక్షర సేద్యానికి ఖానాపూర్ గ్రామాన్ని ఎంచుకున్నారు. 2012లో రాత్రి పాఠశాలను ప్రారంభించారు. అయితే రాత్రి వేళల్లో పనులు, ఇతరత్రా కారణాలతో మహిళలు, పెద్దలు ఇలా అందరూ ఒకేచోటికి రావడం సమస్యగా మారింది. దీంతో ఇంటి వద్దకే చదువు అన్న కాన్సెప్ట్‌తో ఎక్కువ మంది వాలంటీర్లతో నిరక్షరాస్యుల ఇళ్లకు వెళ్లి అక్షరాలు దిద్దించడం మొదలుపెట్టారు. చదువుతో కలిగే ప్రయోజనాన్ని వివరించి ఎందరినో అక్షరాస్యులుగా తీర్చిదిద్దారు. అంతేకాదు వారాంతాల్లో ప్రభుత్వ పాఠశాల లకు వెళ్తున్నారు. ఆంగ్లం, గణితం, కంప్యూటర్ సబ్జెక్టులపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఖానాపూర్, గండిపేట, కోకాపేట, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, వనస్థలిపురం, ఉప్పల్, రామంతాపూర్, ఘట్కేసర్లోని ప్రభు త్వ పాఠశాలల్లో వాలంటీర్ల సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజల వద్దకు పరిష్కారం.. తమ సేవలను మరింత అర్థవంతంగా తీర్చిదిద్దాలని భావించిన ఎస్ఎస్ఎస్.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో బెనోవెలెంట్ కాజ్ సంస్థను ఏర్పాటు చేసింది. దీని ఆధ్వర్యంలో ప్రతి శని, ఆదివారాల్లో గ్రామాలు, మురికివాడల్లో ‘వసుధైక కుటుంబం’ కార్యక్రమం నిర్వహిస్తోంది. మొదట్లో ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం, నేత్రదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలా గ్రామాలు, మురికివాడల్లోని ప్రజలతో మమేకం అవుతున్నారు బెనోవెలెంట్ కాజ్ సభ్యులు. ఆ తర్వాత ప్రతి కుటుంబం దగ్గరకు వెళ్లి వారి సమస్యల గురించి తెలుసుకుంటున్నారు. వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఓ రోజు ప్రజలందరినీ ఒకే చోటికి తీసుకువచ్చి.. అక్కడికే అధికారులను తీసుకువచ్చి వారి సమస్యలు పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తున్నాం. ఇలా ఎన్నో సమస్యలకు స్పాట్లో పరిష్కారం చూపి ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపారు. త్వరలోనే ఎస్ఎస్ఎస్, బెనోవెలెంట్ కాజ్‌ను యూత్ ఫర్ ద యునెటైడ్ నేషన్స్ కిందకు తీసుకొస్తామంటున్నారు ఈ కుర్రాళ్లు. విద్యార్థుల్లోనూ వివిధ సామాజిక సమస్యలపై అవగాహన కలిగించేలా కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతామంటున్నారు. ఇలా సభ్యత్వం తీసుకోవచ్చు.. ఎస్.ఎస్.ఎస్.లో వాలంటీర్‌గా చేరాలంటే http://studentsocialservice.org/ వెబ్‌సైట్‌కి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రోజుకు రూ.1 తో... సేవే లక్ష్యంగా ఎస్ఎస్ఎస్ ఏర్పాటు చేశాం. అందుకోసం పలు ఇంజనీరింగ్ కాలేజీలను వేదికగా మలుచుకున్నాం. ప్రతి తరగతిలోని విద్యార్థి రోజుకు ఒక్క రూపాయి చొప్పున వారానికి రూ.5 జమ చేసి తమ క్లాస్ లీడర్లకు అందిస్తారు. ఇలా జమ చేసిన మొత్తంతో దుస్తులు, పుస్తకాలు, స్టేషనరీ సామగ్రి కొనుగోలు చేసి అనాథ పిల్లలకు అందజేస్తున్నాం. ఇలా మా ల క్ష్యసాధనలో కాలేజీ విద్యార్థులను భాగస్వాములను చేశాం. ఈ రూపాయి ఉద్యమంలో సీబీఐటీ, ఎంజీఐటీ, వాసవి, ఇక్ఫాయ్, ఎంజీఐటీ, శ్రీనిధి, వీఎన్‌ఆర్‌వీజేఐటీ, జేబీఐటీ, జేబీఆర్‌ఈసీ కళాశాలలు చేరాయి. - దుర్గాప్రసాద్, వ్యవస్థాపకుడు -
వెలుగుబాట
‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. సదా మీ సేవలో మేము సైతం అంటూ చేతులు కలిపి... తమ చేతల వివరాలను పంచుకుంటున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్న ఐదో కథనమిది. పొద్దంతా స్వేదం చిందిస్తే తప్ప పూట గడవని నేపథ్యం.. అడుగు ముందుకు వేయాలంటే అడ్డం పడే పేదరికం.. బతుకుల్ని వెక్కిరించే నిరక్షరాస్యత.. అయినా ప్రతికూల పరిస్థితులకు వారు తలవంచలేదు. తాము పడిన కష్టం మరెవరూ పడకూడదనే తలంపుతో ఒక మంచి ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. బస్తీలకు ‘కంటిచూపు’గా మారి వెలుగుబాట చూపుతున్నారు. rakshana161@gmail.com రసూల్‌పురా మురికివాడ. ఆ బస్తీలో తెల్లవారుతూనే అందరినీ పలకరించేది పేదరికమే. పొద్దంతా పని చేస్తేనే అందరికీ పూట గడిచేది. జి.జ్యోతి, రజని, సరిత, శివరంజని, కె.పుష్పలత. పి.పుష్ప, రజిత, సురేఖ.. ఈ పరిస్థితులకు వీరూ మినహాయింపు కాదు. అంతంత మాత్రం చదువులు.. నిరుపేద బతుకులు.. పొద్దునే ఇల్లు విడిచి వెళ్లిన అమ్మానాన్నలు పనిచేసి మళ్లీ ఏ రాత్రికో ఇంటికి రావడం ఏళ్ల తరబడి చూశారు. చదువుకోవాలన్న ఆశను ఆర్థిక దుస్థితి చిదిమేసింది. కన్నీళ్లతో పాటు ఆశలు, ఆశయాల్ని దిగమింగుకుని పెరిగిన వీరిలో.. తమలాగే తమ పిల్లలు, ఇతరులు కష్టాలు పడకూడదని తలిచారు. ఏదైనా చేయాలనే వీరి ఆశయానికి.. ‘ఆపరేషన్ ఐసెట్ యూనివర్సల్’ సంస్థ సేవా కార్యక్రమాలు ప్రేరణనిచ్చాయి. వెంటనే అందులో హెల్త్ కో-ఆర్డినేటర్లుగా చేరారు. తమకు వచ్చిన, నేర్చిన విద్యతోనే బస్తీవాసుల్ని ఆరోగ్యంపై చైతన్యం చేసేవారు. రోజూ తమలాంటి ఎన్నో కుటుంబాలను కలిసే వారు. పిల్లలకు విద్య ప్రాధాన్యాన్ని వివరిస్తూనే కంటి సంరక్షణ చర్యలను వివరించే వారు. కొన్నాళ్లకు ఆపరేషన్ ఐసెట్ యూనివర్సల్ ప్రాజెక్టు వర్క్ పూర్తికావడంతో వీరంతా ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేశారు. అప్పుడే సొంతంగా బస్తీవాసుల కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. 2011 మార్చిలో ‘ర క్షణ వెల్ఫేర్ అసోసియేషన్’ ఏర్పాటు చేశారు. ఇందుకు కుటుంబసభ్యులు, స్థానికుల సహకారం అందింది. దీంతో పూర్తి స్థాయి సేవా కార్యక్రమాలను విస్తృతం చేశారు. ‘డబ్బులున్న వారు ఇంకా డబ్బు సంపాదించడంలోనే నిమగ్నమైపోతున్నారు. మరి పేదల గురించి ఎవరు పట్టించుకుంటారు?’.. ఈ ప్రశ్నే తమ సేవకు పునాది అని ఈ ఎనిమిది మంది చెబుతారు. పేద బతుకుల్లో వెలుగులు రసూల్‌పుర మురికివాడలోని శ్రీలంకబస్తీ, ఇందిరమ్మనగర్, రసూల్‌పుర, సీబీఎన్ నగర్, అన్నానగర్, అర్జున్‌నగర్, అంబేద్కర్ నగర్, కృష్ణానగర్, సిల్వర్ కంపెనీ, 105 గల్లీ, బీరప్పగుడి, రావిచెట్టు గల్లీ.. ఈ బస్తీల్లోని ఇంటింటికీ ‘రక్షణ’ సభ్యులు తిరిగి విద్య, వైద్యంపై ప్రజలను జాగృతం చేస్తారు. అనారోగ్య సమస్యలతో బాధపడే వారిని గుర్తిస్తారు. వారి కోసం వారానికి ఒక ఉచిత వైద్య శిబిరం నిర్వహించి మందులను పంపిణీ చేస్తున్నారు. ప్రత్యేకించి కంటి లోపాలున్న వారిని గుర్తించే బృహత్తర కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నారు. వీరి కోసం ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి, ఆపరేషన్ ఐసైట్ వారి సహకారంతో వైద్యం అందిస్తున్నారు. బస్తీవాసుల్లో కంటి శుక్లాలు గుర్తించడం, చూపు అవశ్యకత, పోషకాహారంతో కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నామన్నారు సంస్థ అధ్యక్షురాలు సరిత. బస్తీలకు ‘కంటిచూపు’ చాలా వర కు కంటి సమస్యలు పౌష్టికాహార లోపంతోనే తలెత్తుతున్నాయని గుర్తించిన వీరు.. బాల్యం నుంచే పోషక విలువలు గల ఆహారం అందజేస్తే సమస్య పరిష్కారమైనట్టేనని తెలుసుకున్నారు. ఈ క్రమంలో రసూల్‌పురా పరిసర ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు సహకరించడంతో పాటు పలు పాఠశాలల విద్యార్థులు, గర్భిణులకు పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. పిల్లల రోజువారీ మెనూలో అధిక పోషక పదార్థాలు లభించే ఆహారం తీసుకునేలా వారిని చైతన్య పరుస్తూ ముందుకెళుతున్నారు. ‘రక్షణ’ సభ్యులు తలా చేయి వేసుకొని పిల్లలకు పౌష్టికాహరం అందిస్తున్నారు. పిల్లలకు, వారి తల్లిదండ్రులకు చదువు వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. ‘మా కృషిని గుర్తించిన ఒకటి, రెండు ఎన్జీవోలు ఆసరానిస్తుండటంతో సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నామ’ని చెప్పారు సంస్థ కార్యదర్శి జ్యోతి. ‘ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా.. అనుకున్న దారిలో ముందుకెళ్తున్నాం. వందలాది మందికి కాటరాక్ట్ ఆపరేషన్లు, మెరుగైన చూపు కోసం కళ్లజోళ్లు పంపిణీ చేశాం. పేదరికం వెక్కిరిస్తున్నా.. కుటుంబసభ్యుల సహకారంతో నలుగురికీ సేవ చేయగలుగుతున్నామంటున్నారు ‘రక్షణ’ సభ్యులు. -
సదా మీ సేవలో..
చీకటి వెలుగుల జీవితంలో అందరూ కోరుకునేది వెలుగే. ఆ జిలుగు నీడలో పదిమందినీ ఆహ్వానించే వారు కొందరే ఉంటారు. అలాంటి వారి గురించి పదిమదికీ తెలిస్తే.. మరెందరి హృదయూల్లోనో సేవాభావం వెలుగు చూస్తుంది. సమాజం కోసం మీరు చేతులు కలిపి.. చేసిన చేతల వివరాలు మాకు తెలియుజేయుండి. మీకు స్ఫూర్తిగా స్టార్‌డమ్‌కి సేవను జోడించి తనదైన శైలిలో స్పందిస్తున్న సినీ నటి సమంత ‘సిటీప్లస్’లో వెలుగుచూసే కథనాలకు బాసటగా నిలుస్తానంటోంది. మీరు చేయూల్సిందల్లా.. ఓ సంస్థ ద్వారా, వ్యక్తిగతంగా మీరు చేస్తున్న సేవల వివరాలను మాకు మెయిల్ చేయుండి. వాటిని ‘సిటీప్లస్’లో ప్రచురిస్తాం. వీటిలో ఉన్నతమైన వాటిని ఎంపిక చేసి.. సదరు సేవా సంస్థలు, వ్యక్తులను సమంత పలకరిస్తారు. ఒక్క సమంత వూత్రమే కాదు.. సేవ చేసే హృదయాలను అభినందించడానికి మరెందరో సెలబ్రిటీలు ముందుకు రానున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు చేస్తున్న చారిటీ వివరాలుమెయిల్టు sakshicityplus@gmail.com -
మేక్ ఎ స్మైల్
‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. సదా మీ సేవలో మేము సైతం అంటూ చేతులు కలిపి... తమ చేతల వివరాలను పంచుకుంటున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్న నాలుగో కథనమిది. మార్పు మంచిదైతే.. అది ఎక్కడ మొదలైనా అంతటికీ పాకుతుంది. అందుకే కేరళలో మొదలైన ఓ మంచి మార్పు.. సిటీకి చేరింది. ‘మేక్ ఎ డిఫరెన్స్’ (మ్యాడ్)గా వచ్చి మనసున్న హైదరాబాదీలను కదిలించి.. మారాజులను చేసింది. తోటివారికి తోచిన సాయం చేయడానికి తీరిక చూసుకునేలా చేసింది. ఆ సాయం చదువైతే.. అంతకు మించిన మార్పు ఇంకే ం కావాలి చెప్పండి. తొమ్మిదేళ్ల కిందట కేరళలో కొందరు స్నేహితులు ఓ బాయ్స్ హాస్టల్‌కు వెళ్లారు. అక్కడున్న కుర్రాళ్లు.. లెక్కల్లో ఏవో డౌట్లుంటే వీరిని అడిగారు. పిల్లల ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పారు. ఆ మిత్ర బృందం వెనుదిరిగే సమయంలో.. ఓ బాలుడు ‘అన్నా.. మళ్లీ ఎప్పుడొస్తారు..?’ అని అడిగాడు. ‘వచ్చే వారం’ అన్నారు. ఆ సంఘటనే ‘మేక్ ఎ డిఫరెన్స్’కు బీజం వేసింది. ఈ సేవాభావానికి అది మొదటి నెలవైంది. ఆ మిత్రులు మొదటి వాలంటీర్లయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 23 మ్యాడ్ సెంటర్లున్నాయి. ఇందులో రెండు వేల మంది వాలంటీర్లున్నారు. ఐదు వేల మంది అనాథ పిల్లలకు మ్యాడ్ తరఫున ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఎంకరేజ్మెంట్.. ఇలా రకరకాల సేవలందుతున్నాయి. నగరంలో మార్పు.. హైదరాబాద్‌లో ఏడు మ్యాడ్ సెంటర్లున్నాయి. అమీర్‌పేట్, బోయిన్పల్లి, సీతాఫల్మండి, కోఠి, మలక్‌పేట, ఖైరతాబాద్, ముషీరాబాద్‌లోని అనాథాశ్రమాల్లో మ్యాడ్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ అనాథాశ్రమాల్లో మూడు వందలకు పైగా చిన్నారులు ఉన్నారు. వారాంతాల్లో వాలంటీర్లు ఈ హోమ్స్‌కి వెళ్లి చిన్నారులకు మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో ట్యూషన్ చెప్తారు. నగరంలో వాలంటీర్ల సంఖ్య వెయ్యికి పైమాటే. వీరిలో టీచర్లు మొదలు విద్యార్థుల వరకూ అన్ని రంగాలకు చెందిన వారు ఉన్నారు. ‘మాకు తోచినట్టు నాలుగక్షరాలు చెప్పి వచ్చేస్తే సరిపోదు.. ఏ టీచర్ (వాలంటీర్) ఎలా చెబుతున్నారో.. విద్యార్థుల నుంచి మ్యాడ్ సెంటర్ హెడ్ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. దాన్ని బట్టి మా బోధనలో లోటుపాట్లు తెలుసుకుని మార్చుకోవాల్సి ఉంటుంది. వాలంటీర్‌గా చేస్తున్న సేవే కదా అన్న చిన్న చూపు ఇక్కడ ఉండదు. అంతా ప్రొఫెషనల్‌గా ఉంటుంది’ అని చెప్పారు అలేఖ్య. అన్నీ వారే.. మ్యాడ్ సభ్యులు అక్షర జ్ఞానం వెలిగించడమే కాదు.. పిల్లలకు ఆనంద జ్యోతులు పంచుతున్నారు. ఆలనాపాలనా కరువైన చిన్నారులకు అన్నీ వీళ్లే అవుతారు. పండుగల వేళ అన్ని సెంటర్లకు సందడి మోసుకొస్తారు. మ్యాడ్ సభ్యుల పుట్టిన రోజులు, పెళ్లి రోజులు.. ఇలా ఏ వేడుకైనా ఆ సెంటర్లలోనే చేసుకుని వాళ్ల ఆనందం పిల్లలతో పంచుకుంటారు. అంతేకాదు పిల్లల్లోని కళలను వెలికితీసే కార ్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. కొన్ని వేడుకలకు సెలబ్రిటీలను తీసుకొస్తారు కూడా. మొన్నామధ్య ముషీరాబాద్‌లోని రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్‌కి సానియా మీర్జాని తీసుకొచ్చి చిన్నారుల ముఖాల్లో సంతోషం నింపారు. అలాగే నగరానికి వచ్చే విదేశీయులను కూడా ఈ సెంటర్లకు తీసుకొచ్చి పిల్లలకు కొత్త పరిచయాలు చేస్తుంది మ్యాడ్. ‘చదువు, ఉద్యోగం, కుటుంబం.. ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే. వీకెండ్లో కొన్ని గంటలు ఈ పిల్లల దగ్గరకు వెళ్లి వారికి పాఠాలు చెప్పడం మంచి అనుభూతినిస్తుంది’ అని చెప్పారు సిద్ధి. చిన్నారులతో అనుబంధం పెరగటానికి వారి దగ్గరికి వెళ్లినపుడు ఒట్టి చేతుల్తో కాకుండా బిస్కెట్లు, చాక్లెట్లు తీసుకెళ్తుంటారు. మెంబర్ కావాలంటే.. వీలున్నప్పుడు ఈ సెంటర్లకు వెళ్లి తెలిసిన నాలుగు అక్షరం ముక్కలు చెప్పేస్తే మనం కూడా మ్యాడ్ సభ్యులం అయిపోవచ్చు అనుకుంటే పొరపాటు. ఇందులో సభ్యులుగా చేరితే కనీసం ఏడాది పాటు పనిచేయాల్సి ఉంటుంది. ముందుగా మ్యాడ్ వెబ్సైట్(ఠీఠీఠీ.ఝ్చజ్ఛ్చుఛీజీజజ.జీ)లో లాగిన్ కావాలి. అందులో జాయిల్ లింక్‌లోకి వెళ్లి మీ వివరాలన్నీ అప్డేట్ చేస్తే మీకు ఇంటర్వ్యూకి కాల్ వస్తుంది. సదరు వ్యక్తి మ్యాడ్ సభ్యుడిగా పనికొస్తారో లేదో అందులో తేల్చేస్తారు. ‘మ్యాడ్ చదువు, సర్టిఫికెట్ చూడదు. పిల్లలతో కలసిపోయే మనస్తత్వాన్ని చూస్తుంది’ అని చెబుతారు స్వాతి. ప్రతి సభ్యుడి నుంచి రూ.700 డిపాజిట్ కట్టించుకుంటారు. ఏడాది తర్వాత సభ్యుడు తన డబ్బులు రిటర్న్ తీసుకోవచ్చు. ఏడాదిలోపు మానే సే వారికి అవి తిరిగి ఇవ్వరు. ఆ పైకాన్ని విద్యార్థుల అవసరాలకు మళ్లిస్తారు. ఒక సభ్యుడిని ఎన్నుకునే విషయంలో ఎంత నిక్కచ్చిగా ఉంటుందో.. నా అన్నవారు లేని విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు ఇవ్వడంలోనూ అంతే పట్టుదలగా ఉంది. మ్యాడ్ సేవలు మరింత వేగంగా విస్తరించాలని కోరుకుందాం. -
ఆత్మ బందువులు
‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. సదా మీ సేవలో మేము సైతం అంటూ చేతులు కలిపి... తమ చేతల వివరాలను పంచుకుంటున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్న తొలి కథనమిది. అయితే చదువులు.. తీరిక దొరికితే కాఫీలు.. కబుర్లు.. ఇంకా టైముంటే సినిమాలు, షికార్లు.. ఇదే నేటి యువత లైఫ్‌స్టైల్.. ఇది చాలామంది అభిప్రాయం. డెఫినెట్‌గా కాదంటున్నారు సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్‌లోని యువతీ యువకులు. ఏ దిక్కూలేని అనాథ శవాలకు అయిన వారిలా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. అందరి చివరి మజిలీ అదే.. అటువంటప్పుడు అక్కడ చేసే సేవ దైవసేవతో సమానమని అంటున్న వీరు తమనిలా పరిచయం చేసుకుంటున్నారు. ‘ఆఖరి సంస్కారానికి మించిన సేవ మరొకటి లేదు. అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించడం సాక్షాత్తూ భగవంతుడికి సేవ చేయడంతో సమానం’.. అఫ్జల్‌గంజ్‌లోని సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్‌లోకి అడుగు పెట్టగానే వినిపించే మాటలివి. సంస్థ వ్యవస్థాపకుడు కానుగుల రాజేశ్వరరావు పదిహేనేళ్ల క్రితం ఒంటరి యువకుడిగా ‘అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు’ అనే మహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం పలువురు విద్యార్థులు అనాథ శవం పాడెపై తలో చెయ్యి వేస్తూ సంస్థ కార్యకలాపాల్లో పాటుపంచుకుంటున్నారు. అంతా విద్యార్థులే.. మనకు ఎంతో కావాల్సిన మనిషి చనిపోతేనే శ్మశానానికి వెళ్లడానికి వెనకాడతాం. అలాంటిది ముక్కూ మొహం తెలియని, దిక్కులేని మనిషి చనిపోతే శ్మశానానికి చేర్చేదెవరు?. పైగా ఆ మృతదేహాలకు అయిన వాళ్లలా దగ్గరుండి అంతిమ సంస్కారాలు నిర్వహించేదెవరు?. ఇక, చదువుకునే యువకులైతే ఇటువంటి విషయాలకు సాధ్యమైనంత దూరంలో ఉంటారు. కానీ, సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్ కార్యకలాపాల్లో పాల్గొనడానికి దాదాపు వంద మంది విద్యార్థులు, యువకులు అందుబాటులో ఉన్నారు. అనాథ శవాలను గుర్తించడం దగ్గరి నుంచి వాటిని మార్చురీకి తీసుకెళ్లడం, అంత్యక్రియలు చేయడం వరకూ అన్ని పనులూ వీరే చేస్తారు. 1999 నుంచి ఇప్పటి వరకు నగరంలోని 11 వేల మంది గుర్తుతెలియని మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. వాటిలో దాదాపు ఎనిమిది వేల శవాలను గుర్తించి.. సంబంధిత బంధువులకు సమాచారమిచ్చారు. ఈ మొత్తం పనిలో విద్యార్థుల పాత్ర చాలా కీలకమైంది. ‘నేను యువకుడిగా ఉన్నప్పుడే ఈ సంస్థను స్థాపించాను. ఈ సేవలు కొనసాగాలంటే యువత ముందుకు రావాలని నాడు ఆశించాను. నా ఆశయం వమ్ము కాలేదని వీరంతా నిరూపిస్తున్నార’ంటారు ఫౌండర్ రాజేశ్వరరావు.. తనతో కలసి నడుస్తున్న విద్యార్థులను గుర్తుచేసుకుంటూ. ఇంకా చేతులు కలవాలి... రాజేశ్వరరావుతో పాటు ఆయన అన్నదమ్ములైన సాయికిషోర్, మహేశ్‌కుమార్ సైతం ఇదే సేవలో నిమగ్నమయ్యారు. సాయిప్రణీష్, ప్రసాద్ వంటి యువకులు దీనికి మించిన సేవ లేదంటున్నారు. సంస్థలో ఇరవై మంది అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇక అబ్బాయిల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ‘మొన్నామధ్య ఒకే రోజు గాంధీ, ఉస్మానియా నుంచి 200 మంది అనాథ శవాలున్నాయని ఫోన్ కాల్ వచ్చింది. అందుబాటులో ఉన్నవారంతా వచ్చి ఒక్కరోజులో దహన సంస్కారాలు నిర్వహించారు. మాతో మరికొంతమంది యువత చేతులు కలపాలి’ అంటారు ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్. అనాథ శవం గురించి సమాచారం అందితే చాలు.. ఎక్కడున్నా సరే, ఈ ఫౌండేషన్‌లోని సభ్యులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుంటారు. ఇక, ఏ దిక్కూలేని అనాథల వివరాలను పోలీసులు, వెబ్సైట్ ద్వారా చెబుతూ బంధువులకు చేరవేస్తున్న పుణ్యం కూడా కట్టుకుంటుంది ఈ సంస్థ. నీ వల్ల కాదన్నారు! సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్‌లోని సభ్యుడైన రాహుల్‌ది వింత అనుభవం. ‘నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సంస్థలో సభ్యుడిగా చేరి నాలుగేళ్లు దాటింది. తొలిరోజు మార్చురీలో ఓ అనాథ శవం ఫొటో తియ్యడానికి వెళ్లాను. మేం అన్ని శవాల ఫొటోలను, డిటేయిల్స్ని భద్రపరుస్తాం. అక్కడున్న డాక్టర్లు.. ‘చాలా చిన్న వయసు.. ఇలాంటి పనులు చెయ్యలేవు’ అన్నారు. కానీ నేను అలాగే కొనసాగాను. ఎందరో అనాథలకు అంత్యక్రియలు చేస్తున్న సమయంలో నేను అందరికంటే గొప్ప పనిచేస్తున్నాననే భావన కలిగేది. నాలానే మరెందరో ఇందులో కొనసాగుతున్నారు’ అంటారు రాహుల్. అప్పటికప్పుడే చేరిపోయా.. ఈ సంస్థలో చేరిన వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో కదిలించే నేపథ్యం. ఒక ప్రైవేటు కంపెనీలో గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేసే ప్రీతి ఈ సంస్థలోకి అడుగుపెట్టడానికి ఒక బలమైన కారణం ఉంది. ‘మా ఇంటి దగ్గర ఒక నిరుపేద మహిళ చనిపోయింది. అయిన వాళ్లెవరూ లేరు. ఇద్దరు పిల్లలు.. ‘అమ్మా.. అమ్మా...’ అంటూ గుండెలవిసేలా రోదిస్తున్నారు. రోజు గడిచిపోతోంది కానీ.. ఆమె అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. ఆ సమయంలో సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్ వాళ్లు వచ్చి సొంత మనుషుల్లా ఆమెకు అంతిమ సంస్కారాలు చేశారు. అది నన్ను కదిలించింది. అక్కడే వారితో మాట్లాడి సంస్థలో చేరాను’ అంటారు చెమ్మగిల్లిన కళ్లతో. నెల క్రితం.. సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్ దగ్గర రోడ్డుపై ఒక నాలుగు రోజులుగా ఓ మహిళ పడి ఉంది. ఆమె చేతికి ఏదో గాయమైంది. అక్కడి నుంచి పురుగులు బయటికి వస్తున్నాయి. నేను మా సహచరులతో కలిసి గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్తే అనాథలకు వైద్యం కుదరదన్నారు. దాంతో నేను ఆమె చేతిని డెట్టాల్‌తో క్లీన్ చేసి, ఆమె చెప్పిన వివరాలను పోలీసులకు తెలిపాను. కృష్ణా జిల్లాలోని ఆమె బంధువులకు సమాచారమిచ్చాం. వాళ్లొచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఆమె ఏడాది కిందట మతిస్థిమితంతో తప్పిపోయిందని చెప్పారు. - రాహుల్ స్టూడెంట్స్ తలచుకుంటే.. స్టూడెంట్స్ తలచుకుంటే ఏపనైనా సునాయాసంగా చేయగలరు. ఎవరినైనా ఎదిరించగలరు, ఒప్పించగలరు. నేను తలచినట్టుగానే ఈ పదిహేనేళ్లలో ప్రతి ఒక్కపనికీ యువతే అండగా నిలిచింది. ఈ రోజు వందమందికి పైగా యువత నిత్యం అందుబాటులో ఉంటారంటే నమ్మగలరా?. ఎనీ టైం.. బాడీ దొరికిందని ఫోన్ చేయగానే పరుగున వచ్చేవారు పదుల సంఖ్యలో ఉన్నారు. - కానుగుల రాజేశ్వరరావు, సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఇంట్లోవారిని ఒప్పించి... అమ్మానాన్నలు నేను చేస్తున్న పనిని అర్థం చేసుకుని అభినందిస్తున్నారు. మనం కూడా ఎప్పటికైనా మరణించాల్సిందే. అప్పుడు అందరూ వచ్చేది శ్మశానవాటికకే.. - భార్గవి, డిగ్రీ విద్యార్థిని,రాధాకృష్ణ ఉమెన్స్ కాలేజీ అది దైవవాటిక.. `శ్మశానవాటికను మేం దేవాలయంగా భావిస్తున్నాం. ఇక్కడ జరిగే ప్రతి పనీ ఆ మాధవుడిని కొలిచినట్టుగానే ఫీలై చేస్తున్నాం. - ఓమ్ని, ఇంటర్ సెకండ్ ఇయర్ సదా మీ సేవలో.. చీకటి వెలుగుల జీవితంలో అందరూ కోరుకునేది వెలుగే. ఆ జిలుగు నీడలో పదివుందినీ ఆహ్వానించే వారు కొందరే ఉంటారు. అలాంటి వారి గురించి పదివుందికీ తెలిస్తే.. మరెందరి హృదయూల్లోనో సేవాభావం వెలుగు చూస్తుంది.సమాజం కోసం మీరు చేతులు కలిపి.. చేసిన చేతల వివరాలు మాకు తెలియుజేయుండి. మీకు స్ఫూర్తిగా స్టార్‌డమ్‌కి సేవను జోడించి తనదైన శైలిలో స్పందిస్తున్న సినీ నటి సమంత ‘సిటీప్లస్’లో వెలుగుచూసే కథనాలకు బాసటగా నిలుస్తానంటోంది. మీరు చేయూల్సిందల్లా.. ఓ సంస్థ ద్వారా, వ్యక్తిగతంగా మీరు చేస్తున్న సేవల వివరాలను వూకు మెరుుల్ చేయుండి. వాటిని ‘సిటీప్లస్’లో ప్రచురిస్తాం. వీటిలో ఉన్నతమైన వాటిని ఎంపిక చేసి.. సదరు సేవా సంస్థలు, వ్యక్తులను సమంత పలకరిస్తారు. ఒక్క సమంత మాత్రమే కాదు.. సేవ చేసే హృదయూలను అభినందించడానికి మరెందరో సెలబ్రిటీలు ముందుకు రానున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు చేస్తున్న చారిటీ వివరాలు మెయిల్ sakshicityplus@gmail.com