ఆత్మ బందువులు | Receiving an unprecedented response from voluntary organizations with sakshi city plus | Sakshi
Sakshi News home page

ఆత్మ బందువులు

Published Tue, Nov 4 2014 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM

ఆత్మ బందువులు

ఆత్మ బందువులు

‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. సదా మీ సేవలో మేము సైతం అంటూ చేతులు కలిపి... తమ చేతల వివరాలను పంచుకుంటున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్న తొలి కథనమిది.

అయితే చదువులు.. తీరిక దొరికితే కాఫీలు.. కబుర్లు.. ఇంకా టైముంటే సినిమాలు, షికార్లు.. ఇదే నేటి యువత లైఫ్‌స్టైల్.. ఇది చాలామంది అభిప్రాయం. డెఫినెట్‌గా కాదంటున్నారు సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్‌లోని యువతీ యువకులు. ఏ దిక్కూలేని అనాథ శవాలకు అయిన వారిలా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. అందరి చివరి మజిలీ అదే.. అటువంటప్పుడు అక్కడ చేసే సేవ దైవసేవతో సమానమని అంటున్న వీరు తమనిలా పరిచయం చేసుకుంటున్నారు.
 
‘ఆఖరి సంస్కారానికి మించిన సేవ మరొకటి లేదు. అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించడం సాక్షాత్తూ భగవంతుడికి సేవ చేయడంతో సమానం’.. అఫ్జల్‌గంజ్‌లోని సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్‌లోకి అడుగు పెట్టగానే వినిపించే మాటలివి. సంస్థ వ్యవస్థాపకుడు కానుగుల రాజేశ్వరరావు పదిహేనేళ్ల క్రితం ఒంటరి యువకుడిగా ‘అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు’ అనే మహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం పలువురు విద్యార్థులు అనాథ శవం పాడెపై తలో చెయ్యి వేస్తూ సంస్థ కార్యకలాపాల్లో పాటుపంచుకుంటున్నారు.

అంతా విద్యార్థులే..
మనకు ఎంతో కావాల్సిన మనిషి చనిపోతేనే శ్మశానానికి వెళ్లడానికి వెనకాడతాం. అలాంటిది ముక్కూ మొహం తెలియని, దిక్కులేని మనిషి చనిపోతే శ్మశానానికి చేర్చేదెవరు?. పైగా ఆ మృతదేహాలకు అయిన వాళ్లలా దగ్గరుండి అంతిమ సంస్కారాలు నిర్వహించేదెవరు?. ఇక, చదువుకునే యువకులైతే ఇటువంటి విషయాలకు సాధ్యమైనంత దూరంలో ఉంటారు. కానీ, సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్ కార్యకలాపాల్లో పాల్గొనడానికి దాదాపు వంద మంది విద్యార్థులు, యువకులు అందుబాటులో ఉన్నారు.

అనాథ శవాలను గుర్తించడం దగ్గరి నుంచి వాటిని మార్చురీకి తీసుకెళ్లడం, అంత్యక్రియలు చేయడం వరకూ అన్ని పనులూ వీరే చేస్తారు. 1999 నుంచి ఇప్పటి వరకు నగరంలోని 11 వేల మంది గుర్తుతెలియని మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. వాటిలో దాదాపు ఎనిమిది వేల శవాలను గుర్తించి.. సంబంధిత బంధువులకు సమాచారమిచ్చారు. ఈ మొత్తం పనిలో విద్యార్థుల పాత్ర చాలా కీలకమైంది. ‘నేను యువకుడిగా ఉన్నప్పుడే ఈ సంస్థను స్థాపించాను. ఈ సేవలు కొనసాగాలంటే యువత ముందుకు రావాలని నాడు ఆశించాను. నా ఆశయం వమ్ము కాలేదని వీరంతా నిరూపిస్తున్నార’ంటారు ఫౌండర్ రాజేశ్వరరావు.. తనతో కలసి నడుస్తున్న విద్యార్థులను గుర్తుచేసుకుంటూ.
 
ఇంకా చేతులు కలవాలి...
రాజేశ్వరరావుతో పాటు ఆయన అన్నదమ్ములైన సాయికిషోర్, మహేశ్‌కుమార్ సైతం ఇదే సేవలో నిమగ్నమయ్యారు. సాయిప్రణీష్, ప్రసాద్ వంటి యువకులు దీనికి మించిన సేవ లేదంటున్నారు. సంస్థలో ఇరవై మంది అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇక అబ్బాయిల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ‘మొన్నామధ్య ఒకే రోజు గాంధీ, ఉస్మానియా నుంచి 200 మంది అనాథ శవాలున్నాయని ఫోన్ కాల్ వచ్చింది. అందుబాటులో ఉన్నవారంతా వచ్చి ఒక్కరోజులో దహన సంస్కారాలు నిర్వహించారు. మాతో మరికొంతమంది యువత చేతులు కలపాలి’ అంటారు ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్. అనాథ శవం గురించి సమాచారం అందితే చాలు.. ఎక్కడున్నా సరే, ఈ ఫౌండేషన్‌లోని సభ్యులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుంటారు. ఇక, ఏ దిక్కూలేని అనాథల వివరాలను పోలీసులు, వెబ్‌సైట్ ద్వారా చెబుతూ బంధువులకు చేరవేస్తున్న పుణ్యం కూడా కట్టుకుంటుంది ఈ సంస్థ.

నీ వల్ల కాదన్నారు!
సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్‌లోని సభ్యుడైన రాహుల్‌ది వింత అనుభవం. ‘నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సంస్థలో సభ్యుడిగా చేరి నాలుగేళ్లు దాటింది. తొలిరోజు మార్చురీలో ఓ అనాథ శవం ఫొటో తియ్యడానికి వెళ్లాను. మేం అన్ని శవాల ఫొటోలను, డిటేయిల్స్‌ని భద్రపరుస్తాం. అక్కడున్న డాక్టర్లు.. ‘చాలా చిన్న వయసు.. ఇలాంటి పనులు చెయ్యలేవు’ అన్నారు. కానీ నేను అలాగే కొనసాగాను. ఎందరో అనాథలకు అంత్యక్రియలు చేస్తున్న సమయంలో నేను అందరికంటే గొప్ప పనిచేస్తున్నాననే భావన కలిగేది. నాలానే మరెందరో ఇందులో కొనసాగుతున్నారు’ అంటారు రాహుల్.

అప్పటికప్పుడే చేరిపోయా..
ఈ సంస్థలో చేరిన వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో కదిలించే నేపథ్యం. ఒక ప్రైవేటు కంపెనీలో గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేసే ప్రీతి ఈ సంస్థలోకి అడుగుపెట్టడానికి ఒక బలమైన కారణం ఉంది. ‘మా ఇంటి దగ్గర ఒక నిరుపేద మహిళ చనిపోయింది. అయిన వాళ్లెవరూ లేరు. ఇద్దరు పిల్లలు.. ‘అమ్మా.. అమ్మా...’ అంటూ గుండెలవిసేలా రోదిస్తున్నారు. రోజు గడిచిపోతోంది కానీ.. ఆమె అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. ఆ సమయంలో సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్ వాళ్లు వచ్చి సొంత మనుషుల్లా ఆమెకు అంతిమ సంస్కారాలు చేశారు. అది నన్ను కదిలించింది. అక్కడే వారితో మాట్లాడి సంస్థలో చేరాను’ అంటారు చెమ్మగిల్లిన కళ్లతో.
 
నెల క్రితం..
సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్ దగ్గర రోడ్డుపై ఒక నాలుగు రోజులుగా ఓ మహిళ పడి ఉంది. ఆమె చేతికి ఏదో గాయమైంది. అక్కడి నుంచి పురుగులు బయటికి వస్తున్నాయి. నేను మా సహచరులతో కలిసి గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్తే అనాథలకు వైద్యం కుదరదన్నారు. దాంతో నేను ఆమె చేతిని డెట్టాల్‌తో క్లీన్ చేసి, ఆమె చెప్పిన వివరాలను పోలీసులకు తెలిపాను. కృష్ణా జిల్లాలోని ఆమె బంధువులకు సమాచారమిచ్చాం. వాళ్లొచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఆమె ఏడాది కిందట మతిస్థిమితంతో తప్పిపోయిందని చెప్పారు.    
- రాహుల్
 
స్టూడెంట్స్ తలచుకుంటే..
స్టూడెంట్స్ తలచుకుంటే ఏపనైనా సునాయాసంగా చేయగలరు. ఎవరినైనా ఎదిరించగలరు, ఒప్పించగలరు. నేను తలచినట్టుగానే ఈ పదిహేనేళ్లలో ప్రతి ఒక్కపనికీ యువతే అండగా నిలిచింది. ఈ రోజు వందమందికి పైగా యువత నిత్యం అందుబాటులో ఉంటారంటే నమ్మగలరా?. ఎనీ టైం.. బాడీ దొరికిందని ఫోన్ చేయగానే పరుగున వచ్చేవారు పదుల సంఖ్యలో ఉన్నారు.
 - కానుగుల రాజేశ్వరరావు, సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్ వ్యవస్థాపకుడు
 
ఇంట్లోవారిని ఒప్పించి...
అమ్మానాన్నలు నేను చేస్తున్న పనిని అర్థం చేసుకుని అభినందిస్తున్నారు. మనం కూడా ఎప్పటికైనా మరణించాల్సిందే. అప్పుడు అందరూ వచ్చేది శ్మశానవాటికకే..     
- భార్గవి, డిగ్రీ విద్యార్థిని,రాధాకృష్ణ ఉమెన్స్ కాలేజీ

అది దైవవాటిక..
`శ్మశానవాటికను మేం దేవాలయంగా భావిస్తున్నాం. ఇక్కడ జరిగే ప్రతి పనీ ఆ మాధవుడిని కొలిచినట్టుగానే ఫీలై చేస్తున్నాం.
- ఓమ్ని, ఇంటర్ సెకండ్ ఇయర్
 
సదా మీ సేవలో..
చీకటి వెలుగుల జీవితంలో అందరూ కోరుకునేది వెలుగే. ఆ జిలుగు నీడలో పదివుందినీ ఆహ్వానించే వారు కొందరే ఉంటారు. అలాంటి వారి గురించి పదివుందికీ తెలిస్తే.. మరెందరి హృదయూల్లోనో సేవాభావం వెలుగు చూస్తుంది.సమాజం కోసం మీరు చేతులు కలిపి.. చేసిన చేతల వివరాలు మాకు తెలియుజేయుండి. మీకు స్ఫూర్తిగా స్టార్‌డమ్‌కి సేవను జోడించి తనదైన శైలిలో స్పందిస్తున్న సినీ నటి సమంత ‘సిటీప్లస్’లో వెలుగుచూసే కథనాలకు బాసటగా నిలుస్తానంటోంది.

మీరు చేయూల్సిందల్లా.. ఓ సంస్థ ద్వారా, వ్యక్తిగతంగా మీరు చేస్తున్న సేవల వివరాలను వూకు మెరుుల్ చేయుండి. వాటిని ‘సిటీప్లస్’లో ప్రచురిస్తాం. వీటిలో ఉన్నతమైన వాటిని ఎంపిక చేసి.. సదరు సేవా సంస్థలు, వ్యక్తులను సమంత పలకరిస్తారు. ఒక్క సమంత మాత్రమే కాదు.. సేవ చేసే హృదయూలను అభినందించడానికి మరెందరో సెలబ్రిటీలు ముందుకు రానున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు చేస్తున్న చారిటీ వివరాలు మెయిల్  sakshicityplus@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement