ఫ్రెండ్స్ ఫర్ సేవ | friends for charity | Sakshi
Sakshi News home page

ఫ్రెండ్స్ ఫర్ సేవ

Published Tue, Nov 25 2014 11:33 PM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM

ఫ్రెండ్స్ ఫర్ సేవ

ఫ్రెండ్స్ ఫర్ సేవ

‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. సదా మీ సేవలో మేము సైతం అంటూ చేతులు కలిపి... తమ చేతల వివరాలను పంచుకుంటున్నాయి.ఈ వరుసలో ప్రచురితమవుతున్న ఏడవ కథనమిది. అన్నార్తుల ఆకలి తీర్చడం.. రక్తమిచ్చి ప్రాణాలు నిలపడం.. చేతనైనంతలోసాటి వారిని ఆదుకోవడం.. ఇవే లక్ష్యాలుగా ముందుకు సాగుతున్న ‘ఫ్రెండ్స్ ఫర్ సేవ’ చారిటీ ఆర్గనైజేషన్ గురించి పరిచయం...
 
గచ్చిబౌలిలో ఐఐఐటీ (ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) విద్యార్థుల మనసుకు అద్దమే ‘ఫ్రెండ్స్ ఫర్ సేవా’. మూడేళ్ల క్రితం ఫణీంద్ర అనే ఐఐఐటీ స్టూడెంట్‌కి ఏదో ఒక సేవా కార్యక్రమం  చేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే స్నేహితులందరినీ కూర్చోబెట్టి విషయం చెప్పాడు. ‘దాదాపు రెండు వేల మంది విద్యార్థులుండే మా ఇన్‌స్టిట్యూట్.. ఫ్రెండ్స్ ఫర్ సేవకి ఒక కొత్త అర్థం చెప్పింది.

మొదట అనాథాశ్రమాలు విజిట్ చేయడంతో మొదలుపెట్టిన మా కార్యక్రమాలు రక్తదానాల వరకూ వెళ్లింది. మూడేళ్లలో ఊహించిన రీతిలో కొనసాగిన మా సేవా కార్యక్రమాలకు మా ఆలోచనే పెట్టుబడి. తీరిక సమయమే మా చారిటీ’ అని చెప్పారు బాలకృష్ణ అనే సభ్యుడు. ఐఐఐటీలో రీసెర్చ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బాలకృష్ణ స్టూడెంట్స్‌ని ఈ సంస్థలో చేర్చడంలో చురుకైన పాత్ర పోషించారు.

ఆసుపత్రులే వేదికగా..
‘మా సంస్థ తరపు నుంచి రక్తదానం చేయడానికి దాదాపు వెయ్యి మందికి పైగా సభ్యులు అందుబాటులో ఉంటారు. నగరంలో ఓ ఇరవై ఆసుపత్రుల్లోని బ్లెడ్‌బ్యాంకుల్లో మా కాంటాక్ట్ నంబర్లను పెట్టాం. అక్కడ ఎవరికైనా రక్తం అవసరమైతే వెంటనే మా సంస్థ యాక్టివ్ మెంబర్లకు కబురు వస్తుంది. మేం వెంటనే స్పందించి
 
అందుబాటులో ఉన్న వ్యక్తిని అక్కడికి పంపిస్తాం. ఇప్పటి వరకు దాదాపు మూడు వేల మందికి రక్తం అందించాం. రక్తంతో పాటు ప్లేట్‌లెట్ల దానానికి కూడా మా సంస్థ సభ్యులు సిద్ధంగా ఉన్నారు’ అని చెప్పారు ఫణీంద్ర. నిజానికి రక్తదానం అంటే ఒక ఆఫీసు...బ్యాంకు వంటి హంగామా లేకుండా ఆసుపత్రుల్లోని బ్యాంకులనే తమ వేదికలుగా మలుచుకున్న తీరు ఫ్రెండ్స్ ఫర్ సేవ ప్రత్యేకతను తెలియజేస్తున్నాయి.

విజిటింగ్ హోమ్స్..
మూడేళ్ల నుంచి తన సేవల్ని అందిస్తున్న ‘ఫ్రెండ్స్ ఫర్ సేవ’ గత ఏడాది నుంచి మరిన్ని సేవలకు వేదికైంది. నగరంలోని అనాథ, వృద్ధాశ్రమాలను ప్రతీ వారంతా సందర్శించడం ‘విజిటింగ్ హోమ్స్’ కార్యక్రమం ఉద్దేశం. దీని కోసం ఐఐఐటీలో గ్రూపులుగా విడిపోయి పనిచేస్తున్నారు. ఏదో వెళ్లి అక్కడి వారిని చూసి రావడం కాకుండా రోజంతా అక్కడే ఉండి వారి జీవన విధానం, చదువు, ఆరోగ్యం వంటి విషయాల గురించి వివరాలు కనుక్కుని వారికి ఏ విధంగా సాయపడగలరో తెలుసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో అవసరమైతే వెంటనే స్పందించి వారికి తగిన సాయం చేస్తున్నారు. పేద పిల్లల పుస్తకాలకు, బట్టలకు ఆర్థికసాయం చేయడం వంటివీ చేస్తున్నారు.

షేరింగ్ ఫుడ్..
షేరింగ్ ఫుడ్ అనేది ‘ఫ్రెండ్స్ ఫర్ సేవా’ ప్రధాన ఉద్దేశం అంటారు బాలకృష్ణ. ఈ సేవా కార్యక్రమం కోసం వీరంతా ఐఐఐటీ క్యాంటీన్ నిర్వాహకులతో మాట్లాడి.. అక్కడ మిగిలిన భోజనంతో పాటు కొన్ని డబ్బులిచ్చి ప్రత్యేకంగా భోజనం వండించుకుని వాటిని ప్యాకింగ్ చేసి అనాథాశ్రమాలకు తీసుకెళ్లి పంచుతున్నారు. అప్పుడప్పుడు రోడ్లపై కనిపించే యాచకులకూ వీటిని అందజేస్తున్నారు. ‘అన్ని దానాల్లోకెల్లా గొప్పది, అవసరమైంది అన్నదానమే కదా! మా ఇన్‌స్టిట్యూట్‌లో చాలామంది విద్యార్థులు క్యాంటీన్‌లో తినకుండా బయటికెళ్లి తినొస్తుంటారు. దాంతో బోలెడంత ఫుడ్ వృథా అవుతోంది.

అది గమనించిన మేము ముందుగానే క్యాంటీన్ వారితో మాట్లాడి మరి కొంత ఫుడ్‌ని తయారుచేయించుకుని మేమే స్వయంగా ప్యాకింగ్ చేసుకుని తీసుకెళ్లి అనాథలకు, యాచకులకు పంచుతున్నాం. కొన్ని అనాథాశ్రమాల్లో ఫుడ్ తీసుకోరు. వారికి డబ్బులిచ్చి అక్కడే వండించి పెడుతున్నాం. మా సంస్థ చేస్తున్న కార్యక్రమాల క్రెడిట్ మా ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకుంటున్న, పనిచేస్తున్న వారందరిది. ఎందుకుంటే ఏ సందర్భంలో ఎవరిని ఏ సాయం అడిగినా కాదనకుండా ముందుకొస్తారు’ అని గర్వంగా చెప్పారు బాలకృష్ణ.

ఒకచోట చదువుకునే విద్యార్థులు, ఒకచోట పనిచేసే ఉద్యోగస్తులు దాదాపు కుటుంబసభ్యుల్లాంటి వారు. వారి ఆలోచనలు కలిస్తే ఆచరణ పెద్ద విషయం కాదు. మంచి సేవా కార్యక్రమానికి వారు నడుంబిగిస్తే వారి చుట్టుపక్కలున్న సాయం కోసం ఎదురుచూసే ప్రతి ఒక్కరు అదృష్టవంతులకిందే లెక్క. దానికి ‘ఫ్రెండ్స్ ఫర్ సేవా’ చేస్తున్న సేవే నిదర్శనం.
 
డేటాబేస్..

ఏదో ఒక ఆసుపత్రి నుంచి రక్తం కావాలంటూ ఫోన్ కాల్ రాగానే గంటల వ్యవధిలో దాతను అందుబాటులోకి తేవడం చిన్న విషయం కాదు. ఫ్రెండ్స్ ఫర్ సేవా సభ్యులు దీనికోసం ప్రత్యేకంగా ఒక డేటాబేస్‌ని తయారు చేసుకున్నారు. దానిద్వారా ఏ గ్రూప్ బ్లెడ్ డోనర్‌నైనా నిమిషాల్లో అందుబాటులోకి తేగలుగుతున్నారు. ‘దీనికోసం మా ఇన్‌స్టిట్యూట్‌లో స్టూడెంట్స్‌కి కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నాం. రక్తదానం ఎంత అవసరమో తెలియజేసే మా క్లాసులు వారిని ఫ్రెండ్స్ ఫర్ సేవా కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొనేలా చేస్తున్నాయి’ అంటారు ప్రదీప్. లక్ష్మణ్, శ్రీకాంత్, సాయిరామ్, నితీష్...మరికొందరు ఈ సంస్థకు సంబంధించి మిగతా కార్యక్రమాలకు పూర్తిస్థాయిలో తమ సేవల్ని అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement