అక్షర సేన..
‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. సదా మీ సేవలో మేము సైతం అంటూ చేతులు కలిపి... తమ చేతల వివరాలను పంచుకుంటున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్న ఆరో కథనమిది. కాలేజ్ డేస్ అంటే ఎంజాయ్‌మెంట్‌కు కేరాఫ్ అనుకుంటారు.
కానీ ఈ టీనేజర్లు మాత్రం.. చదువుకొంటూనే పలు గ్రామాలను దత్తత తీసుకుని అక్షర జ్యోతులు వెలిగిస్తున్నారు. ఇప్పుడు బెనోవెలెంట్ కాజ్ సంస్థగా మారి మురికివాడలు, గ్రామాల్లో పర్యటిస్తూ.. సమస్యలు తెలుసుకుని అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ‘వసుధైక కుటుంబం’ దిశగా అడుగులేస్తున్నారు.
కాలేజ్ డేస్‌లో కుర్రాళ్లు టూ టైప్స్ ఉంటారు. ఎంజాయ్‌మెంట్ తప్ప మరొకటి ఆలోచించని వాళ్లు ఓ రకమైతే.. కెరీర్ తప్ప మరో ధ్యాస పట్టని వాళ్లు ఇంకో రకం. కానీ.. బెనోవెలెంట్ కాజ్ కుర్రాళ్లు మాత్రం సోషల్ రెస్పాన్సిబిలిటీని భుజానికెత్తుకుని శభాష్ అనిపించుకుంటున్నారు. చదువుసంధ్యలతో పాటు సేవబాటలోనూ ముందుంటున్నారు. సమాజం కోసం ఏదో ఒకటి చేయాలన్న తపన వీరిని అందరివాళ్లను చేసింది.
చిన్ననాటి నుంచి సేవాభావం కలిగిన గుంటూరు జిల్లా అమరావతి మండలం నరుకుల్లపాడుకి చెందిన కర్రా దుర్గారావు ఎంబీఏ చదువు కోసం సీబీఐటీ కళాశాలలో చేరడంతోనే ‘స్టూడెంట్ సోషల్ సర్వీస్ సంస్థ’కు బీజం పడింది. ఇంటర్ రోజుల్లోనే తోటి విద్యార్థుల సహకారంతో పలు గ్రామాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించిన దుర్గారావు.. ఇక్కడి మిత్రులతో కలసి స్టూడెంట్ సోషల్ సర్వీస్ సంస్థకు రూపకల్పన చేశాడు.
అక్షర సేద్యం..
తమ సేవా కార్యక్రమాలను క్రమంగా విస్తరించిన ఎస్‌ఎస్‌ఎస్ సభ్యులు.. అక్షర సేద్యానికి ఖానాపూర్ గ్రామాన్ని ఎంచుకున్నారు. 2012లో రాత్రి పాఠశాలను ప్రారంభించారు. అయితే రాత్రి వేళల్లో పనులు, ఇతరత్రా కారణాలతో మహిళలు, పెద్దలు ఇలా అందరూ ఒకేచోటికి రావడం సమస్యగా మారింది. దీంతో ఇంటి వద్దకే చదువు అన్న కాన్సెప్ట్‌తో ఎక్కువ మంది వాలంటీర్లతో నిరక్షరాస్యుల ఇళ్లకు వెళ్లి అక్షరాలు దిద్దించడం మొదలుపెట్టారు.
చదువుతో కలిగే ప్రయోజనాన్ని వివరించి ఎందరినో అక్షరాస్యులుగా తీర్చిదిద్దారు. అంతేకాదు వారాంతాల్లో ప్రభుత్వ పాఠశాల లకు వెళ్తున్నారు. ఆంగ్లం, గణితం, కంప్యూటర్ సబ్జెక్టులపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఖానాపూర్, గండిపేట, కోకాపేట, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, వనస్థలిపురం, ఉప్పల్, రామంతాపూర్, ఘట్‌కేసర్‌లోని ప్రభు త్వ పాఠశాలల్లో వాలంటీర్ల సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ప్రజల వద్దకు పరిష్కారం..
తమ సేవలను మరింత అర్థవంతంగా తీర్చిదిద్దాలని భావించిన ఎస్‌ఎస్‌ఎస్.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో బెనోవెలెంట్ కాజ్ సంస్థను ఏర్పాటు చేసింది. దీని ఆధ్వర్యంలో ప్రతి శని, ఆదివారాల్లో గ్రామాలు, మురికివాడల్లో ‘వసుధైక కుటుంబం’ కార్యక్రమం నిర్వహిస్తోంది. మొదట్లో ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం, నేత్రదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
అలా గ్రామాలు, మురికివాడల్లోని ప్రజలతో మమేకం అవుతున్నారు బెనోవెలెంట్ కాజ్ సభ్యులు. ఆ తర్వాత ప్రతి కుటుంబం దగ్గరకు వెళ్లి వారి సమస్యల గురించి తెలుసుకుంటున్నారు. వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఓ రోజు ప్రజలందరినీ ఒకే చోటికి తీసుకువచ్చి.. అక్కడికే అధికారులను తీసుకువచ్చి వారి సమస్యలు పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తున్నాం.
ఇలా ఎన్నో సమస్యలకు స్పాట్‌లో పరిష్కారం చూపి ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపారు. త్వరలోనే ఎస్‌ఎస్‌ఎస్, బెనోవెలెంట్ కాజ్‌ను యూత్ ఫర్ ద యునెటైడ్ నేషన్స్ కిందకు తీసుకొస్తామంటున్నారు ఈ కుర్రాళ్లు. విద్యార్థుల్లోనూ వివిధ సామాజిక సమస్యలపై అవగాహన కలిగించేలా కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతామంటున్నారు.
ఇలా సభ్యత్వం తీసుకోవచ్చు..
ఎస్.ఎస్.ఎస్.లో వాలంటీర్‌గా చేరాలంటే http://studentsocialservice.org/ వెబ్‌సైట్‌కి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
రోజుకు రూ.1 తో...
సేవే లక్ష్యంగా ఎస్‌ఎస్‌ఎస్ ఏర్పాటు చేశాం. అందుకోసం పలు ఇంజనీరింగ్ కాలేజీలను వేదికగా మలుచుకున్నాం. ప్రతి తరగతిలోని విద్యార్థి రోజుకు ఒక్క రూపాయి చొప్పున వారానికి రూ.5 జమ చేసి తమ క్లాస్ లీడర్లకు అందిస్తారు. ఇలా జమ చేసిన మొత్తంతో దుస్తులు, పుస్తకాలు, స్టేషనరీ సామగ్రి కొనుగోలు చేసి అనాథ పిల్లలకు అందజేస్తున్నాం. ఇలా మా ల క్ష్యసాధనలో కాలేజీ విద్యార్థులను భాగస్వాములను చేశాం. ఈ రూపాయి ఉద్యమంలో సీబీఐటీ, ఎంజీఐటీ, వాసవి, ఇక్ఫాయ్, ఎంజీఐటీ, శ్రీనిధి, వీఎన్‌ఆర్‌వీజేఐటీ, జేబీఐటీ, జేబీఆర్‌ఈసీ కళాశాలలు చేరాయి.
- దుర్గాప్రసాద్, వ్యవస్థాపకుడు