బేగంపేట మార్గంలో మళ్లీ ట్రాఫిక్‌ ఆంక్షలు..  ఫిబ్రవరి 21 వరకు.. | Hyderabad: Nala works at Minister Road, Traffic Diversions for 3 Months | Sakshi
Sakshi News home page

బేగంపేట మార్గంలో మళ్లీ ట్రాఫిక్‌ ఆంక్షలు..  ఫిబ్రవరి 21 వరకు..

Nov 23 2022 7:59 PM | Updated on Nov 23 2022 7:59 PM

Hyderabad: Nala works at Minister Road, Traffic Diversions for 3 Months - Sakshi

బేగంపేట రసూల్‌పురా చౌరస్తా– మినిస్టర్‌ రోడ్డులోని రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌ మధ్య ఉన్న నాలా పునరుద్ధరణ దృష్ట్యా ఆ మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

సాక్షి, హైదరాబాద్‌: బేగంపేట రసూల్‌పురా చౌరస్తా– మినిస్టర్‌ రోడ్డులోని రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌ మధ్య ఉన్న నాలా పునరుద్ధరణ దృష్ట్యా ఆ మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. జీహెచ్‌ఎంసీ ఎస్‌ఎన్‌డీపీ–11 ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ అభ్యర్ధన మేరకు నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 21 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. 

► బేగంపేట ఫ్లైఓవర్‌ వైపు నుంచి కిమ్స్‌ హాస్పిటల్, మినిస్టర్‌ రోడ్డు, రాణిగంజ్, నల్లగుట్ట, పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను రసూల్‌ చౌరస్తా వద్ద రైట్‌ టర్న్‌ తీసుకోవడానికి అనుమతించరు. అయితే అక్కడ యూ టర్న్‌ తీసుకోవచ్చు. బేగంపేట ఫ్లైఓవర్‌ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను హనుమాన్‌ టెంపుల్‌ నుంచి ఫుడ్‌వరల్డ్, సింథికాలనీ మీదుగా రాంగోపాల్‌పేట పీఎస్, మినిస్టర్‌ రోడ్డు, కిమ్స్‌ హాస్పిటల్‌ వైపు అనుమతిస్తారు. 

► రాణిగంజ్, నల్లగుట్ట, పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను రసూల్‌పురా వైపు అనుమతించరు. వీరు రాంగోపాల్‌పేట పీఎస్, సింథికాలనీ, ఫుడ్‌వరల్డ్, హనుమాన్‌ టెంపుల్‌ మీదుగా రసూల్‌పురా వైపు వెళ్లాల్సి ఉంటుంది. 


► సికింద్రాబాద్‌ వైపు నుంచి కిమ్స్‌ ఆస్పత్రి వైపు వచ్చే ట్రాఫిక్‌ను సైతం హనుమాన్‌ టెంపుల్‌ నుంచి ఫుడ్‌వరల్డ్, సింథికాలనీ, రాంగోపాల్‌పేట పీఎస్‌ వద్ద ఎడమ వైపు మళ్లి మినిస్టర్‌ రోడ్డులో కిమ్స్‌ వైపునకు వెళ్లవచ్చు. లేదా సీటీఓ ప్యారడైజ్, రాణిగంజ్‌ వద్ద కుడివైపునకు మళ్లి కిమ్స్‌ వైపు మళ్లవచ్చు. 

► అంబులెన్స్‌లు లేదా రోగులు బేగంపేట ఫ్లైఓవర్‌ నుంచి మినిస్టర్‌ రోడ్డు కిమ్స్‌ హాస్పిటల్‌కు వెళ్లేవారు సీటీఓ/ మీటింగ్‌ పాయింట్‌ వద్ద యూ టర్న్‌ తీసుకుని సింథికాలనీ, రాంగోపాల్‌ పేట పీఎస్‌ నుంచి కిమ్స్‌ హాస్పిటల్‌ వైపుగా వెళ్లేందుకు బైలేన్లు తీసుకోవాల్సి ఉంటుంది.  

► భారీ వాహనాలు (బస్సులు, డీసీఎంలు, లారీలు) హనుమాన్‌ దేవాలయం నుంచి సింథికాలనీ, పీజీ రోడ్డు, సికింద్రాబాద్‌ వైపు రెండు వైపులా అనుమతించరు. ఆ వాహనాలు మినిస్టర్‌ రోడ్డుకు చేరుకోవడానికి రాణిగంజ్‌ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. నగర పౌరులు ఈ ఆంక్షలను గమనించి సూచించిన మార్గాల్లో గానీ, ప్రత్యామ్నాయ మార్గాల్లో గానీ తమ గమ్యస్థానాలను సులువగా చేరుకోవాలని నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement