భూసేకరణ తగ్గించేందుకు..
కొత్త డిజైన్ల కోసం టెండర్లు
సాక్షి, సిటీబ్యూరో: హై సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) పథకం కింద ఫ్లై ఓవర్లు, రహదారులు తదితర పనులకు ప్రభుత్వం రూ.7 వేల కోట్లకు పైగా పరిపాలన అనుమతులు మంజూరు చేయడంతో పనులు చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లోని క్షేత్రస్థాయి పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే రూపొందించిన డిజైన్లను మార్చాలని భావిస్తున్నారు. అలా.. ఆల్విన్ జంక్షన్, జేఎన్‌టీయూ జంక్షన్ల వద్ద డిజైన్ల మార్పునకు ఇప్పటికే కన్సల్టెంట్లను ఆహా్వనించిన అధికారులు తాజాగా రసూల్‌పురా ఫ్లై ఓవర్/అండర్‌పాస్ డిజైన్లను కూడా మార్చేందుకు సిద్ధమయ్యారు.
ప్రత్యామ్నాయ డిజైన్ అవసరం..
మెట్రో రెండోదశ దృష్టిలో ఉంచుకొని ఆల్విన్, జేఎన్‌టీయూ జంక్షన్ల వద్ద డిజైన్ల మార్పుకు సిద్ధమైన అధికారులు బేగంపేట సమీపంలోని రసూల్‌పురా ఫ్లై ఓవర్ /అండర్‌పాస్ నిర్మాణానికి డిఫెన్స్ భూములు సేకరించాల్సి ఉందన్నారు. ఎక్కువ భూ ములు ఇచ్చేందుకు సంబంధిత అధికారులు సుముఖంగా లేకపోవడంతో భూసేకరణ వీలైనంత తగ్గించేందుకు కొత్త డిజైన్ల కోసం కన్సల్టెంట్లను ఆహా్వనించినట్లు పేర్కొన్నారు. ఈ టెండరు పొందే కన్సల్టెంట్స్ ఇప్పటికే ఉన్న డిజైన్‌ను పరిశీలించి, ప్రత్యా మ్నాయ డిజైన్‌ను రూపొందించాల్సి ఉంటుంది.
రూ.105 కోట్లు మంజూరు..
⇒ ఈ ఫ్లై ఓవర్/అండర్‌పాస్ పనులకు ప్రభుత్వం రూ. 105 కోట్లు మంజూరు చేయడంతో పని ప్రారంభించేందుకు పరిస్థితుల్ని అధ్యయనం చేసిన అధికారులు ప్రత్నామ్నాయ డిజైన్‌తో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ రిపోర్ట్ కోసం (పీపీఆర్) కన్సల్టెంట్లను ఆహా్వనించారు. తక్కువ భూసేకరణతో పాటు ప్రజల భద్రత, సేవల పెంపుదల కొత్త డిజైన్ ప్రధాన లక్ష్యం. సేకరించాల్సిన ఆస్తుల సరిహద్దులతోపాటు యుటిలిటీస్ షిఫ్టింగ్ వంటి అంశాలను కూడా బేరీజు వేసి, ఉన్న డిజైన్ కంటే మెరుగైన డిజైన్ రూపొందించాల్సి ఉంటుంది.
⇒ సమీప ప్రాంతాల్లో ప్రస్తుతం పురోగతిలో ఉన్న ప్రాజెక్టులు, మెట్రో రైలు, బీఆర్‌టీఎస్, సీటీఎస్ మాస్టర్‌ప్లాన్‌లను కూడా దృష్టిలో ఉంచుకోవడంతో పాటు ప్రాజెక్టు వ్యయం తగ్గేందుకు కూడా తగిన మార్గాలుంటే సూచించాలి. ఇంకా, మేజర్ జంక్షన్లు, బాటిల్‌నెక్స్, ప్రార్థనా మందిరాలు, శ్మశాన వాటికల వంటి వాటిని దృష్టిలో ఉంచుకోవాలి. రాబోయే ఇరవయ్యేళ్ల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్‌ఫ్రీగా ప్రయాణం సజావుగా సాగేందుకు శాశ్వత పరిష్కారంగా కొత్త డిజైన్ ప్లాన్ ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment