గూడు గోడు
జిల్లా వ్యాప్తంగా 14,950 ఇళ్లు.. రూ.433 కోట్ల నిధులు.. 7,925 మంది లబ్ధిదారులు.. కేవలం 47 ఇళ్లకు మాత్రమే పరిపాలన అనుమతి ... ఇదీ ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ పథకం పనితీరు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఈ పథకం పురోగతి ఏ మాత్రం లేదు.
అనంతపురం: ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ పథకం కింద లబ్ధిదారుల ఎంపికలోనూ తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. హిందూపురం, అనంతపురం నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి స్థాయిలో జరిగింది. పెనుకొండ, రాప్తాడు, రాయదుర్గం నియోజవకర్గాల పరిధిలో 75 శాతం మించింది. ధర్మవరం నియోజవకర్గానికి 1,150 మంజూరు చేస్తే కేవలం 78 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఆఖరి స్థానంలో నిలిచింది. తక్కిన చోట్ల 50 శాతం నుంచి 40 శాతం మేర లబ్ధిదారుల ఎంపిక జరిగింది.
47 ఇళ్ల కే పరిపాల అనుమతి
జిల్లాలోని 14 నియోజకవర్గాలకు 14,950 ఇళ్లను కేటాయించగా, అంచనా వ్యయం రూ.433.55 కోట్లుగా నిర్ధారించారు. సీఎం డ్యాష్ బోర్డ్ అధికారికంగా హౌసింగ్ సంస్థ ఉంచిన గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 7,925 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందులోనూ కేవలం 47 ఇళ్లకు మాత్రమే పరిపాలన అనుమతి లభించింది. అదీ కూడా అనంతపురం నియోజకవర్గం పరిధిలో 50 ఇళ్లు మంజూరైతే ఇందులో 47 మంది లబ్ధిదారుల జాబితా తయారైంది. ఈ 47కు మాత్రమే పరిపాలన అనుమతి ఇచ్చారు. మిగతా 13 నియోజకవర్గాల పరిధిలో ఒక్క ఇంటికీ పరిపాలనా అనుమతి మంజూరు కాలేదు.