‘ఆధునికత’ వైపు వెళ్లాల్సిందే
‘ఆధునికత’ వైపు వెళ్లాల్సిందే
Published Sun, May 28 2017 11:22 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
నర్సరీ రైతుల సమావేశంలో పలువురు వక్తలు
కడియం (రాజమహేంద్రవరం రూరల్) : నర్సరీ రంగం సంప్రదాయక విధానాలను వీడి ఆధునికత వైపునకు వెళ్లాల్సిందేనని ఏపీ నర్సరీ రైతుల సమావేశంలో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఇండియన్ నర్సరీమన్ అసోసియేషన్ (ఐఎన్‌ఏ) ఆధ్వర్యంలో స్థానిక జీఎన్‌ఆర్ ఏసీ కల్యాణ మంటపంలో ఆదివారం ఈ సమావేశం నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఐఎన్‌ఏ అధ్యక్షుడు పల్ల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నర్సరీ రైతులకు ఉచిత విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా అధికారులు కృషి చేయాలని కోరారు. అనంతరం సమావేశంలో సాగు విధానాల నుంచి మార్కెటింగ్, టాక్స్ చెల్లింపుల వరకు పలువురు ప్రముఖులు, శాస్త్రవేత్తలు, అధికారులు మాట్లాడారు. నర్సరీ రంగంపై ఆధారపడిన భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే ఆధునిక పద్ధతులను అవలంబించడం ద్వారా మరింత మెరుగైన మార్కెట్‌ను సృష్టించుకోవచ్చునని సర్వత్రా అభిప్రాయపడ్డారు. మొక్కలను ఎగుమతులు చేసేందుకు తోడ్పడే ప్లాంట్స్ క్వారంటైన్ సెంటర్‌ను కడియం నర్సరీలకు సమీపంలో ఏర్పాటు చేయాలని ఐఎన్‌ఏ ప్రధాన కార్యదర్శి పుల్లా వీరవెంకట్రావు కోరారు. సమావేశంలో ఏపీయంఐపీ పీడీ సుబ్బారావు, హార్టీకల్చర్ ఏడీ చిట్టిబాబు, హార్టీకల్చర్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు, నర్సరీ రంగ ప్రముఖులు తాడాల వీరాస్వామి, కేఎన్‌ఏ అధ్యక్షులు పుల్లా చంటియ్య, ఐఎన్‌ఏ ప్రధాన కార్యదర్శి పుల్లా వీరవెంకట్రావు, కోశాధికారి టి.రవికుమార్, జీసీ సభ్యుడు ఎం.వీరబాబు, జె.సుబ్రహ్మణ్యం, నర్సరీ రంగ ప్రముఖులు పాల్గొన్నారు.
రైతుల్లో చొరవ పెరగాలి
కడియం ప్రాంత నర్సరీ రైతుల్లో చొరవ మరింత పెరగాలి. ఆధునిక విధానాలను అవగాహన చేసుకుని అమలు చేయాలి. ఉద్యాన రంగాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అందుకు తగిన ప్రోత్సాహకాలను మంజూరు చేస్తున్నాం. నర్సరీ రైతులు కోరిన వెంటనే పలు అనుమతులు కూడా ఇచ్చాం. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడి రైతులు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం పొందాలంటే విదేశీ మార్కెట్‌పై పట్టు సాధించుకోవాలి. ఇక్కడి మొక్కలను తీసుకువెళ్లి ఇతర రాష్ట్రాల్లోని వ్యాపారులు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడి రైతులు నేరుగా విదేశీ ఎగుమతులు చేస్తే మరిన్ని లాభాలనార్జించే వీలుంటుంది. నర్సరీ రైతులు అన్ని సదుపాయాలు కల్పించేందుకు ఉద్యాన శాఖ ఎప్పుడూ సిద్ధమే.
– చిరంజీవ్ చౌదరి, రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్
సాయిల్‌లెస్ సేద్యం చేపట్టాలి
కేవలం మట్టిని మాత్రమే వినియోగించి మొక్కలు పెంచే విధానానికి స్వస్తి పలకాల్సిన పరిస్థితి ఉంది. కొబ్బరి పొట్టు తదితర ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాలి. నెమటోడ్స్ వంటి తెగుళ్లు మట్టి ద్వారా దేశమంతా వ్యాపించే అవకాశం ఉన్నందున దీనిపై చర్యల తీసుకునే పరిస్థితి ఉంది. సరైన అవగాహన లేకపోవడం కారణంగా నెమటోడ్స్ వ్యాప్తి విస్తృతమవుతోంది. ఇప్పటికైనా జాగ్రత్త పడాలి. శాస్త్రవేత్తలు ఇచ్చే శిక్షణను కూడా వినియోగించుకోవాలి. హార్టీకల్చర్ యూనివర్శిటీకి అనుబంధంగా సబ్‌సెంటర్‌ను ఏర్పాటు చేసి రైతులకు నేరుగా సూచనలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను కోరాం. త్వరలోనే దీనిపై అనుమతి వస్తుంది.
– డాక్టర్ జె.దిలీప్‌బాబు, వైఎస్సార్ హార్టీకల్చర్ యూనివర్శిటీ రీసెర్చ్ డైరెక్టర్
20 అడుగుల చెట్లకు డిమాండ్
ప్రస్తుతం మౌలిక వసతుల రంగం అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుంటే నర్సరీ రంగం మరింత వేగంగా వృద్ధి చెందాల్సిన అవసరముంది. పదిహేనేళ్ల నుంచి వచ్చిన మార్పులకంటే రానున్న మూడు, నాలుగేళ్లలో మరింత విస్తృతమైన మార్పు ఈ రంగంలో చోటు చేసుకుంటుంది. నేలపైనే మొక్కలను పెంచడం కాకుండా గోడలపై, రూఫ్‌టాప్‌లపై కూడా మొక్కలను పెంచడం ప్రారంభమైంది. అందుకు తగిన మొక్కలను ఉత్పత్తి చేసేందుకు నర్సరీలు సిద్ధంగా ఉండాలి. దుబాయ్‌లోని బుర్జ్‌ఖలీఫా టవర్‌వద్ద ఏర్పాటు చేసిన గార్డెన్‌లో వేసిన అనేక రకాల మొక్కలు కడియం ప్రాంత నర్సరీ రైతులనుంచి సేకరించినవే. కానీ ఇక్కడి రైతులు నేరుగా వారికి అమ్మకపోవడంతో కష్టం నర్సరీ రైతులదైతే, లాభం మధ్యలో ఉన్నవారికి దక్కింది. విదేశీ రకాల మొక్కల కంటే మన వాతావరణానికి అనుకూలంగా మన వద్దే ఉన్న అనేక రకాల మొక్కలను గుర్తించి, అభివృద్ధి చేయాలి. తద్వారా రైతులకు లాభాలు పెరుగుతాయి. చిన్న మొక్కలకు మార్కెటింగ్ కంటే 20 అడుగులున్న మొక్కలకు విస్తృత మార్కెట్ సదుపాయం భవిష్యత్తులో ఏర్పడుతుంది.
– నవీన్, సీనియర్ ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్, హైదరాబాద్
ఆదాయం పెంచి చూపడం ముప్పే
వివిధ కారణాలతో కొందరు నర్సరీ రైతులు ఆదాయాన్ని పెంచి చూపిస్తున్నారు. ఇలా చేస్తే లాభం కంటే నష్టమే అధికంగా ఉంటుంది. దీనిని రైతులు గుర్తుంచుకోవాలి. నర్సరీ రంగానికి జీఎస్‌టీ అమలు చేయాలన్న ప్రతిపాదనలు ఉండడాన్ని గుర్తించి ఐఎన్‌ఏ అధ్యక్షుడు పల్ల సుబ్రమ్మణ్యంకు చెబితే వెంటనే స్పందించి నర్సరీ రైతులతో కలిసి ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీలతో సహా 25 మంది ఎంపీలకు వినతిపత్రాలు అందజేశారు. మోడల్ బిల్లు రూపుదిద్దకోక మునుపే మేలుకోవడం వల్ల మినహాయింపు లభించింది. దీంతో నర్సరీ రంగం ద్వారా సమకూరే ఆదాయాన్ని కూడా వ్యవసాయ ఆదాయంగానే పరిగణిస్తూ జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎగుమతుల విషయంలో కూడా ఆడిటర్ల సలహాలను రైతులు పాటించాలి.
– వీఎస్ ప్రకాష్‌రావు, చార్టర్డ్ అక్కౌంటెంట్, రాజమహేంద్రవరం
Advertisement