రైతుల ప్రస్తావనేదీ?
- సాదాసీదాగా డీసీసీబీ పాలకవర్గ సమావేశం
- మత్స్యకారులకు రుణాల మంజూరుకు గ్రీన్ సిగ్నల్
విశాఖపట్నం : జిల్లా కేంద్ర సహకార కేంద్ర బ్యాంక్(డీసీసీబీ) పాలక వర్గం సమావేశం సోమవారం సాదాసీదాగా జరిగింది. పలు తీర్మానాలు ప్రవేశపెట్టగా సభ్యుల ఆమోదం లభించింది. సభ్యుల వ్యతిరేకతతో కొన్ని తిరస్కరించారు. రైతులకు మేలు జరిగే విధంగా ఎటువంటి తీర్మానాలు లేకపోవడం నిరాశ మిగిల్చింది. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు కొత్త రుణాలు, పాత రుణాల చెల్లింపునకు వ్యవధి అంశాలు ప్రస్తావనకు రాలేదు.
పాత రుణాలతో సంబంధం లేకుండా కొత్త రుణాలు మంజూరు కోసం సమావేశంలో తీర్మానం జరుగుతుందని భావించిన రైతన్నల ఆశలు ఫలించలేదు. సహకార సొసైటీలకు నిధులను విడుదల చేయడంలో చైర్మన్, అధికారులు చురుకుగా వ్యవహరించాలని సభ్యులు కోరినా అధికారులు పట్టించుకోలేదు. బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 77 పోస్టులు భర్తీ చేయాలని సభ్యులు పట్టుబట్టారు.
అడ్డదారుల్లో కొంత మంది తాత్కాలిక ఉద్యోగులను పర్మనెంట్ చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని, అలాంటి చర్యలకు తాము వ్యతిరేకమని సభ్యులు ఎదురుతిరిగారు. బ్యాంక్ నిబం
ధనల ప్రకారం ఉద్యోగాలు కల్పించాలని కోరారు. బ్రాంచి బ్యాంకుల భవనాల అద్దెలు పెంచాలని తీర్మానం చేశారు. భవన యజమానుల అభ్యర్థన మేరకు అద్దె ధరలు పెంచుతున్నట్టు చైర్మన్ వివరించారు.
డీసీసీబీలో ప్రభుత్వ అజమాయిషీ ఉండరాదని సభ్యులంతా ఒక్కటిగా వ్యతిరేకించారు. రూ.65.86 లక్షల బ్యాంక్ ధనం ప్రభుత్వానికి ఎందుకు చెల్లించడానికి అధికారులు సిద్ధపడ్డారని నిలదీశారు. మత్స్యకారులకు రుణాలు అందించడానికి పాలకవర్గం ఆమోదించింది. ప్రభుత్వం జారీచేసిన జీవో 40 ప్రకారం మత్స్యకారులకు బోట్లు, వలల కొనుగోలుకు రుణాలు మంజూరు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంకా మత్స్యకార మహిళా గ్రూపులకు రుణాలు అందించడానికి అంగీకరించింది.
చిల్లర వ్యాపారులు, వ్యక్తులకు రుణాల మంజూరుకు తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం లభించింది. రైతుల ప్రయోజనార్థం ఎటువంటి తీర్మానాలు ప్రవేశపెట్టకపోవడంతో సభ్యుల నుంచి నిరసన వ్యక్తం అయ్యింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ కొనసాగిన సమావేశంలో సాదాసీదాగా ముగిసింది. అధికారులు తమ ప్రతిపాదనలకు విలువలు ఇవ్వడం లేదని సభ్యులు వాదనకు దిగారు. చైర్మన్ సర్ధిచెప్పడంతో వివాదం సద్ధుమణిగింది.