పోషకాహారానికి ధరాభారం | nutrition food students | Sakshi
Sakshi News home page

పోషకాహారానికి ధరాభారం

Published Thu, Jun 29 2017 3:08 AM | Last Updated on Tue, Sep 5 2017 2:42 PM

పోషకాహారానికి ధరాభారం

పోషకాహారానికి ధరాభారం

-కుకింగ్‌ చార్జీలు నామమాత్రంగా పెంచిన సర్కారు
-ఈ పెంపు ఏ పాటి అంటున్న ఇంప్లిమెంటింగ్‌ ఏజెన్సీలు
-మధ్యాహ్న భోజనంలో అనివార్యమవుతున్న కోత
-2.80 లక్షల మంది బాలలకు పస లేని తిండే గతి
రాయవరం (మండపేట): పిల్లలంటే చాలు..ఎవరైనా ఎంతో ఇష్టంగా కొసరి కొసరి పెడతారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో  ‘ఈరోజుకు ఇంతే..సర్దుకోం’డంటూ..కోత పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. కూరగాయల ధరలు చూస్తే ఆకాశన్నంటుతున్నాయి. పప్పుల రేట్లు వింటే నిప్పుల్ని ముట్టుకున్నట్టవుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం మధ్యాహ్న భోజనానికి ఆచితూచి  తాజాగా విద్యార్థికి రూ.1.35 పెంచింది. ఈ నేపథ్యంలో చేసేది లేక నీళ్ల సాంబారు, అరకొర పప్పుతో, ఆకుకూర, గుడ్డులో కోతతో చాలీ చాలని భోజనం పెడుతూ పిల్లల ఉసురు పోసుకుంటున్నామని మధ్యాహ్న భోజన పథకంనిర్వాహకులు వాపోతున్నారు. పిల్లలు ఉదయం తినే రెండు ఇడ్లీలే రూ.10 పెడితే గానీ రావడం లేదు. అలాంటిది రూ.6.48 ఇస్తే పప్పుకూర, గుడ్డుకు ఎలా సరిపోతుందో ప్రభుత్వానికి తెలియంది కాదు. ఇలా మధ్యాహ్న భోజనం పథకంలో పౌష్టికాహార లోపంతో పేద విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం తీరుపై ‘సాక్షి’ కథనం. 
 రేట్లు రగులుతుంటే ఈ పెంపు ఏపాటి..
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో 4,189 ప్రభుత్వ, మండల పరిషత్, జెడ్పీ, మున్సిపల్‌ పాఠశాలల్లో రోజుకు సుమారు 2.80 లక్షల మంది పిల్లలు ఈ పథకంలో భోజనం చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ లెక్కల ద్వారా తెలుస్తోంది. కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని స్వచ్ఛంద సంస్థలు వండి విద్యార్థులకు సరఫరా చేస్తుండగా, అధిక పాఠశాలల్లో మిడ్‌డే మీల్‌ వర్కర్లు వండి వడ్డిస్తున్నారు. జిల్లాలో సుమారు 8 వేల మంది మిడ్‌డే మీల్‌ వర్కర్లు పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని వండి వార్చేందుకు వంట ఖర్చుల కింద ఒక్కో విద్యార్థికి ఈ ఏడాది అదనంగా రూ.1.35 చెల్లించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రకారం ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు రూ.7.18 నుంచి రూ.8.53, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రూ.5.13 నుంచి 6.48కు పెరిగినట్లైంది. పెరిగిన చెల్లింపు జూన్‌ నుంచే అమలులోకి వచ్చింది. అయితే పెరిగిన నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరల నేపథ్యంలో ఈ పెంపు ఏపాటి అన్న విమర్శలు  ఇంప్లిమెంటింగ్‌ ఏజెన్సీల నుంచి వినిపిస్తున్నాయి. సాంబారు చేయాలంటే కందిపప్పుతో పాటు చింతపండు, తాలింపుకు దినుసులు, నూనె, ఉల్లిపాయలు, టమాటాతో పాటు కూరగాయలు వేయాలి. ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ కందిపప్పు రూ.70, చింతపండు రూ.90, టమాటాలు రూ.30పై మాటే. ఇలా అన్ని ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ధరలతో నాణ్యతగా వండమని ఉపాధ్యాయులు నిర్వాహకులకు గట్టిగా చెప్పలేని పరిస్థితి ఉంది. దీనికి తోడు నెల నెలా బిల్లుల చెల్లింపులో జాప్యం కావడంతో అప్పుచేసి పప్పుకూడు పెట్టలేక, పెరిగిన ధరలతో అన్నీ తెచ్చి వండలేక మామూలు కూరల తయారీతో మమ అనిపిస్తున్నారు. 
కూరగాయలు ఏవైనా కిలో రూ.30 పైమాటే
2005లో మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టారు. అప్పటిలో ధరలకు, నేటి ధరల మధ్య పెరుగుదల చూస్తే కళ్లు తిరిగే పరిస్థితి కనిపిస్తోంది. 2005లో ఒక కోడిగుడ్డు రూ.3 ఉంటే నేడు రూ.4.50కి పెరిగింది. నిన్న మొన్నటి వరకూ కోడిగుడ్డు రూ.5కి అమ్మారు. కూరగాయలు కిలో రూ.10 నుంచి రూ.15 ఉండగా నేడు..ఏ కాలమైనా ప్రతి కూరగాయ కిలో రూ.30 పైమాటే. 
ప్రతి రోజూ విద్యార్థికి అందించాల్సిన ఆహార పరిమాణం 
ఆహార పదార్థాలు ప్రాథమిక యూపీ/ఉన్నత పాఠశాలలు
బియ్యం 100 గ్రాములు 150 గ్రాములు
పప్పులు 20 గ్రాములు 30 గ్రాములు
కూరగాయలు 50 గ్రాములు 75 గ్రాములు
నూనె 5 గ్రాములు 7.5 గ్రాములు
 
కొత్త మెనూ ఇదే..
సోమవారం               : గుడ్డు+సాంబారు
మంగళవారం              :   కూరగాయలు
బుధవారం                 :   గుడ్డు+సాంబారు
గురువారం                   : పప్పు+ఆకుకూర
శుక్రవారం                    :   గుడ్డు+సాంబారు
శనివారం                       :  పప్పు+ఆకుకూర
హాస్టల్‌ విద్యార్థులతో సమానంగా చెల్లించాలి..
హాస్టల్‌ విద్యార్థులతో సమానంగా మధ్యాహ్న భోజన పథకం చార్జీలు పెంచాలి. హాస్టల్‌లో ఒక్కో విద్యార్థికి రూ.12 నుంచి రూ.15 చెల్లిస్తుండగా, మధ్యాహ్న భోజన పథకంలో ప్రాథమిక స్థాయిలో కేవలం రూ.6.18 చెల్లించడం సమంజసం కాదు. 
– కవి శేఖర్, ప్రధాన కార్యదర్శి, ఎస్‌టీయూ 
బిల్లులు సకాలంలో చెల్లించాలి..
మధ్యాహ్న భోజన పథకంలో బిల్లులు సకాలంలో చెల్లించాలి. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను బట్టి మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు డబ్బులు కేటాయించాలి. 
– సీహెచ్‌ ప్రదీప్‌కుమార్, ప్రధాన కార్యదర్శి, పీఆర్‌టీయూ 
ఇబ్బందులు పడుతున్నాం..
ఒక పక్క నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోవడం లేదు. ఏటా అరకొరగానే పెంచుతున్నారు. 
– వాసంశెట్టి సత్యవతి, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలు, సూర్యారావుపేట, కాకినాడ రూరల్‌ 
చాలా ఇబ్బందులు పడుతున్నాం..
బిల్లులు సకాలంలో రాక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం చార్జీలు అరకొరగా పెంచితే ఎలా నిర్వహించాలి? చాలా ఇబ్బందులు పడుతున్నాం. 
– తిక్కా రమణ, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలు, ఎంపీపీ స్కూల్, బెల్లంపూడి, పి.గన్నవరం మండలం 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement