నల్లధన మార్పిడిలో భాగస్వాములు కావద్దు
బంగారం కొనుగోళ్లపై నిఘా
ఇన్‌కంటాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ బి.జి రెడ్డి
ఏయూక్యాంపస్ : నల్లధనం మార్పిడిలో సాధారణ ప్రజలు భాగస్వాములు కావద్దని ఇన్‌కంటాక్స్ శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ బి.జి.రెడ్డి అన్నారు. శనివారం రాత్రి ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పొదుపు ఖాతాలలో ఒక్కసారిగా అధిక మొత్తాలను జమచేస్తే చిక్కులు తప్పవన్నారు. నల్లధనం కలిగినవారు ఇతరుల ఖాతాలను వినియోగించుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇటువంటి వారు భవిష్యత్తులో విచారణ, శిక్షలను ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు. తమ సొంత ధనాన్ని, దాచుకున్న సొమ్ములను భద్రంగా బ్యాంకులో వేసుకోవచ్చున్నారు. ఇటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావన్నారు. సాంకేతిక అందుబాటులో ఉందని, బ్యాంకులో జరిపే లావాదేవీలను గమనించడం జరుగుతుందన్నారు. ప్రధాని ప్రకటన తరువాత భారీగా బంగారం కొనుగోళ్లు జరిగాయన్నారు. వీటన్నింటినీ తమ శాఖ నిశితంగా పరిశీలిస్తుందని చెప్పారు. కొందరు ఎంతో తెలివిగా 1.8 నుంచి 1.98 లక్షల చొప్పున వివిధ వ్యక్తుల పేరుతో బంగారం భారీగా కొనుగోలు చేశారన్నారు. పాన్ నంబర్ ఇవ్వకుండా తప్పించుకోవడానికి ఇటువంటి చర్యలు పాల్పడ్డారన్నారు.
ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు రూ. 50 లక్షలు విలువ చేసే బంగారం కొనుగోలు చేసినట్లు తమకు సమాచారం అందిందన్నారు. కొద్ది గంటల సమయంలోనే మూడు కోట్ల రూపాయల వ్యాపారం కొందరు వర్తకులు జరిపినట్లు గుర్తించామన్నారు. ఇటువంటి చర్యలను సాంకేతిక సహకారంతో వెంటనే గుర్తించి విచారణ జరపడం జరుగుతోందన్నారు. సొసైటీలు, స్వచ్చంద సంస్థలకు సంబంధించిన అన్ని నగదు లావాదేవీలు, డొనేషన్లు గమనిస్తామన్నారు. ఎవరైనా తప్పుకు పాల్పడినట్లు గుర్తిస్తే విచారణ జరపడం తథ్యమన్నారు. ఇటువంటి వాటిని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజి్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు, ఎస్‌బీఐ ఆడిట్, ఇనస్పెక్షన్ విభాగం డీజీఎం జయచంద్ర, రీజినల్ మేనేజర్ ఎం.వి.ఎస్.ఎస్.ఎన్ శ్రీనివాస ప్రసాద్,ఓవర్సీస్ బ్యాంక్ ఏజిఎం మురళి, ఏయూ ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పెద్దసంఖ్యలో బ్యాంక్ ఉద్యోగులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.