...అను నేను కార్పొరేటర్గా..
♦ నేడు కొలువు దీరనున్నఖమ్మం కార్పొరేషన్ పాలకవర్గం
♦ ఉదయం 11 గంటలకు ముహూర్తం
♦ సీల్డ్ కవర్లో మేయర్, డిప్యూటీ మేయర్ల పేర్లు
♦ ఫాం- ఏ సమర్పించిన పార్టీల అధినేతలు
♦ మార్గదర్శకాలు రాలేదని కోఆప్షన్ ఎన్నిక వాయిదా
♦ సర్వం సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం
ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ నూతన పాలకవర్గం మంగళవారం ఉదయం కొలువుదీరనుంది. సరిగ్గా ఉదయం 11 గంటలకు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఎన్నికైన కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులకు ఇప్పటికే ఆహ్వానం పంపారు. ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేయించారు.
కౌన్సిల్ కొలువు దీరేదిలా..
50 డివిజన్లలో గెలుపొందిన కార్పొరేటర్లు ఉదయం 11 గంటల కల్లా కార్పొరేషన్‌లోని సమావేశ మందిరానికి వస్తారు. వీరితో కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ‘మేయర్ ఎన్నిక నిర్వహిస్తాం.. పోటీలో నిలిచే వారు నామినేషన్ ప్రకటించాలి’ అని కోరుతారు. మేయర్ పదవి కోసం ఒక్క అభ్యర్థి మాత్రమే నామినేషన్ వేస్తే పోటీ లేదని భావించి ఏకగ్రీవ ంగా నియమిస్తారు. ఒకవేళ పోటీ ఉంటే చేతులు ఎత్తే పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తారు. మెజార్టీ సభ్యులు ఆమోదించిన వారిని మేయర్‌గా ప్రకటిస్తారు. మేయర్‌ను ఎంపిక చేసే పద్ధతిలోనే డిప్యూటీ మేయర్‌నూ ఎంపిక చేస్తారు. ఎంపికైన మేయర్, డిప్యూటీ మేయర్లకు ప్రిసైడింగ్ అధికారి నియామక పత్రాలు అందజేస్తారు. కొత్తగా నియమితులైన వారితో కోరం (25 మంది సభ్యుల కంటే ఎక్కువ) ఉంటే కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తారు. కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించే నాటికి ప్రమాణ స్వీకారం చేయని కార్పొరేటర్లు తిరిగి సర్వసభ్య సమావేశం నిర్వహించే వరకు వేచిచూడక తప్పదు. అప్పటి వరకు కార్పొరేటర్లుగా పరిగణించే అవకాశం ఉండదు. కాబట్టి సభ్యులందరూ సకాలంలో హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు.
కవర్లోనే ర హస్యం..
కార్పొరేషన్ ఎన్నికలప్పటి నుంచి మేయర్ అభ్యర్థి నియామకం దాదాపుగా ఖాయమైందని అధికార పార్టీ చెబుతోంది. కానీ సోమవారం రాత్రి వరకు కూడా మేయర్, డిప్యూటీ మేయర్ల విషయమై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. సీల్డ్ కవర్లోనే మేయర్, డిప్యూటీ మేయర్ల గుట్టు ఉన్నట్లు తెలుస్తోంది. మేయర్ పదవిని ఆశిస్తున్న వారిలో డాక్టర్ పాపాలాల్, రామ్మూర్తి పేర్లు వినిపిస్తున్నాయి. డిప్యూటీ మేయర్ పదవికి విపరీతమైన పోటీ ఉంది. ఎక్కువ సంఖ్యలో ఆశావహులు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. ‘తామే డిప్యూటీ మేయరంటే.. తామే..’ అంటూ అనుచరుల వద్ద ప్రగల్భాలకు పోతున్నారు. సీఎం కేసీఆర్ ఆమోదంతో ప్రకటించిన మేయర్, డిప్యూటీ మేయర్ల పేర్లు సీల్డ్ కవర్లో ఉంచి మంగళవారం రిటర్నింగ్ అధికారికి ఇవ్వనున్నట్లు టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు షేక్ బుడాన్‌బేగ్ ప్రకటించారు.
ఫాం ఏ సమర్పణ
కార్పొరేషన్ కౌన్సిల్ నియామకానికి సంబంధించిన ఫాం-ఏను టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బేగ్ కలెక్టర్‌కు సో మవారం అందజేశారు. కౌన్సిల్ ఏర్పాటుకు తమ పార్టీకి మెజార్టీ సభ్యులున్నారని తెలిపారు. మేయర్, డిప్యూటీ మేయర్ల పేర్లు వెల్లడించే ఫాం-బీని మంగళవారం ఉదయం అందజేసేందుకు టీఆర్‌ఎస్ కసరత్తు చేస్తోంది.
కో-ఆప్షన్ వాయిదా
రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు రాలేదన్న కారణంతో కోఆప్షన్ సభ్యుని నియామకాన్ని వాయిదా వేసినట్లు కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. ఖమ్మం కార్పొరేషన్ స్థాయికి అనుగుణంగా మొత్తం ఐదుగురు కో-ఆప్షన్ సభ్యులను నియమించే అవకాశం ఉంది. వీరిలో ఇద్దరు మైనార్టీలు, ముగ్గురు కార్పొరేషన్ పాలనా వ్యవహారాలపై అనుభవం ఉన్నవారు ఉంటారు. కౌన్సిల్ ప్రారంభమైన 60 రోజుల లోపు కోఆప్షన్ సభ్యుల నియామకం చేపట్టవచ్చనే నిబంధన ఉంది. ఈ మేరకు తిరిగి కౌన్సిల్ సమావేశం నాటికి సభ్యుల ఎంపిక జరగనుంది.
ఎక్స్ అఫీషియో సభ్యులకూ ఆహ్వానం..
కౌన్సిల్ సమావేశం, ప్రమాణస్వీకారోత్సవం కార్యక్రమానికి ఎక్స్‌అఫిషియో సభ్యులకూ ఆహ్వానం పంపారు. స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యులు రేణుకాచౌదరి, ఎమ్మెల్సీ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, పల్లా రాజేశ్వరరెడ్డి కౌన్సిల్ సమావేశానికి హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారం, ఎంపిక కార్యక్రమాలు జిల్లా ఎన్నికల పరిశీలకులు ఇలంబరితి, కలెక్టర్ లోకేష్‌కుమార్ పర్యవేక్షణలో జరగనున్నాయి.