ఒడియా విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తాం
Published Mon, Nov 28 2016 3:25 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
శ్రీకాకుళం అర్బన్: ఒడియా మీడియం విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మినరసింహం హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఒడియా టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో ఆదివారం విశ్రాంత డీఐ స్కూల్స్(ఒడియా) మహేష్ చంద్ర సామంత్ దంపతులను ఘనంగా సన్మానించారు. అనంతరం మేధో సమ్మాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఒడియా మీడియంలో 77 ఖాళీలు ఉన్నాయని, వాటిని త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. ఇచ్ఛాపురంలో ఒడియా మీడియం విద్యార్థుల కోసం కేజీబీవీ స్కూల్‌ను ప్రారంభిస్తామని చెప్పారు.
ఒడియా టీచర్స్ అసోసియేషన్ కోసం జిల్లా కేంద్రంలో భవన నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. ఒడియా మీడియం విద్యార్థులకు హిందీ కూడా ఒక సబ్జెక్టుగా ఉంటుందన్నారు. అనంతరం 39 ఏళ్లుగా డీఐ స్కూల్స్ (ఒడియా) గా సేవలందించిన మహేష్‌చంద్ర సామంత్ దంపతులకు ఆంధ్రప్రదేశ్ ఒడియా టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగామహేష్‌చంద్ర సామంత్ మాట్లాడుతూ ఒడియా భాషకు, విద్యార్థుల అభివృద్ధికి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో తోడ్పడిన ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఒడియా మీడియంలో 10వ తరగతిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు కై వసం చేసుకున్న విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు(మేధో సమ్మాన్) అందజేశారు. 40 పాఠశాలలకు చెందిన 80 మంది విద్యార్థులకు మేథో సమ్మాన్ పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం డీఈవో డి.దేవానందరెడ్డి, విజయనగరం డీఈవో ఎస్.అరుణకుమారి, డిప్యూటీ ఈవోలు వి.ఎస్.సుబ్బారావు, ఎ.ప్రభాకరరావు, ఆంధ్రప్రదేశ్ ఒడియా టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.కె.మహాపాత్రో, బృందావన్ దులై, ఉపాధ్యక్షులు భాస్కర్ పాడి, బురాడో, ప్రతినిధులు డీపీ చౌదరి, ప్రమోద్‌కుమార్ పాడి, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement