ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు ఆరో రోజుకు చేరుకున్నాయి. ఉదయం నుంచి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో విద్యార్థులను 108 వాహనంలో అత్యవసరంగా కేజీహెచ్‌కు తరలించారు. ఆరు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో విద్యార్థులు నీరసించిపోయారు. నడవలేని పరిస్థితికి చేరుకున్నారు. అంతకుముందు దీక్షా స్థలంలో వారు సందర్శకులకు కరచాలనం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఏయూ వైద్యుడు బాలకృష్ణ వచ్చి విద్యార్థులకు ప్రాథమిక వైద్య పరీక్షలు జరిపారు. విద్యార్థులకు రక్తపోటు తగ్గడంతో పాటు, రక్తంలో షుగర్ స్థాయి పడిపోవడం గమనించారు.
ఆరేటి మహేష్‌కు ఉదయం చాతీలో నొప్పితో సతమతమయ్యాడు. దీనితో ఉదయం పదకొండు గంటల నుంచి దీక్షా శిబిరం వద్ద విద్యార్థుల్లో ఆందోళన ప్రారంభయింది. అదే సమయంలో లగుడు గోవింద్ స్పృహ కోల్పోయాడు. దీనితో ఆందోళన చెందిన విద్యార్థులు చుట్టూచేరి వారికి సపర్యలు చేపట్టడం ప్రారంభించారు. ఇదే విషయాన్ని వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. వైద్యులు సైతం విద్యార్థులకు ఫ్లూయడ్స్ అందించాలని సూచించారు. దానికి వీరు నిరాకరించారు.
సమైక్యాంధ్ర కోసం తమ ప్రాణాలను సైతం అర్పిస్తామని నినదించారు. జిల్లా యంత్రాంగం ఆర్‌డీఓ, ఎంఆర్‌ఓ అధికారులెవరూ రాకపోవడం, వైద్యం అందించడానికి వైద్యబృందం వంటివి ఏర్పాటుచేయపకోవడంపై విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. చివరకు దీక్ష చేస్తున్న విద్యార్థులను బలవంతంగా అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
విద్యార్థుల దీక్షలు భగ్నం
Published Mon, Aug 5 2013 2:41 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
Advertisement
Advertisement